మనుచరిత్రము - ఒక సమీక్ష - అచ్చంగా తెలుగు
మనుచరిత్రము (పరిచయం ) -బాలాంత్రపు వేంకట రమణ
ఒక సమీక్ష
దేవరకొండ సుబ్రహ్మణ్యం 
తెలుగువారి జీవితాలకి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉన్నది. ప్రతి తెలుగుబిడ్డ ఎదో ఒక కాలంలో కథలో, నవలలో, కవితలో చదివినవాడే. ఒక పాఠకునికి ఒక పుస్తకం నచ్చింది అంటే దానికి కారణాలు అనేకం. ముఖ్యమైనవి ఆపుస్తకంలోని వస్తువు, భాషా, నిడివి వంటివి.మనకు అర్థం కాని విషయం, అర్థంకాని భాషలో ఉంటే మనం చదవలేముకదా. అలాగే ఈనాటి కాలంలో మన కావ్యాలను చదవటానికి సాధారణ పాఠకులు ఉత్సాహం చూపటంలేదు. కారణం భాష గ్రాంధికం కావటం, పద్యాల రూపంలో ఉండటం, మొదలైన కారణాలు అనేకం. అదే కావ్యాన్ని మనకు సులభంగా అర్థం అయ్యేట్టుగా ఎవరైనా పండితులు వివరిస్తే 'ఓహో ఎంత బాగుంది ' అనిపిస్తుంది. దీనితో పాఠకునికి మరింత ఉత్సాహం కలుగుతుంది. కాస్త ప్రయత్నంతో నెమ్మదిగా చదివి అర్ధం చేసుకునే ప్రయతంచేసి సఫలత సాధిస్తాడు.
సరిగ్గా "మనుచరిత్రము - (పరిచయం)" అనే పుస్తకంలో రచయిత శ్రీ బాలాంత్రపు వేంకట రమణ గారు ఇదే ప్రయత్నించి సఫలులయ్యారు. ఎలాగో చూద్దాం.
తెలుగు పంచ కావ్యాలలో మొదటిగా పేరొందినది మనుచరిత్రము . ఆంధ్ర కవితా పితామహ బిరుదాంకితుడు, అష్టదిగ్గాజాలలో ప్రథముడు, సాక్షాత్తు కృష్ణదేవరాయలిచే గండపెండేరం తొడిగించుకున్నవాడు, కవిత్వంలోనేకాక రాయల దిగ్విజయాలలో పాలుపంచుకుని ఆమాత్యునిగా మెలగిన అలసాని పెద్దనామాత్యుడు. 

పాఠకులకు సులభంగా అర్థంకావటానికి బాలాంత్రపు రమణ గారు ఎంచుకున్న విధం ఇలాగ ఉంది. 1. కవి పరిచయం 2. కావ్యంలోని కథ (సులభమైన తెలుగులో), 3. పద్యాల సొబగులు. ఇప్పుడు ఒక్కొక్క అంశం పరిశీలిద్దాం:
1. కవి పరిచయం: ఒక కావ్యం గురించి తెలుసుకోవటం ఎంత ముఖ్యమో ఆకావ్యాన్ని రచించిన కవిని గురించి తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈకావ్యాన్ని రచించిన అలసాని పెద్దనామాత్యుడు ఎక్కడివాడు, ఎప్పటి వాడు ఇతని ఇతర రచనలేమిటి మొదలైన ఆసక్తికర విషయాలే కాక వారి కొన్ని చాటువులను, ప్రఖ్యాతి చెందిన సీసపద్యమాలికను మనకు వ్యాఖ్యాన సహితంగా మనకు రుచిచూపించారు శ్రీ బాలాంత్రపు రమణ గారు.
2. కథా విధానము: ఈభాగంలో కావ్యంలోని కథను క్లుప్తంగా మనముందుంచారు. చక్కని సరళమైన భాషలో ఎవరికైనా అర్ధమయ్యే రీతిలో చెప్పారు. ఊరికే కథ చెప్పటంతో వదలలేదు.  ప్రవరుడు ఏ కాశీ ప్రయాగకో వెళ్ళక హిమాలయాలకే ఎందుకు వేళ్ళాడు అన్నది ప్రశ్న   . ఈప్రశ్న కి సమాధానంకోసం నేను కూడా ఆలోచించాను.  
అవును ఎందుకూ అని ఆలోచిస్తే నాకు తోచిన సమాధానం:
కావ్యారభంలోనే పెద్దన గారు మనకు ప్రవరుని వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తారు. ప్రవరుడు ఎంత అందగాడో, ఎంత ఐశ్వర్యవంతుడో, అంతటి నిష్టాగరిష్టుడు. వేద వేదాంగ పురాణ సకలశాస్త్ర కోవిదుడు. మహాదాత. అన్నిటికీ మించి సంపూర్ణంగా వైరాగ్యాన్ని వంటపట్టించుకున్న గృహస్తు. ఇంక హిమాచలమో? సమస్త పౌరాణిక సంఘటలకు ఆలవాలం. మహామహిమాన్వితులైన మహర్షుల నివాసస్థానం. ప్రకృతి సౌందర్య నిలయం. విరాగీఇన ప్రవరునికి అవకాశం దొరకగానే అటువంటి ప్రదేశానికి వెళ్లాలనిపించటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
మరొక కారణం ఏమంటే "బుద్ధి కర్మానుసారిణి" మన ఆలోచనలు, ప్రవర్తన అన్ని మన కర్మను బట్టివస్తాయి. ప్రవరుడు పరోక్షంగా మను వంశ సంభవానికి కారకుడయ్యాడు. అతని చేసిన వరూధిని అతని విరహంలో మాయారూపంలో వచ్చిన గంధర్వునిచే స్వరోచిని కుమారునిగా పొందింది. ఈ సర్వోచికే మన కథానాయకుడు, రెండవ మనువు అయిన స్వారోచిషుడు జన్మించాడు. ఇంతకథ జరగాలంటే ప్రవరుడు హిమాలయాలకు వెళ్లక తప్పదు. విధిలిఖితం జరగాల్సిందే. 
ఇటువంటి పాఠకులను ఆలోచింపచేసే అనేక ప్రశ్నలు ఈ గ్రంధంలో మనకు అనేకచోట్ల తారసపడతాయి. ఉదాహరణకు మన హైందవ సిద్ధాంతం ప్రకారం మన భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నాయని నమ్మకం. ఈ అష్టదిగ్గజాలు ఏమిటి మొదలైన వివరాలతో పాటు వీటికి మన ఆధునిక Plate Tectonic Theory కి ఏమైనా సంబంధం ఉన్నదా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఇటువంటి ప్రశ్నలు పాఠకులను ఆలొచింపచేస్తాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.
3. పద్యాల సొబగులు. ఒక పద్యకావ్యంలోని కథను వచనంలో చదవటం ఒక ఎత్తు అయితే అదే కథను పద్యాలలోనే చదువుతూ ఆరసాస్వాదన చేయటం మరొక ఎత్తు. దేని ఆనందం దానిదే. ఈకావ్యంలోని కథను ముందుగానే తెలిపిన రమణగారు తరువాతి భాగంలో కావ్యంలోని ముఖ్యమైన పద్యాలను ఎంచుకొని ఆపద్యంలోని పదాలను విడమరచి చెప్పటమే కాకుండా అంతరార్థం ఏమైనా ఉంటే అదికూడా మనకు వివరించారు. అదికూడా కథను అనుసరించి ఆశ్వాసాలను అనుసరిస్తూ మనకుం వివరించారు.
పనసతొనలకన్న పంచదారలకన్న జుంటితేనియకన్న జున్నుకన్న తియ్యనైన పద్యాలను అల విడమరచి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరికి అర్థమయ్యే రీతిలో రచించి మనకు అందించారు.
పండితులకు, సాధారణ పాఠకులకు కూడా అర్థం అయ్యేరీతిలో అనేక నూతన విషయాలను జోడించి ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా మనకు ఒక మరపురాని పరిచయాన్ని అందించాటంలో శ్రీ బాలంత్రపు వేంకట రమణ గారు పూర్తిగా సఫలీకృతులయ్యారు.
మీరుకూడా ఈ గ్రంథాన్ని చదివి ఆ తేనెలను ఆస్వాదించండి. 
ప్రతులకు సంప్రదించండి:
9573170800, బాలాంత్రపు రమణ.

No comments:

Post a Comment

Pages