వ(వా)యా(య్యో) ’మీడియా’ - అచ్చంగా తెలుగు

వ(వా)యా(య్యో) ’మీడియా’

Share This
వ(వా)యా(య్యో) ’మీడియా’ 
పూర్ణిమ సుధ 

’చైన్ సే సోనా హోతో జాగ్ జావ్...’! అని అరిచిన అరుపుకి, కోమలికి వెన్నులో వణుకు పుట్టింది. మాగన్ను నిద్ర పట్టిన మత్తు వదిలి, కళ్ళని ఐఫోన్ కెమెరా అంత ఫోకస్ పెట్టి, టీవీనే చూస్తోంది. నిమిషానికో మారు, మనవాడి వాడి గొంతులో పలికిన మాడ్యులేషన్ కి బిక్క చచ్చి, ఉత్కంఠని ఆపుకోలేక, ’ఏమండీ, ఇలా రండి’, అని పిలిచి,”ఈ మధ్య ఇలా కూడా చేస్తున్నారుట” అంటూ బుగ్గలు నొక్కుకుంది. అసలే సొట్ట బుగ్గల సుందరేమో, ఇప్పుడు మరీ గుంతలు పడి, మన అల్వాల్ రోడ్లలా అధ్వానంగా తయారయ్యాయి. మళ్ళీ కాసేపటికి తేరుకుని, ఎవరి పనిలో వాళ్ళు పడ్డారు. 
కోమలి, గంగాధర్ ఇద్దరూ చూడ చక్కని జంట. రీసెంట్ గా పెళ్ళి చేసుకుని, ఒక డీసెంట్ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ తీసుకుని, అన్ని విధాలా ఒక ఇంటివారయ్యారు. ఈ అమ్మాయితో జీవితం, ఈ యమ్ ఐ తో ఇల్లు సంతోషంగా గడుస్తున్నది. మొన్నటివరకూ, ఇద్దరూ కొత్తగా పెళ్ళయినందుకు, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా, రోజూ సాయంత్రం కుప్పలు తెప్పల కబుర్లని పోగేసుకుని, చక్కగా కాలక్షేపం చేసారు. మోడీ నుండీ మోర్ సూపర్ మార్కెట్ క్వాలిటీ దాకా, రాజకీయంలోని రాగా నుండీ సంగీతంలోని సాగామాపా దాకా, ప్రతీదీ అవసరమే..! కాదేదీ కబుర్లకనర్హం... అన్నట్టు తెగ మాట్లాడేసుకునేవారు. అభిప్రాయాల్లో మార్పున్నా, గౌరవించుకుని, గౌరవమందుకుని, ఎంతో చూడముచ్చటగా ఉండేది సందర్భం. ఎదురుగా ఉన్న పద్మగారు, ఇదే విషయమై, వాళ్ళాయనతో గొడవ కూడా పడ్డారు. ’చూసారా ? రోజూ ఎంచక్కా, బాల్కనీలో కూర్చుని కబుర్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నారు. మీరూ ఉన్నారెందుకు ? 24 గంటలూ ఆ టీవీ గోలే తప్ప, ఈ బీవీని పట్టించుకున్న పాపాన పోలే’దని... 
కోమలి స్వతంత్ర్యభావాలు గల వ్యక్తి. అలా అని స్త్రీవాదం, అతివాదం లాంటివేమీ లేవు. తన పనులకు ఎదుటివారి మీద ఆధారపడకూడదని, 2 వీలర్, కార్ అన్నీ నేర్చుకుంది. తనకు ఉద్యోగం తప్పనిసరి కాదని, కానీ ఆర్థిక స్వతంత్ర్యం కోసం, ఎంత అవసరం లేకపోయినా, మనకంటూ ఒకరు వచ్చేవరకూ, ఖాళీగా మాత్రం ఉండనని, పెళ్ళి చూపుల్లో ముందే చెప్పింది. తనకి కొన్ని నిర్దుష్ఠమైన అభిప్రాయాలున్నా, ఎదుటి మనిషిని గౌరవించే తత్వం ఉండాలని, ప్రతీదానికీ తానా అంటే తందానా అనే మనుషులు నచ్చరని తెలుసుకుని, అన్నీ మాట్లాడుకున్నాకే పెళ్ళి చేసుకున్నారు. అందుకే ఇప్పుడు వారు, ఆకాశం కిందున్న ఏ విషయం గురించైనా, మొహమాటం లేకుండా, మాట్లాడేసుకుంటారు. వారి మధ్య స్పేస్ విషయాలకైనా స్పేసుంది... 
కానీ ఈ మధ్య, ఏంటో విచిత్రంగా ప్రవర్తిస్తోంది కోమలి. గంగాధరానికి ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అన్నిట్లోనూ గంభీరంగా ఉండే కోమలి, ఉత్తినే బేలగా మారిపోతోంది. రెండు నిమిషాలు ఫోన్ అటెండవకపోతే బెంబేలెత్తిపోయి, కొలీగ్స్ కి ఫోన్ చేస్తోంది. ఈ విషయం గురించి అడుగుదామనుకుంటూనే - తనే చెప్తుందిలే అని సరిపెట్టుకున్నాడు.
మొన్నటికి మొన్న, ఇద్దరూ కలిసి నెక్లెస్ రోడ్ కి వెళ్ళి కాసేపు కూర్చునొద్దామనుకున్నారు. సరే అని బయలుదేరాక, బండి మీద అతిగా భయపడిపోయి, పక్కనించీ వెళ్ళే ప్రతీ వెహికిల్ కి తనే రియాక్ట్ అవుతోంది. తను కాళ్ళు దగ్గరకి జరిపిందంటే, పక్కనేదో వెహికిల్ వస్తున్నట్టు తెలిసిపోతోంది. ఎందుకింత భయపడుతోంది..? మొన్నటి దాకా బానే ఉండేది. తనే చాలా సార్లు, నన్ను ఆఫీస్ నుండీ పిక్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఏంటీ మార్పు ? నిన్నటికి నిన్న, తనకి ఇష్టమని రాజస్థానీ సమోసా తెస్తే, ’అది ఏ ఆయిల్ ? పరిసరాలెలా ఉన్నాయ్ ? ఈ మధ్య రీ యూస్డ్ ఆయిల్ లో మార్చేసిన ఇంజన్ ఆయిల్ ని కలిపి వాడుతున్నారని’ భయపడి, ముక్క కూడా ముట్టుకోలేదు. ఎంతో ముచ్చట పడి, కట్టుకున్న డబుల్ బెడ్ రూం ఫ్లాట్ లో, ఒక బాత్రూంలో తనకోసమే బాత్ టబ్ పెట్టిస్తే, కనీసం ఒక్కనాడు కూడా స్నానం చేయలేదు. అదేంటంటే, వచ్చే ఆదివారం చేస్తా, పై ఆదివారం చేస్తానని దాటేస్తోంది. ఇదివరకు సామరస్యంగా మాట్లాడే తను, ప్రతీ దానికీ వితండవాదం చేస్తోంది.  అది విని, తనకీ టెంపర్ లూజై, ఏదేదో మాట్లాడి, చిలికి చిలికి గాలివానగా మారి, ఎడమొహం పెడమొహంగా పడుకుంటున్నారు. 
ఒంటరిగా బైటికెళ్ళాలంటే భయం, ఏదైనా తినాలంటే భయం, పడుకోవాలంటే భయం, మాట్లాడాలంటే భయం, బండి నడపాలంటే భయం, బండి మీద కూర్చోవాలన్నా భయం, బంధువులొస్తున్నారంటే భయం... ఏంటిది ? ఇక లాభం లేదని, ఆ రోజు సాయంత్రం ఆఫీసునుండి కొంచెం ముందే వచ్చి, తనకి నచ్చిన బంగాళాదుంపల వేపుడు, టొమేటో రోటి చట్నీ చేసి, బాల్కనీలో కుర్చీలు వేసి, తనకి నచ్చిన రఫీ పాటల్ని, బ్లూటూత్ స్పీకర్లకి కనెక్ట్ చేసి, వేచి చూస్తున్నాడు. ఇంతలో కోమలి రానే వచ్చింది. మంచి అరోమా ముక్కుపుటాలని తాకేసరికి, ఆకలి రెట్టింపయింది. సరే ముందు భోంచేసి, బాల్కనీలో కూర్చున్నారు. గొంతు కాస్త సవరించుకుని, గంగాధర్ మాట్లాడడం మొదలు పెట్టాడు... ’ఏంటి కోమలీ విశేషాలు..!’ అని. ’అంటే, ఆఫీసులో చాలా చిరాగ్గా ఉంది గంగా..! అక్కడి పరిస్థితులు చూస్తుంటే, ఎప్పుడో ఒకప్పుడు మానేసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్’ అంది ’ ఈ టైపు మాటలెక్కడో విన్నట్టుంది... అనుకుని,”సరే ఎందుకీ మధ్య చాలా భయపడుతున్నావ్ ’ అని భయం భయంగా అడిగాడు. ’నేను, నేను భయపడుతున్నానా ? మరి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావ్ ? చాలా కూల్ గా అడిగావా ? ’ ముందు నీ సంగతి చూస్కో..! అసలు నా గురించి మాట్లాడే హక్కే లేదు’ అనేసరికి, ఆశ్చర్యపోయి, ఏం మాట్లాడాలో తెలీక, కాసేపు ఆగి, నీకు ఇష్టమని రఫీ పాటలు ప్లేలిస్ట్ ఆన్ చేసి ఉంచాను అని ప్లే చెయ్యడం మొదలుపెట్టాక, కాస్త నెమ్మదించింది.
ఇదేదో సీరియస్ సమస్యని గుర్తించి, సైకాలజిస్ట్ దగ్గరికి అని చెప్పకుండా, నా చిన్నప్పటి ఫ్రెండ్ అని ఒకసారి కలవమన్నాడని చెప్పి, తీసుకెళ్ళాడు. భయం భయంగా పరిసరాలు చూస్తూ ఉంది. ఇంతలో డాక్టర్ కిరణ్, సైకాలజిస్ట్ వచ్చి, ఇద్దరినీ తేరిపారా చూసి, క్యారెక్టర్ గుర్తొచ్చి, స్నేహితుడిలా నటించడం మొదలుపెట్టాడు. పిచ్చాపాటీ మాట్లాడుతూ టీవీ పెట్టాడు. అంతే... అప్పటిదాకా లేడి పిల్లలా చలాకీగా ఉన్న కోమలి, ఒక్కసారిగా స్థాణువైపోయి, టీవీనే చూస్తోంది. ఇంతలో రోడ్ ప్రమాదాన్ని చాలా వాస్తవికంగా, పాశవికంగా చూపించడంతో, తీవ్ర ఉద్రిక్తతకి లోనయింది. ఇంతలో ఇద్దరూ కిందకి వెళ్ళి వస్తామని చెప్పి, బయటికొచ్చారు. ఓ పది నిమిషాలు మాట్లాడుకుంటూ ఉండగా కోమలి ఫోన్ చేసింది. ఎటూ పైకే వెళుతున్నాం కదా అని అటెండ్ అవలేదు గంగాధర్. అంతే..! ఖంగారు పడి, పక్క ఫ్లాట్ కి వెళ్ళి, ఆ డాక్టర్ నెంబరు కనుక్కుని ఆయనకి కూడా ఫోన్ చేసేసింది. ఇదంఆ గమనించిన డాక్టర్ కిరణ్, ఇంట్లోకి అడుగుపెడుతూనే, చర్చా కార్యక్రమం చూస్తూ మధ్య మధ్యలో ఫోన్ ట్రై చేస్తున్న కోమలిని చూపించి... చూడు, పూర్తిగా ఉద్రేకంగా మారిన నీ భార్య కోమలిని చూడు అని అసలు విషయం కనిపెట్టినవాడిలా పోజు కొట్టాడు. ఏం అర్థం కాక జుట్టు పీక్కుంటున్న మన గంగాధరాన్ని కూర్చోపెట్టి, విషయాన్ని విశదీకరించాడు. దీన్ని మీడియోఫోబియా అంటారు. శ్రీదేవి చావుకి కారణమయిన బాత్ టబ్ ని రియలిస్టిక్ గా చూపించినందుకే ఆ బాత్ టబ్ భయం, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, కాష్మీర్ ఉదంతాలు, పరువు హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, దోపిడీ దొంగల భీభత్సం, ఎన్నికల మీటింగుల్లో నేతలు మాట్లాడే బ్లేమ్ గేములు, పనికి మాలిన చర్చల్లో చేసే రచ్చలు... ఇవన్నీ తన మీద తీవ్ర ప్రభావం చూపించాయని కృష్ణుడు చేసినట్టు, గీత బోధ చేసేసరికి, మరి కిం కర్తవ్యం ? అన్నాడు గంగాధరం. ఏమీ లేదు. కేబుల్ కనెక్షన్ తీసెయ్యండి. అంతగా సినిమాలు కావాలంటే, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ లాంటివెన్నో ఉన్నాయిగా..! కొన్నాళ్ళు వార్తలకి దూరంగా ఉంటే, ఈ వాతలు అవే తగ్గిపోతాయి అని పరిష్కారం కూడా చెప్పాడు. 
హమ్మయ్య అని, మాయాబజార్లోని దుశ్శాసనుడిలా ఇదే మన తక్షణ కర్తవ్యం అని పెరిగిన కేబుల్ చార్జీల వంక చెప్పి, ఉన్న ఇద్దరూ ఆఫీసు నుండి వచ్చాక, మాట్లాడుకునే సమయం లేదని చెప్పి, కనెక్షన్ కట్ అన్నాడు. ఆ రోజు ఎప్పటిలాగే, రాత్రి భోజనాలయ్యాక, ఆరుబయట వెన్నెల్లో, రెండు కుర్చీలు, రెండు కప్పుల గోరువెచ్చటి పాలు, ఇద్దరు మనుషులు, ఒకే మనసుగా ఎప్పటినుండో పోగుబడిన కబుర్లని పంచుకుంటూ, నవ్వులు పెంచుకుంటూ ఉండగా, చంద్రుడు కూడా నిద్దరొస్తోందని, మబ్బుల దుప్పటిని లాక్కున్నాడు.
***

No comments:

Post a Comment

Pages