దుపట్టా నెమలి రంగులు - అచ్చంగా తెలుగు

దుపట్టా నెమలి రంగులు

Share This
 దుపట్టా నెమలి రంగులు
(అనువాద కథ )
 కన్నడంలో: సునంద కడమె  
తెలుగుకి: చందకచర్ల రమేశ బాబు

“క్రితం సారి మీ అందరికీ పంపిన కేస్ హియరింగ్ రేపు పొద్దున పదకొండు గంటలకు ఉంది. ప్రతిసారి లాగానే మన డబ్ల్యు.డి. ఆఫీసులోనే ఉంటుంది. రండి. “ అంటూ మా కమిటి వ్యవహారాలు చూసుకునే శశిరేఖ ఫోన్ చేసింది. ఈ ఫోన్ వస్తే మాత్రం వేరే ఏ పనున్నా వదిలేసి పరిగెత్తడమే. తాము పనిచేసే స్థలాల్లో ఆడవారి పైన జరిగే లైంగిక వేధింపుల స్థానిక ఫిర్యాదులను పరిశీలించే సమితి అది. బాధల్లో ఉన్న ఆడవాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయడానికి ఏదైనా చెయ్యవచ్చు అంటే ఇలాంటి సమితిల ద్వారానే అని ఈ మధ్యలో నాకు తీవ్రంగా అనిపించడం వల్ల, మూడు సంవత్సరాల క్రితం కలెక్టర్ గారి  ఆఫీసునుండి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించలేదు. ఫైలు తీసి చదివే సమయం లేనందువల్ల, బస్సెక్కగానే సీటు దొరికేసరికి నాకు కొద్దిగా తెరపిగా అనిపించింది. పేపర్లు తిరగేస్తూ కూర్చున్న నాకు జిల్లా కేంద్రం ఎప్పుడొచ్చిందో తెలియలేదు.
అందరూ వచ్చేసి ఉంటారనుకుని గబగబా బస్ దిగబోయాను. అంతలో దాని తలుపులు మూసుకు పోయేసరికి కండక్టర్ వచ్చి సహాయం చేసి దిగేటట్టు చేశాడు. డబ్ల్యు. డి. ఆఫీసు చేరుకోవడానికి ఎక్కవలసిన చిన్న గుట్ట ఎక్కేటప్పుడు మొదలైన ఆయాసం నాకు నా వయస్సును గుర్తు చేసింది. ఆఫీసు గేటు దాటి మెట్లెక్కేటప్పుడు మా సమితి ఇతర సభ్యులు ఒక్కొక్కరే రాసాగారు. క్రితం ముప్ఫై సంవత్సరాలనుండి ఒక అనాథ శిశుమందిరం నడుపుతున్న సిస్టర్ డేసి, స్వాంతన అనే ఎన్.జి.వొ. కన్వీనర్ రజియా, అలాగే సమితి అధ్యక్షురాలు డబ్ల్యు.డి ఇన్ చార్జ్ బసంతి అంగడిగారు మీటింగ్ హాలులోకి ప్రవేశిస్తుండడం కనిపించి ఊపిరి పీల్చుకున్నాను. హాలో హాయ్ చెప్పుకున్నాము.
అది ప్రభుత్వ కచేరి అవడంతో అన్ని చోట్లా కొద్దిగా క్రమశిక్షణ కరువైంది కనిపించింది. మీటింగ్ హాలు తలుపు జాయింటు వదులయ్యి, తలుపు సగమే తెరచుకోవడంతో ఒక్కొక్కరే అడ్డంగా ఇరుక్కుంటూ తిరిగి లోపలికి వెళ్ళాము. హాలులో ఒక మూల రంగు వెలసిన తలుపులతో టాయ్లెట్ కనిపించింది. తలుపులు మూసే ఉండడంతో ముక్క వాసన ముక్కు రంధ్రాలకు సోకింది. రౌండ్ టేబుల్ పైన అందరూ కూర్చోగానే ఆఫీసు అటెండర్ శాంతమ్మ పరుగున వచ్చి ఒక చింకిగుడ్డతో టేబుల్ ను తుడవసాగింది. కొద్దిగా సైనస్ ప్రాబ్లమ్ ఉన్న సిస్టర్ డేసి వరసగా ఎనిమిదో పదో సార్లు తుమ్మింది. అది చూసిన బసంతి మేడం “ శాంతమ్మా ! మేము రావడానికి ముందే ఈ తుడవడాలు అయిపోవాలి. వచ్చే మీటింగ్ కు ఇలా చెయ్యద్దు “ అన్నారు. దానికి బదులుగా శాంతమ్మ హిహి అంటూ ఇకిలించి వెళ్ళిపోయింది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే శాంతమ్మ ఇంతకంటే ఎక్కువగా బదులు ఇవ్వడం కుదరదు అనిపించింది. 
వెనుకటి కేస్ గురించిన కొద్ది చర్చ జరిగింది. “ అలా చూస్తే ఈ కేస్ కంటే అది చాలా తేడా “ అంటూ సంభాషణ కదిపారు సిస్టర్ డేసి.  “కొందరు తమ వైయక్తిక ద్వేషం సాధించడానికోవడానికి తమ కేసును ఇక్కడిదాకా తీసుకువచ్చి మా ప్రాణాలు తీస్తారు” అంటూ తన మాటను జత కలిపింది రజియా. “ నిజమే. ఈ కేసులో ఏదో భావనాత్మక సంబంధాన్ని గురించిన సమస్య కనిపిస్తోంది. “ అంటూ నేను కేస్ ఫైలును బ్యాగునుండి బయటకు తీసి టేబుల్ పైన ఉంచాను. “ మీరంటోంది నిజమే. భావనాత్మక సంబంధాలున్నప్పుడు సమస్య తప్పకుండా ఉంటుంది. “ అంటూ కాస్త పెద్దగానే నవ్వారు సిస్టర్ డేసి. వారిద్దరూ మాట్లాడే ఇతర భాష కలిసిన తెలుగు యాస నాకెప్పుడూ గమ్మత్తుగా అనిపిస్తుంది. డబ్ల్యు.డి. ఆఫీసు శశిరేఖ ఈ కేస్ ఫైలును తీసుకుని ప్రవేశించిందంటే ఇక మీటింగు ప్రారంభమైనట్టేనని మాకు తెలుసు. మూడు సంవత్సరాలనుండి ఈ శశిరేఖ మొహంపైన ఒక చిరునవ్వైనా చూడడానికి నోచుకోని మేము ముగ్గురం ఆమె నిర్వికారానికి మా స్పందనలా ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాం. 
“ బాధితురాలు సబీనా తెగ్గినమని అనే ఆమె కలెక్టర్ గారికి పంపిన ఫిర్యాదు జెరాక్స్ కాపీలు తీయించి క్రితం వారమే వీరందరికీ పంపాను మేడం. “ అంది శశిరేఖ. “ అవును. కలెక్టర్ ఆఫీసునుండి ఫోను వచ్చింది. ఈ సారి ఎందుకు ఆలస్యం చేశారు హియరింగ్. కంప్లయింట్ వచ్చి చాల రోజులైంది కదా “ తమ కళ్ళద్దాలను పెట్టుకుంటూ అడిగారు బసంతి మేడం. “ మా సమితికి వచ్చి చాల రోజులైంది మేడం. కానీ మీ అందరి సౌకర్యాలు చూసుకుని మీరు మీటింగ్ కి రావాలి కదా ? అదీ కాకుండా నాకు ఆఫీసు పని కూడా ఎక్కువైంది. ఒక్కదాన్నే అన్నీ చూసుకోవాలి. ఇది కూడా నాకే అంటగట్టారు” అంటూ ముఖం ముడుచుకుని తన గోడు వెళ్ళబోసుకుంది శశిరేఖ. “ సరేలెండి. ఇంతకూ అమెని, ఆ వ్యక్తిని ఎప్పుడు రమ్మన్నారు ?” 
“ పదకొండున్నరకు రమ్మన్నాను మేడం. అంతలోనే మీలో మీరు చర్చించుకోవడానికి సమయం కావాలి కదా !” 
సరేనని తలూపుతూ మేడంగారు  మా వైపు తిరిగి “మీ ముగ్గురూ కేస్ స్టడీ చేశారా ?” అని అడుగుతూ ఎదుట ఉన్న బిస్లేరి బాటల్ మూత తిప్పసాగారు. 
సిస్టర్ డేసి “ తను పని చేసే ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీ యజమాని హమీద్ తన పైన లైంగిక దౌర్జన్యం చేశాడని సబీనా ఫిర్యాదు ఇచ్చింది. అబార్షన్ చేయించారని కూడా వ్రాసుకుంది. “ అనగానే రజియా “ అబార్షన్ అయింది అనడానికి సరైన సాక్షి నహీ హై మేడం. డాక్టర్ రాసిచ్చిన గోలీల చీటీ ఉంది. బస్ “ అన్నది. నాకు ఆశ్చర్యమేసింది. “ అబార్షనే న్యాయ సమ్మతం కానప్పుడు ఏ డాక్టరైనా నేను అబార్షన్ చేశాను అని సర్టిఫికేట్ ఎలా ఇస్తాడు మేడం ?” అన్నాను. మేడం గారు “ అవున”న్నట్టు తలాడించి తమ కళ్ళద్దాలను టేబల్ పైన పెట్టారు. నాకు అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి పదాలు దొరకలేదు. అలా ఒక పది సెకెండ్లు అక్కడ మౌనం రాజ్యమేలింది.
తమ పక్కనే నిలబడి ఫైలులను పరికిస్తున్న సిద్దును చూసిన మేడం బయటికి పొమ్మని సంజ్ఞ చేశారు. మీటింగ్ వివరాలు వాడికి తెలియకుండా జాగ్రత్త తీసుకున్నారు అని గ్రహించాను. “తనకు ముప్పై ఎనిమిది సంవత్సరాలని, తనకు మొదటి భర్త వలన ఐదు సంవత్సరాల కొడుకు ఉన్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది ఆమె “ అంటూ సిస్టర్ డేసి కేసు గురించి చెప్పసాగారు. అంతలో శాంతమ్మ లోపలికి వచ్చి “ హమీద్ అనే ఒకాయన మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు “ అనగా మేడం “ మీటింగ్ నడుస్తోంది. ఇంకెవ్వరినీ లోపలికి పంపడానికి వీలు లేదని చెప్పు “ అన్నారు. “ అదే హమీద్ అయి ఉండాలి మేడం. ఇనుప ఫ్యాక్టరి యజమాని “ సిస్టర్ డేసి చిన్నగా నవ్వారు. మేడం శాంతమ్మ వైపు తిరిగి “ కుదరదు. కేస్ స్టడీ చేయడానికి ముందే ఎవరినీ కలవడం కుదరదు అని అన్నారు అని చెప్పు ఆయనకు “ అంటూ మరోసారి నీళ్ళు తాగారావిడ.

శాంతమ్మ లోపలికి వచ్చేటప్పుడు తీసిన తలుపుల గుండా ఒకాయన అప్పుడే లోపలికి వచ్చి నిలబడడం గమనించిన మేమంతా కంగారుపడ్డాం. “ ఎవరయ్యా నువ్వు ?” మేడంగారు చురచురా చూస్తూ అడిగారు. “ నేనే మేడం హమీద్ ని. నా పైనే ఆమె ఫిర్యాదు చేసింది. అదంతా అబద్ధం. “ అంటూ చేతులు కట్టుకుని విధేయత ప్రదర్శించాడు. మేమంతా అతడి వైపు కోపంగా చూశాము. మేడం గారు “ మేము పిలవకుండా ఇలా లోపలికి తోసుకుని రాకూడదయ్యా. మీ కేసే స్టడీ చేస్తున్నాము. పిలిచినప్పుడు రా. బయట వైటింగ్ హాలులో కూర్చో. నీతో పాటు ఎవరది ఆ కార్లో ఉన్నది ?” అనడిగారు కోపంగా. “అతడు....అతడు...” అంటూ తడబడుతూ హమీద్ “ అతడు మా కారు డ్రైవర్ మేడం. “ అన్నాడు. “ అలాగా ? మీ లాయర్ ను తీసుకురాలేదు కదా ? అవును. ఇంతకూ మీ లాయర్ తో నాకెందుకు ఫోన్ చేయించింది ? అసలు బుద్దుందా మీకు ? మర్యాదలు తెలీవా ? ఇదేమైనా కోర్ట్ అనుకున్నారా మీరు ? మీ లాయర్ కు ఇక్కడ ప్రవేశం లేదు. తెలిసిందా ? ఒకవేళ ఆయన మీతో పాటు వచ్చుంటే ఆయనను తిరిగి పంపించేయండి. చట్టసంబంధమైన విషయాలు నేను చూసుకోగలను. నేను కూడా లా చదివినదాననే. ఇది ఫిర్యాదు పరిశీలన కమిటి. ఫిర్యాదు ఇచ్చినవారికి కలిగిన ఇబ్బంది గురించి విచారణ చెయ్యడమే మా పని “ అన్నారు. దానికతడు “ మీరు విచారించండి మేడం. నాకిబ్బందేమీ లేదు. నాదొక ప్రార్థన మేడం. ఆమె ఉన్నప్పుడు దయచేసి నన్ను పిలవకండి. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను మేడం. చచ్చినా ఆమె మొహం చూడాలనిపించడం లేదు నాకు “ అంటూ చేతులు జోడిస్తూ వేడుకున్నట్టు అడిగాడు. 
“సరే సరే ! సెపరేట్ కౌన్సెలింగ్ తీసుకుంటాంలే. ఇప్పుడు వెళ్ళు. “ అంది రజియా. నేను మధ్యలో కలగజేసుకుని “ ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేస్తే, ఆమె తప్పును ఈయన, ఇతని తప్పును ఆమె చెప్తుంటే మనం గుడ్డిగా వింటూ కూర్చోవాలంతే “ అన్నాను. మేడం గారు
 “ ఉండనివ్వండి. వారి ప్రస్తుత మనఃస్థితిని కూడా మనం గమనించాలి కదా ! “ అన్నారు. ఆమెకు వత్తాసుగా రజియా “ కలిపి కూర్చోబెట్టి కౌన్సెలింగ్ చేయడానికి వాళ్ళిద్దరేమైనా భార్యాభర్తలా ?” అంటూ నన్నే దబాయించింది.  నేను బదులివ్వకపోవడంతో ఆ విషయం అక్కడికే సమాప్తమయింది. హమీద్ అంతా వింటూ బయటికి వెళ్ళాడు. 
“ అతడి లాయర్ మీకు కూడా ఫోన్ చేశాడా మేడం ?” అని శశిరేఖ అడిగినదానికి మేడం “ఎందుకు మీకూ చేశాడా ?”  అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. “ అవును మేడం. నిన్నంతా ఎనిమిది పది సార్లు ఫోన్ చేసి బుర్ర తినేశాడు. ’ సబీనా ఫిర్యాదులో ఏం రాసిందో చెప్పండమ్మా ప్లీజ్. ఇదొక్క సహాయం చేసి పెడితే మా హమీద్ గారు మీ ఇంటికి ప్రత్యేకంగా గిప్ట్ పంపుతారు ’అన్నాడు. దానికి నేను ’ మీ మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. దాన్ని కలెక్టర్ గారికి పంపుతాము ’ అనగానే చటుక్కున ఫోన్ పెట్టేశాడు. బహుశా ఇతనితో వచ్చింది ఆ లాయరేనేమో మేడం. డ్రైవర్ అని అబద్ధం చెప్తున్నాడు. “ అనింది. మేము ముగ్గురం కిటికీలోంచి వాళ్ళ కారు నిల్చున్న చోట చూశాము. మళ్ళీ నేనే “ వచ్చుంటే బయట ఉంటారు లెండి మేడం. మనం లోపలికి పిలవకపోతే సరి. “ అన్నాను.
 “ అవునవును. అంతే “ అన్నారు డేసి, రజియా. 
“ హమీద్ అనే ఆయనది ఇనుప ఫ్యాక్టరి. అందులో మూడు సంవత్సరాల నుండి పని చేస్తోందట ఈమె. హమీద్ ఈమెను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి రెండు సంవత్సరాలు తనతో గడిపి ఇప్పుడు మోసం చేశాడు అని ఆమె ఫిర్యాదు. ’అతడికి సుమారు నలభై సంవత్సరాలుండొచ్చు. పెళ్ళి కాలేదు. కాబట్టి అతడి మాటలు నమ్మి తనకూ పిల్లాడికి ఒక ఆశ్రయం అవుతుంది అను అనుకున్నాను ’ అని వ్రాసింది.” అంటూ  డేసి ఫిర్యాదులోని సమస్యను బహిర్గతం గావించారు. “ గర్భవతినయ్యాను, ఇప్పుడైనా నన్ను పెళ్ళి చేసుకొమ్మని అడిగితే, ఫ్యాక్టరి విషయాలు బయటికి ఎందుకు లీక్ చేశావు అంటూ లేనిపోని ఆపాదనలు తన పైన మోపి మూడు నెలల నుండి ఫ్యాక్టరి లోకి రానివ్వడం 
లేదట “ అన్నది రజియా. నేను కొనసాగిస్తూ “ఫ్యాక్టరి పనిలో నుండి ఎందుకు తీసేశారు అని అడగడానికి వెళ్తే, హమీద్ తమ్ముడు సలీమ్, డ్రైవర్ శివు కలిసి తనను కొట్టారు అని కూడా రాసుకుంది.” అన్నాను. “ మా ఫ్యాక్టరి ఎదుట ఆత్మహత్యా ప్రయత్నం చేసింది అంటూ పాత హుబ్లి పోలిస్ స్టేషన్లో అబద్ధపు ఫిర్యాదు రాయించి, నన్ను అరెస్ట్ చేయించి, నాదే తప్పు ఇక ముందు ఇలా చేయను అని రాసిన లెటర్ కు బలవంతంగా నాతో సంతకం తీసుకున్నారు అని కూడా రాసింది “ అంది రజియా. అన్నిటినీ వింటున్న మేడం విసుగ్గా “ ధనమదం వీళ్ళకి.  అదే ఇలా చేయిస్తుంది. పేదింటి ఆడపిల్లలంటే బజారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు” అంటూ ఎదురుగా ఉన్న బెల్ నొక్కారు.
లోపలికి వచ్చిన శాంతమ్మతో “ రెస్ట్ రూములో సబీనా అని ఒకామె కూర్చునుంటుంది. ఆమెను పిలు “ అన్నారు. సబీనా మెల్లగా భయంతో చూస్తూ లోపలికి వచ్చింది. ఆకుపచ్చ మఖమల్ సల్వార్ వేసుకుంది. కప్పుకున్న తెల్ల దుపట్టా పైన రంగురంగుల రెండు నెమళ్ళు కనిపించాయి. లోపలికి వస్తూ మా నలుగురికీ నమస్కారం అంటున్నట్టు చేతులు జోడించింది. ఎదురుగ్గా ఉన్న ప్లాస్టిక్ కుర్చీ చూపించి కూర్చోమన్నాము. మేమంతా ఫైలులోని సుందరిని సూటిగా చూస్తున్నాము అని నాకు అనిపించి, చూపు మరల్చి గోడకేసి చూడసాగాను. గోడపైన డబ్య్లు. డి ఆఫీసునుండి తమ కర్తవ్యాన్ని ముగించి వెళ్ళిపోయిన ఆఫీసర్ల పేర్ల బోర్డు కనిపించింది. అలా దృష్టి మరల్చినా కానీ, సబీనా దుపట్టా పైన కనిపించిన నెమళ్ళ జంట రంగులు మాత్రం నా కళ్లల్లో మెదలసాగాయి.
“ నీ పేరేమిటమ్మా ?” అంటూ ఫైలులోకి చూస్తూనే అడిగిన మేడం ప్రశ్నకు “ అందులో ఉంది “ అంటూ ఫైలును చూపింది సబీనా. మేడం కోపంగా “ అడిగిందానికి జవాబు చెప్పమ్మా. నువ్వు హిందీలో పేరు రాశావు. నాకు హింది చదవడం రాదు.” అన్నారు. 
“సబీనా అండి.” క్లుప్తంగా బదులు వచ్చింది. “ ఇంటి పేరు?” “ తెగ్గినమని “ “ ఇది నీ తండ్రి ఇంటి పేరా ?” “కాదు. నా భర్త ఇంటి పేరు మేడం. “ “ భర్త ఎక్కడ?” “ నరగుందలో ఉన్నాడండి.” “ ఎందుకు ? నీతో పాటు ఉండడా ?” లేదు మేడం. నాలుగు సంవత్సరాల నుండి వదిలేశాడండి. “ “ అయితే విడాకులు తీసుకున్నావా ?” “ కాయితాల్లో కాలేదు మేడం. కానీ తలాఖ్ చెప్పాడు. “ తరువాత నీ భర్త వద్దకు వెళ్ళలేదా ?” లేదు మేడం. ఆయన ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. వేరే పిల్లలు కూడా ఉన్నారు ఆమెతో “ “ మరి ఆయన ఇంటి పేరు పెట్టుకున్నావు ?” “ కావాలి కదా మేడం. పిల్లడిని స్కూల్లోవేసేటప్పుడు అడుగుతారు కదా “ “ తప్పుగా అనుకోవద్దు. ఎందుకు వదిలేశావు నీ భర్తను ?” “ ఆ మనిషి సరిగ్గా లేడు మేడం. పని చేసేవాడు కాదు. నేను పని చేసి తెచ్చిన డబ్బులను లాక్కుని తాగేవాడు. కొట్టేవాడు మేడం.”  అంటూ రెండూ మోచేతులకు పైన బ్లేడుతో కోసిన పాత గాయాలను చూపింది. రజియా, డేసి, నేను ఇంకోసారి మా చూపు మరల్చాము.
రజియా ఉన్నట్టుండి గంభీరంగా సబీనా వైపు చూస్తూ “ నువ్వు బురఖా వేసుకోవా ?” అని అడిగింది. సబీనా మెడ తిప్పుతూ అంతే వినయంగా “బురఖా ఇంట్లో ఉంది మేడం. కొద్దిగా చిరిగింది. “ అంది. అంతలో సిద్ధు చాయ్, మారి బిస్కత్తుల ట్రే తీసుకుని వచ్చాడు. ఎందుకో మేమంతా బిస్కత్తులు వదిలేసి ఉత్త చాయ్ మాత్రం తీసుకున్నాము. తన చేతి సంజ్ఞతో సబీనావైపు చూపిస్తూ మేడం “ ఆమెకు కూడా ఇవ్వు. అలాగే పంపొద్దు.” అన్నారు. చాయ్ తాగుతూ నేను చిన్నగా నవ్వుతూ “ రజియా ! మరి నువ్వు బురఖా వేసుకోవా ?” అని అడిగాను. గంభీరంగా ముఖం పెట్టిన ఆమె “ మా సంగతి వేరు. మేము సమాజ కార్యకర్తలం. వీళ్ళు వేసుకోవాలి “ అంది. నేను “ అలా ఉందా మీ రూలు ?” అంటూ ఖాలీ చేసిన చాయ్ కప్పును ట్రేలో పెడుతూ సిస్టర్ డేసివైపు చూసి చిన్నగా నవ్వాను. ఆమె సూటిగా చెప్పడంలోదిట్ట. “ ఎందుకు ? ముస్లిం ఆడవాళ్ళు అంటే అంతా ఒకటే. ఆమె వేసుకోవాలి అంటే మీరు కూడా వేసుకోవాలి. మీకు రూలు లేదు అంటే ఆమెకూ లేనట్టే “ అంటూ కనుబొమ్మలు ముడివేస్తూ గద్దించారు. “ అలా కాదు. బురఖా వేసుకోకపోతే మాలా మనస్సు గట్టిగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు బురఖా వేసుకోకపోతే ఇలా కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. “ అంది రజియా. మేడం మధ్యలో కలుగజేసుకుని 
“ ఈమె చెప్పే మాట నాకు కరక్టే ననిపిస్తుంది. ఉంటే హై థింకింగ్ అన్నా ఉండాలి లేదా మొహం చాటు చేసుకుని బ్రతకాలి. “ అన్నారు. “ అరె ! ఈ వరస నాకు అర్థమే కాలేదు “ చిన్నగా అని చెమట తుడుచుకుంటూ సిస్టర్ డేసి వైపు చూశాను. “ అది అలాగేనండీ. సింపల్. సత్తా ఉంటే యుద్ధానికి రండి. లేకుంటే నోరు మూసుకుని బందీలు కండి “ అంటూ డేసి జోకు వేసినట్టు పెద్దగా నవ్వారు. “ కానీ ఇలాంటి వాళ్ళను అంధకారాన్నుండి వెలికి రప్పించి వారిని సశక్తులను చేయడానికి మీ ఎన్ జి ఒ నుండి ఏదైనా కార్యక్రమం తలపెట్టవచ్చు మీరు “ అని నేను ముగించేంతలో రజియా “ ఇప్పటికే అలాంటి పనులు చాలా చేస్తున్నాము. మీకు మా పనులను గురించిన సరైన సమాచారం లేదు అనిపిస్తుంది. “ అంది. నేను “ అవునవును. మీ సంస్థ గురించి నాకు అంతగా తెలీదు “ అంటూ ఆ విషయానికి ముగింపు పలికాను. 
అందరిదీ చాయ్ కార్యక్రమం ముగిసిందనిపించగానే మేడం మళ్ళీ ప్రారంభించారు. “ ఇక్కడ వ్రాసిందంతా నిజమేనా లేదా ఎవరి బెదిరింపుతోనయినా ఈ వ్యక్తి పైన ఇలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నావా “ అన్నారు.
“ జరిగిందే వ్రాశాను మేడం. ఖుదా కి కసమ్. అబద్ధాల ఆరోపణలు కావు.”
“ వీటికంతా సాక్ష్యాలేవి ?”
“ ఫిర్యాదుతో పాటే ఇచ్చాను కదా మేడం. “
“ ఏ సాక్ష్యాలు ? అబార్షన్ అయింది అని వ్రాశావు ఇందులో ? దానికి సరైన సాక్ష్యం లేదు “
“ ఎందుకు లేదు మేడం ? అక్కడే ఉంది చూడండి మేడం. డాక్టర్ గోలీలు రాసిచ్చిన చీటీ”
“ ఉత్త గోలీలు రాసిన చీటీ సరిపోదు. అబార్షన్ ఏ క్లినిక్ లో చేయించుకున్నావు ? ఎప్పుడు అడ్మిట్ అయ్యావు ? ఏ డాక్టర్ అబార్షన్ చేశారు ? అడ్మిట్ లేదా డిస్చార్జ్ అయిన సర్టిఫికేట్ కావాలి “
“ అలాంటివేవీ లేవు మేడం. హమీద్ తో ఉన్నప్పుడే మూడు నెలలు నేను బయట చేరలేదు. కడుపులో తిప్పేది. అప్పుడు నేను మళ్ళీ పని కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాను. తగిలిన గాయాలకు బ్యాండేజ్ వేయిస్తాము అంటూ వాళ్ళే కారులో తీసుకు పోయి అడ్మిట్ చేయించారు. తరువాత వెళ్ళి అడిగాను. అవన్నీ సాక్షిగా పెడ్తే మేము జైలుకెళ్ళాలంతే అన్నారు డాక్టరుగారు. “
“నువ్వు హమీద్ తో అలా తొందరపడడానికి ముందే ఇవన్నీ ఆలోచించాలి కదా !” అన్నారు మేడం.
“ తనే వచ్చి నా స్నేహం చేశారు మేడం. తనే నా బిడ్డను ఎత్తుకుని ముద్దాడింది. అతనే అబ్బాజాన్ అని నా బిడ్ద నమ్ముకున్నాడు.” అంటూ బొంగురు గొంతుతో చెప్తోంది సబీనా.
తన వ్యక్తిత్వాన్ని అందరి ముందు పరిచి నగ్నంగా అయినట్టనిపించి, లైంగికత లోని సూక్ష్మ భావాన్ని అందరూ విప్పి చూస్తున్నారనిపించి, అసహ్యంతోపాటు కుతూహలం కలగలిసి వచ్చిన భావమొకటి ఆ మీటింగ్ హాల్ లో కొనసాగింది. అందరూ అదేదో శూన్యంలోకి వెళ్తున్నట్టుంది అని నాకనిపించి ఎవరి వైపూ చూడకుండా తల దింపాను.
“ ఇప్పుడు నేనేం చెయ్యాలి మేడం?”
“ వాళ్ళు నీకు లైంగికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారనడానికి ఇంకా ఏవైనా సాక్ష్యాలు కావాలి.” “ ఇంకా అంటే మేడం ?” నేనే ఆమెకు వివరించాను. “ సిసికెమెరా ఫుటేజ్, ఫోనులో రికార్డైనా సంభాషణ ఇలాంటివేమైనా ఉన్నాయా ?”  వెంటనే సబీనా తన చిన్న ఫోన్ తీసి చూపిస్తూ “ ఇందులో హమీద్ ఇచ్చిన అన్ని మెసేజ్ లు ఉండేవి మేడం. ఆ రోజు ఫ్యాక్టరి గేట్ వద్ద గొడవ చేసి స్టేషన్ కు తీసుకెళ్ళి బెదిరించి సంతకం తీసుకున్నరోజే, ఈ మొబైల్ లోని మెసేజులన్నీ డిలీట్ చేశారు. “ “ ఎవరు డిలీట్ చేసింది ? పోలీసులా ?” అడిగారు మేడం.
“ హమీద్ తమ్ముడు సలీం భాయ్ మేడం. అతనే డిలీట్ చేసింది. హమీద్ కు అంత మొబైల్ వాడడం రాదు మేడం. అవన్నీ ఇంగ్లీష్ లో మెసేజ్ లు మేడం. చదవడానికి రాదు మేడం అయనకు. చదువుకోలేదు. నాలుగో తరగతి అంతే. “ అనింది సబీనా.
“ ఎందుకు రాదు? అంతా వచ్చుంటుంది. నువ్వు ఫూల్ అయ్యవంతే “ అన్నాను నేను.
రజియా “ మనకు దాని అవసరం ఉందనిపిస్తే, మనం తెప్పించుకోవచ్చు లెండి.” అంటూ గుర్తు చేసింది.
“నువ్వు మళ్ళీ ఆ ఫ్యాక్టరీకే ఎందుకు వెళ్ళావు పని ఇప్పించాలని ? వేరే ఫ్యాక్టరీలలో ప్రయత్నించి ఉండవచ్చుకదా “ అన్నాను నేను.
“ సుమారు ఐదు, ఆరు ఫ్యాక్టరీలలో ప్రయత్నించాను మేడం. వాళ్ళదంతా ఒకే యూనియన్. ఆమె కాల్ గర్ల్, ఆమెను పన్లో పెట్టుకోకండి అని సలీమ్ భాయ్ అందరికీ ఫోన్ చేసి చెప్పాడటండీ. నన్ను రోడ్డున పడి అడుక్కు తినేటట్టు చేస్తానని ఫ్యాక్టరీ అంతా అరుస్తూ తిరిగాడంట. నా స్నేహితురాలు చెప్పింది. “ అంది సబీనా.
“అరె. నువ్వు అలాగే వచ్చేశావా ? కంప్లెయింట్ ఇవ్వాల్సింది వాడి పైన. కాల్ గర్ల్ అంటే ఊరుకుంటారా ఎవరైనా ?” ఇప్పుడు రజియాకూడా బాధపడింది.
“ ఎక్కడా పని దొరక్కుండా నేనూ నా బిడ్డా పస్తులుండేటప్పటికి ఇక గత్యంతరం లేక మళ్ళీ వాళ్ల కాళ్ళు పట్టుకున్నాను మేడం. “ గద్గదితంగా అంది సబీనా.
“ సరే. ఇప్పుడు నీకేం కావాలి ?” 
“ వాళ్ల ఫ్యాక్టరీలో నాకు పని ఇప్పించమనండి లేదా హమీద్ తను భరోసా ఇచ్చినట్లుగా నన్నుపెళ్ళి చేసుకోమనండి.”  ఆమె చెప్పింది మా ముగ్గురికీ సబబేననిపించింది.
“ ఎలాగూ హమిద్ కు ఇంకా పెళ్ళి కాలేదు. పెళ్ళి చేసుకోవడానికేం పోయింది ? దీని గురించి హమీద్ తోనూ మాట్లాడి తరువాత ఒక నిర్ణయానికి వద్దాం” అని అనుకుని మేడం గారికి చెప్పాము.
అందుకు అంగీకరిస్తూ మేడం సబీనాతో “ ఇక నువ్వు వెళ్ళి మహిళల రూములో కూర్చోమ్మా. మళ్ళీ పిలిచినప్పుడు వద్దువుగానీ “ అని చెప్పి సిద్ధు తో “ ఏ సిద్ధు ! బయట విశ్రాంతి గదిలో హమీద్ అనే ఆయన ఉంటారు. ఆయనను పిలు. “ అన్నారు. సబీనా వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తరువాత హమీద్ ప్రవేశించాడు. కూర్చోమని చెయ్యి చూపించి మేడం “ నువ్వే కదయ్యా అప్పుడు చెప్పా చెయ్యకుండా తోసుకువచ్చింది? “ అని అడిగేసరికి హమీద్ తన జేబు రుమాలు తీసి నుదురు తుడుచుకుంటూ ’ సారీ మేడం, సారీ మేడం, సారి “అంటూ కూర్చోకుండా నిలబడిన విధానంలో ఏదో అతి వినయ ధోరణి కనిపించింది నాకు. 
“ ఏంటయ్యా హమీద్, సబీనా అనే అమ్మాయిని మోసం చేశావంట “ అంటూ మేడమ్ నోరు తెరిచేలోగా “ లేదు మేడం. అన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతోంది. ఆమె కంప్లెంట్ లో ఒక్కటైనా నిజం లేదు మేడం. పాపం ఏదో పేద ఆడపిల్ల అని ఫ్యాక్టరి పన్లో తీసుకుంటే మా విరోధులతో చేతులు కలిపి మా ఫ్యాక్టరీ కాన్ఫిడెన్షియల్ విషయాలన్నీ వాళ్ళకు చెప్పి, అక్కడకూడా డబ్బులు తీసుకుంది. ఆమెది ఒకటీ రెండని కాదండీ . మేడం, మీరే చూశారు కదా బురఖా వేసుకోదండి. ఎప్పుడూ రిక్షావాళ్ళతో తిరుగుతూ ఉంటుందండి. ఎక్కడికెళ్తుందో ఎక్కడనుండి వస్తుందో ఎవరికీ తెలీదండి. ఆమె మాటలు నమ్మకండి మీరు మేడం. రిక్షా డ్రైవర్లతో జత కడుతుందండి ఆమె. “ అనగానే “  చూడవయ్యా ! రిక్షావాళ్ళతో స్నేహం చెయ్యడం అంటే అదేదో నిషిద్ధం అనే మాట ముందు వదిలెయ్యి. వాళ్ళు కూడా శ్రమజీవులే. కష్టపడే సంపాయిస్తారు. అందరి రిక్షావాళ్ళను ఒకే తాటి క్రింద కట్టెయ్యద్దు. “ సిస్టర్ డేసి ఉన్నచోటునుండే గొంతు పెంచారు. నేను కూడా “ చూడయ్యా ! ముందు నీ తలకాయలోనుండి వాళ్ళ గురించిన అల్ప అభిప్రాయాన్ని తీసెయ్ “ అన్నాను. 
“ ఆమెను పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చావంట? అబార్షన్ చేయించావంట ? మీ తమ్ముడు సలీమ్, డ్రైవర్ శివు కలిసి ఆమెను  పట్టుకుని కొట్టారంట ? మీ తమ్ముడు బెదిరించి అబద్ధపు లెటర్ రాయించుకున్నాడంట ? మొబైల్ లాక్కుని అందులో మీ సంభాషణ అంతా డిలీట్ చేశాడంట “ 
“ అయ్యో అయ్యో ఖుదా ! అంతా అబద్ధాలండీ. అది చెప్పే మాటలకి ఒకటైనా సాక్షి ఉందాండీ ? డబ్బులు కొట్టేయడానికి వేసిన ప్లాన్ మేడం. మణికట్టు నరం కోసుకుని ఫ్యాక్టరి ముందు పడుంటే అయ్యో పాపం అని నేనే ఆస్పత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకెళ్ళి వదిలాను మేడం. తరువాత మేమే కంప్లెంట్ ఇచ్చాము. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటే మళ్ళీ మా నెత్తికి చుట్టుకో కూడదు కదండీ ? అన్ని సాక్ష్యాలు ఆ ఫైలులో ఉన్నాయి చూడండి మేడం. “ అన్నాడు హమీద్. 
“ ఓహో ! మీకింకా పెళ్ళి కాలేదట కదా. అందుకే మీ ఇద్దరికీ రాజీ చేసి ఇక్కడే మీ ఇద్దరికీ నిఖా చేసేద్దాం అనుకున్నాం “ అని మేడం అంటుండగానే హమీద్ ఉలిక్కిపడి “ అరెరె ! ఇదొక పెద్ద అబద్ధం మేడం. నాకు పెళ్ళికాలేదు అని చెప్పిందా ? దీనికంటే పెద్ద అబద్ధం ఎక్కడుంది మేడం ? ఇంట్లో నాకు పెళ్ళాం, పిల్లలు ఉన్నారండి. అమ్మాయి ఈ ఏడు పెద్దమనిషయిందండీ. ఉండండి. మొబైల్ లో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. చూపించేస్తాను” అంటూ మొబైల్ ఓపన్ చేసి తను భార్య, ముగ్గురు పిల్లలతో పాటు ఉన్న ఫోటో చూపించాడు. మేము ముగ్గురమూ కళ్లద్దాలు పెట్టుకున అతడి మొబైల్ తీసుకుని దృష్టి పెట్టి చూసి తిరిగి ఇచ్చేశాము. అతడే కొనసాగిస్తూ “ రాత్రనీ పగలనీ లేదండి. ఫోన్ చేస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఏమనుకుంటారండీ? మాకూ విసుగొచ్చేసిందండి. మా ఫ్యాక్టరి సమస్యలే మాకు చాలా ఉంటాయండి. పాపం పేద పిల్ల అని సహాయం చేసింది నిజమండి. మొగుడు వదిలేశాడు, కొడుకు పసివాడు అంటే డబ్బులు ఇచ్చింది కూడా నిజమేనండి. అందుకే మా పైన కన్నేసి ’వీళ్ల దగ్గర బాగా పైసలున్నాయి, ఇంటి యజమాని ఆస్తి సగం వస్తుంద’ అని ఎవరో చెప్పుంటారండి. దీని ఐడియా కాదండి అది. వేరే ఎవరో చెవిలో ఊదుతారు. వాళ్లెవరని కూడా మాకు తెలుసండి. మేము ఫ్యాక్టరీ తీసుకున్నప్పుడు మాకంటే ముందుగా ఒకరు ఆఫర్ పెట్టారండి. మేము కొంచెం ఎక్కువ ఇచ్చి ఫ్యాక్టరి ఖరీది చేశామండి. మావాళ్ళేనండి వాళ్ళు. కడుపుమంటండి వాళ్లకి. అందుకే ఇలా చేస్తున్నారు. బిజినెస్ శతృత్వమండి. “ మేడం అతణ్ణి ఆపుతూ “ అంటే మీ ఆస్తి తగాదాను ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఇలా తీర్చుకుంటున్నారన్నమాట” అనేటప్పటికి “ ఈమె వాళ్ళ మాటలు ఎందుకు వినాలి మేడం. మా దగ్గర బాగా పైసలు లాగింది. ఇప్పుడు వాళ్ళ వైపు వెళ్ళింది. మా ఫ్యాక్టరి విషయాలన్ని వాళ్లకు చెప్పిందని మేము ఆమెను తీసేశాము. మా ఫ్యాక్టరి కాన్ఫిడెన్షియల్ విషయాలు వాళ్ళకు చెప్తే మాకు లాస్ కదండి ? ఇప్పుడు నేనే ఒక కంప్లైంట్ ఇస్తాను మేడం. ఈమె వలన నాకు మానసిక ఒత్తిడి కలుగుతోంది అని.” 
“మీకూ ఆమెకు మూడు సంవత్సరాల అనైతిక సంబంధం ఉండిందట కదా ! అది కూడా అబద్ధమేనా లేదా కొద్దిగా సత్యమేనా ?” అక్కడే ఉప్పు చిలకరించసాగారు సిస్టర్ డేసి. 
“ సంబంధం ఎందుకు పెట్టుకుంటాను మేడం నేను ? ఇంట్లో దేవతలాంటి పెళ్ళాం ఉంది. ఇలా దారిన పొయ్యేవాళ్ళనంతా నేనెందుకు నెత్తికి ఎక్కించుకుంటాను ? ఫ్యాక్టరి పనులే తడిపి మోపెడవుతుంటాయండి మాకు. ’మా నాన్న తన్ని తగలేశాడు, మొగుడు ఇంకో పెళ్ళి చేసుకున్నాడు, ఎక్కడికి పోయేది’ అని మా దగ్గరకు వచ్చి ఏడ్చిందండీ. మేమైనా ఏం చెయ్యగలం చెప్పండి మేడం. పోనీ పాపం అని పన్లోకి పెట్టికున్నదే తప్పయిపోయిందండి. చాలా చలాకీ ఆడది మేడం ! మా చుట్టుపక్కల ఉన్న ఆరు జమాత్ లలో మా గురించి ఏవేవో అబద్ధాలన్నీ రాసి పాంప్లెట్లు పంచిపెట్టిందండీ. ఖాజిగారి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికీ పెళ్ళి చెయ్యమని రాద్ధాంతం చేస్తుందండి. అవన్నిటికీ సాక్ష్యం ఈఫైలులో ఉన్నాయి చూడండి మేడం. మెంటల్ అయిపోయిందండీ ఆమె. పాపం అని ఊరకున్నంతా మా గొంతుకే చుట్టుకుంటుందండీ ఇది. ఈ దునియాలో తలెత్తి తిరగకుండా చేస్తోందండీ. అంత గలీజు చేసిందండి. “ అతడు పెద్ద ఫైలే తెచ్చాడు. దాన్ని తీసుకుని పెట్టుకోమని మేడం శశిరేఖకు చెప్పి, అతణ్ణి బయటకు పంపి మనం మాట్లాడదామని సంజ్ఞ చేస్తూ
 “ సరే. అయితే. మీరు బయట వెయిట్ చెయ్యండి. కేసు రిపోర్ట్ అవగానే మీ సంతకం కోసం పిలుస్తాము “ అంటూ హమీద్ ను బయటకు తరిమారు మేడం.
“ఇదంతా చూస్తుంటే ఇద్దరికీ సంబంధం ఉన్నది నిజమనిపిస్తుంది. కానీ ఈమె పెళ్ళి ప్రస్తావన ఎత్తగానే అతడు తగ్గినట్టుంది.” “ కానీ ఆమె హమీద్ పెళ్ళి కాని వ్యక్తి అని ఆసక్తి చూపాను అనడం అబద్ధం. మూడు సంవత్సరాలు అదే ఫ్యాక్టరీలో పని చేస్తూ అతనితో తిరిగిన తనకు అతడు వివాహితుడా కాదా అని తెలుసుకోవడం కష్టమా ?” హమీద్ ఒప్పుకోవడం లేదు కానీ, ఇద్దరూ పరస్పరం ఒప్పుకునే జతగా ఉన్నారన్నది నిజం. కానీ పెళ్ళికి మాత్రం నో అని సంబంధం తెంపేసుకున్నట్టుంది. ఈమె వదిలెయ్యడానికి ఒప్పుకోవడం లేదు.”  “ ఒక ఆడది తన గొంతెత్తి తన ఫ్యాక్టరి యజమానినే గడగడలాడిస్తోందంటే ?” పాపం ! ఆ పెళ్ళయిన హమీద్ ను పెళ్ళి చేసుకోమని బతిమాలితే అయ్యే పనేనా ?” “ ఇందులో ఆమె పోగొట్టుకునేది ఏమీ లేదు. అతడికి తన పరువు పోతుంది అని అంతే. అది తెలుసుకునే ఆమె పావులు కదుపుతోంది.” అన్నారు మేడం. నాకు దిగులయ్యింది. “ ఒక పని చెయ్యొచ్చు మనం. హమీద్ నుండి కొంత ధనసహాయం చెయ్యగలమేమో చూడొచ్చు. “ అని అంటుండగానే మేడం మధ్యలో కలగజేసుకుని “ బైలా లో దీని గురించి ఏం చెప్పారో చూడండి. ఇక్కడ రూల్ ౨ బి లో బాధితురాలికి డబ్బు,ఆస్తిలాంటి ఆమిషాలు చూపి నోరు మూయించరాదు అని నియమమే ఉంది” అంటూ మమ్మల్ని హెచ్చరించారు. 
“ఇద్దరూ పరస్పరం అంగీకారంతోనే కలిశారు కాబట్టి ఇది లైంగిక దౌర్జన్యం కాదు అని రిపోర్టు చెయ్యాలా మేడం?” నాలో తలఎత్తిన ప్రశ్నను నేను అడిగాను. “అవును. అలాగే రాయండి శశిరేఖా. అలాగే సబీనా ఫిర్యాదులో చెప్పిన ఆరోపణలకన్నిటికీ సరైన సాక్ష్యాలు లేవని కూడా చేర్చండి.” అన్నారు. “డబ్బులు, అంతస్తు కనిపిస్తే అమ్మాయిలు ఇలా చేయడం నాకు తెలుసు” అన్నారు డేసి. “ సులభంగా ఐశ్వర్యాన్నిఅనుభవించడానికి ఇదొక ఆప్షన్ మా పేద ఆడపిల్లలకు. మా ఎన్జోవోకు కూడా ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి.” అంది రజియా. “పెళ్ళి కాలేదు అని అబద్ధం చెప్పి ఇతడే ఆమెను చేరదీసి ఉంటాడు. పెళ్ళి మాట ఎత్తగానే భార్య, పిల్లలు గుర్తుకొచ్చినట్టుంది ఇతడికి “ అన్నారు డేసి. “అలా అయితే పరస్పరం అంగీకరించి లైంగికంగా పాల్గొన్నప్పుడు దౌర్జన్యం అని ఎలా భావిస్తాం” అంది శశిరేఖ, రిపోర్ట్ రాస్తూనే. మా అందరి మనసుల్లో తప్పంతా సబీనాదే అనే భావన గట్టి పడుతుండగా నేను “ ఫ్యాక్టరి ఎదుట హమీద్ తమ్ముడు, వాళ్ల డ్రైవర్ శివు కొట్టింది ఆమె పైన జరిగిన దౌర్జన్యం అని చూపి ఆమెకు ఏమైనా పరిహారం ఇప్పిద్దామా మేడం ?” అంటూ మేడం వైపు చూశాను. “ ఆ పని చెయ్యచ్చు. కానీ ఆమె మొహమే చూడను అనేంత ద్వేషం నింపుకున్నాడే ఈయన. మరి పరిహారం ఏమైనా ఇస్తాడని నేననుకోను” అన్నారు మేడం. “ఈ కేసులో ఇక చర్చించాల్సిందేమీ లేదు. బాధితురాలు తన ఫిర్యాదులో నమోదు చేసిన ఆపాదనలను నిరూపించడానికి ఇచ్చిన సాక్ష్యాలు తగినన్నిలేవు కాబట్టి కేస్ క్లోస్ చేయాలి” అని శశిరేఖకు మేడం చెప్పేంతలో, లోపలికి పరుగున వచ్చిన సబీనా మేడం వద్దకు వెళ్ళి నుంచుని “ నేను ఆఖరిసారిగా హమీద్ తో ముఖాముఖి మాట్లాడాలి మేడం. ఎదురుగా నుంచుని మాట్లాడాలి. నాకు అతని మనస్సులో ఏముందో తెలియాలి. దయచేసి ఇదొక్క అవకాశం ఇప్పించండి మేడం ప్లీస్. అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడతాను. ఆయనే చెప్పనీ, నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు అక్కర్లేదు అని. తరువాత నేనూ గమ్మున ఇంటికెళ్ళిపోతాను. అటువైపు మొహం కూడా తిప్పను.” అంటూ బ్రతిమాలుతూ మేడం కాళ్ల దగ్గర కూర్చుని మొండికేయసాగింది. 
“అంతా అయిపోయింది కదమ్మా ! నీ తప్పుల పెద్ద ఫైల్ నే అతడు తెచ్చి చూపించాడు. నీ అంతకు నువ్వు స్వాభిమానంతో కష్టపడి సంపాదించుకునుంటే ఇంత కష్టం వచ్చేదా ?” అన్నారు డేసి. “ నీ సాక్ష్యాలేవీ సరిగ్గా లేవు. ఇక్కడే కాదు, నువ్వెక్కడికి వెళ్ళినా నీకు న్యాయం దొరకడం కష్టం. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. రేపు మా ఎన్ జి ఓ వద్దకు రా. నా కార్డిస్తాను. నీకు ఏ పనుల్లో నైపుణ్యం ఉందో చూసి నీ బ్రతుకుకు ఒక దారి చూపెడతాను” అంది రజియా.  కాని అంతగా అడుగుతున్న సబీనా కోసం, ఒకే  ఒక్కసారి ఇద్దరినీ ఎదురెదురు నిలబెట్టి మాట్లాడిస్తే తప్పేమిటి అన్న ఆలోచన రాగానే నేను 
“మేడం, నాకెందుకో కేస్ క్లోస్ చెయ్యడానికి ముందు ఒక సారి ముఖాముఖి చేయిస్తే మంచిదనిపిస్తుంది. ఆమె అడిగినదానికి కూడా ఒక బదులు దొరికి వాళ్ళ జోలికి పోకుండా తన బ్రతుకేదో తను చూసుకుంటుందేమో “ అన్నాను. అది విన్న మేడం విసుగ్గా
 “ చూడండి. మీరు రచయిత్రిగా మీ కథల్లోని పాత్రలను కావలిస్తే ముఖాముఖి చెయ్యండి. ఇక్కడికవన్నీ తేకండి. కౌన్సెలింగ్, తప్పొప్పుల విచారణ అంతే మన పని ఇక్కడ. బైలా ఇంకోసారి చదువుకోండి. జంటగా విచారణ చెయ్యడానికి ఇది ఫ్యామిలీ కోర్ట్ కాదు” అన్నారు.  నాకెందుకో ముఖభంగమయినట్టయినా బయటికి కనబరచకుండా “ సరే మేడం. మీరు చెప్పినట్టే కానివ్వండి “ అన్నాను.
సబీనా వదిలిపెట్టకుండా ఇప్పుడు ఆమె కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ “ అలా అనకండి మేడం. హమీద్ వద్దంటే వద్దు. నేను వెళ్ళిపోతాను. ఇకపైన వాళ్ళ దరిదాపులకు కూడా రాను.” అంటున్నది. అది విన్న రజియా, డేసి మనసులు కూడా కరగసాగాయి. మేడం కూడా కొద్దిగా మెత్తబడ్డారు. మా ముగ్గురినీ చూస్తూ మేడం “ ఏం చేద్దామండీ ?” అన్నారు. రజియా సందేహిస్తూనే “ ఆలోచించవచ్చు “ అనగా డేసి “ ఒక అవకాశం ఇచ్చేసి ముగించేద్దాం. వెళ్ళిపోవచ్చు” అన్నారు. మేడం సబీనాను ముందరున్న కుర్చీలో కూర్చోమని చెప్పి, బెల్ కొట్టి సిద్ధును పిలిచి “బయట వెయిటింగ్ రూములో హమీద్ అని ఉన్నారు. పిలు” అన్నారు. అంతా అయిపోయి కేస్ షీట్ పైన తన సంతకం కోసం తనను పిలుస్తున్నారనుకుని నవ్వుతూ లోపలికి వచ్చిన హమీద్ పక్కనే కూర్చున్న సబీనాను చూసి వచ్చినంత వేగంగానే బయటికి పరిగెత్తాడు. “ చూశావా సబీనా. అతడికి నీ మొహం కూడా చూడబుద్ది కావడంలేదు. నువ్వేమో పెళ్ళి మాటలు మాట్లాడతావు “ అన్నారు మేడం. లోపలికి వచ్చిన వ్యక్తిని గమనించని సబీనా “ ఎక్కడ వచ్చాడు ? ఎక్కడ? ఎక్కడ?” అంటూ నుంచుంది.
మేడం సిద్ధును పిలిచి “ వెళ్లవయ్యా ! హమీద్ ని ఇంకోసారి పిలుచుకుని రా” అన్నారు. పది నిముషాలు గడిచినా వ్యక్తి జాడ లేదు. అప్పుడే శశిరేఖనుద్దేశించి డేసి “ వికాస సౌధకు మేము ట్రైనింగ్ కు వెళ్ళివచ్చిన టిఎ,డిఎ బిల్లులు శాంక్షన్ అయ్యాయా ?” అన్నారు. “ అవును. అదొక్కటి ఉండిపోయింది శశిరేఖా “ అన్నది రజియా. వెంటనే నా వైపు తిరిగిన మేడం “ ఏం మీకు అక్కర్లేదా ? ఏమీ మాట్లాడరు ?” అన్నారు. “ ఔను. మా ఆయన గుర్తు చేస్తూ ఉంటారు.” అన్నాను. “ మేడం. సైన్ చేయించి ఈరోజే కలెక్టర్ ఆఫీసుకు పంపుతాను” అన్నారు శశిరేఖ. అంతలొ సిద్ధు లోపలికి వచ్చి “ ఈమె లోపలుంటే ఆయన రారట మేడం.” అని చెప్పగానే నేనే బయటికి వచ్చి చూస్తే కారు వద్ద మొహం అటుగా తిప్పి నిలబడి ఉండడం కనిపించింది. మెట్లు దిగి అక్కడికే వెళ్ళాను. 
“ లోపలికి వస్తే ప్రమాదమేమీ లేదు. మేమంతా ఉన్నాం కదా. ఏమీకాకుండా చూసుకుంటాం. అది మా కమిటీ డ్యూటి. ఒక్కసారి చివరి సారిగా లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళిపో. మీకు క్లియర్ అవుతుంది. మాకూ ఆలస్యమవుతోంది.” అని బలవంతం చేశాను. “ దానిక్కాదు మేడం. అలా కాదులెండి” అంటూ హమీద్ కంగారుపడ్డాడు. కారులో కూర్చున్న వ్యక్తితో చిన్నగా ఏదో మాట్లాడాడు. అతడు కూడా దిగి హమీద్ తో పాటు వచ్చాడు. సబీనాకు భయపడి డ్రైవర్ ను తోడు తీసుకు వస్తున్నాడేమోనని అనుకున్నాను. ఇద్దరూ నా వెంటే లోపలికి వచ్చారు. మేడం వాళ్లవైపు తిరిగి “ హమీద్ నువ్వేమో పెళ్ళయి పిల్లలున్నారంటున్నావు. ఈమె చూస్తే మీకు పెళ్ళి కాలేదంటోంది. ఎవరో ఒకరు అబద్దం చెప్తున్నారు కదూ “ అని అడిగారు. హమీద్ తడబడుతూ “ నాకు.... నాకు. పెళ్ళయింది మేడం.” అన్నాడు. అలాగే చెమటలు తుడుచుకుంటూ దీనమైన గొంతుతో మేడం దగ్గరకు వెళ్ళి చిన్న గొంతుతో “ మేడం. నాది తప్పయిపోయింది. కడుపులో పెట్టుకోండి మేడం. మా అన్నయ్యకు తెలుగు సరిగ్గా రాదు. అందుకే పొద్దున్నుండి మీతో అతడి మాటలుగా నేనే మాట్లాడాను.” అంటూ చేతులు జోడించాడు. అతడు ఏం చెబుతున్నాడో మాకెవ్వరికీ ఒక్క క్షణం అర్థం కాలేదు.
ఆశ్చర్యంతో మేడం “ ఏంటయ్యా ! నీకు తెలుగు బాగానే వస్తుందే “ అని అడిగినందుకు ముందు కూర్చున్న సబీనా “ లేదు మేడం, వెనక తెల్ల షర్ట్ వేసుకున్నాయన హమీద్, ఈయన ఆయన తమ్ముడు సలీం భాయ్ “ అంది. మేడంతో పాటు మేము ముగ్గురం కూడా తేలు కుట్టిన వారిలా ఒక్కసారిగా కుర్చీల నుండి లేచి నుంచున్నాము. “ ఇదేంటయ్యా ఇది! పిల్లల ఆట మాదిరిగా అనుకున్నారా ? అప్పుడేమో నీతో పాటు వచ్చిందెవరని అడిగితే కార్ డ్రైవర్ అన్నావు. మమ్మల్ని మోసం చేస్తారా ? ఇప్పుడు సబీనా ఒక్కత్తే కాదు, మేము కూడా కేస్ వెయ్యకుండా వదిలేది లేదు “ అంటూ మేడం కోపంగా అరుస్తూ కూర్చున్నారు. “ పొద్దున్నుండీ చేసిందంతా ఉత్త నాటకం అని తేలిందే “ అంటూ రజియా కూర్చుంటే “ రిపోర్టులో దీన్ని కూడా చేర్చండి శశిరేఖా “ అంటూ విరమించారు డేసి. నేను 
“ అంతా ఉల్టా అయిపోయిందే !”అంటూ నవ్వుతూ కూర్చున్నాను. అప్పుడు మేడం
 “ శశిరేఖా ! ఇతడి మోసం గురించి ఒక కంప్లెయింట్ టైప్ చేయండి. విచారణా కమిటీనే మోసం చేస్తాడా ? ఎంత పొగరు ఇతడికి. ఇక ఈ పేద సబీనా ఒక లెక్కా?” అన్నారు. ఆమెలో గొంతులోని కరుకుదనానికి మేమంతా ఆశ్చర్యపడ్డాము.
“ మేడం, తప్పయిపోయింది. తప్పు కాయండి “ అంటూ అక్కడే నిలబడున్న సలీమ్ ను మేడం ఇంకా కోపంతో “ ముందు నువ్వు బయటికి వెళ్ళు. నా కళ్ళెదుట ఉండొద్దు. గెట్ లాస్ట్ “ అంటూ అరిచేటప్పటికి ఇంకేం జరుగుతుందో అని భయపడి సలీమ్ వెనకెనకే నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. పాపం హమీద్ బెదిరిపోయి దూరంగా నిల్చుని చేతులు జోడించాడు. మాకంతా కేసు అనుకోని మలుపు తిరిగిందనేకంటే, పొద్దున్నుండి కూర్చుని చేసిందంతా వ్యర్థమయ్యిందనే అవమానం కలగసాగింది. ఈ హమీద్ ను మళ్ళీ విచారించాలా లేక కేస్ మళ్ళీ ముందుకేయాలా అని అర్థం కాక మాకు ఇబ్బంది అనిపించసాగింది.
“ఏంటయ్యా ! సబీనాను ఇలా మోసగించవచ్చా ?” అంటూ డేసి అడిగిన ప్రశ్నకు “ లేదు మేడం. నేనెందుకు మోసగిస్తాను ? నా తమ్ముడు చేసిన పనండీ అంతా. ఇంత సేపూ నన్ను కార్లో కూర్చోబెట్టి లాక్ చేసుంచాడండీ. మూడు సంవత్సరాలనుండీ మా మధ్య ఉన్న స్నేహం తెలిసుండి కూడా ఇప్పుడు నేను ఆమెను పెళ్ళి చేసుకుంటాను అనగానే మండిపడుతున్నాడండి. పెళ్ళెందుకు వద్దు, అలాగే కొనసాగించు కావలిస్తే అంటాడు. పెళ్ళి చేసుకుంటే ఆమె కొడుకుకు ఆస్తి పంచాలి అంటాడండీ. ఎవరికో పుట్టినవాడికి మన ఆస్తి పోవడం నేను ఒప్పుకోను అంటాడండీ. ఈ రెండు నెలల నుంచి నా ఫోన్ తీసేసుకుని ఈమెకు నేను చేసిన మెసేజ్ లన్నీ తీసేసి నేను తిట్టినట్టు మెసేజ్ చేశాడండి. నానుండి ఆమెను దూరం చెయ్యడానికి ఫ్యాక్టరీ నుండి ఆమెను తరిమేసింది కూడా వాడే. మా ఖాన్దాన్ లో చెడబుట్టాడండి వీడు. మా అమ్మి నాకని తెచ్చిన అమ్మాయిని తనే చేసుకున్నాడండి. మా అమ్మి చనిపోయాక నేను ఒంటరివాడ్నయిపోయానండి. ఈ పాడు ఆస్తి, దౌలత్ ఏవీ నాకు వద్దు మేడం. నాకు సబీనా కావాలి. ఆమె కొడుకు కూడా నా కొడుకే. నా తమ్ముడి నుండి నన్ను విడిపించండి మేడం.” అటు వైపు ఇతడి మాటలు విని సబీనా వెక్కుతుంది కూడా వినిపించింది.
చెప్తున్నదంతా ముగించి అక్కడే కూలబడిన హమీద్ ను సబీనా పరిగెత్తి వచ్చి దగ్గరికి తీసుకుని కూర్చుంది. “ ఇద్దరూ ఇష్టపడే కలుసుకున్నాము మేడం. దేవుడిలాంటి మనిషి తను. రాత్రి రెండు గంటల దాకా మాట్లాడుకునేవాళ్ళం. ఒక టైమని లేదు, కాల్ చేసేవాడు. ఇప్పుడు ఇలా ఎందుకయ్యాడు అనిపించేది మేడం.” అంటూ ఆనందంతో ఊగిపోతోంది సబీనా. “ ఈమె చెప్తోందంతా నిజమే మేడం. నేను ఈమెను పెళ్ళి చేసుకుంటాను. మీరంతా థోడా మదద్ కరో మేడం. ఈమె కొడుకు జవాబ్దారి నాది. నేను ఒంటరివాడ్నయ్యాను మేడం. నాకొక జోడి కావాలి. నా తమ్ముడు సలీంకు కూడా కొంచెం బుద్ధి చెప్పండి. అంతా 
మీరే సరి చెయ్యండి మేడం.” అంటూ వెక్కుతుంటే మేమంతా వెళ్ళి అతడిని సమాధాన పరిచాము. సబీనా ఇప్పుడు తన ఆకుపచ్చ దుపట్టాలోని నెమలిలోని రంగులలాగా మాలోనూ రంగులు నింపసాగింది.
  **** 

No comments:

Post a Comment

Pages