శివం - 58 - అచ్చంగా తెలుగు
శివం - 58
రాజ కార్తీక్
కల్పన భారతి కి నాకు జరుగుతున్న సంభాషణ ..
నేను: "చెప్పు తల్లీ, నీ కోరిక ఏమిటో?"
క బా: "స్వామి, నాతో కలిసి నువ్వు కూడా పాట పాడలి."
నేను నవ్వు మొహం పెట్టాను. 
క బా: "నువ్వు ఇచ్చిన ఈ గాత్రనికి నీతో కలిసి పాడితేనే నాకు సంతృప్తి. ఇది తప్ప నాకు వేరేమీ కోరిక లేదు స్వామీ!"
గుడి బయట కొంతమంది కాగడాలతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కల్పన భారతి ఏమన్నా సహాయం కోసం చూస్తోందేమో అని...
ఇక కల్పన భారాతి గానం మోదలయ్యింది.
"పుట్టుక ఏమి ..మరణం ఏమి ..జన్మం ఏమీ..కర్మం ఏమీ ...
అంతా మాకు ఋణమా ఏమి  ..నీకు లీల గాదా అది ఏమి.."
అని శ్రావ్యమైన ఆలాపనతో సందర్భానుసారంగా, తన లయతో గీతాలాపన చేసింది. తన కీర్తనకు సమాధానం చెప్పామన్నట్టు...
ఇక నా వంతే, పాడటం...
"ఆ...ఆ....ఆ.."అని శాస్త్ర బద్ధమైన ఆలాపన మొదలు పెట్టాను.
దేవాలయంలో అన్ని దీపాలు వెలిగాయి.
చుట్టూ ఉన్న గంటలు వాటంతటవే మ్రోగయి.
ఆలయ ప్రహరీ చుట్టూ ఉన్న గోడల్లో ఉన్న పెద్ద కాగడలు దీపాలు, వాయిద్య పరికరాలు వెలిగాయి, మ్రోగయి.
ఆలయం దగ్గర ఉన్న బృందం ఈ హఠాత్ పరిణామంతో ఆశ్చర్యచకితులయ్యారు.
వారిలో ఒకడు మాత్రం, "ఒరేయ్ పాటలు పాడే పంతులమ్మ కోసం శివుడే వచ్చాడేమో రా," అన్నాడు.
'అవును రా, లేకపోతే గుడిలో దేవుడు తప్ప ఎవరూ ఉంటారు? ఇన్ని దీపాలు వాటి అంతట అవే ఎలా వెలుగుతాయి " అన్నాడు మరొకడు.
నేను: " పుట్టుక, మరణం, జన్మం, కర్మం ..శివం" అని అలపించాను.
ఆ గాత్రం అంతటా మారుమ్రోగింది.
బయటి వారిలో మరొకడు "అరేయ్, అది శివుడి గొంతేరా! లేకపోతే మనిషి గొంతు అలా ఎలా ఇంతమందికి వినపడుతుంది?" అన్నాడు.
క.బా: "నా కోసం వచ్చావు ..శంభో..మహాదేవా." అంది‌.
వారు ఇక దాన్ని రూఢి చేస్కున్నారు.
వారు వారి కాగడలను వదిలేసి, చేతులు ఎత్తి మొక్కి, "ఈ తల్లి పుణ్యాన నేను, మీరు, మనం అందరం శివయ్య గొంతు వింటున్నాం." అన్నారు పరమానందంగా.
ఇక మా సంగీత ప్రవాహం సాగుతూనే ఉంది ..
క భా: " ఎందుకు ఈ దుఃఖం సుఖం ..?" అని పాడింది.
నేను "ఏమి లేదు అంతా నేనే." అని సంగీత ఆలాపన చేసాను.
ఆలయమంతా దేదీప్యమానంగా ఉంది. 
కల్పన భారాతి పూర్తిగా తన గతం మరిచి, నాతో కలిసి సంగీత ప్రవాహంలో ఓలలాడుతోంది...
దూరంగా ఆలయంలో వెలుగుతున్న దీపాలు మిణుకుమిణుకు మంటున్నాయి.
ఆ నోటా ఈ నోటా "శివుడు వచ్చాడు రా" అని ఊరంతా పాకింది. దాదాపుగా  అందరూ వచ్చారు.
అందరూ "శంకరా ..శివయ్య "అంటు భజన మొదలు పెట్టారు.
కానీ కల్పనకు మాత్రం అవేమి వినబడట్లేదు.
తన దృష్టి అంతా నా మీద, నా అలపన, నా కీర్తన మీదా మాత్రమే.
అందరికి కల్పన పాడిన పాట కొంచెంగా విన బడుతోంది.
అప్పుడు వారు భజన ఒక్క నిమిషం ఆపారు.
దానికి ప్రతిగా నేను పాడిన పాట మాత్రం బాగా గట్టిగా ధ్వనిస్తోంది.
నా గానము పూర్తి కాగానే, "మరింత గట్టిగా 'హర హర మహాదేవ' అని అరిచారు వారి భక్తి వెల్లువ కాగా!
అక్కడ ప్రతి ఒక్కరూ అలా నన్ను పిలుస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుషులలో  చెడు వదిలేసి ఉన్నవారు అందరూ పలికే నామం ఒకటే - 'హర హర మహాదేవ',
'సాంబ సదా శివ'.
కల్పన మాత్రం తాను శ్రద్దగా సంగీత ఆలాపన చేస్తోంది. తనకు ప్రతిగా నేను పాడుతున్నాను.
"గ్రహణం అయినా పర్లేదు, ఆలయ తలుపులు తెరుద్దాం, పరమేశ్వరుడ్ని చూద్దాం," అని నిర్ణయించారు అక్కడ వారు.
ఎంత తెరుద్దామనుకున్నా ఆ ఆలయ తలుపులు తెరుచు కోవట్లేదు. వారికి అర్థమయ్యింది, అది నా లీల అని.
మా సంగీత కచేరి అలా కొనసాగుతూనే ఉంది.
తన కొద్దిపాటి నృత్య ప్రదర్శనతో నా ముందూ వెనకాలా ఆడుతూ, పాడుతూ, పూర్తిగా లీనమైన కల్పన భక్తి యదార్థ స్థితికి చేరుకుంది.
తన పాట, నా భాష్యం అలా‌సాగుతున్నాయి.
నేను ప్రతిగా పాడిన గీతాన్ని  అక్కడ కొంతమంది రాసుకుంటున్నారు.
కల్పన మనసు పూర్తి పారవశ్య స్థితిలో ఉంది. అదే భక్తి స్థితి.
ఆ రాత్రంతా అందరికీ జాగారం అయ్యింది.
కల్పన తన భాషలో అదే సంగీతంతో నన్ను స్తుతించింది, సన్మానించింది, ప్రార్ధించింది .
అక్కడి వారు"ఈ తల్లి అంతా ఇంతా అదృష్టం చేసుకోలేదు "అని అంటున్నారు.
కల్పన పూర్తిగా సమాధాన పడింది. నా ముందు మొకరిల్లి, నా ఆశీర్వాదం కోసం నా పాదాలు తాకింది.
సూర్యోదయం కావస్తోంది. గ్రహణ సమయం అయిపోయింది. మళ్ళీ ఆలయం తిరిగి తెరవాల్సి ఉంది.
కల్పన నా పాదలు పట్టుకుంది, కానీ విడవకుండా అలాగే వుండిపోయింది.
నేను ఇప్పుడు కల్పనకు దేవుడుని కాను, తండ్రిని. 
నేను "చెప్పు తల్లి ." అన్నాను.
క బా: "తండ్రి, నా కోసమే వచ్చావు. ఈ తన్మయత్వం, ఈ భక్తి, ఈ శివ సాన్నిధ్యం, ఎంతో ప్రశాంతంగా, ప్రగాఢంగా ..'అంటూ ఏమి చెప్ప లేకపోతోంది.
నా చేతితో కల్పన భారతి తలను తాకాను. కల్పన ఏదో హాయిగా, పారవశ్యంగా ఉంది మహాదేవా!" అంది.
నేను వెళ్లి, "తల్లి ..వెళ్లి నీ సంగీత అభిషేకం కొనసాగించు, నీ పుట్టకకు పరమార్థం అదే" అన్నాను.
తన్మయత్వంతో లేచిన కల్పన అడుగులు ఆలయ తలుపులు వైపు మళ్ళాయి.
అంతే పారవశ్యంగా లేచి వెళ్తోంది కల్పన... 
నేను తిరిగి వచ్చి, నా మూల విరాట్ లో కలిసి పోయాను.
తలుపుకు తెరుచుకున్నాయి.
అందరూ కల్పన భారతినే చూస్తున్నారు. ఇప్పుడు కల్పన భారతి అడుగులు ఇది వరకులా కాదు, నెమ్మదిగా పడుతున్నాయి.
అందరూ ఆమె నడుస్తుంటే దారి ఇచ్చి చేతులు ఎత్తి మొక్కు తున్నారు.
అందరికి అర్థమయ్యింది తనకి నా దర్శనం అయ్యిందని, ఇక ఏమీ అడగాల్సిన అవసరం లేదని. 
ఎవ్వరూ ఏమి అడుగుతున్నా తన సమాధానం
ప్రసన్నత, ఆనందస్థితి!
అందరూ "నీవల్ల మేమందరం శివుని పాట విన్నాము, తరించాము." అన్నారు.
ఆమె మొహంలోకి తీక్షణంగా చూసి, దైవదర్శనం పొందిన ఆమె‌ అదృష్టాన్ని గుసగుసలుగా చెప్పుకుంటున్నారు.
ఆలయంలోకి వచ్చిన వారు గర్భగుడి తెరిచి వుండటం చూసి, "హర హర మహాదేవ!" అంటున్నారు.
కల్పన మళ్ళీ తన సంగీత పాఠాలు నేర్పుతూ, తన పారవశ్య స్తితిలో కొనసాగుతూ ఉంది. అలా  కల్పనకు శివదర్శినిగా గౌరవాన్ని ఇచ్చారు. తన జీవితాన్ని శివుడికే అంకితం చేసి అలాగే ఆమె ఎల్లప్పుడూ పారవశ్య స్థితిలో ఉండేది. 
తనకు నా స్పర్శ ద్వారా అలౌకిక ఆనందం నిరంతరం ఉండేటట్లుగా అనుగ్రహించాను.
భక్తులారా !ఏది ఏమైనా, నేను ఎప్పుడూ మీతో వుంటాను.
మరొక భక్తుని కధ నా మదిలో మెదులుతోంది.
మీకు వచ్చేసారి చెబుతాను...
(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages