మేడారం మహాజాతర - అచ్చంగా తెలుగు
మేడారం మహాజాతర
( 2020 ఫిబ్రవరి 5 నుండి 8 వరకు )
శ్రీరామభట్ల ఆదిత్య మన దేశంలో గ్రామదేవతలకు, వనదేవతలకు  చాలా ప్రాధాన్యం ఉంది. ఆ ఆదిశక్తి వివిధ రూపాలలో భక్తులను కాపాడుతూనే ఉంటుంది. ఆ వనదేవతా రూపాలలో వచ్చిన సమ్మక్క, సారలమ్మలు గిరిజన దేవతలుగా వాసికెక్కారు. దేశంలో కుంభమేళా తరువాత భారీ సంఖ్యలో జనం పాల్గొనే జాతర 'శ్రీ మేడారం మహాజాతర'. తెలంగాణా రాష్ట్రంలోని మూలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో రెండేళ్ళకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ జాతర ప్రసిద్ధికెక్కింది.
రెండేళ్ళకొకసారి మాఘ పూర్ణిమ సందర్భంగా నాలుగు రోజులపాటు ఈ జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 5 నుండి 8 వరకు ఈ జాతర జరుగుతుంది. సారలమ్మ మరియు గోవిందరాజుల గద్దె ప్రవేశంతో మొదలై దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇక్కడ అమ్మవార్లకు వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజలు నిర్వహిస్తారు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా బంగారం (బెల్లం) సమర్పించడం విశేషం.
19వ శాతాబ్దం మరియు 20వ శతాబ్దం మధ్యభాగం వరకు ఈ జాతరను కేవలం గిరిజనులే, అదికూడా చిలకలగుట్ట మీద మాత్రమే జరుపుకునేవాళ్ళట. కానీ 20వ శతాబ్దం మధ్యభాగం తరువాత జనాల తాకిడి పెరగడంతో కొండకింద జాతర జరపడం ప్రారంభమైంది. 1996 నుండి ఈ జాతరను 'రాష్ట్ర పండుగ'గా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మనకు అమ్మవార్లు విగ్రహరూపంలో కనబడరు కేవలం గద్దెలు మాత్రమే కనబడతాయి.
చరత్ర - కథ:
నేటి జగిత్యాల జిల్లాలోని పొలాస అనే ప్రాంతాన్ని 13వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. మేడరాజు తన ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన పగిడిద్దరాజుకిచ్చి వివాహం జరిపించాడు. పగిడిద్దరాజు మేడారంను పాలించేవాడు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు జన్మించారు. మేడారం కాకతీయులకు సామంత రాజ్యంగా ఉండేది. ఒకానొక సమయంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడ్డాయి మేడారంలో. దాంతో కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు పగిడిద్దరాజు. కాకతీయ మహారాజు ప్రతాపరుద్రుడి రాజ్యవిస్తరణ కాంక్ష మరియు పగిడిద్దరాజు కప్పం కట్టలేదనే కారణంతో వారిపై దండెత్తారు కాకతీయులు.
యుద్ధంలో కాకతీయులపై సంప్రదాయ యుద్ధరీతిని అవలంబించారు గిరిజనులు. కానీ  కాకతీయ సుశీక్షత భారీ సైన్యం ముందు చాలాసేపు నిలువలేకపోయారు గిరిజనులు. కాకతీయ సేనల ధాటికి గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ ముందే మరణిస్తారు. గోవిందరాజు సారలమ్మ భర్త. ఓటమిని భరించలేని జంపన్న సమీపంలోనే సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడట. ఆనాటి నుండి ఆ వాగు 'జంపన్న వాగు'గా పిలువబడుతోంది.
కాకతీయులతో వీరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క గుర్రంపై చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. ఆమెను వెంబడించిన సైన్యానికి, అనుచరులకు పసుపుకుంకుమల భరిణెలు మాత్రమే కనబడ్డాయి. వాటినే సమ్మక్క సారలమ్మ (సారక్క) లుగా భావించి ప్రతీ రెండేళ్ళకొకసారి మాఘ పూర్ణిమకు ఘనంగా జాతర నిర్వహిస్తారు.
జాతర జరిగే తేదీలు:
2020 ఫిబ్రవరి 5న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి గోవిందరాజుల రాక.
ఫిబ్రవరి 6న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి రాక.
ఫిబ్రవరి 7న అమ్మవార్లకు మొక్కులు.
ఫిబ్రవరి 8న అమ్మవార్ల వన ప్రవేశం.

No comments:

Post a Comment

Pages