వటవృక్షం - అచ్చంగా తెలుగు
 “వటవృక్షం”
మంథా భానుమతి 
(జంధ్యాల పికెల్స్, అచ్చంగా తెలుగు సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ )

  
“గురువుగారూ! గురువుగారూ!” వీధి వాకిట నుంచే గట్టిగా పిలుస్తూ వచ్చాడు నారసింగన్న.

  పెరటి లోని వటవృక్షం కింద పది మంది శిష్యులకి వ్యాకరణ పాఠాలు బోధిస్తున్న రంజన భట్టు, పక్కకు తిరిగి చూశాడు, ముడిచిన కనుబొమ్మలతో.. 

  ఆకుల మధ్యనుండి త్రోవ చేసుకుని భట్టుగారి మీద పడుతున్న బాల భానుని కిరణాలు గురువుగారి తేజస్సుని రెట్టింపు చేస్తున్నాయి. 

  సంస్కృతాంధ్ర కన్నడ భాషల్లో కావ్యాలు రాయగల భట్టుగారి దగ్గర శిష్యునిగా చేరటమంటే, సాక్షాత్తూ వ్యాసుల వారి శిష్యరికమే అని చెప్పుకుంటారు.

  పధ్నాలుగవ శతాబ్దపు మూడో దశకం.. కొండవీటి రాజ్యం. చుట్టుముట్టి ఉన్న శత్రురాజుల ధాటికి తట్టుకుని, ప్రోలయ వేమారెడ్డి ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అభేద్యమైన కొండవీటి కోట, రాజ్యానికి మంచి రక్షణ కల్పిస్తోంది.

  సాహిత్యం, సంగీతం, క్రీడలు.. ప్రజల ప్రశాంత జీవనాన్ని తెలియజేస్తున్నాయి.

కొండవీటిలో వీధి వీధినా కవులు తిరుగుతుంటారని చాటువులు చెప్తుంటారు. అందరూ కాకపోయినా కొందరు మంచి కవులున్నారు.

  క్రీడలలో.. కుస్తీ పోటీలు ప్రాముఖ్యత వహించాయి. ఇప్పుడు నారసింగన్న వచ్చింది కూడా వాటి గురించి గురువుగారికి చెప్దామనే.

  భట్టుగారి తీరు చూసి, ఒకడుగు వెనక్కి వేశాడు.

  “ఏమి విశేషం నారన్నా! చెప్పు..” ఒక శిష్యుని పద్యాన్ని దిద్దుతూ అన్నారు భట్టుగారు.

  “మీరు కోపగించుకోనంటే..”

   భృకుటి ముడిచే, చెప్ప మన్నట్లు తల ఎగరేశారు గురువుగారు.

  “క్రీడా స్థలంలో కుస్తీ పోటీలకి మైదానం తయారు చేస్తున్నారు. ఇసక వేయటం అయింది. ఇంక ఎర్రమట్టి పరవబోతున్నారు.”

  “ఇందులో వింత ఏముంది? ఎప్పుడూ జరిగేవే కదా?”

  “ఈ సారి స్త్రీలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు స్వామీ. రాణీ గారు స్వయంగా పర్యవేక్షిస్తారుట.”

  పద్యాన్ని దిద్ది శిష్యునకందించి నారన్న కేసి తిరిగారు భట్టుగారు.

  క్షణంలో సగం సేపు వారి కనుబొమ్మలు పైకి లేచాయి. 

  “అందరికీ నాయకురాలు రమక్క. చాలా కాలం నుండీ అమ్మాయిలకి శిక్షణ ఇస్తోందిట. ఈసారి కుస్తీ పోటీలు చాలా మందిని ఆకర్షించబోతున్నాయి. అద్దంకి, బెజవాడ, రాజమహేంద్ర వరం వంటి పొరుగూర్ల నుండి కూడా పాల్గొనబోతున్నారు.”

  “మంచిదే. ఆత్మ రక్షణకి కూడా పనికొస్తుంది. ధనుర్విద్యలో, కత్తి యుద్ధంలో కూడా ప్రావీణ్యం సంపాదించాలి స్రీలందరూ.” అదాటుగా అన్నారు రంజన భట్టు.

  ఉలిక్కి పడ్డాడు నారసింగన్న. గురువుగారు అంతమాట ఎందుకనేశారో! నిరంతరం పొరుగురాజుల నుంచి రక్షించుకుంటూ ఉండవలసిందే కదా! సుల్తానుల బెదిరింపు ఎప్పుడూ ఉండనే ఉంది. యుద్ధ ఛాయలేమైనా కనిపిస్తున్నాయా? 
***

  రమాసుందరి గుర్రం దిగి, వాకిట పాదాలు శుభ్రం చేసుకుని ఇంటిలోనికి వచ్చింది. కన్నులలో దృఢనిశ్చయము, నడిచే తీరులో ధైర్యము పట్టుదలని సూచిస్తున్నాయి. సమమైన శరీర సౌష్టవం, తీరైన కనుముక్కుతీరు.. చూడగానే అందరినీ ఆకర్షించే రూపం.

  రమాసుందరి సహచరులూ, సమవయస్కులే కాక అందరూ రమక్క అనే వ్యవహరిస్తారు.

  వాడలో ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుంటుంది.

  ఇరవై సంవత్సరాలు దాటినా, ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వివాహానికి ససేమిరా అంటుంది. తల్లి ఏమైనా చెప్పబోదామనుకుంటే, సూర్యోదయాత్పూర్వం నిదుర లేచిన మొదలు.. రమక్క, రమక్క అంటూ గుంపు తరువాత గుంపు వస్తూనే ఉంటారు.

  యువతులందరికీ తన విద్యలన్నీ నేర్పించటం, పోటీలు నిర్వహించటం.. నిమేష మాత్రం విరామం దొరకదు.

  ఎప్పటి లాగానే ఆ రోజు కూడా తల్లి, మంచి తీర్థం ఇచ్చి ఆరంభించింది.. 

  “ఎన్ని సంబంధాలు తల్లీ.. ఎందరో అందచందాల్లో, విద్యలో నీకు సాటి అయిన వారు! అందరినీ కాదనుకుంటే..” మాట పూర్తవకుండానే కుమార్తె కన్నులలోని తీవ్రత చూసి ఆపేసింది.

  “అమ్మా! నాకు బహు భార్యలలో ఒకరిగా ఉండుట నచ్చదని మీకు తెలుసు కదా! ఎవరైనా ఏక పత్నీ వ్రతుడుంటే చెప్పు.. వెంటనే అంగీకారం తెలుపుతాను.”

  గాఢ నిట్టూర్పు వెలువరచింది మాతృమూర్తి.

  అటువంటి వాగ్దానం చేయుట సాధ్యమేనా? బహు భార్యాత్వం.. కనీసం ఇరువురు భార్యలు సర్వ సాధారణం. వివాహమప్పుడు ఒక్కరే ఉన్నా.. ఆ తరువాత రెండవ వివాహం జరగదని ఎవరూ చెప్పలేరు. 

  “అటువంటి వ్యక్తి దొరుకుతే చెప్పండమ్మా.. ఏ మాత్రం సందేహించకుండా వెనువెంటనే వివాహం చేసుకుంటాను.” రమక్క స్థిరమైన కంఠస్వరంతో అనేసి, లోపలికి నడిచింది. 
***

   క్రీడా స్థలం తయారయింది.

  ఒక చోట ధనుర్విద్యా ప్రదర్శన, వేరొక చోట కత్తి యుద్ధం, మరొక స్థలంలో కర్ర సాములు, నడి మధ్యలో కుస్తీ పోటీలు ఆరంభమయ్యాయి. 

  రమక్క తాను స్వయంగా పాల్గొనక, శిష్యురాళ్లని పోటీలకి తయారు చేసి గడిలో నిలిపింది. మధ్యాహ్నానికే పొరుగూర్ల నుంచీ, పొరుగు దేశాల నుంచీ వచ్చిన జట్లు ఓడి, ప్రేక్షకులలో కలిశారు. 

  అద్దంకి జట్టుకి, కొండవీటి జట్టుకి పోటీ నడుస్తోంది. ఇరువురూ ఒకరికొకరు తీసిపోకుండా పట్లు బిగిస్తున్నారు. చివరి క్షణంలో అద్దంకి ఆడపడుచు విజయం సాధించింది. 

  పట్టణముల పేర్లు వేరైనా ఇద్దరూ రమక్క శిష్యురాళ్లే. కొండవీటికి రాజధాని తరలక ముందు రమ శిష్యబృందంలో ఉన్న అమ్మాయే గెలిచింది. ప్రధమ, ద్వితీయ విజేతలిరువురూ ఆనందంగా కరచాలనం చేసుకుని, గురువుగారి వద్దకు వచ్చి పాదాభి వందనం చేశారు. రాణీగారు స్వయంగా బహుమతులు అందజేశారు. 
***

  “స్త్రీలకి యుద్ధ విద్యలెందుకండీ? సున్నితంగా ఉంటారు, ఇల్లు దిద్దుకోవాలి కానీ..” ప్రేక్షకులలో ఎవరో ప్రశ్నిస్తున్నారు. రంజనభట్టు విన్నారా మాట..

  “ఆ విధంగా ఆలోచిస్తే కాకతీయ మహారాజ్ఞి రుద్రమదేవి అంత సామ్రాజ్యాన్ని ఏలగలిగేవారా? స్వయంగా అశ్వారూఢయై, కత్తి డాలు ధరించి యుద్ధాలు చేసి రాజ్యాన్ని ముష్కురుల నుండి, ఇతర రాజుల నుండి రక్షించగలిగేవారా? దురదృష్టవశాత్తూ, అంబదేవునితో అంతర్యుద్ధంలో అంతమవక పోతే, మరికొన్ని సంవత్సరాలు సుభిక్షంగా పాలించే వారు కదా!” రంజనభట్టుది కంచుకంఠం. కొండవీడు నగరం, కొండల మధ్యనుందేమో, ప్రతిధ్వనిస్తూ అందరినీ ఆకర్షించింది.

  రాణీగారు నిష్క్రమించాక రమక్క కూడా తన బృందంతో అక్కడికి వచ్చి విన సాగింది.  

  “అంతే కాదు.. ప్రతాపరుద్రుని ఏలుబడిలో, ఓరుగల్లు పట్టణం మీద ముష్కురులు దాడి చేసినప్పుడు, స్త్రీలకు కూడా యుద్ధ విద్యలు వచ్చి ఉంటే అంత సర్వనాశనం అయేది కాదేమో! ఆత్మరక్షణకైనా పనికి వచ్చేది. దేశాన్ని రక్షించుకోలేక పోయినా.”

  “స్త్రీలు సుకుమారంగా ఉంటారండీ భట్టుగారూ.. కత్తియుద్ధాలూ, కుస్తీ పట్లూ అంటే..” ఎవరో సన్నగా అంటున్నారు. సర్రుమని కోపం వచ్చేసింది భట్టుగారికి.

  “అందుకేనా పాపం.. ఒకరు సరిపోరని ముగ్గురు సుకుమార్లని వివాహం చేసుకున్నారు. అంత జాలి ఉంటే, ఒక్కరిని ప్రేమతో చూసుకోవలసింది..” భుజం మీది ఉత్తరీయం విదిలించారు. వింటున్నవారిలో సగం మంది ఏదో పనున్నట్లు తప్పుకున్నారు. రమాసుందరి కుతూహలంగా చూసింది.

***

  “రంజన భట్టుగారా?” నమ్మలేనట్లు అడిగారు రమక్క తండ్రిగారు. చిరునవ్వుతో తల పంకించింది రమ. పోటీల నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులను కూర్చోబెట్టి భట్టుగారిని వివాహమాడ ఆశ పడుతున్నానని చెప్పింది. వారి పెద్దలతో మాట్లాడమని కోరింది.

  “అతని పేరులోనే కానీ స్వభావంలో ఇసుమంతైనా రంజనం లేదమ్మా. కోపిష్ఠిగా పేరుపొందారు. పాండిత్యంలో, యుద్ధ విద్యలలో సమాన ప్రతిభ ఉందంటారు కానీ.. ఎప్పుడూ నాసికాగ్రానే ఉంటుంది ఆగ్రహం. తనకి నచ్చని దేదైనా సరే.. సావధానం లేకుండా అంతెత్తున లేస్తారు. అందుకే, ఎంత పాండిత్యమున్నా రాజానుగ్రహం కలుగలేదు. కలవాలని వెళ్లినప్పుడు, ఎవరితోనో వాదులాడి, రాజుగారిని చూడకుండానే విసవిసా వచ్చేస్తారు.” తండ్రిగారి వివరణ రమక్క నిర్ణయాన్ని మార్చలేకపోయింది.   

  రంజనభట్టు నవయువకుడు. ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి. రమక్కకి ఈడూజోడూ బాగా కుదురుతుంది.

  “అతడు తిట్టుకవిట. పైగా వాక్శుద్ధి కూడా బాగా ఉందట. అర్ఘ్యమిస్తూ చెరువులో అతని రజత పాత్ర జార విడుచుకున్నాడట. అంతే.. చెరువులో నీళ్లన్నీ ఎండిపోవాలని ఒక పద్యం అల్లి పాడాడట. నీళ్లన్నీ ఇగిరిపోయాయట. తళతళలాడుతున్న తన పాత్ర పట్టుకుని, ఏమీ జరగనట్లు వెళ్లిపోయాట్ట. రేప్పొద్దున్న నీ మీద కోపం వచ్చి, అటువంటి శాపం ఏదన్నా ఇస్తే..” తల్లి ఆదుర్దాగా అడిగింది.

  పకపకా నవ్వింది రమా సుందరి. “అదంతా కట్టుకథమ్మా. నేను కూడా విన్నాను. పద్యంపాడుతూ, నీటిలో మునిగి వెతుక్కుని తీసుకున్నారట. కోపం రాకుండా నేను చూసుకుంటాను. ఇన్ని రోజులు.. పెండ్లి అని వేధించి, ఇప్పుడు చేసుకుంటానంటే అభ్యంతరపెడ్తావేమమ్మా? నాకు అన్ని విధములా సరిపోయిన వ్యక్తి దొరికారు. మన కులమే కూడా.. ఇంకేల సంశయం?”
 ***
  రంజనభట్టుగారి వటవృక్షం వద్ద రెండు పాఠశాలలు వెలిశాయి. భట్టుగారి పాఠాలు ఈ ప్రక్కనా, రమక్క పాఠాలు ఆ ప్రక్కనా. రెండు పాఠశాలలలో, సాహిత్యం, యుద్ధ విద్యలు సమానంగా బోధిస్తున్నారు.

  వాన పడుతుంటే తప్ప, వారి అలుకలూ, భోజనాలూ.. కొద్ది సంవత్సరముల పిదప పుత్రికా పుత్రులిరువురి ఆటపాటలూ.. అన్నీ వటవృక్షం కిందనే!

  ఆ దంపతుల కృషికి మెచ్చి రాజుగారు ఒక అగ్రహారం రాసి ఇచ్చి, రంజనపురం అని పేరు పెట్టారు. రాజుగారి సైన్యంలో ప్రతిభావంతులైన యువతీ యువకులు ప్రతీ సంవత్సరం చేరుతూ ఉన్నారు. అందువలననే నేమో.. ప్రోలయవేమారెడ్డి ఏలిన కాలం అంతా అద్దంకి సీమ ప్రశాంతంగా ఉండి, కళలు ఉద్ధరింపబడ్డాయి. 

***

No comments:

Post a Comment

Pages