శివం - 63 - అచ్చంగా తెలుగు
శివం - 63
హరసిద్ధుని కథ 
రాజ కార్తీక్


(హర సిద్దు శిల్ప కళ ను పరిశీలించాలన్న ధ్యేయం తో కుంబయ్య అతని కళ ప్రాంగణం కి వచ్చి అతని చేత చెక్క బడిన శిల్పాలను గురించి విశ్లేషణ చేస్తున్నాడు)

కుంభయ్య:

 " ఏమయ్యా హర సిద్ద ! ఏమిటి ఈ చిన్న చిన్న నిర్లక్ష్య పనులు?"

హర సిద్దు తనను కుంబయ్య పొగుడుతాడని అనుకుంటే ఏంటి ఇది అని, అంత నికచ్చిగా చిన్న తప్పును కూడా చెప్తున్నాడు అని అనుకోసాగాడు.

హ సి " కుంభన్న నిజం చెప్పు! నీవు కూడా ఒక శిల్ప కారుడివి కదా! లేకపోతే ఇంత సున్నిత అంశాలు నీకు అంత గట్టిగా కనపడవు."

కుంభయ్య "నా శిల్ప కళ గురించి ఎందుకు కానీ ఇప్పుడు... అయినా అదేమీ హర సిద్ద? ఎవరూ గమనించకపోతే నువ్వు చేసింది ఒప్పు అయిపోతుందా!"

హ సి " లేదు అన్న , కాకపొతే చిన్న చిన్నదోషాలు."

కుంభయ్యా "గొప్ప వాడివి కావాలి అనుకుంటే ఇది సరిపోదు హర సిద్ద. సాధ్యమైన గొప్ప తనంతో పరిజ్ఞాననాన్ని ఉపయోగించి గొప్పగా చేయాలి. ఫలితం దైవానికి వదిలి వేయాలి."

హ.సి " అవును అన్నా! నువ్వు చెప్పింది నిజమే ..కానీ,అవి నేను అంతగా పట్టించుకోలేదు."

కుంభన్న "చిన్న నిర్లక్ష్యం కూడా మనలని ఎక్కడి దాకా అయిన తీసుకు వెళ్తుంది.‌ మనకి తెలిసినంతలో మన విద్య పూర్తిగా వినీయోగించాలి. అప్పుడే కళకు సార్థకత."

అంటూ అనగానే... హర సిద్దు వచ్చి కుంబన్న చెప్పిన లోటు పాట్లు, పొరపాట్లు గమనించి ఒప్పుకున్నాడు..

హ సి " అన్నా మరి... "

కుంభన్న " హర సిద్దు... దేవుడిని తయారు చేసే నువ్వు అంతా డీలా పడాల్సిన అవసరం లేదు.‌ నీలో ఒక మహా శిల్పి ఉన్నాడు. చిన్నపాటి విమర్శకే నువ్వు తట్టుకో లేక పోతే ఎలా? నిన్ను విమర్శ చేసే వారికి సిగ్గు వచ్చేలా నీ పనితనం ఉండాలి. విమర్శ ను అంగీకరించి తిరిగి నువ్వు నీ పనితనం చూపించాలి."

హర సిద్దు కి మాత్రం కుంబన్న మాటలు చెవిలో నుండి మనసు కి ఎక్కుతున్నై . చిన్నగా హర సిద్దు మనసులోని మొండితనం పోతూ ఉంది.

 కు. "హర సిద్దా వినపడుతుందా! మళ్లీ ఎక్కడ పెట్టావ్ నీ మనసు? బాగా పని చేసేటప్పుడు నీ జీవితంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని మధన పడతవేమో ! చివరికి ఇలా వస్తుంది నీ పనితనం! "

" అయినా ఏమిటి ఇది హర సిద్దా? శ్రీ కృష్ణుడు వాయించే వేణువును చుడు ..ఎక్కడ ఉన్నాయి సరిగమలు పలికే సన్నని ద్వారాలు?

సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం బాగుంది. కానీ అగ్ని ఏది?

హనుమంతుని మెడలో ఉన్న ఆ ఆభరణం... సరిగ్గా కూర్పు కాబడ లేదు.

బాల కృష్ణుని చేతిలో వెన్న ముద్ద చూడు... ఎన్ని వంకర్లు తిరిగి ఉందో !" అంటూ చెప్పసాగాడు.

హర సిద్దు కోపంతో...

" అన్నా! వెన్న ముద్ద తింటే కరిగిపోతుంది. దాంట్లో ఏమి తప్పు ఉంది? " అని అడిగాడు.

కు. " అవున్ నిజమే. దాంట్లో లేదు మిగతా అన్నిట్లో ఉంది, అని నువ్వు ఒప్పుకున్నట్లు అంతేనా? "

హ సి " ఆ దేవుడి సృష్ఠిలోనే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. నాది ఎంత అన్నా? "

కు. " అతి తెలివి వద్దు హర సిద్దా! నీ గురించి మాటలాడేటప్పుడు  నీ గురించే మాట్లాడు. దేవుడితో పోలిక ఎందుకు? నువ్వు శ్రీరాముడి లాగ మాట మీద పూర్తిగా ఉండగలవా? ఆంజనేయుడిలాగా స్వామి భక్తి చూపగలవా? కృష్ణుడి లాగ గోవర్ధన గిరి ఎత్తగలవా? పోలిక కి అయినా సమ ఉజ్జీలు కావాలి.

చూడు, కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తిన శిల్పం ... కృష్ణుడి వేలు సరిగ్గా కొండ మధ్యలో ఉండాలి. కానీ నువ్వు ఎలా చెక్కవో చూడు...

చూడు హాలహలం తాగుతున్న శివుని శిల్పం... ఆయన ముఖ కవళికలలో గాంభీర్యం లేదు."

హర సిద్దు మాత్రం మనసులో ఇలా అనుకుంటున్నాడు, "చిన్న చిన్న శిల్పకళలోని తప్పులే కాకుండా, శిల్పంలోని ముఖ కవళికలు కూడా చూసి ఇంత క్షుణ్ణంగా చెప్తున్నాడంటే కుంభన్న మామూలు వాడు కాదు. తన వాదన మాటలు ఇతని దగ్గర చెల్లవు" అని నిర్ధారించుకున్న డు.

కు "హర సిద్ద! ఈ భక్తుడు ఎవరు?"

హ సి "అన్న హరిశ్చంద్రుడు. కాశీ వచ్చిన సందర్భంగా శివుని దర్శనం చేసుకొని పులకించిన ఆయన మోము చూడు..."

కు " చూసి చెప్పు హర సిద్దా! నువ్వు చెప్పక పోతే అది తెలుస్తుందా! కోపం వస్తే గొప్ప గుణాలు పెంచు కోవాలి ,హరిశ్చంద్రుని వలె నువ్వు ఎల్లప్పుడూ సత్యం మాత్రమే చెప్పగలవా?"

హర సిద్దు పూర్తిగా ముగబోయాడు...

అసలు కొన్ని చూస్తేనే ఇలా అంటే, ఇంకా చాలా ఉన్నాయి, అవి చెక్కేటప్పుడు తన మానసిక స్థితి మరోలా ఉన్న విగ్రహాలు. వాటిని చూసి ఏమి అంటాడో! అనుకోసాగాడు.

తన విద్యను, తన పనితనాన్ని ఏకి పారేస్తున్న కుంభన్న మీద కోపం రావట్లేదు సరికదా, ప్రతి క్షణం హర సిద్దు జీవితంలో జరిగిన విషయాలు గుర్తుకు వస్తున్నాయి.

కానీ హర సిద్దు మనసులో మాత్రం తన జీవితం లో జరిగిన సంఘటనలు బిగ్గరగా "నాకు జరిగినవి చెప్పు, నన్ను శిల్పం చెక్కేందుకువాడుకో ! "అని వెదుకుతూ వేడుకుంటున్నా య్...

తన జీవితంలో జరిగిన సంఘటనలకి ప్రతి రూపంగా మలచిన కొన్ని శిల్పాలను ఇప్పుడు అతడు చూపబోతున్నాడు ..

కుంభన్న  "హర సిద్ద! ఏంటి ఈ విగ్రహం? ఒక బాలుడు ఉన్నాడు.‌ కానీ తల్లి తండ్రులను పోలిన వారు ఇద్దరు ఉన్నారు?"

తనకు వచ్చిన జ్ఞాపకాల వల్ల, గుర్తుల వల్ల మనసు కనీరు పెడుతూ ఉన్నాడు హర సిద్దు...

"ఓ మహాదేవా!" అని ఆర్తిగా కేక వేసాడు.
(ఇంకా ఉంది)









No comments:

Post a Comment

Pages