బసవ పురాణం - 10 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు - బసవ పురాణం - 10

 పి.యస్.యమ్. లక్ష్మి




రుద్ర పశుపతి కధ


రుద్ర పశుపతి అతి గొప్ప శివ భక్తుడు.  ఈయన స్వామి క్షేమం కోసం పరితపించాడు.  ఆ ప్రగాఢమైన ప్రేమతోనే శివుని ఒడిలో స్ధానం సంపాదించాడు.  మరి బసవేశ్వరుడు చెప్పిన ఆ కధ నా మాటల్లో చెప్పనా?


పూర్వం రుద్ర పశుపతి అనే ఆయన వుండేవాడు.  ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయన పురాణాలు, హరి కధలు ఎక్కువగా వినేవాడు.  ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవతము పురాణము చెబుతూ సాగర మధనం గురించి చెప్పసాగాడు.  అందులో సాగర మధనంలో హాలాహలం రావటం, దానిని బ్రహ్మ, విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు.  


రుద్ర పశుపతి ఆ కధలో ఎంత తన్మయత్వం చెందాడంటే ఆ పౌరాణికుడిని మళ్ళీ మళ్ళీ అదే కధ చెప్పమని అడిగి,  “ఏమిటి   శివుడు విషం మింగాడా!?  ఇది నిజమేనా?  ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా!?”  అని ఆ పౌరాణికుని గుచ్చి గుచ్చి అడుగగా ఆయన కూడా “నిజమే, శివుడు ఆ హాలాహలాన్ని మింగాడు” అని చెప్పాడు.  దానితో ఆ భక్తుడు స్పృహ తప్పి నేలమీద పడి కొంత సేపు తర్వాత తెలివి రాగా శివుడు తన ఎదురుగా, అప్పుడే విషం మింగినట్లు బాధ పడుతూ,  “నా తండ్రీ, శివయ్యా, నువ్వు విషం ఎందుకు మింగావయ్యా?  నువు విషం మింగావని వింటేనే నేను భరించలేక ఇలా అయిపోయానే, ఇంక నిజంగా విషం మింగిన  నువ్వెలా వున్నావో కదా??  అయ్యో, ఆ విషం లోపలకెళ్తే నిన్ను చంపేస్తుంది.  వెంటనే కక్కెయ్యవయ్యా.  లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా!  నీ మరణ వార్తని నేనెట్లా వినేది?  విని నేను బతికి వుంటానా!?     అయినా నిన్ను విషం మింగమని వాళ్ళెట్లా కోరారు?  నిన్నడగటానికి వాళ్ళకి నోరెలా వచ్చింది?  అదేదో వాళ్ళే మింగచ్చు కదా!  ఎంత గడుసువాళ్ళు వాళ్ళు!  నువ్వేమో విషం మింగి చనిపోవాలా? వాళ్ళు మాత్రం సుఖంగా వుండాలా?  నీకేగనక తల్లి వుంటే నిన్నిలా విషం తాగనిచ్చేదా?  నీ అర్ధాంగి ఎలా వూరుకున్నది?  నీ కుమారులక్కడ లేరా?  ఎక్కడికెళ్ళారు సమయానికి?  వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళా?    నా తండ్రీ, నీకెంత ఆపద వచ్చింది!?  నేను భరించ లేకుండా వున్నాను. ఇంక వెంటనే దాన్ని కక్కెయ్యవయ్యా.”  అని మళ్ళీ పౌరాణికుడిని అడగసాగాడు.  


“శివుడా విషం కక్కాడా లేదా”  అని.  పౌరాణికుడు “ఇంకా కక్కలేదు. కంఠములో నిలుపుకున్నాడు” అని చెప్పాడు.  అది విని రుద్ర పశుపతి మళ్ళీ “అయ్యో, విషం కంఠంలో వున్నదే.  అది కంఠం దిగితే ఇంక చెప్పేదేమున్నది?  ఇంక మరణమే.  ఇంక పౌరాణికుడు ఆ విషయమే చెప్తాడు.  ఆ మరణవార్త నా చెవిని పడక మునుపే నేనే ప్రాణ త్యాగము చేసేస్తాను.”  అని దగ్గరలోవున్న ఒక లోతైన చెరువులో పడిప్రాణ త్యాగము చెయ్యబోగా శివుడు పార్వతీ దేవితో  సహా ప్రత్యక్షమయి, “భక్తవరా, నీ మూఢ భక్తికి నేను మెచ్చాను, వరము కోరుకో” అన్నాడు.  


అప్పుడు కూడా రుద్ర పశుపతి “నా వరము సంగతి దేవుడెరుగు. ముందు నువ్వా విషాన్ని కక్కావా లేదా? ఆ సంగతి చెప్పు” అని నిలదీశాడు.  అప్పుడు ఈశ్వరుడు అతనిని ఓదార్చి, “నేను విషాన్ని కడుపులోకి మింగలేదు.  కంఠంలోనే వుంచుకున్నాను.  అందుకేగదా భక్తులు నన్ను నీల కంఠుడు అంటారు.  ఈ విషమిలా కంఠంలోనే వుండటంవల్ల నా శరీరంలో ఏమీ మార్పు రాదు.  నేను ఎప్పటిలా ఆరోగ్యంగానే వుంటాను” అని చెప్పాడు.  


కానీ రుద్ర పశుపతికింకా నమ్మకం కుదరలేదు. “విషం ఎప్పటికైనా ప్రాణ హాని కలిగిస్తుంది. అందుకనే వెంటనే దానిని కక్కివెయ్యి.  ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే వుంటుందా?  పొరపాటున కిందకి దిగితే తప్పకుండా ఆపదే.  అదిగో, దిగుతున్నట్లు నాకు కనబడుతోంది.” అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు.  


అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చోబెట్టుకుని, “ఈ విషమెప్పుడూ అలాగే వుంటుంది.  కిందకి దిగదు.  నువ్వు నమ్మకపోతే, నమ్మకం కలిగేవరకూ అలాగే చూస్తూ వుండు” అన్నాడు.  దానికా భక్తుడు “నేనిలాగే చూస్తూ వుంటాను.  ఆ విషము కంఠంలోంచి ఎప్పుడు కిందకి దిగుతుందో, అప్పుడే నేనూ నా ప్రాణం విడుస్తాను” అని చూస్తూ కూర్చున్నాడు.  ఇప్పటికీ రుద్ర పశుపతి ఈశ్వరుని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు.  


ఈ కధని బసవేశ్వరుడు తన దగ్గరకొచ్చిన భక్తులకి చెప్పాడు.  భక్తికి లొంగని భగవంతుడు వుండడు అని ఈ కధ నిరూపిస్తుంది.  రుద్ర పశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి, ఆయన బాగోగులే తనకి ముఖ్యమనుకుని, ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించటానికి సిధ్ధపడి, చివరికి తన మూఢ భక్తితో ఆయన ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు.  


చూశారా!?  భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు!.

***


No comments:

Post a Comment

Pages