కార్తీక దీపాలు - అచ్చంగా తెలుగు
కార్తీక దీపాలు
సత్య శేష సాయి శ్రీనివాస్ వేమూరి


శివా అనే రెండక్షరాలు చాలవా? బతుకు భవసాగరం ఈదడానికి. శివ తత్వం అర్థం అయితే చాలదా? బతుకులో మర్మం తేటతెల్లం అవడానికి.
అల్పసంతోషం, అవ్యాజమైన కరుణ, నిరాడంబరత, నిర్మలమైన మనసు ఇవే కదా స్వామి చిదానంద రూపం తెలియజేసేది. నెత్తి మీద గంగ, వామ భాగంలో అన్నపూర్ణ, ఒడిలో సంతానం, ఎదురుగా రెక్కల కష్టం తెలిసిన నంది, ఫాలభాగంలో జ్ఞానం, వంటిని కప్పే కృత్తివాసం, ప్రకృతే ఇల్లు, ఇదే స్వామి విలాసం. 
ఇవన్నీ,  బ్రతుక్కు కావలసిన అవసరాలు ఎలా ఉండాలి? ఎంత నిరాడంబరంగాబతుకు  ఉండాలి? అని చెబుతూ ఉంటాయి. 
జీవితం ఆనందంగా ఉండాలంటే ఏది ఎంత వరకూ ఉండాలి?  ఆప్తమిత్రులతో ఎలా మెలగాలి? అనేదానిపై ఉంటుంది.  ఆ విశేషం శివయ్య రూపంలో మనకు ద్యోతకం అవుతూ ఉంటుంది. 
కడుపు చూసి అన్నం పెట్టే భార్య, విరూపంతో ఉన్నా బుద్ధిమంతులైన సంతతి, నిర్మలమైన మనసు, శివకుటుంబం లో ఉంటాయి. అవే ఆయనకిష్టం. వారినే తన ఒడి చేర్చుకుంటాడు.
తోడు నిలిచే సహచరి కాళీ రూపం,ఆయనది సుందర రూపం.  కానీ ఎంతటి ప్రేమో స్వామికి తన ఇల్లాలి పైన.  అన్నింటిలోనూ ఆవిడే ఆయనకు సగభాగం. స్త్రీ సమానత్వం ప్రకటించే అద్భుతమైన రూపం శివయ్య.‌
ఏది పెట్టినా నైవేద్యం అనే భావించి కన్నప్పను చేరదీశాడు. నమ్మి ఆరాధించిన బాల భక్తురాలు గొడగూచిని అక్కున చేర్చుకున్నాడు.  జాత్యాభి జాత్యాన్ని ప్రదర్శించిన  సోంత సోదరి గౌడీమాత(గవ్వలమ్మ)ను దూరం ఉంచాడు. అహంకారంతో దరిచేరిన అంపశరుని అణిచి వేశాడు. భక్తితో దరిచేరిన రాక్షసులను ఆదరించాడు. ఆయన చూసింది రాక్షస జన్మను కాదు. దరిచేరిన వేళ వారి హృదయంలో కనిపించిన విశ్వాసాన్ని, అకుంఠిత దీక్షని. పాత్రత గుణానికే కానీ జన్మకు కాదని ఆయన తత్వం చెబుతోంది.
_________
కౌడీమాత (గవ్వలమ్మ)
కాశీ విశ్వనాథుని సోదరి కౌడి. ఆమెకే గౌడీ మాత, గవ్వలమ్మ అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది.  
కాశీలో ఈ గుడి చిరునామా :
Sankat Mochan Rd, Durgakund,Opposite Karpatri, Durgakund, Jawahar Nagar Colony, Bhelupur, Varanasi, Uttar Pradesh 221010

గౌడీమాత కధ
సామాన్య భక్తులు, మడి, దడి ఆచారం పాటించక ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా స్వామిని స్పృశించి, అభిషేకాలు చేస్తూ పరవశించి పోతూ, మోక్షం పొందటం చూసి, చిరాకు పడింది గౌడమ్మ. ఆలయ ప్రవేశానికి అర్హత లేని వారిని లోపలికి రానిచ్చి గర్భ గుడిలో స్వామి పవిత్ర మూర్తిని ముట్టుకోవటం భరించలేక చికాకు పడింది. 
ఇది స్వామికి తెలిసి ఆగ్రహం చెందాడు. తనను చేరేవారి మనసులో భక్తి ప్రధానం కానీ వేరేవీ ప్రధానం కాదని చెప్పారు. 
సోదరికి కాశీ బహిష్కరణ విధించాడు. ఆవిడకు కనువిప్పు కలిగి శిక్ష వేయొద్దని ప్రాధేయపడింది. శాపం తిరుగులేనిదన్నాడు. 
దాంతో ఆవిడ ఖిన్నురాలై, ఏ జనాన్ని తాను తూలనాడిందో అక్కడే ఉండి, వారి భక్తిలో తాను చేసిన పొరపాటు కడిగేసుకుంటానని చెప్పింది. స్వామి ప్రసన్నుడై ఎవరు కాశీ యాత్ర చేసి, నీ దర్శనం చేసుకుంటారో వారికి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అనీ, ఎవరు నీ చరిత్ర తెలుసుకుని భగవంతునికి కావలసింది భక్తే కానీ, వేరేదీ కాదని గ్రహించి  నీకు గవ్వలు సమర్పిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వరం ఇచ్చాడు. 
దానితో ఆవిడ,  ఏ సామాన్య జన బాహుళ్యాన్ని  నిరశించిందో, ఏ జనులను అంత్యజులని సాధించిందో,  ఆ జనుల మధ్యలోనే ఉండి వారి భక్తితో పునీత మయ్యి, తన దరిచేరే వారికి సకల సంపదలు ప్రసాదిస్తోంది. 
వేదవిద్యకు మూలమయిన వ్యాసునికీ కాశీ ప్రవేశం లేదు. కారణం గౌరీ శాపం.
అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శంకరులకు కూడా స్వామి చండాలుని రూపంలోనే దర్శనమిచ్చి అందరిలో ఉండేది తానని తెలియజేశారు. 
శివయ్యకు కావలసింది భక్తే. ఇంకేం కాదు. అందరిలోనూ ఆయన్ని దర్శించిన వారికే ముక్తి. కాశీ దర్శనం గొప్ప గొప్ప మహర్షులకే అలభ్యం. అటువంటి కాశీ మనందరి ప్రవేశానికీ అర్హం. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? 
ఇదీ కౌడీమాత, గౌడీమాత, గవ్వలమ్మ చరిత్ర.
 ***
శివ తత్వం తెలియాలంటే ఇంకో ఉదాహరణ చెప్పొచ్చు.
సూర్య, చంద్రులు కన్నులైన స్వామికి, సూర్యనందనుడు ఆప్తుడై తోచాడు. ఈశ్వరుడు గొప్పా, శనీశ్వరుడు గొప్పా అనే పోటీ వచ్చినపుడు, దోబూచులాడే తండ్రిలా చెట్టు తొర్రలో దూరాడు. పసి బిడ్డ మనసుకు ఆనందం కలిగేలా శనీశ్వరుని సంతృప్తి పరిచాడు. యోగవిద్యకు అధిష్టాన దేవతను చేసి, అందరిచేత దూరంగా ఉంచబడే శనిదేవునికి ఒక అస్థిత్వం కల్పించాడు. అందుకే ఏల్నాటి శని పట్టిన వారు, శివయ్యకు అభిషేకం చేస్తే శని సంతోష పడతాడు. అష్టకష్టాలు రాకుండా కాపాడుతూనే బతుకు అర్థాన్ని వివరించేలా రాటు తేలేలా చేస్తాడు.
దగాపడ్డ కష్టజీవులే శివయ్య చుట్టూ ఉంటారు. ఆయన సామ్రాజ్యంలో సేద తీరుతూ ఉంటారు. ఆయన ఉన్న చోట ప్రశాంతత.‌ఆయన ఎక్కడ ఉంటే అక్కడే పవిత్రత. అది ఆలయమైనా, స్మశానమైనా సరే. కష్టజీవుల దైవం శివయ్య. దగాపడిన వారి పక్షపాతం శివయ్య. 
ఆయన సన్నిధి ఆర్తులకు శరణు. ఆయన సాహచర్యం పీడుతులకు స్వాంతన. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యం.‌ చెంబెడు నీళ్ళకే తబ్బిబ్బయ్యే శివయ్యకు నారాయణుడంటే వల్లమాలిన ప్రేమ. బావమరిది కదా అందుకే నల్లనయ్య అంటే సుందరుడికి అంత ఇష్టం. 
కార్తీకం నారాయణునికి, మాఘం శివుడికి ప్రీతిపాత్రం. అందుకే కార్తీక పురాణం విష్ణువుని, మాఘపురాణం శివుడ్ని కీర్తిస్తాయి. కార్తీకంలో శివాభిషేకం నారాయణునికీ, మాఘంలో నారాయణారాధన శివునికి ఇష్టం. పరస్పర గౌరవాలు శివకేశవులు ప్రకటించే పుణ్యమాసాలివి. 
శివారాధన అంటే కష్టాన్ని నమ్ముకోవడం, ఆకలిగొన్న వాడికి పట్టెడన్నం పెట్టడం. శరణు కోరిన దీనులకు చేతనైనంత సహాయం చేయటం. ఆభిజాత్యాలు, అహంకారం వీడటం. పెద్దలను గౌరవించడం, గుణానికి పెద్దపీట వేయటం. అలా చేయటం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. ఆనందమైన మనసే శుభాలను తెస్తుంది. అదే శివం అవుతుంది.‌
ఈ కార్తీకం మీ జీవన నదిలో  మనసు అరటిదొప్పలపై, విజ్ఞానంతో కూడిన ఆనందం  కార్తీక దీపాల వెలిగించి,  శోభలీనాలని మనః స్ఫూర్తిగా ఆకాంక్షించండి.
 ***

No comments:

Post a Comment

Pages