సూర్యాస్తమయం - అచ్చంగా తెలుగు
సూర్యాస్తమయం
మొక్కరాల అలమేలుమంగ


టి.వి.లో బ్రేకింగ్ న్యూస్.... బ్రేకింగ్ న్యూస్.....
"ప్రేమించలేదని కోపంతో యువతిపై యాసిడ్. దాడి చేసిన యువకుడు"
యువతి స్ధానిక మహిళా కలాశాలకు చెందిన మానస గాను,యువకుడు స్ధానిక సాఫ్ట్వేర్ ఉద్యోగి సూర్య గాను గుర్తింపు. మిగిలిన వివరాలకోసం మా ప్రతినిధి రామ్ ని అడిగి తెలుసుకుందాం.
హలో, రామ్ చెప్పండి అసలు ఏం జరిగింది?యువకుడు యువతిపై యాసిడ్ దాడి చెయ్యడానికి దారితీసిన కారణాలేంటి వివరాలు చెప్పగలరా?టి. వి. స్టూడియోనించి న్యూస్ రీడర్ లత ప్రశ్న.
లతా! ఇప్పుడే కొన్ని విషయాలు తెలిసాయి.యువకుడు స్ధానిక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సూర్యగా గుర్తించారు.యువతి మానస; అతని స్నేహితుని చెల్లెలుగా తెలుస్తోంది.గత కొద్దికాలంగా వారు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. గత కొద్దిరోజులుగా మానస సూర్య పట్ల విముఖత,నిరాశక్తత చూపటం, అతనిని పెళ్ళి చేసుకోవడానికి నిరాకరించడం, సూర్యని మనస్తాపానికి గురిచేసాయి.ఆకారణంగానే సూర్య ఈ దుర్మార్గానికి పాలు పడినట్టుగా తెలుస్తోంది లతా! 
రామ్! సూర్య తల్లితండ్రులు దీని గురించి ఏమంటున్నారు?
లతా!సూర్య తల్లిదండ్రులు ఒకవిధమైన షాక్ లో ఉన్నారు ప్రస్తుతం ఏం మాట్లాడే స్ధితిలో లేరు.కేసు దర్యాప్తు జరుగుతోంది మిగిలిన వివరాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది లతా,! సంఘటనాస్ధలం నుండి దిసీజ్ రామ్ ఫ్రమ్ XYZటి.వి.
ఓవర్ టు స్టూడియో.
ఉదయం నుంచి ఆ టి.వి లో ఈ బ్రేకింగ్ న్యూస్ ప్రతి పది నిముషాలకీ వేస్తూనే ఉన్నారు.
న్యూస్. చూస్తున్న ప్రేక్షకుల స్పందన ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా......
"ఇద్దరూ చక్కగా ఉన్నారు.అదేం పోయేకాలం యాసిడ్ లు పోసుకోవడాలు,చంపుకోవడాలు"
"ఆ..........ఏదో చెడి ఉంటుంది లేకపోతే యాసిడ్ పోసుకోవడం వరకూ ఎందుకు వస్తారు?"
"ఈ కాలం కుర్రకారు అన్నింటికీ బరితెగించేసారు ఓమంచీ లేదు, చెడూ లేదు.""
"సుబ్బరంగా తల్లీ తండ్రీ సంపాదించి పోస్తూంటే తిన్నదరక్క"
"ఇంట్లో తల్లిదండ్రుల ముందు బుద్ధిమంతుల్లా నాటకాలు,బయట వెర్రిమొర్రి వేషాలు"
"ఈ టీ.వీ. వాళ్ళున్నారే ఇలాంటి న్యూస్ లు పదే పదే వెయ్యడం ఎందుకో యువతకి నూరి పొయ్యడానికా, హెచ్చరించడానికా? బుర్ర వేడెక్కిపోతోంది.దీనికి తోడు ఇతర టీ.వీ. చానళ్ళతో పోల్చుకుంటూ తామే ఈ న్యూస్ మొదట ప్రేక్షకులకి అందించామన్న బిల్డప్ ఒకటి. దిక్కుమాలిన చానళ్ళు,దిక్కుమాలిన మనుషులు వాళ్ళకి మతిలేక మనకి గతిలేక, ఒక్క పనికొచ్చే విషయం ఉండదు" ఓ తాతగారి ఆవేదన.
**** 
వసుధ, నారాయణమూర్తి ల పెళ్ళై ఐదేళ్ళయినా ఇంకా సంతానం కలగలేదు.
అత్తగారు వసుధని సూటీపోటీ మాటలనకపోయినా, ఆవిడకి పిల్లలు పుడతారో లేదో అని చిన్న బెంగ ఉండేది. తను దేవుళ్ళకి మొక్కుకోవడమే కాదు,వసుథ చేత నోములూ వ్రతాలు, పూజలు చేయించేది. వంశోద్ధారకుడు పుట్టి ఇంటిపేరు నిలపాలని.
దేవుళ్ళ ప్రార్ధనలతో సరిపోదని, మానవ ప్రయత్నం కూడా ఉండాలని పక్కింటి పార్వతొదిన అనడంతో వసుధ అత్తగారు , డాక్టర్ల సలహా సంప్రదింపులు కూడా మొదలు పెట్టించింది కొడుకూ కోడలు చేత.
రోజులు, వారాలు నెలలు గడుస్తున్నాయి.
దేవుడిచ్చిన వరమో, డాక్టర్ల వైద్య సహాయమో, వసుధ కడుపు పండింది.
వసుధని అత్తగారు ఎంతో అపురూపంగా చూసుకుంది నెలలునిండి ప్రసవం అయ్యేవరకూ..
ఓ ఆదివారం సూర్యోదయ సమయాన వసుధకి పండంటి మగబిడ్డ పుట్టాడు.
ఆదివారం పుట్టాడని,ఇంటికి వెలుగు తెచ్చాడని మురిపెంగా చంటాడికి"సూర్యప్రకాశం"అని పేరు పెట్టుకున్నారు.
మధ్యతరగతి కుటుంబం అయినా పిల్లాడి అచ్చట్లు ముచ్చట్లు తీర్చడంలో ఎలాంటి లోటు చెయ్యలేదు
చదువు సంధ్యలు బాగా రావాలని ఐదో ఏట. "బాసర"లో అక్షరాభ్యాసం చేసారు. పదో ఏట బామ్మగారి కోరిక మేర ఉపనయనంచేసారు.
ప్రతి సంవత్సరం వేసవి సెలవులు వృధా కాకుండా ఆటలు, పెయింటింగ్, గిటార్ మొదలయిన శిక్షణా తరగతుల్లో ఆయా విద్యల్లో తర్ఫీదు ఇప్పించారు.
సూర్య చాలా తెలివైనవాడు. ఏదయినా ఇట్టే పట్టేసేవాడు. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు.
తెలిసినవాళ్ళందరూ కుర్రాడు చురుకైనవాడు, బుద్ధిమంతుడు అనే అనేవారు.
సూర్య మీద తండ్రి ప్రభావం ఎక్కువ.ఆయన ముక్కు సూటితనం, నిజాయితీ,మోసం,దగాల వంటివి ఖండించడం ,సూర్యకి వచ్చిన వారసత్వ లక్షణాలు.
ఇరవైమూడేళ్ళ వయసుకే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్ధిరపడ్ఠాడు.
ఎలా ఎప్పుడు అంకురార్పణ జరిగిందో తెలియదు స్నేహితుడి చెల్లెలు మానసను చూసిన క్షణం నుంచే ప్రేమలో పడ్డాడు.
మానస చాలా అందంగా, చురుగ్గా,. మోడరన్ గా,ఈనాటి అమ్మాయిల పోకడలతో ఇట్టే ఆకట్టుకుంటుంది.
సూర్య మానసను ప్రేమిస్తున్న విషయం తల్లితండ్రుల కు చెప్పాడు.
ఈకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోనివాళ్ళెవరు
కాలంతోపాటు మనం మారాలి అనుకున్నారు సూర్య తల్లిదండ్రులు.........పైగా ఒక్కగానొక్క కొడుకు ఈ పెళ్ళిపేరుతో ఒదులుకోలేరుకదా!
గత కొద్దిరోజులుగా సూర్య ప్రవర్తన లో కనిపిస్తున్న మార్పు వారు గమనించకపోలేదు.విసుగ్గా, చిరాగ్గా,కోపంగా ఉంటున్నాడు.తరచి అడిగినా సరైన సమాధానం లేదు.
ఒకరోజు సూర్య' చాలా బాథపడుతూ అమ్మా!మానస నన్ను మోసం చేసిందమ్మా, ఇన్నాళ్లు నాతో స్నేహంగా, ప్రేమగా ఉన్న తను నన్ను దూరం పెడుతోంది.నన్ను పట్టించుకోవట్లేదు మనం పెళ్ళి చేసుకోవడంకంటె స్నేహితులు గానే ఉండడం మంచిది అంటోంది.ఇన్నాళ్ళూలేనిది.మానాన్న వేరే సమంధం చూసారు, ఆయన్ని ఎదిరించలేను ఆంటోంది.ఇన్నాళ్ళూ నాకు కల్పించిన ఆశల మాట ఏంటి అంటే సమాధానంలేదు.ఇది మోసం కాదా అమ్మా! అంటూ తల్లి ఒడిలో వాలిపోయాడు కన్నీరు పెడుతూ.
తల్లి మనసు తల్లడిల్లింది. ఇదేవిటి ఇలా జరిగింది అని బాధ పడింది పిల్లాడి మనసుకు తగిలిన గాయానికి. అయినా ధైర్యం తెచ్చుకుని కొడుకుని ఓదార్చింది.ధైర్యం చెప్పింది.
సరే...... మెల్లగా వాడే సర్దుకుంటాడులే అనుకుంది.
ఈరోజు తొందరపాటు తో సూర్య చేసిన ఈ దుర్మార్గపు చర్యతో నారాయణమూర్తి, వసుధ ఎంతో కృంగిపోయారు.ఇద్దరూ ఎప్పుడూ ఎవరిచేత మాట పడింది లేదు,. వేలెత్తి చూపించుకున్నది లేదు.ఉన్నదాంట్లో కొడుకుని మంచి మార్గం లోనే పెంచారు.
సూర్య చేసిన ఈ పనితో ఇద్దరికీ తలకొట్టేసినట్టు ఉంది. అవమానంతో, సిగ్గు తో చితికిపోతున్నారు.
లేకలేక పుట్టిన కొడుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచారు.విద్యాబుద్థులు నేర్పించి,కొడుకు సమాజంలో మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలని, పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో సంతోషం గా ఉండాలని ఆశించారు.
నిజాయితీ, ముక్కుసూటి స్వభావం, మోసం,దగా వంటివి సహించలేకపోవడం వంటి లక్షణాలు ఉన్న సూర్య మానస మోసం సహించలేకపోయాడు. తొందరపాటుతో, క్షణికావేశంలో, విచక్షణ కోల్పోయి ఇటువంటి చర్య కి పాల్పడ్డాడు.
వ‌సుథ మనసు అనేక తర్జనభర్జనకు లోనయింది.
తనను వద్దనుకున్న మనిషి గురించి ఆలోచించడమే 
వీడి తప్పు ఆ అమ్మాయిని శిక్షించే అధికారం వీడికెక్కడిది?
తన ఈ విచక్షణారహిత తొందరపాటు చర్య వల్ల తనేదో మానసకు తగిన శాస్తి చేసాననుకుంటున్నాడు.
పరోక్షంగా తనకుతానే శిక్షవిధించుకున్నాడు. భవిష్యత్తు శూన్యం అయిపోయింది. ఒకదుర్మార్గుడిగా మాయని మచ్చ పడిపోయింది.
వృద్ధాప్యం లో తల్లితండ్రులకు అండగా ఉండవలసినవాడు భారంగా, తీరని బాధగా మిగిలాడు.
ఏ పాపం ఎరుగని, ఏతప్పూ చెయ్యని తల్లిదండ్రులు తలవంపుల పాలయ్యారు..ఇలాంటి దుర్మార్గుని కన్నవారిగా ముద్ర పడిపోయింది.
ఇంటికి ,కంటికి, వెలుగునిస్తాడనుకన్న సూర్య, అస్తమించిన సూర్యుడయ్యాడు. తన జీవితానికి, తల్లిదండ్రుల జీవితానికి చీకటే మిగిల్చాడు.
మానసను శిక్షించడంతోపాటు, తన జీవితం నాశనం చేసుకున్నాడు.
తప్పు ఎవరిదైనా సూర్య చేసింది నూటికి నూరు పాళ్ళు తప్పు.
బిడ్డకి ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లి పోతుఉంది. అలాంటిది మానస బాధతో విలవిల్లాడుతూంటే ఆతల్లి ఎంత తల్లడిల్లిపోతోందో పాపం. 
ఓ తల్లి గా ఆ తల్లి మనసు పడే ఆవేదన గ్రహించగలదు
తనిప్పుడు తల్లిలా బాధ పడాలా?
తనయుడి తప్పుకు బాథ పడాలా?
వసుథ మనసు పరిపరివిధాల పరితపిస్తోంది
వసుధ చెంపలపై కన్నీరు థారాపాతంగా కారుతోంది.
ఒక్క క్షణం ఆలోచించింది........తనకుతాను సమాధానపరచుకుంది..... ధైర్యం కూడదీసుకుంది .....
కళ్ళు తుడుచుకుని లేచింది.
టీ.వీ.వారు చాలా సేపటి నుండి అందుబాటులోకి రమ్మని కోరుతున్నా తామే తప్పు చేసిన భావనతో తప్పించుకుంటోంది. అలా చెయ్యడం కరెక్ట్ కాదనిపించింది.
జరిగినదానికి సూర్య బాధ్యత వహించడం,శిక్ష అనుభవించడమే కరెక్ట్.
తన మనోభావన,తన మనోవేదన టీ.వీ.చానల్ ద్వారా నలుగురితో పంచుకుని, మరో యువకుడు ఇలాంటి పనికి పూనుకోకుండా, దాని ప్రభావం ఆ యువకుని జీవితం మీదే కాక, తల్లితండ్రుల మీద, కుటుంబం మీద, దగ్గరి వారిమీద ఎలా ఉంటుందో, బాధిత స్త్రీ కుటుంబానికి కలిగే నష్టం ఎంతో వివరించి
ఒక్కసారి......ఒక్కక్షణం ....... ఆలోచించి, మీ జీవితాలు, మీ సొంత మనుషుల జీవితాలు నిర్జీవం, అంథకార మయం, అస్తవ్యస్తం, అయోమయం, కాకుండా చూసుకోమని ఒక సూచన, మెసేజ్, ఇవ్వాలని ధృడనిర్ణయంతో, భారమైన హృదయంతో బయలుదేరింది.
ఓ యువతా! తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు దుర్మార్గపు చర్యలు మానండి, మీరు వేసే ప్రతి అడుగూ, మీ మీదే కాదు మీ ఆప్తులపై కూడా ప్రభావం చూపుతుంది.మీపై ప్రాణాలు పెట్టుకున్న వారికి తలవంపులు తేకండి. ఇదే వసుథ నేటి యువత కి ఆర్తితో ఆవేదనతో ఇవ్వాలనుకుంటున్న అర్ధింపు.
**** 

No comments:

Post a Comment

Pages