గయా క్షేత్రాలు - అచ్చంగా తెలుగు
గయా క్షేత్రాలు 
శ్రీరామభట్ల ఆదిత్య 

మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి. వాటిల్లో గయా క్షేత్రాలు అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా పరిగణింపబడుతున్నాయి. ఈ గయా క్షేత్రాలు మొత్తం మూడు. అవి....

1) శిరో గయ - గయ ( బీహార్ రాష్ట్రం )
2) నాభి గయ - జాజ్‌పూర్ ( ఒడిషా రాష్ట్రం )
3) పాద గయ - పిఠాపురం ( ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం )

ఈ మూడు క్షేత్రాలు ఎన్నో విశేషాలు వలన చాలా ప్రసిద్ధి చెందాయి. గయా మాంగళ్యగౌరికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, పీఠిక్యాం పురుహూతికా అని మూడు క్షేత్రాల గురించి అష్టాదశశక్తిపీఠ స్తోత్రంలో కనిపిస్తుంది. ఈ మూడూ అష్టాదశశక్తి పీఠాలలోకి వస్తాయి. అందునా బీహార్ రాష్ట్రంలోని గయ విష్ణుపాద క్షేత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం ప్రముఖ దత్తక్షేత్రం.

కథ:
అసలు ఈ మూడు క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే... పూర్వం గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతడు త్రిపురాసురుడి కుమారుడు. ఇతడు రాక్షసుడే అయినా అతడు మహాభక్తుడు, రాక్షసరాజు కూడా. గయాసురుడు వేలాది సంతవ్సరాల పాటు శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రమైన తపస్సు చేశాడు. గయాసురుడు చేసిన అద్భుతమైన తపస్సు మెచ్చిన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమయి ఏం వరం కావాలి అని అడగగా, "నా శరీరం ఈ ప్రపంచంలోని అన్ని తీర్థాలకన్నా పవిత్రం కావాలి" అని వరం కోరుకున్నాడు. 

నారాయణుడు "తథాస్తు" అని అంతర్ధానమయ్యాడు. అలా గయాసురుడి శరీరం పవిత్రమైపోయింది. ఏ పాపమైనా సరే ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి. దీని వలన సృష్టిఘటనా చక్రంలో మార్పులు వచ్చాయి. గయాసురుడు చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా అతడికి ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీచ్యుతుడయ్యారు. దేవతలందరూ పదవీభ్రష్టులయ్యారు. 

అప్పుడు దేవతలందరూ కలిసి త్రిమూర్తులను కాపాడమని వేడుకున్నారు. దేవగణాలకు అభమిచ్చిన త్రిమూర్తులు ఋత్విక్కుల వేషాలలో గయాసురుడి వద్దకు వస్తారు.  తాము ఓ గొప్ప యాగాన్ని తలపెట్టామని, దానికి తగ్గ పవిత్రమైన స్థలాన్ని చూపించమని వారు గయాసురుడిని కోరగా తన శరీరం కన్నా పవిత్రమైన స్థలం ప్రపంచంలో ఎక్కడా లేదనీ, తన శరీరం మీద యజ్ఞాన్ని చేసుకోమన్నాడు గయాసురుడు. కానీ "యజ్ఞం మొదలు పెట్టిన తర్వాత నీ శరీరం గనక ఏ మాత్రం కదిలినా నీకు మరణం తప్పదని" అని షరతు విధించారు ఆ ఋత్విక్కులు. ఆ షరతుకు గయాసురుడు అంగీకరిస్తాడు. 

అలా త్రిమూర్తులు తమ యజ్ఞాన్ని గయాసురుడి శరీరం మీద మొదలుపెట్టారు. గయాసురుడి శిరో భాగంలో శ్రీ మహావిష్ణువు, నాభి భాగంలో బ్రహ్మ మరియు పాద భాగంలో శివుడు యజ్ఞం చేయనారంభించారు. అలా 6 రోజుల పాటు యజ్ఞం జరగగా ప్రతీ రోజూ కోడి కూతను గుర్తుపెట్టుకొని ఎన్నిరోజులు పూర్తయ్యాయో గయాసురుడు లెక్క పెట్టుకునేవాడు. కానీ 7వ రోజు రాత్రి తెల్లవారకముందే పరమేశ్వరుడు కోడి రూపంలో కూస్తాడు, 7వ రోజు కూడా అయిపోయిందని గయాసురుడు తన శరీరాన్ని కదిలిస్తాడు. అప్పుడు వెంటనే షరతు ప్రకారంగా త్రిమూర్తులు గయాసురుని వధించబోగా, ఆ  ఋత్విక్కులు సాక్షాత్తుగా త్రిమూర్తులని గయాసురుడు గ్రహించి, తన చివరి కోరికగా వారు యజ్ఞం చేసిన మూడు ప్రాంతాలూ పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారి అశేష భక్తజనంచేత పూజలు అందుకోవాలని కోరతాడు. సరేనన్న త్రిమూర్తులు వాడిని వధిస్తారు. అలా ఏర్పడ్డవే ఈ మూడు క్షేత్రాలు.

( ఇంకా ఉన్నది....)

No comments:

Post a Comment

Pages