వడ్రంగి పిట్ట తెలివి - అచ్చంగా తెలుగు

వడ్రంగి పిట్ట తెలివి

Share This
వడ్రంగి పిట్ట తెలివి… పిట్ట కొంచెం తెలివి ఘనం
పి.ఎస్.ఎం.లక్ష్మి 
పిల్లలూ, వడ్రంగి పిట్టను చూశారా మీరెప్పుడైనా?  ఇది ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోను, చెట్లెక్కువగా వుండే ప్రదేశాల్లోనూ, అడవుల్లోను వుంటాయి.  ఇవేమి చేస్తాయో తెలుసా?  చెట్లని ముక్కుతో పొడుస్తూ వుంటాయి.  మీలో పర్యావరణ ప్రేమికులు చాలామంది వుంటారు కదా.  మీరనుకోవచ్చు. ఈ పిట్టలేమిటి ఇలా చెట్లని పొడిచి పొడిచి పాడు చేస్తున్నాయి అని.  కానీ అసలు విషయమేమిటో తెలుసా?  అవి చెట్లని రక్షించటానికి అలా పొడుస్తూ వుంటాయి.  ఆశ్చర్యంగా వుంది కదూ!  నిజమేనర్రా!!

ఈ పిట్టకా పేరు రావటానికి కారణం అది చేసే పనే .. చెట్ల బెరళ్ళను ముక్కుతో తొలుస్తూ వుండటం.  దాని ముక్కు చాలా వాడిగా వుంటుంది.  ఈ పిట్టవల్ల చెట్లకి చాలా లాభం కలుగుతుంది.  అదెట్లా, అలా పొడిచి నాశనం చేస్తోంది కదా అంటారా?   చెట్ల బెరడు కింద, పగుళ్ళలో, చెట్టు వంపుల్లో అనేక క్రిమి కీటకాలు దాక్కునుంటాయి.  వాటివల్ల చెట్టుకి హాని కూడా కలగవచ్చు.  వడ్రంగి పిట్ట ఆ క్రిమి కీటకాలనన్నీ తినేసి, చెట్లని రక్షిస్తుంది.   పురుగులు చిన్నగా వుండి పిట్టకి కనబడకపోయినా సరే.  అది వాసనతో అవి ఎక్కడున్నాయో కనుక్కుని తన పొడిగాటి ముక్కుతో బయటకి లాగుతాయి.  దీని నాలుక మీద జిగురుగల పదార్ధం లాంటిది వుంటుంది.  అందుకని పురుగులు పారిపోలేవు.  చూశారా, సృష్టిలో విచిత్రాలు!  చెట్లు తమని తాము రక్షించుకోలేవు గనుక, మనుషులేగాక, ఇలాంటి పిట్టలు కూడా వాటిని రక్షిస్తాయి.

వడ్రంగిపిట్ట కధ చెబుతున్నాను కదాని దాని గురించి కూడా కొంత చెప్పాను.  సరే.  ఇప్పుడు కధ...


ఒక అడవిలో ఒక పులి వుంది.  అడవిలో ఒక పులే వుంటుందా అని అడక్కండి గడుగ్గాయిలూ.  అడవిలో బోలెడు పెద్ద పెద్ద జంతువులూ, చిన్న చిన్న జంతువులూ, పక్షులూ, పురుగులూ, ఇలా ఎన్నో రకాల జంతువులు వుంటాయి కదా.  వాటిలో మన కధ ఒక పులి, ఒక వడ్రంగి పిట్ట గురించి.  

అడవిలో పులి వుంది కదా.  అది జంతువులను వేటాడి తింటూ వుంటుంది కదా.  ఒక సారి అది అలా తిన్నప్పుడు ఒక ఎముక పళ్ళ మధ్య గుచ్చుకుంది.  దానితో  అది ఏమీ తినలేక పోయింది.  మాసాన్ని కొరకటానికి, నమలటానికీ, ఆ ఎముక అడ్డుగా వుంది.  మనకి గూడా పళ్ళల్లో ఏదన్నా గుచ్చుకుంటే మనం ఇంకా ఏమీ తినలేము.  దాన్ని బయటకి తియ్యటానికి అనేక విధాల ప్రయత్నిస్తాము కదా.  అలాగే పాపం అది కూడా దానికి చేతనయిన అన్ని విధాలా ఆ ఎముకను తియ్యటానికి ప్రయత్నించింది. కుదరలేదు.

అక్కడే ఒక చెట్టు మీద వున్న వడ్రంగి పిట్ట అది చూసింది.  పాపం పిట్టకి చాలా జాలి వేసింది.  ఆ ఎముక రాకపోతే పులి ఏమీ తినలేదు కదా.  అది ఆకలితో వుండిపోతుందని అనుకుంది.  దానికి సహాయం చేయాలనుకుంది.  కానీ దానివల్ల తనక్కూడా కొన్నాళ్ళు ఆహారం దొరికితే బాగుంటుంది.  రోజూ ఈ పురుగులు తిని విసుగు వస్తోంది అనుకుంది.  అందుకే..

పులి బావా, నీకు నేను సహాయం చేస్తాను.  నీ నోట్లో వున్న ఎముకని నా వాడి ముక్కుతో తీసేస్తాను.  అయితే నువ్వు నాకు రెండు వాగ్దానాలు చెయ్యాలి అని అడిగింది.  వడ్రంగి పిట్ట ముక్కు సంగతి తెలిసిన పులి, మంచి సహాయం దొరికింది, దీన్ని వాడుకోవాలనుకుని, సరే చెప్పు. ఏం చెయ్యమంటే అది చేస్తాను అన్నది.  వడ్రంగి పిట్ట తన రెండు వాగ్దానాలు అడిగింది.  మొదటిది తను పులి నోట్లో తల పెట్టినప్పుడు పులి తనని తినకూడదని, రెండోది పులి సంపాదించుకున్న ఆహారంలో కొంత భాగం తనకి ఇవ్వాలని.  సరేనంది పులి.  మాట తప్పకూడదని మరోసారి వాగ్దానం తీసుకుంది పిట్ట.


ఇంక పులిని జాగ్రత్తగా వుండమని గబగబ దాని నోట్లో ఎముకని తన వాడి ముక్కుతో పీకేసింది.  పులి తన బాధ పోయి సంతోషించింది.  వడ్రంగి పిట్ట చెట్టుమీదకి ఎగిరి కూర్చుంది. దానికీ కొంచెం బధ్దకం వేసి చెట్టుమీదనుంచీ కదలకుండా కూర్చునేది.  పులి వేటాడి కొంచెం మాంసం పిట్టకి తెచ్చిస్తే అది తిని బధ్దకాన్ని పెంచుకుంటూ వచ్చింది. పులి క్రూర జంతువు కదా.  దానికి రోజూ తను అంత చిన్న పిట్టకి ఆహారం తెచ్చి పెట్టటం తలవంపులుగా అనిపించింది.   అందుకే ఇంక అది పిట్టకోసం ఆహారం తేవటం మానేసింది.  ఆకలివేసిన పిట్ట మళ్ళీ ఏ చెట్టు మీద పురుగులు వున్నాయా అని వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చింది.

దాంతో పిట్టకి కోపం వచ్చింది.  నేను తినే ఆహారం ఎంత!?  అంత కొంచెం ఆహారం తెచ్చి పెట్టటానికే ఈ పులికి చేతకావటంలేదా.  నేను ఆ ఎముక తియ్యకపోతే అసలు మాంసం తినగలిగేదా? అని అనేక విధాల అనుకుని  ఎలా అయినా పులికి శాస్తి చెయ్యాలని అనుకుంది.  పులి ఆదమరచి వున్నప్పుడు దాని కన్నొకటి తన ముక్కుతో పొడిచేసింది.  దానితో పులి కుయ్యో మొర్రో అని వడ్రంగి పిట్ట మీద అరిచింది.  “నువ్వు నా నోట్లో తల పెట్టినప్పుడు నేను నీ మెడ కొరక్కుండా వదిలేశాను.  నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా.”  అని అరిచింది.

పిట్ట మాత్రం తక్కువ తిందా.  “కొరికుండాల్సింది.  ఆ ఎముకతోబాటు నా తల, ముక్కు కూడా నీ నోట్లో వుండి పోయేవి.  వాటిని పీకటానికి ఇంకెవరి దగ్గరకన్నా పరిగెత్తాల్సి వచ్చేది.  అయినా  నేను నీకుమల్లే ఆహారం ఇస్తానని మోసం చెయ్యలేదు.  ఇంకో కన్ను వుంది కదా.  దాన్ని కూడా పొడిచెయ్యలేదు..సంతోషించు.  దాంతో నీ ఆహారాన్ని వెతుక్కో.  నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడితే నీకీ గతి వుండేది కాదు కదా” అని ఎగిరి పోయింది.

***

No comments:

Post a Comment

Pages