భరత శతకము - టంగుటూరి వరదరాజశర్మ - అచ్చంగా తెలుగు

భరత శతకము - టంగుటూరి వరదరాజశర్మ

Share This
భరత శతకము - టంగుటూరి వరదరాజశర్మ
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం : 
ఈశతకంలో కవి తనగురించి కానీ ఏమి చెప్పికొనలేదు. ఈశతకం 1932సం||లో నెల్లురులో ప్రచురించబడటం వలన బహుశా ఈ కవి నెల్లూరి ప్రాంతములలో వాడు కావొచ్చును. ఈకవి ఇతర రచనలు కూడా తెలియలేదు.
శతకపరిచయం:
"భరత" అనే మకుటంతో రచింపబడిన ఈశతకంలో 108 కందపద్యాలున్నాయి. ఈశతకం ప్రధానంగా కుమారీ, కుమార శతకాలవలే నీతి శతకము. ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత ఉపయోగ పడేటట్లుగా రచింపబడినది. 

ఈశతకంలోని కొన్ని పద్యాలను చూద్దాము.

క. అడకువగల ధీమంతుఁడు
పుడమిని సర్వజ్ఞుఁడనుచు బుధనుతి గాంచున్
గడుఁజదివినా తఁడేనిన్
జెడుగర్వంబందెనేని సిద్ధమి భరతా!


క. అనుదినము గ్రొత్తపాఠ
మ్మును గఱచుచు మఱవకుండ మొనసి చదువులోఁ
గొనవలె గురువుల మన్నన
గనవలె నుజానమహిమ ఘనుఁడయిభరతా!


క. అందము ధనములు నిలువవు
యెందును గుణమేకరీతి నెసగునుగానన్
పొందుము సుగుణులమైత్రిని
తొందఱపడి విహితులనుచుఁ దొడరకు భరతా!


క. ఆకటికి దగునకుడుపును
నీకలిమికిదగిన యుడుపు నిను గాపాడున్
లోకమునఁబొంగి క్రుంగుట
నీకనులకుఁ దేటపడదె నిత్యము భరతా!


క. ఇయ్యవలె లేనివానికి
నెయ్యముతో వైరిపోరునిలుపఁగ వలయున్
గయ్యమునకు గాలూనుట
యెయ్యెడఁగారాదు సుమతి కెన్నగభరతా!

క. ఎప్పుడుతప్పు కనంబడు
నప్పుడు సరిదిద్దుకొనుట యసదృశగుణమౌ
ముప్పునగలిగెడు దుఃఖము
లిప్పుడగాంచెదరు సూరులెంతయు భరతా!


క. ఒక్కకపని నొక్కతఱి
జక్కగ నెఱవేర్పవలయు జదివెడు పట్లన్
జిక్కకు మాటల నిదురన్
సొక్కకుమీ పగలుకునుక జూడకు భరతా!


కపటము, గర్వము, లోభం
బపకారము, దొంగతనము, నాగ్రహపాటున్
విపరీతభోజనము లివి
యెపుడైన నమానుషంబు లెన్నగ భరతా!

కొన్ని పద్యాలలో ఈకవి సుమతి శతకకారుని అనుకరించాడు. తెలుగు భాషలోని నానుడులను ఈకవి శతకంతటా సందర్భోచితంగా వాడుకున్నాడు.

క. కలహము గలిగెడు చోటికి
కులహీనులు వెలయు సభకు గోతులకడకున్
పిలువని పేరంటమునకు
తెలివిగలుగువార లరుగుదేరరు భరతా!


క. క. కన్నమ్మ కడుపుఁజూచును
వెన్నుందిలకించు గొన్నవెలదుక గుణసం
పన్నత తల్లింగొలుచుచు
నన్నుతులంగాంచు నతఁడె సరసుడు భరతా!


క. కాడులు వీడులగుటయున్
వీడులునుంగాడులగుట విపరీతంబే
ఱేడులుమాఱగ భువిలో
నాడులుమాఱ్పొందుచుంట నైజము భరతా!


చక్కని సులభమైన భాషలో పిన్నలకు పెద్దలకు అర్థం అయ్యెట్టుగా వ్రాయబడిన ఈశతకం మీరూ చదవండి. మీపిల్లలచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages