చాలా వాయిద్యాలకు ఇదే ఆఖరి తరం... - అచ్చంగా తెలుగు

చాలా వాయిద్యాలకు ఇదే ఆఖరి తరం...

Share This
చాలా వాయిద్యాలకు ఇదే ఆఖరి తరం...

నయీకషిశ్జయధీర్ తిరుమలరావు ఎన్నో ఏళ్లుగా జానపద పరిశోధనచేస్తున్నారు. ఆయన పరిశోధన బృందంలో చురుకుగా ఉంటూ, ఈ వాయిద్యాల సేకరణ, పరిరక్షణలో ఎంతో తోడ్పాటును అందించారు ఆచార్య గూడూరు మనోజ. ఆదిధ్వని ప్రదర్శన పట్టాలెక్కడంలో ఎంతో కృషి చేసిన ఆమె క్షేత్ర స్థాయి నుంచి, నేటి ప్రదర్శన ఏర్పాటు, దీని లక్ష్యాలు, ప్రజల, ప్రభుత్వ భాద్యత గురించి అనేక విషయాలను సాక్షితో పంచుకున్నారు. 

(ఆచార్య గూడూరు మనోజ, కన్వీనర్, తెలంగాణ ఆది ధ్వని అధ్యయన వేదిక)


వాయిద్య సేకరణ అంకురార్పణ ఎలా... 
ప్రొఫెసర్‌ జయధీర్ తిరుమల రావు గారు గిరిజనæ సాహిత్యాణ్వేషణలో భాగంగా  గోండు భాష, సమ్మక్క సారక్క, జాంబ పురాణం ఇలా జానవద సాహిత్యాన్ని ఎత్తిరాసే ప్రక్రియలో మేం అంతా పనిచేస్తున్నాం. అయితే ఈ కథలు అన్నీ సంగీతంతో ముడి వేసుకుని ఉన్నాయి. సంగీతం ఆయా వాయిద్యాలతో.  ఈ కథలు ప్రక్రియల్లో భాగమైన సంగీతం జనసుముదాయంలోకి రాలేదనే అవగాహన ఏర్పడింది.  అంతే కాదు భాష, సాహిత్యం వెనక ఉన్న సంగీతం పోతోంది. ఇవి కేవలం వాళ్ల వాయిద్యాలు మాత్రమే. ఈ వాయిద్యాలు దుకాణాల్లో దొరకవు. వాళ్లే చేసుకుంటారు.  వాటిని ఎలా కాపాడాలి అనే ప్రశ్నకి సమాధానంగా మూలధ్వని కార్యక్రమం రూపొందించాం. పరిచయం ఉన్న 200 వందల కళాకారులతో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది మార్చి17, 18 తేదీల్లో యూనివర్సిటీలో ఒక సెమినార్‌ చేశాం. ఈ సంగీత గోష్టి  అందరికీ నచ్చింది. చాలా మంది తమకు తోచిన సలహాలు, అభిప్రాయాలు తెలపటం జరిగింది. ప్రజా సంగీతాన్ని యూనివర్సిటీలకు మాత్రమే పరిమితం చెయ్యటం ఏమిటని అన్నారు. అందుకే ఇలా పబ్లిక్‌ ప్రదర్శన ఏర్పాటు చేశాం. జనబాహుళ్యంలోకి ఈ అంతరించిపోతున్న సంగీతం, సంగీత వాయిద్యాలు, కళాకారులు వస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశ్యంతో వారు సూచించారు.ఇది తెలంగాణ అస్తిత్వం...

ఇది కేవలం కళ, సంగీతం కాదు. తెలంగాణ అస్తిత్వం ఇవి. ఢిల్లీ నుంచి ఈ మధ్య సుప్రీం కోర్టు జడ్జి ఒకరు వీటిని చూడడానికి వచ్చారు. ఢిల్లీలో తెలంగాణ అస్తిత్వ దాఖలాలు కూడా ఏర్పడ లేదని అన్నారు. ఆ అస్తిత్వమే ఆదిధ్వని ప్రదర్శన. వీటిని నలుదిశలా వ్యాప్తి చెయ్యటం ఇప్పుడు మన బాధ్యత. 


చివరి తరం.. 

రుంజ రామ్మూర్తి, బుర్రవీణ కొండప్ప, 12 మెట్ల కిన్నెర కుమ్రా లింగో వీటిని ఇప్పటి దాకా నిలబెట్టడానికి వారి రక్తమాంసాలు ధార పోశారు. కేవలం సంగీతం మీద వారి కున్న నిష్ఠ వల్ల. వీళ్ల తర్వాత ఎవ్వరూ లేరు. 
ఇందులో కొందరి కళాకారులను ఇలాంటి ప్రదర్శనకి రమ్మని ఆహ్వానిస్తున్నప్పుడు వారికి చాలా కోపంగా ఉంటుంది, ఏం ఉపయోగం అని తిరిగి ప్రశ్నిస్తారు. మా బతుకు ఇంతే. మా సంగీతం పోతే పోతది అనే నిర్వేదం ఏర్పడింది. వారి సంగీతానికి భవిష్యత్తు లేదని నిర్వేదం ఏర్పడినా, సంగీతం పట్ల వారికున్న మమకారం, వారి జీవితాల్లో సంగీతాన్ని ముడివేసుకున్న తీరు వాళ్లు వదులుకోలేరు. పొద్దంతా కూలి పని చేసుకుంటూ ఇంకా ఈ సంగీతాన్ని కాపాడుకుంటున్నారు. ఈ సంగీతం నేర్చుకుంటే వాళ్లకి పొట్ట గడవదు కాబట్టి వీరి తర్వాత తరం వాళ్లు ఆటోలు నడుపుకుంటున్నారు, ఏదో పథకాల్లో పని చేసుకుంటున్నారు. 
మా పరిశోధనలో మాకు స్పష్టంగా తెలిసింది ఒక్కటే, ఇది కచ్చితంగా ఈ గిరిజన, జానపదా సంగీతానికి సంబంధించి చివరి తరం.. 


ఈ ప్రదర్శన ఒక ప్రయత్నం...

ఈ వాయిద్యాలు కేవలం ధ్వని మాత్రమే కాదు, మన ఆత్మను స్పృశిస్తాయి. రుంజ రాంమూర్తిని అడిగితే, ఎన్ని నరాలు, ఎన్ని ఎముకలు, ఎంత కీళ్లు, మాంసం కరిగితే ఆ శబ్దం పుడుతుందో చెబుతాడు. 
సమాజంలో ఒక వర్గం ఈ సంగీతం కోసం ఎందుకు ఇంత శ్రమ పడాలి? సమాజం తిరిగి వారికి ఏం ఇస్తుంది?  ఈ ప్రశ్నలు వారి పరిస్థితిని అందరి ముందు ఉంచే ప్రయత్నం. మన అస్తిత్వమైన ఆదిమ సంగీతానికి దాపురించిన పరిస్థితిని సభ్యసమాజంతో పంచుకునే ప్రయత్నం..


సామూహిక అవగాహన...

ఇవి అంతరించిపోతున్నాయని, ఈ విషయాలన్నీ తెలసనే వాళ్లే తెలంగాణలో చాలా మంది ఉన్నారు.  మరి పట్టుకోవచ్చు కదా, కాపాడవచ్చు కదా అంటాను నేను. ఇప్పుడు గిరిజన, జానపద సాహిత్యం ఉంది వాటిని వారి భాష నుంచి తెలుగులోకి ఎత్తి రాయవచ్చు. రాస్తున్న వారికి సహకారం అందించవచ్చు. ఏమైనా ఈ సంగీతం పట్ల, వాయిద్యాల పట్ల సామూహిక అవగాహన, ప్రోత్సాహం అవసరం. దాని వల్లే ఇవి బతుకుతాయి. ఇవి బతకకుండా భారతీయ సంగీతం సమగ్రం కాదు. అసంపూర్ణ సంగీతాన్ని పెద్దది, గొప్పది అని తృప్తి పడితే అది సంపూర్ణ సంగీతం ఎప్పటికి కాదు. సంగీతంలో అన్ని రకాల సంగీతాలు ముఖ్యమైనవే, గొప్పవే.


 కదలిక కోసం చిన్న చిన్న అడుగులు

– వీటిని వెలికి తీశాం. వీలైనంత వరకూ ఆయా కళాకారులతో వాయిద్యాలను తయారు చేయించాం. ఇక వీటిని పరిరక్షించాలి. మ్యూజియం ఏర్పాటు చెయ్యాలని గట్టిగా కోరుకుంటున్నాం. 
– ఉన్న పరిస్థితి కళాకారులకు వివరించి  కులాలు, కుటుంబాల పట్టింపులు లేకుండా ఆసక్తి ఉన్న వాళ్లకి నేర్పించడానికి చివరి తరం వాయిద్య కళాకారులు సిద్ధ పడేలా చేశాం. రుంజ, బుర్రవీణ, మెట్ల కిన్నెర లాంటి వాయిద్యాలు బతికితే చాలు అంటున్నారు. 
–  బుర్రవీణ, మెట్లవీణ, కిక్కిరి లాంటి ఒక్క వాయిద్యం మాత్రమే ఉన్న  వాయిద్యాలకు రెండో వాయిద్యాన్ని తయారు చేయించగలిగాం. నేర్చుకునే, వాయించే వాళ్లు దొరకకపోతారా అనే ఆశతో ఉన్నాం, 
– ఆయా జిల్లాల కలెక్టర్లను రిక్వెస్ట్‌ చేసి స్కూల్స్‌లో నేర్పించే విధంగా మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చేశాం.
***

No comments:

Post a Comment

Pages