శ్రీధరమాధురి -84 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -84

Share This

శ్రీధరమాధురి -84

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


 ప్రతిరోజూ, కృష్ణ భగవానుడు తోటలోకి వెళ్లి, మొక్కలతో ,"మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను," అనేవారు. మొక్కలు “మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము” అంటూ బదులిచ్చేవి. 

ఒకరోజున కృష్ణుడు చాలా ఆందోళనగా తోటలోకి త్వరగా వెళ్ళారు. ఆయన వెదురుమొక్క వద్దకు వెళ్ళారు. వెదురు మొక్క ఇలా అడిగింది,”కృష్ణా ! మీకోసం నేను ఏదైనా చెయ్యగలనా?” కృష్ణుడు,”అవును, కాని, అది అడిగేందుకే నాకు కష్టంగా ఉంది, ఇచ్చేందుకు నీకూ కష్టంగా ఉంటుంది.” అన్నారు.

వెదురు మొక్క ఇలా అంది, “దయచేసి అడగండి, మీకోసం ఏమైనా చెయ్యడాన్ని నేను ప్రేమిస్తాను. మీరు నా దైవం, మనకు ఒకరిపట్ల ఒకరికి లోతైన ప్రేమ ఉంది. మీకు ఏ విధంగానైనా పనికి వచ్చే అవకాశాన్ని దయుంచి నాకివ్వండి.”

కృష్ణుడు ఇలా అడిగాడు, “నీ ప్రాణం కావాలి, నిన్ను నరికేస్తాను.”

వెదురు మొక్క ఇలా అంది, “ దయుంచి అలాగే చెయ్యండి.”

కృష్ణుడు ఇలా అడిగాడు, “ఒకసారి నిన్ను నరికాకా, నీ ప్రాణం పోతుంది. అలాంటప్పుడు నా కోరికకు నువ్వెలా అంగీకరిస్తున్నావు?”

వెదురు మొక్క ఇలా అంది, “మీరే నా ప్రేమికులు, అందరికంటే నాకు మీరే ఎక్కువ. మీరేమైనా అడుగుతున్నారంటే, అది ఏదో గొప్ప ప్రయోజనానికి అయ్యుంటుంది. ఈ ప్రాణాన్ని ఇచ్చింది మీరే, ఇవాళ కాకపొతే ఏదో ఒకరోజున ఇది పోయి తీరాల్సిందే. ఎవరికీ పనికిరాకుండా చావడం కంటే, ఒక ప్రయోజనం కోసం చనిపోవడం మంచిది, అదీ నా ప్రేమికులు, దైవం అయిన మీ చేతుల్లో చావడం కంటే భాగ్యం ఏముంటుంది? అందుకే ఏ జంకూ లేకుండా నన్ను నరకండి, మీకు కావలసిన పవిత్రమైన కార్యానికి నన్ను వాడుకోండి.”

కృష్ణుడు ఆ వెదురు మొక్కను కత్తిరించి, లోపల ఉన్నదంతా తీసేసి ఖాళీ చేసారు, దానికి రంధ్రాలు పెట్టారు, దాన్ని వేణువుగా మార్చి, ఊదడం మొదలుపెట్టారు. 

గోప బాలురు, గోపికలు, రాధ, రుక్మిణి, సత్యభామ అందరూ వేణువును చూసి, అసూయ పడేవారు. “చూడు, కృష్ణుడు మా దైవం, కాని, మాకు కొంత సమయం పాటు మాత్రమే ఆయనతో ఉండే అవకాశం దక్కుతుంది. కాని ఆయన నీతో నిద్ర లేస్తారు, నీతోనే పడుకుంటారు, అన్ని వేళలా నీకు ఆయనతోనే ఉండే అవకాశం దక్కుతుంది కదా ! అనేవారు.

ఒకరోజున వారు వేణువును ఇలా అడిగారు, “ దైవం నిన్ను ఇంతగా అనుగ్రహించడానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటో దయుంచి చెప్పవూ!”

వేణువు ఇలా అంది, “ ఆ రహస్యం ఏమిటంటే, నన్ను నేను దైవేచ్చకు వదిలేసాను. నాకు ఏది సరైనదో అది ఆయన చేసారు. నాలో నిండివున్న పదార్ధాన్నంతా తీసేసి ఖాళీ చేసారు. ఆ తర్వాత రంధ్రాలు చేసారు. దైవం నన్ను ఆయనకు ఎలా కావాలో అలా మలచుకున్నారు. నేను ఆయన చేతిలో వాయిద్యాన్ని అయ్యానంతే !”

దైవం ఆయన ఏది, ఎలా కావాలనుకుంటే అలాగే మీతో చెయ్యగలిగినప్పుడు, అది సంపూర్ణ శరణాగతి, వేణువు లాగా మీరాయన చేతిలో ఇమిడిపోతారు. ఏ ప్రశ్నలూ అడక్కూడదు, ఎందుకంటే ఆయనపట్ల మీకు ప్రశ్నించనలవి కాని మహా విశ్వాసం ఉంటే, అది మీ జీవితాన్ని వెదురు నుంచి వేణువుగా మారుస్తుంది. అప్పుడు మీరు ఎల్లప్పుడూ దైవంతోనే ఉంటారు. అందుకే అలా ఉండండి చాలు, గతంలోనో, భవిష్యత్తులోనో కాదు, ప్రస్తుతమనే ఈ క్షణంలో బలంగా నాటుకుని ఉండండి... ఈ క్షణాన్నే ‘దైవం’ అంటారు.


No comments:

Post a Comment

Pages