అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 22 - అచ్చంగా తెలుగు

అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 22

Share This
అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) సీరియల్ నవల- 22
(కెరొలిన్ కీనె 'ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ ' ఆంగ్ల నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధశాస్త్రి (సోమసుధ)

 
(కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యాన్ని వెతికి పెట్టమని నాన్సీ తండ్రిని సాయమడుగుతాడు ముసలి మిలిటరీ ఉద్యోగి మార్చ్. తండ్రి కోరికపై ఆ పరిశోధనను చేపట్టిన నాన్సీ తన స్నేహితురాళ్ళతో కలిసి ఆ పాతభవనం అటక మొత్తం గాలిస్తుంది. మార్చ్ కి ఆర్ధిక సాయానికి ఉపయోగపడే ఎన్నో వస్తువులను ఒక షాపులో అమ్మి ఆ డబ్బుని మార్చ్ కుటుంబనిర్వహణకు ఉపయోగించే ఏర్పాట్లు చేస్తూంటుంది యువ గూఢచారి. ఆగంతకుడెవరో ఆ భవనంలో తిరుగుతున్నాడని అక్కడ పని చేసే ఎఫీ ద్వారా తెలుసుకొంటుంది. ఒకసారి తన స్నేహితురాళ్ళతో కలిసి అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేసి విఫలమవుతుంది.  అటక మీద రహస్యమార్గం ఉందేమో అని వెతుకుతున్న సమయంలో అస్తిపంజరం తమకేదో సైగ చేస్తోందని బెస్ అంటుంది. వెంటనే అస్తిపంజరం ఉన్న బీరువాలో గాలించిన యువగూఢచారికి  పాత ఉత్తరాలతో పాటు కొన్ని పాటలు దొరుకుతాయి. తన తండ్రి క్లయింట్ కు అమ్మించి పెడతానని వాటిని నాన్సీ యింటికి తీసుకొస్తుంది. అంతకు మునుపు నాన్సీ తండ్రి అప్పగించిన మరొక కేసులో సీసాలను అమ్మే వంకతో డైట్ కంపెనీ లాబ్ లో దూరి అక్కడ ఉన్న రసాయనికాలను తెచ్చి తండ్రికి యిస్తుంది. మాటల మధ్యలో తండ్రి లాబ్ లో ఆమె లైట్ వేసి వదిలేసిన దానిపై డైట్ కంపెనీలో విచారణ జరుగుతోందని చూచాయగా తెలియపరుస్తాడు. అందువల్ల డైట్ కంపెనీకి తిరిగి వెళ్ళి ఆ పరిసరాల్లో తెలిసిన వ్యక్తి కనపడటం వల్ల తాను అకస్మాత్తుగా వెళ్ళిపోయానని, తిరిగి అక్కడ వదిలి వెళ్ళిన సీసాల అమ్మకం మాట్లాడటానికి వచ్చానని నమ్మబలుకుతుంది.  డైట్ తో సీసాల అమ్మకానికి బేరం కుదరక సీసాలను తీసుకొచ్చేసి ఫేబర్ దుకాణంలో అమ్ముతుంది.  ఆ రాత్రి ఆమె తన స్నేహితురాళ్ళతో ఆగంతకుని కోసం యింటిముందర చీకట్లో మాటు వేయాలని నిర్ణయించుకొని మార్చ్ తో చెబుతుంది.  అతను అయిష్టంగానే ఒప్పుకొంటాడు.  అనుకొన్నట్లుగా వాళ్ళు ముగ్గురు నల్లదుస్తుల్లో యింటి ముందు మాటువేస్తారు.  తరువాత . . . .)
@@@@@@@@@@

మార్చ్ రేడియో కట్టేసి, హాల్లో లైట్ ఆర్పేసి రెండవ అంతస్తు మెట్లెక్కాడు.

బయట చీకట్లో నాన్సీ, మిగిలిన యిద్దరమ్మాయిలు తమ స్థానాల్ని మార్చుకొన్నారు.  రహస్యంగా యింట్లోకి చొరబడే దొంగ జాడ లేదు.  వేకువఝాము లోపల ఎవరూ రాకపోతే, తరువాత ఎవరూ రారు.  అప్పుడు ఈ ముగ్గురమ్మాయిలు పహారాని ఆపేయవచ్చు.

ఆ పాతభవనంలో ఎక్కడినుంచో రాత్రి ప్రశాంతతను భగ్నపరుస్తూ గడియారం గంటలు మోగాయి.  పాత కూలీల నివాసాల దగ్గర నిలబడ్డ నాన్సీ పదకొండు గంటలను లెక్కబెట్టింది.

ఇంతలో దూరం నుంచి మరొక శబ్దం వినిపించింది.  శబ్దం ఏదో గందరగోళంగా ఉంది.

నాన్సీ నిటారుగా నిలబడి, వినిపిస్తున్న శబ్దంపై దృష్టిని కేంద్రీకరించింది.  ఆమెలో కలవరం మొదలైంది.

ఒక్కక్షణం ఎవరిదో మెల్లిగా నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది.  ఎవరో రోడ్డుకి ఆనుకొని ఉన్న దేవదారు చెట్ల మధ్యనుంచి ప్రత్యక్షమయ్యాడు.  అతడు చప్పుడు చేయకుండా మెల్లిగా ఆ పాత భవనం వైపు కదులుతున్నాడు.

అదేసమయంలో యింటిముందునుంచి ఎవరివో ఆడుగుల చప్పుడు వినిపించింది.  " ఇతను దొంగకి సహచారుడు అయి ఉంటాడు" అనుకొందామె.

దానిలో సందేహం లేదు.  దట్టంగా అంధకారం అలముకొన్న ఆ చీకటిరేయిలో నీడలా కనిపించే ఆ ఆకారాలు రెండు ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి.  నాన్సీకి ఊపిరి ఆగినట్లయింది.

నాన్సీ చూస్తూండగా రెండు నీడలు బాగా దగ్గరవుతున్నాయి.  మొదట పచ్చికబయలుకి అడ్డం పడి వచ్చిన వ్యక్తి కనిపించాడు.  అకస్మాత్తుగా లోనుంచి వస్తున్న మనిషి గొంతు చెట్లగాలి శబ్దాన్ని  చీలుస్తూ ఖంగున మోగింది.

"నాన్సీ! ఎక్కడున్నావు?" మార్చ్ గొంతు అది.

ఇంటిముందున్న దేవదారుతోటలో ప్రతిధ్వనించిన అతని అకాలమైన పిలుపు, లోనికొస్తున్న దొంగకి హెచ్చరిక అయింది.  వెంటనే అతను వెనుదిరిగి పారిపోసాగాడు.

అది గమనించిన నాన్సీ దాక్కున్న చోటనుంచి బయటకొచ్చి పారిపోతున్న దొంగ వెంటపడింది.  అదే సమయంలో తన స్నేహితురాళ్ళను సాయం చేయమంటూ అరిచింది.  వాళ్ళిద్దరూ కూడా ఆమె వెన్నంటి పరుగెత్తారు.  కానీ వారి పరుగు నిష్ఫలమైంది.  చీకటిరాత్రి దొంగను మింగేసింది.

నిరాశ చెందిని అమ్మాయిలు వెనుదిరిగి యింటికి వచ్చారు.  నాన్సీ జరిగినదంతా తన స్నేహితురాళ్ళకు వివరించింది.

జార్జ్ కి  విపరీతమైన కోపం వచ్చింది.  "దొంగను పట్టుకోలేకపోవటం మన అసమర్ధత.  కానీ మనం అతని కోసం కాపు కాస్తున్నట్లు అతనికి తెలిసిపోయింది."

"మనం అతన్ని పట్టుకోలేకపోవటమే గాక, అతను యింట్లోకి ఏ మార్గంలో ప్రవేశిస్తున్నాడో తెలుసుకొనే అవకాశం కూడా పోయింది" అని నాన్సీ నిరాశగా చెప్పింది.

"ఓ! అదే సమయంలో మనల్ని చూడాలని పెద్దాయన ఎందుకనుకున్నాడు?" బెస్ అసహనంగా అంది.

"ఆయన మన క్షేమం గురించి ఆలోచించి ఉండవచ్చు" నాన్సీ అంది.

మార్చ్ అకాలంలో అలా ప్రవేశించినందుకు వారికి క్షమాపణ చెప్పాడు.  కటికచీకటిలో ఆరుబయట ఆడపిల్లలు ఉన్నారని అతనిలో అలజడి మొదలైంది.  అందుకే వాళ్ళు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకొందుకు అతను యింటి బయటకు వచ్చినట్లు పెద్దాయన వారికి వివరించాడు.  అలా బయటకు రాగానే వాళ్ళు ముగ్గురు అతనికి కనిపించలేదు.  దానితో వాళ్ళకి ఏమన్నా జరిగిందేమోనని భయమేసి పిలిచాడు.  అదేసమయంలో తనకి దగ్గరలోనే దొంగ ఉన్నాడన్న విషయాన్ని అతను గమనించలేదు.

ఆగంతకుడు తనపై నిఘా ఉందని గమనించాడు గనుక ఆ రాత్రి ఖచ్చితంగా మరి రాడని వాళ్ళు నిర్ధారించుకొన్నారు.  అందుకే ఆ ముగ్గురమ్మాయిలు తమ నిఘాకి స్వస్తి చెప్పి, నిద్రకు ఉపక్రమించారు.

తెల్లారి నిద్రలేచిన నాన్సీకి దూరంనుంచి సన్నగా సంగీతం వినిపించింది.

"పెద్దాయన ఉదయాన్నే రేడియో  పెట్టినట్లున్నారు" అనుకొందామె.

నాన్సీ భోజనాల గదికి చేరుకొనే సమయానికే పెద్దాయన తన మనవరాలితో టిఫిన్ బల్ల దగ్గిర కూర్చుని ఉన్నాడు.  కానీ వాళ్ళిద్దరూ తినటం లేదు.  వాళ్ళు రేడియోలో ఎవరో పాడుతున్న పాటను వింటున్నారు.

"నాన్సీ! ఇది మా నాన్న పాటల్లో ఒకటి" పాప ఉత్సాహంగా చెప్పింది.

పాటను విన్న తరువాత, పెద్దాయన చెప్పుకొంటున్న అతని కుమారుడు కూర్చిన బాణీకి విరుద్ధంగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది.  అది ఇద్దరు ప్రేమికులు పాడుకొనే అందమైన నృత్యగీతం.  పాటలో ఉన్న ఒక పదబంధం ఆమె దృష్టిని ఆకర్షించింది.  అదే " నా హృదయపు కోరిక."

"తాను ఈ రహస్య శోధనకు దిగకుముందే ఈ పదాలను ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది.  ఎక్కడ?" పరధ్యానంగా అనుకొందామె.

ఒక గంటసేపు ఆమెను ఆ పాట వెంటాడింది.  అకస్మాత్తుగా ఆమెకు గుర్తు వచ్చింది.  వెంటనే మార్చ్ వద్దకు పరుగున వెళ్ళింది.

" మాయమైపోయిన మీ కుమారుడి సంగీతపు  జాడ మొదట మీరు చెప్పిన వాటిల్లోనే ఉందని నమ్ముతున్నాను" ఆనందంగా చెప్పిందామె.

"ఎలా?"

"అవే!  మీ అబ్బాయి తన భార్యకు వ్రాసిన ఉత్తరాలు!  వాటిలోని ఒక ఉత్తరంలో ' నా హృదయపు కోరిక ' అన్న పదాలు ఉన్నాయి."

"అయితే అవి పనికొస్తాయి" పెద్దాయన ఒప్పుకున్నాడు.

నాన్సీకి మళ్ళీ ఆ ప్రేమలేఖలను చదవాలని ఆత్రుత కలిగింది.

(తరువాయి భాగం వచ్చే సంచికలో)

   

No comments:

Post a Comment

Pages