శ్రీ మద్భగవద్గీత - 29 - అచ్చంగా తెలుగు
ఓం శ్రీ సాయిరాం
భక్తి యోగము
12 వ అధ్యాయము

సమశ్శత్రౌచ మిత్రేచ తధామానావమానయోః
శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః 
- 18వ శ్లోకం

తుల్యనిన్దా స్తుతిర్మౌనీ సంతుష్టోయేనకేనచిత్
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియోనరః
-19 వ శ్లోకం

శత్రువునందును , మిత్రుని యందును , మానావమానములందును, శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగానుండు వాడును , మౌనముగానుండు వాడును, లభించినదానితో తృప్తినొందువాడును , నిర్ధిష్టమగు నివాసస్తానము, లేదా శరీరమందు రవంతైనను ఆసక్తి లేనివాడును , భక్తితో కూడియుండువాడను యగు మనుజుడు నాకు ఇష్టుడు.
మౌనము వాక్కునకే కాదు మనస్సునకు కూడా యుండవలెను. భక్తుడు నిరంతరము దైవమందు లగ్నమైన చిత్తము కలిగియుండును, దైవమును గూర్చీ సదామననము చేయునందువలన అధికముగా మాట్లాడలేడు. అని కేతుడనగా దేహాభిమానము లేనివాడని అర్థము
స్థిరమతిః దైవపరమైన విషయమందుగాని, ప్రాపంచిక విషయమందుగాని స్థిరమైన నిశ్చయములు గలవాడని భావము. భగవంతుడు బాహ్యమైన సుఖ సంతోషాలనిస్తే భక్తిని ప్రదర్శించటం, లేదంటే ముఖం చాటెయ్యటం కాదు. సర్వకాల సర్వావస్థలయందు సుఖ దుఃఖములందు మానావమానములయందు, భగవంతునిపై నిశ్చలభక్తిని ప్రదర్శించుటే నిజభక్తి, ఇటువంటి సద్గుణములతో అలరారువాడే నిజ భక్తుడు. ఇవన్నియును జ్ఞానియొక్క లక్షణములుగా తోచుచుండుట చేత వాస్తవముగా పరాభక్తికినీ, జ్ఞానమునకు ఖేదమేలేదని తేలుచున్నది. చిత్తము వికాశమునొందుచు భక్తుడు క్రమముగా సర్వాంతర్యామియగు ఆత్మదేవుని తన మనః పుష్పములచే పూజించును.
ఈ ప్రపంచమున మనుజుడు సంపాదించదగిన సమస్త పదార్థములకంటే సర్వోత్తమమైనది, అమూల్యవంతమైనది ఈ భగవత్ప్రీతియే అయివున్నది. కావున దానిని తప్పక సంపాదించవలయును. అది ఎట్లు లభించగలదు? గీతయందు తెలుపబడిన సద్గుణములను చక్కగా అవలంబించినచో భగవంతుడు ప్రీతినొందగలడు. మనకు భగవంతునిపై ప్రీతిగలదని భావించవచ్చును. భగవంతునికి మనపై అనుగ్రహము కలదా అని యోచించవలెను. మాతృమూర్తి బిడ్డను ప్రేమించినట్లుగా భగవంతుడు మనలను ప్రేమించాలి. ఏ మానవుడైననూ పై సుగుణములను అవలంబించి దైవానుగ్రహమునకు పాత్రులుకావలయును.

యేతు ధర్మ్యామృతమిదం యధోక్తం పర్యుపాసతే
శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవమే ప్రియాః
- 20వ శ్లోకం

ఎవరైతే శ్రద్ధావంతులై , నన్నే పరమగతిగనమ్మీ , ఈ అమృత రూపమగు మోక్షసాధనమైన ధర్మమును, చెప్పబడిన ప్రకారము అనుష్టించుదురో వారు నాకు మిక్కిలి ఇష్టులు. ఇట్టి ధర్మములను శ్రధ్ధాభక్తులతో అనుష్టించువారికి కలుగు ఫలితమును చెప్పుచున్నారు. భగవానుడు భక్తుని లక్షమములను పేర్కొని పేర్కొని కడకు వానిని అనుష్టించుటవలన కలుగు గొప్ప ఫలితమును గూడా చెప్పెను, ఆ ఫలితమేమి ?
భగవంతునికి పరమ ప్రీతిపాత్రులగుటయే ఇంతకుమించిన ఫలితము జీవులకేమికావలయును భగవత్కృపకు మించిన వస్తువు ముల్లోకములలో మరియొకటిలేదు. ఏలయన అట్టి కృప మోక్షమునకు దారితీయును. ఎట్లన భగవదనుగ్రహముగలవారికి బుద్ధి యోగము సంప్రాప్తించును. దానిచే అతనికి మోక్షము లభించును.
"ధర్మ్యామృతమ్" పైన తెలుపబడిన ధర్మములు అమృతరూపముగ వర్ణించబడినవి. ఎందువలననగా, జననమరణములనుండీ తప్పించగల సామర్థ్యము వానియందుగలదు.జీవుని అమరునిగా చేయగల శక్తి వానియందు గర్భితమైయున్నది. భగవంతుడు కరుణతో అమృత వర్షమును కురిపించెను. వారి వారి బుద్ధియను పాత్రనిండుగా అమృతమును పట్టి తనివితీరా త్రాగుట జీవుల ధర్మము. అట్టి ధర్మములనేప్రకారము అనుష్టించవలెను.
శ్రద్ధధానాః శ్రద్ధతో అనుష్టుంచవలెనని చెప్పబడినది. అనేక పర్యాయములు గీతయందు భగవానుడు శ్రద్ధ యొక్క ఆవశ్యకతను పేర్కొనుట గమనించవలయును. పరాత్పరుడే పరమగతియని నమ్మి అతనిని ధ్యానించుచు ఆయా సుగుణములను ధర్మములను అనుష్టించవలెను. ఆ ప్రకారమాచరించువారు తనకు మిక్కిలి ప్రియులని గీతాచార్యుని భావము. భగవంతునికి ప్రీతిపాత్రుడైన జీవుని యొక్క మోక్ష విషయమై ఏ సందేహము అక్కరలేదు కావున ముముక్షువులు త్వరపడి భగవత్ప్రాక్తమగు ఈ ధర్మామృతమును తనివితీరా పానము జేసి కృతార్థులగుటకై యత్నింపవలయును.
ఇట్లు
సకల జన శ్రేయోభిలాషి
మీ రెడ్లం రాజగోపాలరావు
పలమనేరు

No comments:

Post a Comment

Pages