మరపు
 P.L.N. మంగారత్నం
					
	ఈ ఏడాది  పెద్దబ్బాయికి పెళ్లి నిశ్చయం చేసాం. 
ముహూర్తాలు పెట్టుకోవడమే తరువాయి, రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి.  ఇంటికి రంగులూ, పెయింట్లు వెయ్యించడానికే పది రోజులు పట్టింది. 
పెళ్లి పనులు వినాయకుడికి ముడుపు కట్టడంతో మొదలయ్యాయి.  ముహూర్తానికి ఎన్నో రోజులు టైము లేకపోవడంతో .. ఇంటికి కావలసిన వస్తువులు ఒక్కటొకటిగా సమకూరుస్తున్నాం. 
ఆ రోజు... 
శుభలేఖలు ప్రింటింగుకు ఇస్తూ,   రాబోయే కోడలికి ‘బంగారు నగ’ కొనే పని పెట్టుకున్నా౦.
	ఇంకో గంటలో బంగారం షాపుకి వెళతాం అనుకుంటుండగా..  జగన్నాధపురంలో ఉన్న చెల్లెలు అర్చన వచ్చింది కూతుర్ని తీసుకుని. అర్చన టీచరుగా పనిచేస్తు౦ది. ప్రస్తుతం వేసవి శెలవులు. 
	భర్త అంటే మరిది రత్నాకర్ సామర్లకోటలో ఉన్న ప్రైవేటు .. పవర్ ప్లాంటులో కంప్యూటర్ ఆపరేటరు.  దానికి  ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో వేన్నిళ్ళకు చన్నీళ్ళలా .. ఉపయోగపడుతుంది మరిది జీతం. 
 సాయంత్రం కావస్తుంది. ఇప్పుడనగా బయలుదేరితే గాని షాపింగు .. తెమలదు. మరిది కూడా వచ్చి ఉంటే బాగుండును. మా ఆయన కన్నా ..మరిదికి బంగారం లెక్కలు బాగా తెలుస్తాయి అనుకుంటూ  “రత్నాకర్ ఏడీ? లేటుగా వస్తానన్నాడు గానా” తను రావడం ఇంకా లేటుగా అవుతుందేమోనన్న ఆదుర్దాతో.
 “లేదు శెలవు కుదరలేదట. కొలీగ్ ఎవరో శెలవు పెట్టడంతో తనకు శెలవు దొరకలేదట . బట్టలు కొనేటపుడు వస్తానన్నాడు. ఇంతకీ... పెళ్ళికూతురికి ‘నగ’ ఏ షాపులో కొనాలనుకు౦టున్నారు” అడిగింది.
“ మలబార్ గోల్డ్ కి వెళ్ళాలనుకుంటున్నాం. రత్నాకర్ కూడా వచ్చిఉంటే బాగుండేది. ఇంకా చాలా వస్తువులు కొనాలి ” రాసుకున్న లిస్టు చూపిస్తూ అన్నా, 
	‘హమ్మయ్యా! ఫర్వాలేదు. నేను కూడా అందులోనే గోల్డ్ స్కీం క్రింద నెలకు పది వేలు కడుతున్నా. ఈ నెలలో ఇంకా కట్టలేదు. నీకు తెలుసు కదా. ఈ వేసవిశెలవుల్లో జీతాలు రావని, ఇపుడు నువ్వో ‘పదివేలు’ సర్దితే, జీతాలు రాగానే ఇచ్చేస్తాను” అడిగింది రిక్వస్తుగా.
	పెళ్లి పేరు మీద  వేలు ఖర్చులు పెడుతూ .. దానికి లేవని ఏమంటా౦. “ సరే! అలాగేలే” అన్నా.. పర్సులో ఏ.టి.ఎమ్ కార్డ్ ని తడుముకుంటూ కాదంటే బాధపడుతుంది. ఎంతైనా తోడబుట్టినది కదా!
	షాపుకి వెళ్లి ధరా, తరుగు .. వంటి వివరాలు తెలుసుకుంటు౦డగానే ..” అక్కా,  నా పది వేలు ఇవ్వు.  మీరు నగ సెలెక్ట్ చేసుకునేటప్పటికి  టైము పడుతుందిగా.ఈ లోపు ఆ కౌంటర్లో డబ్బులు కట్టేసి వస్తాను” అంటూ అడిగింది.
నేను ఇస్తాననడంతో అప్పుడే ‘అవి’ తన స్వంతం అయిపోయినట్లు. పర్సులోంచి  అయిదు, రెండు వేల రూపాయల నోట్లు తీసిఇచ్చాను.     
	ఓ గంట తరువాత అందరికీ నచ్చిన ‘నెక్లేసు’ఒకటి తీసుకున్నాం.   
						***
	పెళ్లి దగ్గర పడుతుండడంతో హడావుడిగా పనులు చేసుకుంటున్నా, జమాఖర్చుల లెక్కలు వేసుకోవడం మానలేదు. పెళ్లి కూతురికి  వాళ్ళు కోరిన విధంగా అన్నీ పట్టు చీరేలే కొన్నాం.
	  ఓ సారి లెక్కలు  వేసుకుంటుంటే  ‘పదకొండు వేల” పైన లెక్కకు  తక్కువోచ్చింది. అలా ఎందుకు జరిగిందో అర్ధం కాలేదు. కొన్న ప్రతి వస్తువుని కాగితం మీదకి తీసుకొచ్చాను. ఎందుకో తేడా తెలీలేదు. 
దానికోసం బుర్రబద్దలు కొట్టుకోవడం అనవసరం అని .. పెళ్లన్న తరువాత ఏవో  కనబడని ఖర్చులుంటాయని .. పైగా ఖర్చు నా ఒక్కదాని చేతిమీదుగా నడచింది కాబట్టి, ఈ విషయంలో ఎవరినీ ‘అనే’ పని లేదని,  ఆ తక్కువైన డబ్బుని ..’సాదర్’ అంటూ ‘లెక్కతేలని’ ఖర్చుగా వ్రాసేసి,  బీరువాలో ఉన్నడబ్బుకి .. లెక్క సరిపెట్టేసాను.
	 					***
	నాలుగు నెలల తరువాత  ఓ ఆదివారం .. 
అర్చన వచ్చి కాస్సేపు బాతాఖానీ వేసి, వియ్యపు వాళ్ళ వివరాలు తెలుసుకుని,  వెళుతూ .. వెళుతూ ‘అయిదువేలు’  తీసి చేతిలో పెట్టింది.
	“ఎందుకు” అన్నా ఆశ్చర్యంగా.
	“ అప్పుడు. మలబార్ గోల్డ్ లో తీసుకున్నాగా” అంది గుర్తులేదా! అన్నట్లు చూస్తూ.
	అపుడు సడన్ గా గుర్తొచ్చింది. నా ఇంటి పెళ్లి ఖర్చు .. తనకి అప్పివ్వడం తోనే మొదలయ్యిదని. కొన్న వస్తువులకే .. లెక్కలు వేయడంతో .. అకౌంట్లో  తేడాలు ఎందుకోచ్చినయ్యో కూడా అపుడు  గుర్తొచ్చింది. 
“ అస్సలు గుర్తు లేదు సుమా! పూర్తిగా మర్చిపోయాను” అన్నాను లెక్కతేలని డబ్బు తిరిగొచ్చినందుకు సంతోషపడుతూ.
	“ అయ్యో!  పూర్తిగా మర్చిపోయావా! అలా అనుకుంటే ఇవి ‘కూడా’ ఇవ్వకపోయేదాన్ని గదా ” అంది కళ్ళు మెరిపి౦చి,  తమాషాగా భుజాలెగరేస్తూ.
	“నేను మర్చిపోతే ఏమిటిలే .. నువ్వయినా గుర్తు పెట్టుకున్నావు కదా” నా ముఖంలో సంతోష౦. తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికినట్లు.
ఏ ఖర్చూ నా లెక్క దాటిపోలేదు.  ప్రతి రూపాయి అవసరానికే ఖర్చు చేశానని సంతృప్తి పడ్డాను. మిగినది నెమ్మదిగా ఇస్తుందిలే సరిపెట్టుకున్నాను.
					***
	అలా ‘అనుకుని’ అప్పుడే ..
రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
 ఆ మిగిలినకి సమాధానం లేదు. ఆ రోజు విషయాన్ని నాకు గుర్తు చేసి .. ఇప్పుడు తను మర్చిపోయింది. ఈసారి ‘కావాలనే’ మరచిపోయింది. నేనేలాగు అడగలేని అక్కనని  కావచ్చు.
	నిద్రపోయేవాడిని లేపగలం గాని, నిద్ర నటించే వాడిని లేపలేo కదా!
ఈ లోపు తను మలబార్ గోల్డ్  ఇన్స్తాల్మేంట్ పూర్తి అవడంతో ఒక పెద్ద హారం తెచ్చుకు౦ది. ఒక అపార్టుమెంటు కొనుక్కుంది బ్యాంకు లోనూ పెట్టుకుని,  ఇంటికి కావలసి కొత్త హంగులు సమకూర్చుకుంది.  
ఇన్నాళ్లూ ఆగి .. ఇలాంటి సమయంలో నేను బయటపడితే .. ఏం కారణం చెబుతుందో! 
“ఎపుడో ..ఇచ్చేసాను నువ్వే మరచిపోయావ్” అంటుందేమో అన్న సంశయం.  
 డబ్బు అయిన వాళ్ళని కూడా దూరం చేస్తుంది.  పిలిస్తే పలికేంత దగ్గరలో ఉన్నది ఇది. మిగిలినవాళ్ళు  చెట్టు కొకళ్ళు పుట్టకొకళ్ళు అన్నట్లు దూరంగా.. వేరే వేరే జిల్లాలలో  ఉన్నారు.  
ఈ విషయం  సందర్భానుసారం .. 
ఓసారి  ఆఫీసులో చెప్పాను.  ఇల్లు తరువాత ఫ్రీగా మాట్లాడుకోగల ప్రదేశం ఆఫీసు.  తనేం లేక ఇబ్బంది పడడం లేదు కదా! నా పెద్దరికాన్ని, ముఖమాటాన్నిఅలుసుగా తీసుకున్న౦దుకు నొచ్చుకుంటూ. 
అంతా విని “అయ్యో! అడక్కపోయరా? అయిదు వేలంటే తక్కువా .. ఏమిటి ” అన్నాడు పక్క సీటు సుందరం.
తనకీ ఓ సారి ఇలాగే జరిగిదని  పెద్ద స్టొరీనే  చెప్పాడు ఎదురు సీటు పరాంకుశ౦. 
ఈ సంభాషణలు  ఇలా జరుగుతుండగా .. 
అంతా వింటూ పని చేసుకుంటున్న ..  టైపిస్టు రాగిణి ‘మాటలు’ తన పనికి ఆటంకం అనుకుందో ఏమో!  మా సంభాషణలకు అడ్డుకట్టవేస్తూ నన్నుద్దేశి౦చి “ఇప్పడలా అన్నా మీరెందుకు  వదిలేస్తారు మేడం .. ఎప్పుడూ ఆటో అయినా ఎక్కకుండా ..  స్టాండింగులో ఉన్నా బస్సు  ఎక్కే మీరు .. అయిదు వేలు వదిలేస్తారా? ఎప్పుడో అప్పుడు  వసూలు చేసేస్తారు లెండి ” జోస్యం పలికింది.   
జీవితంలో ఎప్పటికైనా నా డబ్బు నాకొచ్చేస్తుంది .. చెల్లెలు ఇంట్లోదే అన్నట్లు.   
					***
రోజూ లాగే, ఇంటికొచ్చి ఆఫీసులో సంబాషణ ఆయన ముందు పెట్టాను. 
మా టైపిస్టు జోస్యాన్నీ చెప్పాను. 
          ఉండేది ఇద్దరమే.
కాబట్టి, ఏమాటైనా ఆయన  విని తీరాల్సిందే. విసుగనిపించినా కూడా.
పిల్లల్లో ..
ఒకడు బెంగళూరులో ఉంటే, మరొకడు హైదరాబాదులో ఉన్నాడు.
అప్పుడు అన్నారు “ చిన్నవాడితో ఒకసారి మీ చెల్లెలు అంటుంటే విన్నాను. అన్నయ్య పెళ్ళిలో .. మీ అమ్మ ఆడపిల్లలు ఎవరికీ ఆడపడుచు కట్నాలు ఇవ్వలేదు. ఏడుగురు ఆడపిల్లలూ  ..  ఏవో డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. ఆ విషయం ఇద్దరు పిన్నిలూ అడగలేక వెళ్ళిపోయారు. మీకు చెల్లెళ్ళు ఎవరూ లేరని, అవతలి వాళ్ళు ఆడపడుచు కట్నం ఇవ్వకపోయినా ..ఇచ్చిన లాంచనాలలో, మీ అమ్మ ఏదో చూసి ఇవ్వాలి ”
“ కాబట్టి, మా చిన్నది సంధ్య .. ఊరిలొ ఉన్నందుకు శుభలేఖలకీ పసుపు రాసి, బొట్లు పెట్టింది కదా! అందుకు మీ అమ్మకు ఇవ్వాల్సిన ‘డబ్బు’ మా పిల్లకి ఆడపడుచు కట్నంగా ఉంచేసుకుంటానని చెప్పు” అని.
ఆ మాటకు నాకు నోట మాటరాలేదు. 
“ అప్పుడు నువ్వు ఇంట్లో లేవులే” అంటూ కొసమెరుపు కూడా ఇచ్చారు.
దానికి అలాంటి తెలివితేటలకు లోటు లేదు.  ఇన్నాళూ నిద్ర నటిస్తుంది అనుకున్నాను. బాకీ ఎగ్గొట్టడానికి కారణం వెతుక్కుందని చాలా ఆలశ్యంగా తెలిసి ఆశ్చర్యపోయాను. 
****
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment