అదృష్టం - అచ్చంగా తెలుగు
అదృష్టం 
మల్లిఖార్జునరావు 


శ్రీదేవి సాధారణంగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చక్కగా ముస్తాబై కాఫీ రెడీగా పెట్టుకుని ఉండేది. ఆరోజు చెదిరిన జుట్టుతో మలినమైన ముఖంతో సోఫాలో కూర్చుని ఉంది. కేదార్ కి ఆమెని చూస్తే జాలి పొంగుకొచ్చింది. 
"ఏమిటి కన్నా ! ఏమైంది?" అనడిగాడు.
సాధారణం గానే లాలనగా మాట్లాడే భర్త గొంతులోని మార్దవానికి ఆమె గుండెలో ఉబుకుతున్న దుఃఖం పొంగి వచ్చింది
"ఏమైందో చెప్పచ్చుగా ? మీ నాన్నగారు మాట్లాడారా ?"
"ఉహూ!"
"మరి... ?"
మామగారు ఎక్కువగా ఫోను చెయ్యరు. ఆ మాటకొస్తే మాట్లాడడమే తక్కువ. ఆయన చెయ్యదల్చుకున్నది చేసేస్తారు. ఒక్కోసారి చేసింది కూడా ఇంట్లో చెప్పరు. అందుకని శ్రీ దేవి దుఃఖం అందుకు కాదనే సరికి ఆశ్చర్యం వేసింది కేదార్ కి.
“అమ్మే ఫోన్ చేసింది. తమ్ముల్లిద్దరూ కోపంగా ఉన్నారుట. కారణం చెప్పట్లేదుట. అమ్మ అనడం నాన్న గారి వీలునామా గురించి గుర్రుగా వున్నారు అని” అని మళ్ళీ ముక్కు ఎగబీల్చింది శ్రీదేవి.
“అవునూ ! మీ నాన్న గారు వీలునామాలో ఇలా వ్రాసానని మీ నలుగురికీ చెప్పారుగా ? అప్పుడు ఏమీ మాట్లాడని వాళ్ళు ఇప్పుడు కోపగించుకోవడం ఎందుకో ?” అని ఆశ్చర్యం వెలిబుచ్చాడు కేదార్. 
“నాకూ ఆశ్చర్యం గానే ఉంది” అంది మళ్ళీ వెక్కుతూ శ్రీదేవి. 
”పోనీ ఒక్కసారి ఏలూరు వెళ్ళొస్తావా ?” సాలోచనగా అడిగాడు.
ఆ మాట విని కొంచెం తేరుకుని “వెళ్లి రమ్మంటారా? మీరు ఒక్క రెండు రోజులు మానేజ్ చేయగలరా?” ఆశగా అడిగింది.
“ఏమీ పరవాలేదు. ఇదివరకు చేసే వాడిని కాదూ ? నువ్వు వెళ్లిరా !” అని అప్పటికప్పుడు టాక్సీ రాజుకి ఫోన్ చేసి పురమాయించాడు కేదార్. 
“అన్నం కుకర్ లో ఉంది, చారు పెట్టేసాను. బంగాళదుంపలు వేయించేసుకోగలరు కదా ? ఈ పూటకి ఊరగాయ వేసుకోండి. రేపు ఉదయానికి వచ్చేస్తాను. మీరేమీ చేతులు కాల్చుకోకండి. మధ్యాహ్నానికి వంట వేళకి నేనిక్కడ ఉంటాను. శ్రమ అనుకోకండా ఒక అరగంట లంచ్ కి వచ్చేసి వెళ్ళండి. ఎలాగూ ఆఫీస్ కార్ ఉంది కదా!” అని గలగలా పురమాయిస్తున్న శ్రీదేవిని చూసి హమ్మయ్య అని నిట్టూర్చాడు.
“నువ్వేమీ బెంగ పెట్టుకోకు కావాలంటే రేపు కూడా ఉండి ఎల్లుండి రావచ్చు. నేను మా అక్కయ్య వాళ్ల ఇంట్లో భోజనం చేసేస్తానులే !” సముదాయిస్తున్న కేదార్ ని మురిపెంగా చూస్తూ “వొద్దు లెండి మిమ్మల్ని చూడకుండా రెండు రోజులు ఉండలేను” అంది శ్రీదేవి.
        **        **        **        **
భార్య బయల్దేరాక ఫ్లాస్క్ లోని కాఫీ త్రాగుతూ సోఫాలో చేరబడి టీ వీ ఆన్ చేసాడన్న మాటే కానీ కేదార్ కి తన పెళ్లి రోజులు, బావ మరుదులు అత్తా మామలు గుర్తు వచ్చాయి. మామ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఇంజనీర గా రిటైరయ్యే నాలుగు సంవత్సరాల ముందు తన ఒక్కగానొక్క కూతురిని థర్మల్ ప్లాంట్ లో జూనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్న కేదార్ కి ఇచ్చి పెళ్లిచేసారు. అప్పటికి బావ మరుదులు ఇద్దరూ చిన్న పిల్లలు. పెద్ద బావ మరిదికీ శ్రీదేవికీ పదేళ్ళు వార. పెళ్ళైన కొత్తలో వారానికి ఒకసారి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళే కేదార్ బావ మరుదులతో క్యారమ్స్ నుంచి బొంగరాలు తిప్పడం దాకా అన్ని ఆటలూ ఆడాడు. బావ మరుదులు కూడా బావగారు రాగానే చుట్టుకు పోయే వారు. 
నెమ్మదిగా కేదార్ సీనియర్ ఇంజనీర్ తరువాత డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యేసరికి బావ మరుదులు ఇంజనీర్లు అయి పెద్ద వాడు హైదరాబాదులో న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ లో సైంటిస్ట్ గాను, చిన్న వాడు పూనా లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను సెటిలయి పెళ్ళిళ్ళు అయి తండ్రులు కూడా అయ్యారు. పెద్దవారయ్యే కొద్దీ వాళ్ళలో వచ్చే మార్పులని గమనిస్తుండే వాడు కేదార్. ఇద్దరికీ జీవితం మీద అవగాహన, ఆలోచనలు పసిగడుతూనే ఉండేవాడు. 
తన పిల్లలిద్దరూ చదువులు అయిపోయి ఉద్యోగాలకి వెళ్లిపోయినా మేనమామలతో మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. అకస్మాత్తుగా ఈ మలుపు కేదార్ ని ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి. బావ మరుదులు బాగానే సంపాదించుకుంటున్నారు. మామగారు ఉద్యోగంలో నిజాయితీగా పని చేసారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఏలూరు దగ్గర పొలం కాక ఏలూరులో రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. అది కాక తాడేపల్లి గూడెం లో ఒక మండువా ఇల్లు కూడా ఉంది. మగపిల్లలిద్దరికీ హైదరాబాద్ లోనూ, పూనా లోనూ అపార్ట్మెంట్ లు ఏర్పాటు చేసారు. అయినా వీలునామా మీద గుర్రుగా ఉన్నారు అంటే నమ్మ బుద్ధి కాలేదు అతనికి. అయినా శ్రీదేవి వచ్చేదాకా ఒక నిర్ధారణకి రాదల్చుకోలేదు.
        **        **         **        **
మర్నాడు ఉదయం మళ్లీ టాక్సీ లో తిరుగు ప్రయాణం ముందు శ్రీదేవి ఫోన్ చేసి క్లుప్తంగా నేను వచ్చాక సాయంత్రం వివరం గా మాట్లాడుతాను అని ఊరుకుంది. 
        **        **        **        **
సాయంత్రం ఆఫీస్ లో పని లేట్ అయి ఇంటికి భోజనం టైం కి వచ్చిన కేదార్ అలసిపోయిన మొహం చూసి ముందర స్నానం చేసెయ్యండి భోజనం చేసిన తరువాత మాట్లాడుకుందాం అంది శ్రీదేవి. భార్య ముఖ కవళికలని బట్టి పరిస్థితి ఊహించుదామనుకున్న కేదార్ కి నిరాశ తప్పలేదు. 
భోజనాలు అయిపోయాక సర్దుకోవడం అయి న్యూస్ చూస్తున్న భర్త పక్కన కూర్చుని “మీరేమైందని ఊహిస్తున్నారు ?” అని అడిగింది.
ఒక్క నిమిషం ఆలోచనలు కూడగట్టుకుని కేదార్ జవాబిచ్చాడు “వాళ్ళు ఇద్దరూ పరిణితి చెందిన ఆలోచనలు కలిగిన వారు. ఆస్తి కోసం గొడవ పడి మాట్లాడడం లేదంటే నమ్మ బుద్ధి కావడం లేదు. పైగా మీ నాన్న గారు అన్యాయంగా యేమీ పంపకాలు చెయ్య లేదే. నీకు కూడా రెండు ఎకరాలు పసుపు కుంకం క్రింద ఇచ్చారు కదా ? దాని మీద అసంతృప్తితో ఉన్నారా ?” అనడిగాడు.
కళ్ళు వర్షిస్తుండగా “మా తమ్ముళ్ళ గురించి మీకే బాగా అవగాహన ఉంది, మేము వాళ్ళని తప్పుగా అర్ధం చేసుకున్నాం” అని భర్త మెడ చుట్టేసి ఏడవడం మొదలు పెట్టింది. 
“ఏమైంది వివరంగా చెప్పు” అని లాలనగా అడిగాడు కేదార్.
“మీకు తెలుసు కదా ? పెద్ద వాడికి సింహ భాగం రావాలని ఏలూరులో మేడ, పొలంలో మూడు వంతులు పెద్ద తమ్ముడికి ఇచ్చి, గూడెంలో ఇల్లు, మిగిలిన పొలం చిన్న తమ్ముడికి ఇచ్చేసారు. పెద్ద తమ్ముడేమో ‘ఇద్దరికీ న్యాయంగా పంచలేదు, తమ్ముడికి కూడా సగం రావాలి, పైగా మీ ట్రీట్ మెంట్ లకి, అమ్మ ఆపరేషన్లకీ వాడే పూర్తిగా ఖర్చు పెడుతున్నాడు, వాడికి వాస్తవంగా ఎక్కువ రావాలి, పైగా గూడెం లో పాత ఇల్లు వాడి పేర పెట్టడమేమిటి? ఏలూరులో మేడ వాడికి ఇచ్చెయ్యండి’ అన్నాడు . నేను నిన్న రాత్రి ఇద్దరితోనూ మాట్లాడాను” అంది.  
“మరి చిన్న వాడేమన్నాడు ?” అన్న భర్త వైపు మళ్ళీ నిండిన కళ్ళతో చూస్తూ “ ’మేమిద్దరమూ కాలేజీ, ఇంజనీరింగ్ అంతా విజయవాడలో బావగారి దగ్గరే జరిగాయి, అక్కకి రెండు ఎకరాలా ఇచ్చేది ?’ అని ఫైరయ్యాడండీ” అంది. “నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బాగానే సంపాదించుకుంటున్నాను. అన్నయ్యది గవర్నమెంట్ ఉద్యోగం. అన్నయ్యకి ఇంకా ఎక్కువ ఇమ్మంటున్నాడు.” 
“మరి మీ మరదళ్ళు ?” అని ప్రశ్నార్ధకంగా చూస్తున్న భర్తతో “ వాళ్ళు నా మరదళ్ళు కాదండీ ! నాకు చెల్లెళ్ళు. ఆయన ఏంచెప్తే మాకు అదే సమ్మతం అని ఇద్దరూ అన్నారండీ ! మా అమ్మా నాన్నలు చాలా అదృష్టవంతులండీ ! బంగారం లాంటి కొడుకులు, కోడళ్ళు దొరికారు” అంటున్న భార్యని చిరునవ్వుతో చూస్తూ “మరి అల్లుడో ?” అన్నాడతడు . “మీకింత వరకూ చెప్పనేలేదు. మిమ్మల్ని గురించి మా అమ్మ ఏమందో తెలుసా ? నాకు కేదార్ అల్లుడు కాదు, పెద్ద కొడుకు. మీరు ‘మీ అమ్మాయికి ఏమీ ఆస్తి ఇవ్వక పోయినా మాకు చింత లేద’న్నారు గుర్తుందా ? మా అమ్మ ప్రతి క్షణం అదే తలుచుకుంటుందండీ, మీరు సిసలైన వజ్రం నాకు అని గుండెల మీద వాలిపోయిన శ్రీదేవిని చూసి సంతృప్తిగా నిట్టూర్చాడు కేదార్.
***

No comments:

Post a Comment

Pages