జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 24 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 24

Share This
జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 24
చెన్నూరి సుదర్శన్ 

(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  
 “ఏకాంబరంకు మా ఇంటికెదుర్గానే కంగన్‍హాల్ ఉంది. కాలేజీ తరువాత నేరుగా షాపుకే వెళ్తాడు. అయితే ఆరాత్రి ఎనిమిది గంటలకు సునీత మొగడు నలుగురు రౌడీలతో వ్యాన్లో వచ్చాడు. పెద్ద గొడవ జరిగింది. బూతు మాటలు తిడుతూ ఏకాంబరం తల బద్దలు కొట్టారు. షాపు ధ్వంసం చేసారు. పోతూ పోతూ..  కాలు విరిచి వెళ్ళారు. అందుకే వారం రోజులు సెలవు పెట్టింది..” చిచ్చుబుడ్డి చల్లారినట్లుగా ఆమె కడుపు ఉబ్బడం తగ్గింది.. ప్రశాంతంగా తన సీట్లోకి వెళ్ళబోతూ “సార్.. నేను చెప్పినట్లు ఎవరితో అనకండి.. గాలికి పోయే కంప కాళ్ళకు  తగిలించుకున్నట్లు.. మనకెందుకు లెండి” అంటూ కాలేజీబెల్ మ్రోగుతుంటే క్లాసుకు వెళ్లి పోయింది.

నాకూ క్లాసుందని లేచాను.
***

ఉస్మానియా యూనివర్సిటీలో పది రోజుల పాటు కంప్యూటర్  ట్రైనింగ్ క్లాసులంటూ నాకు ఉత్తర్వులు వచ్చాయి.

            స్టేట్ నుండి దాదాపు యాభై మంది మ్యాథ్స్, ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్లకు కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నేర్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ఫలితమది. అప్పటికే కాలేజీలకు కొత్తగా కంప్యూటర్లు వచ్చాయి గాని తెరిచే నాథుడే లేడు.
            నేను ఎంతో ఉత్సాహంగా యూనివర్సిటీలోని కేంద్రీయ శిక్షణా కార్యాలయంలో అడుగు పెట్టాను. మెయిన్‍రోడ్డు నుండి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉందాశిక్షణా కేంద్రం.
నా రిలీవింగ్, జాయినింగ్ రిపోర్ట్స్  సబ్మిట్ చేసాను. ఇంకా చాలా మంది రావాల్సి ఉంది. మొదటి రోజు కదా.. మధాహ్నం లంచ్ తరువాత క్లాసులన్నారు.
            నెమ్మదిగా క్యాంటీన్ వైపు కదిలాను.
            సెల్ఫ్ సర్వీసు.. టోకెన్ తీసుకొని పెరుగన్నం తిన్నాను.
            క్యాంటీన్లోని జనం ఎక్కువగా ట్రైనింగ్‍కు వచ్చిన వారే..  తెలిసినవారేవరైనా  అగుపిస్తారా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాను...
ఆశ్చర్యం.. కలా..? నిజమా..? అని తేరిపారా చూసాను.  నిజమే.. అతడే.. చాలా రోజులయ్యింది కదా చూసి.. మనిషిలో కాస్తా మార్పు వచ్చింది. కాని విజయకుమార్‍ను గుర్తించక పోవడమా..? నా టీచింగ్‍కు పునాదులేసిన మహాను భావుడు.. ఎంత అదృష్టం..!
ఇంటర్మీడియట్ బోర్డు పుణ్యమా అని విజయకుమార్‍ను కలుసుకునే భాగ్యం కలిగింది. అప్పట్లో ఫోన్లు వాడకం తక్కువ. సెల్ ఫోన్లు అసలే లేవు. ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. ఆ తరువాత నేను రెండు మూడు సార్లు ఉత్తరాలు రాస్తే జవాబు రాలేదు.
ఇప్పుడు ఇలా ప్రత్యక్షమయ్యే సరికి  పరుగు తీసాను.
            నన్ను చూడగానే విజయకుమార్ ఎక్కడో చూసానే అన్నట్లుగా చూస్తున్నాడు.
            “నమస్తే మాష్టారూ..” అన్న నాపలుకరింపు అతడిని తట్టి లేపింది. నాస్టైల్ అలాంటిది మరి. వెంటనే “సూర్యప్రకాష్..!” అంటూ ఆశ్చర్య పోతూ లేచి నన్ను హత్తుకున్నాడు. నా కళ్ళు ఆనంద భాష్పాలతో నిండి పోయాయి. 
“మాష్టారూ.. ఎలా ఉన్నారు?” అంటూ ఉద్వేగభరితుడయ్యాడు.
            నాకూ నోట మాట రావడం లేదు. హృదయమంతా ఆనందంతో ఉప్పొంగిపోయింది.
            “మాష్టారూ.. మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఐయాం డూయింగ్ వెల్..” అంటుంటే మాటలు తడబడసాగాయి.
చిరునవ్వులు చిందిస్తూ ఇరువురం నింపాదిగా కూర్చున్నాం.
            “ఇప్పుడు ఎక్కడున్నారు”
చెప్పాను.
            “మీరు డిగ్రీ కాలేజీ కదా.. మాష్టారూ.. ట్రైనింగ్ ?” అంటూ సందిగ్ధంలో పడ్డాను.
            నేను ఈ ట్రైనింగ్ సెంటర్లో ఫ్యాకల్టీని.
            ఎగిరి గంతులేసినంత పని చేసాను. ద గ్రేట్ విజయకుమార్ పాఠాలు మళ్ళీ వినబోతున్నాను. అదీ కంప్యూటర్ కోర్సు.. మరొక సారి అభివాదం చేసాను. 
***

No comments:

Post a Comment

Pages