అటక‌ మీది మర్మం - 27 - అచ్చంగా తెలుగు

అటక‌ మీది మర్మం - 27

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) -  27
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు తెలుగు సేత)
 గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)
 

(తండ్రి కోరికపై కనిపించకుండా పోయిన ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్ కుమారుడి సాహిత్యాన్ని వెతికి పట్టుకోవటానికి నాన్సీ అంగీకరిస్తుంది.  తన స్నేహితురాళ్ళతో ఆ పాత భవనాన్ని గాలిస్తుంది  కానీ ఆమెకు ఎలాంటి ఆధారాలు దొరకవు.  ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పనిలో చేరిన ఎఫీ ద్వారా నాన్సీ తెలుసుకొంటుంది.  ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది.  అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది.  వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి.  రేడియోలో వినబడే పాటలో కొన్ని పదాలు మార్చ్ కుమారుడు అతని భార్యకు వ్రాసిన ఉత్తరంలో ఉన్నాయని ఆమెకు గుర్తుకొస్తుంది.  వాటిని వెతకటానికి యింటికి వెళ్దామనుకొంటూండగా, ఫాన్సీ డ్రస్సు వేసిన సుశాన్ ప్రమాదవశాత్తూ మెట్లమీద నుంచి కిందకు దొర్లిపోతుంది.  అదే సమయంలో మెట్లకు పక్కనున్న గోడపై వ్రాసి ఉన్న సంగీత స్వరాలు బయటపడతాయి.  ఆమె తన స్నేహితురాళ్ళతో కలిసి జెన్నర్ ఆఫీసుకి వెడుతుంది.  జెన్నర్ తమకు ఇంటర్వ్యూ యివ్వకపోగా, తమ గురించి ఎవరితోనో మాట్లాడటం వాళ్ళు వింటారు.  తరువాత అక్కడనుంచి హోటలుకి బయల్దేరిన వ్యక్తిని వెంబడిస్తారు ముగ్గురు అమ్మాయిలు.  హోటలు వాళ్ళు ఆ వ్యక్తిని బెన్ బాంక్స్ అని గాక డైట్ అని సంబోధించటం వాళ్ళు వింటారు.  హోటలు వాళ్ళ నుంచి ఈ డైట్, బెన్ బాంక్స్ ఒకరే అని తెలుసుకున్న నాన్సీ, ఆ విషయం తండ్రితో చెబుతుంది.  వెంటనే తండ్రి ఆమెను అక్కడనుంచి మార్చ్ భవనానికి వెళ్ళిపొమ్మని, అవసరమైతే తానే ఆమెను అక్కడకొచ్చి కలుస్తానని చెబుతాడు.  తండ్రి చెప్పినట్లే నాన్సీ ఫిప్ ఉత్తరాలతో మార్చ్ భవనానికి చేరుకొంటుంది.  ఆ ఉత్తరాలను చదివిన ఆమెకు కిటుకంతా అస్తిపంజరంలో ఉన్నట్లు గ్రహించి, దాన్ని బీరువాలోంచి పక్కకు తీస్తుంది.  దాన్ని తగిలించిన చోట బీరువాలో కన్నం కనిపిస్తుంది.  వెంటనే సన్నని ఊచను ఆ కన్నంలోకి నెట్టుతుందామె.  తరువాత. . . .)
@@@@@@@@

ఊచ ఒక వైపు కొసని బట్టలబీరువాలోని గుండ్రంగా ఉన్న ఆ చిన్న కన్నంలోకి జాగ్రత్తగా నెట్టింది.
ఆ ఊచకు అవతలవైపు గోడ కానీ, మరేదైనా వస్తువుగానీ తగలలేదు.  విస్తుపోయిన నాన్సీ ఊచను తొలగించి, ఆ చిన్న కన్నం గుండా తొంగి చూసింది.  అటువైపంతా చీకటిగా ఉండి చిన్న కాంతిరేఖ కూడా కనిపించలేదు.
నాన్సీ కొంతసేపు తనలో తాను తర్కించుకొంది.  'బీరువా కన్నంలో ఊచ చాలా భాగం దూరిందంటే బీరువా వెనుక గోడ కానీ, తలుపు కానీ ఉండాలి.  దానికి కూడా కన్నం ఉంది గనుకే ఊచ అంత భాగం లోనికెళ్ళింది.  అంటే అవతలవైపు ఖాళీ స్థలం కానీ, గది కానీ ఉందా?  ఖాళీస్థలమైతే ఆకసంనుంచి పడే వెలుతురైనా కనపడాలి.  కానీ కన్నంలోంచి తొంగిచూస్తే చీకటిగా ఉంది గనుక ఈ అటకకు ఆవలివైపు ఒక చీకటి గది ఉందన్నమాట!  అటు చీకటిగది ఉంటే, ఈ అటకమీద నుంచి ఆ గదిలోకి వెళ్ళటానికి మధ్యలో తలుపేమైనా ఉందా?  అంటే అటకమీద ఉన్న ఈ బీరువా  గోడకి కాక తలుపుకు చేరవేసి ఉందా?'
" వింతగా ఉంది" మార్చ్ తో అంటూ అతను చూసేందుకు వీలుగా ఆమె పక్కకు తప్పుకొంది.
అతను కన్నంలోంచి చూస్తే అవతలవైపంతా చీకటిగా కనిపించింది.  "నువ్వు. . .నువ్వేమంటావు?" అతని గొంతులో అలజడి ధ్వనించింది.
"ఈ బీరువా అటకమీద ఒక గోడకు చేరవేసి ఉందని యిన్నాళ్ళూ అనుకొన్నాను" నాన్సీ చెప్పింది.
"నేనే బీరువాను అక్కడకు జరిపాను" అయోమయంగా అన్నాడతను.
"అటువైపు గది కానీ, ఏదైనా గూడు కానీ ఉండాలి.  లేదంటే అవతలి వైపు సూర్యకాంతి మనకు కనిపించేది కదా!"
"నువ్వన్నది నిజమే!" పెద్దాయన తలూపాడు.  "ఇన్నాళ్ళూ ఈ రహస్యాన్ని తెలుసుకోకుండానే యిక్కడ ఉంటున్నాను.  ఈ యింటిమీద నాకు పరిపూర్ణజ్ఞానం ఉన్నట్లు అనుకోకూడదని తెలియజెప్పావు" శాంతంగా నవ్వుతూ అన్నాడతను.
తాను కనుగొన్న కొత్త విషయానికి పులకించిపోయిందామె.  తాను యింటి బయటకెళ్ళి ఆ యింటి నిర్మాణశైలిని పరిశీలించి వస్తానని చెప్పి, అటక దిగింది.  ఆమె ఆ భవనం యొక్క బాహ్యస్వరూపాన్ని కూలంకషంగా పరిశీలించింది.  ప్రధాన భవనంలోని చిన్న భాగం పాత కూలీల నివాసాల పైకప్పుకి జోడించి ఉన్నట్లు గమనించింది.
"అక్కడ రహస్యంగా ఒక గది ఉండి ఉండాలి" అన్న తలంపు బలపడి ఆమె ఆలోచనలు పదునెక్కాయి.  వెంటనే బాణంలా యింట్లోకి దూసుకెళ్ళి హడావిడిగా అటకమీదకు చేరుకొంది.
"ఏమైనా తెలిసిందా?" మార్చ్ అడిగాడు.
"తెలిసింది" ఆయాసపడుతూనే ఆమె తాను కనుగొన్న విషయాన్ని అతనికి చెప్పింది.
"అక్కడ రహస్యమైన గది ఉందని నాకింతవరకు తెలియదు" విస్తుపోతూ చెప్పాడతను.  "ఆలోచించి చూస్తే, అకస్మాత్తుగా ఫిప్ కొన్ని గంటలపాటు మాయమయ్యేవాడు.  అతను ఎక్కడ ఉన్నాడో మాకెవరికీ తెలియదు.  తను మాకెప్పుడూ ఏమీ చెప్పేవాడు కాదు.  అందుకే మేము అతన్ని అడగలేదు కూడా!"
"బహుశా మీ అబ్బాయి ఈ గదిని కనుక్కొని తన సంగీత కార్యక్రమాలకు రహస్యస్థావరంగా చేసుకొని ఉండొచ్చు.  ఈ బీరువాని పక్కకు జరిపి వెతుకుదాం."
బరువుగా ఉన్న ఆ బీరువాని జరపటం వాళ్ళిద్దరికీ సాధ్యం కాలేదు.  అందుకే వంట చేస్తున్న ఎఫీని పని ఆపి రమ్మని నాన్సీ పిలిచింది.
"బలంగా నెట్టేవాళ్ళు కావాలి" పనిపిల్లతో చెప్పిందామె.
"మీ ఆజ్ఞను పాటిస్తాను" పనిపిల్ల యికిలిస్తూ చెప్పింది.  "మీ మనసులొ ఉన్నదేంటో సూటిగా చెప్పండమ్మా!"
"ఈ చెక్క బీరువాని పక్కకు నెట్టాలి."
చివరకు వాళ్ళు ముగ్గురు సాయం పట్టి ఆ టేకు కర్ర బీరువాని కొన్ని అంగుళాలు పక్కకు నెట్టగలిగారు.  అటకమీదకొచ్చిన సుశాన్ వాళ్ళు చేసే పనిని ఆసక్తిగా చూసింది.  ఉన్నట్లుండి చప్పట్లు కొడుతూ దాని చుట్టూ ఉత్సాహంగా తిరుగుతూ నాట్యం చేసింది.
"అదిగో అదే!  గోడలో బిగించి, తొంగి చూట్టానికి వీలైన కన్నంతో ఉన్న తలుపు."
"నిజమే!" ఎఫీ విస్తుపోతూ అంది.  " నాకు నమ్మకం కలగటం లేదు.  ఈ చుట్టుపక్కల అన్నీ వింతగొలిపే వస్తువులే కనిపిస్తున్నాయి."
ఆ తలుపు మోటుగా యింటి దగ్గర ప్రత్యేకంగా తయారుచేయించినట్లు ఉంది.  వడ్రంగం పని ఏ మాత్రం తెలియని వ్యక్తి దాన్ని తయారుచేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
"మా అబ్బాయి స్వయంగా తానే ఈ తలుపుని తయారుచేసి యిక్కడ పెట్టి ఉండొచ్చు, వెధవ!" అంటూ పెద్దాయన తనలో తనే మురిసిపోయాడు.  "వాడెప్పూడూ యిలాగే ఏవో మరమ్మత్తు పనులు చేస్తూండేవాడు."
నాన్సీ తలుపుకున్న గొళ్ళెం తీసి తలుపుని తన శక్తి కొలదీ గట్టిగా తోసింది.  కానీ అది తెరుచుకోవటానికి మొరాయించింది.
" వింతగా ఉందే!  నన్ను ప్రయత్నించనీ!" అంటూ మార్చ్ ప్రయత్నించాడు
.
అతని కన్నా నాన్సీయే నయమనిపించింది.  వయసులో ఉన్న ఎఫీ ప్రయత్నించినా లాభం లేకపోయింది.

"అటుపక్క గడియ పెట్టి ఉండాలి" నాన్సీ అంది.  "అదే జరిగితే మనం ఎప్పటికీ ఆ గదిలోకి వెళ్ళలేము."
(తరువాయి భాగం వచ్చే సంచికలో)

No comments:

Post a Comment

Pages