శంకరం పెళ్ళి - అచ్చంగా తెలుగు
శంకరం పెళ్లి (కథ )    
జీడిగుంట నరసింహ మూర్తి 

శంకరానికి వారం రోజుల్లో పెళ్లవు తుందనగా గోదావరికివరదలోచ్చాయి. గోదావరికి గండి పడి నీళ్ళు ఉదృతంగా ఇళ్ళల్లోకివచ్చేసాయి. మళ్ళీ ఆర్నేల్లవరకు సరైన పెళ్లి ముహూర్తాలు లేవనిశంకరం కాబోయే మామగారు వరద కాదు ప్రళయం వచ్చి పడినాపెళ్లి చేసెయ్యాలని నిర్ణయించేసాడు.
శంకరానిది ఒక ప్రైవేటు కంపనీలో ఉద్యోగం. “ పెళ్ళికి నాలుగురోజులు సరిపోవా ?” అన్నాడు లీవ్ లెటర్ ను కోపంగా చూస్తూశంకరం  బాస్. అతని బాసుకు ముప్పై ఐదేళ్ళు వచ్చినా ఇంకా పెళ్లికాలేదు. అతనికో పెళ్లి కాని అక్కగారు కూడా ఉంది. ఇరవై ఎనిమిదిదాటిన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రంత చాదస్తుడు ఈప్రపంచంలో ఎవరూ ఉండరు. మగ పెళ్లి వారితో తిక్క తిక్కగామాట్లాడి ఎన్నో సంబంధాలు చెడగొట్టు కున్నాడు. ఆయనకుకావలసింది పెళ్లి కొడుకుకి తెలివి తేటలున్నాయా లేదా అనేది కాదు.పెళ్లి కొడుకు తండ్రి కూడా బాగా చదువుకున్న వాడై తను అడిగినప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పగలిగి ఉండాలి. తన కూతుళ్ళుఇంగ్లిష్ ఎం. ఏ చదివారని, పెళ్లి కొడుకు తెలుగు ఎం.ఏ అని “ మేముఇంగ్లీష్ వాళ్ళం. మీరు తెలుగు వాళ్ళు . ఈ సంబంధం ఎలాచేసుకునేది?” అంటూ తను ఆడపిల్లల తండ్రనే విషయం పూర్తిగామర్చిపోయి భాద్యతారహితంగా కూతుళ్ళ పెళ్లి వాయిదావేసుకుంటూ వస్తున్నాడు. ఆఖరికి ఒక కూతురు అర్థరాత్రి తండ్రినికత్తితో బెదిరించి “ పెళ్లి చేస్తావా లేకపోతే ఎవరితోనైనా లేచిపొమ్మంటావా ?” అంటూ కోపంగా అరిచింది. వేరే ఇళ్ళల్లోపెళ్ళిళ్ళు అవుతున్నాయంటే ఆయనకు ఎంతో అసహనంగావుండేది. కాని తన తప్పు తను తెలుసుకోవడానికి ఆయన ఎప్పుడూప్రయత్నించ లేదు. ఆయన కొడుకైన శంకరం బాస్ నారాయణకుఅప్పటినుంచి ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నట్లుగా తన దగ్గరకుశుభలేఖ తీసుకు వస్తే చూసి చూడనట్లుగా పక్కన పడేసేవాడు. లీవ్ఇవ్వడానికి ఒక పట్టాన ఒప్పుకునే వాడు కాదు. 
బాస్ ఎక్కువ రోజులు లీవ్ ఇవ్వలేదన్న బాధ ఒక వైపు, గోదావరికివరదలు మరోవైపు అసలు పెళ్లి చేసుకోవడానికే చిరాగ్గా ఉందిశంకరానికి. బాసును నిర్లక్ష్యం చేసి ఇంకా నాలుగైదు రోజులు సెలవుఎక్కువ వాడుకుందామంటే అసలే ప్రైవేటు కంపనీలో ఉద్యోగం.తీసేయడానికి నిమిషం పట్టదు. అందూనా తను పెళ్లిచేసుకోబోతున్నాడు. తన తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తులూపాస్తులూ అంటూ ఏమీ లేవు. ఉద్యోగం పోగొట్టుకుని చెట్టుకిందకాపురం పెట్టలేడు. 
వరద తగ్గు ముఖం పట్టాక హైదరాబాద్ నుండి ముప్పై మందికి పైగాబయలుదేరి రాజమండ్రి చేరారు. పెళ్ళివారు తమ రాక కోసం రెండుమూడు గుర్రబళ్ళు వేసుకుని సిద్దంగా ఉన్నారు. పెళ్లి కొడుకు ఇంకాకొంతమంది ముఖ్యమైన వాళ్లకు ఒక కారును పంపారు. మధ్యలోకారు బురదలో కూరుకు పోవడంతో శంకరం కూడా మట్టిలోకి దిగికారు తోయాల్సి వచ్చింది. వాళ్ళందరిని చూస్తూంటే మగపెళ్లివారిలా కనిపించడం లేదు. అప్పుడే మట్టిపని చేసోచ్చినవాళ్ళల్లా వున్నారు. విడిది ఇల్లు కనిపించ గానే గుర్రాలు గట్టిగాసకిలించాయి. అదో పెద్ద పెంకుటిల్లు. చూర్లు ముందుకు వాలిపోయివున్నాయి. తల జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన జనం అంతాలోపలి ఎగబడ్డారు.
ఒక పక్క తుఫాన్ తాలూకు చాయలు ఇంకా కనిపిస్తూనే వున్నాయి.చలి గజగజా వణికించేస్తోంది. అందులో శీతాకాలం కూడా. దానికితోడు అప్పడే వడుగూ, స్నాతకం. శంకరానికి ఆ పెంకుటింట్లో ఒకగది కేటాయించబడింది. కాని అప్పటికే ఎవరో ఆడవాళ్ళు ఆ గదిలోపౌడర్ కోటింగులు వేసేసుకుంటున్నారు. వాళ్ళు శంకరాన్ని పెళ్లికొడుకుగా గుర్తించ లేదనుకుంటా. అనుకోకుండా శంకరం ఒక కర్రముక్కలతో చేసిన కిటికీ లోంచి దొడ్డివైపు చూసాడు. అక్కడమోపులు మోపులుగా తడిసిన కట్టేలున్నాయి. వాటినిమండించాలన్న ప్రయత్నంలో కొందరు ఆపసోపాలు పడుతున్నారు.వాళ్ళ వొళ్ళు మండి పోతోందే తప్ప కట్టెలు మాత్రం మండటం లేదు.ఈ లోపు శంకరం బంధుమిత్రులు, వదినలు, అక్కలు కొద్దిగా కాగిననీళ్ళతోనే స్నానాలు చేసి ముస్తాబై పోతున్నారు. శంకరం స్నానంచేసాడా లేదా అన్న ఆలోచన అక్కడివారికి లేదు. అసలక్కడ పెళ్లికొడుకు అనే ఒక జీవి ఉన్నాడని వాడికి అన్నీ చూసాకనే మిగిలినవాళ్ళ విషయం అన్న ధ్యాస ఎవ్వరికే లేదు. ఈ లోపు ప్లాస్క్ ల్లోకాఫీలు వచ్చాయి. ఒక గుంపు వాటిపై పడి పగల గొట్టేసారు. ఒకప్రక్క బ్రాహ్మణులు వడుగు ముహూర్తానికి టైమవుతోందని కంగారుపెట్టేస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుల్లా శంకరం తల్లితండ్రులు పట్టుబట్టలు కట్టుకుని తయారై పోయారు. శంకరం మాత్రం ఎలాగో పాచిముఖం మాత్రం కడుక్కో గలిగాడు. దొడ్లో బలవంతంగా వెలిగించినకట్టేలేప్పుడో ఆరిపోయాయి. శంకరం ఇంకా స్నానం చెయ్యలేదనితెలుసుకున్న ఒక పిల్ల పురోహితుడు శంకరం పెడ రెక్కలు విరిచిదొడ్లోకి లాక్కుపోయి అక్కడున్న గంగాళంలో నుండి పది చెంబులనీళ్ళు అతని బుర్రపై గుమ్మరించాడు. శంకరానికి ఈ హటాత్పరిణామానికి ఊపిరాడలేదు. అతనికో మంచు పర్వతాన్నికౌగిలించు కున్నట్టుగా ఉంది. వొళ్ళంతా పొగలోచ్చేస్తున్నాయి.ముక్కులు బిగపట్టేస్తున్నాయి. అతని ప్రమేయం లేకుండానే అతనికిపంచెలు మార్చ బడ్డాయి. వేసవిలో కూడా సలసల కాగే నీళ్ళనుపోసుకునే అతనికి తుఫాన్ పట్టిన ఈ శీతాకాలంలో ఐసు ముక్కలతోస్నానం చేయించినందుకు అతనికి అక్కడున్న వారందరిపై కసిగాఉంది. పురోహితులు మంత్రాలు చదువుతూ శంకరాన్ని కూడా మధ్యమధ్యలో చదవ మంటున్నారు. అతని నోటికి గట్టిగా అటో మేకు,ఇటో మేకు, వేసి బిగించినట్టుగా ఉండటంతో కనీసం నోరు కూడామెదపలేక పోయాడు. పులి మీద పుట్రలా “ అబ్బాయిని మళ్ళీస్నానం చేయించుకుని రండి “ అని పురోహితులు అజ్ఞాపించడంతోమళ్ళీ పిల్ల పురోహితుడు ఈ సారి మళ్ళీ ఈడ్చికెళ్ళినట్లుతీసుకువెళ్ళి మళ్ళీ పది చెంబులు భళ్ళున గుమ్మరించాడు.అతన్నిఒక మహా సముద్రంలో మధ్యలో ;బయటకు కొట్టుకు రాకుండావిసిరేసినట్లుగా అనిపించింది. ఒక పక్క ఇదేమి పట్టనట్టుగాబంధుమిత్రులు వేడి వేడి ఉప్మా లాగించేస్తూ ఎడమచేత్తో కాఫీనినోట్లోకి వంచుకున్తున్నారు. శంకరంలో మెల్ల మెల్లగా ఒళ్ళునొప్పులు ప్రారంభమయ్యాయి. ముక్కు పుటాల్లోంచి నీళ్ళు కారడంమొదలు పెట్టాయి. ఒక పక్క తడిసిపోయిన చితుకుల్నిమండించాలని ఒక బ్రాహ్మణుడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు.ఆ పొగలతో శంకరం మొహం మీద దట్టంగా కమ్మేసింది. అతనికి ఆపొగల మధ్య ఒక్కసారి భళ్ళున కడుపుతీరా ఏడ్చీయ్యాలనిపించింది. పొగకి కళ్ళ నీళ్ళు ఎలాగూ వస్తాయి కనుకతానేడుస్తున్నాడని ఎవరికీ తెలియదు.
వరండాలో పదిహేను పదహారేళ్ళ ఆడపిల్లలు వయ్యారంగాఅక్కడున్న వాళ్లకు కాఫీలు, టీలు అందిస్తున్నారు.
“మీ దుంప తెగిపోనూ. ఒక కప్పు కాఫీ నా మొహాన తగలేయ్యండ్రా “అని అరవాలనుకున్న ప్రయత్నం ఫలించలేదు. వడుగు కార్యక్రమంపూర్తయ్యింది. ఎంత సేపటికి పైకి లేవలేక పోతున్న శంకరాన్ని ఎవరోబలవంతాన లేపి మంచంపై కూర్చో బెట్టారు. ఇప్పుడేదైనా రైలుంటేహైదరాబాద్ పారిపోతే బాగుణ్ణు అనుకున్నాడు శంకరం.
“ఇక స్నాతక కార్యక్రమం. నాయనా తయారవ్వు” అంటూ తొందరచేసారు పురోహితులు. శంకరానికి మాత్రం ఒక మూల రగ్గు కప్పుకుని మూడంకె వేసి పడుకోవాలని ఉంది. అసలు పెళ్లి ముహూర్తానికి ఆపెళ్లి కూతురికి తనతో కాకుండా ఇంకెవరితోనైనా పెళ్ళైతే బాగుణ్ణుఅన్న వింత ఆలోచన కూడా అతనికి కలిగింది. తనింతఅయోమయంగా , అధోగతిలో ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోరే !అసలు తనున్నానని గ్రహించకుండా కొందరాడవాళ్ళు ఏమీపట్టించుకోకుండా చీరలూ, జాకెట్లూ, మార్చేసు కుంటున్నారు. తనగదిలో వాళ్ళను చూడలేక తను సిగ్గుతో చచ్చిపోతున్నాడే తప్పవాళ్ళకేం పట్టడంలేదు.
రాత్రి పదకొండు గంటలకు పెళ్లి. తెల్లవారు ఝామున మూడుగంటలకు గృహ ప్రవేశం. విడిదంతా గురకలు పెట్టే వాళ్ళతోరామడోలు వాయిన్చినట్టుగా ఉంది. తనకు కేటాయించిన గదిలోఎవరో ఒకరి మీద ఒకరు పడుకుని నిద్ర పోతున్నారు. ఇక చేసేది లేకకండువా నెత్తి కింద పెట్టుకుని గడప మీదే నిద్రపోయాడు శంకరం.
ఉదయానికి కొంతమంది చుట్టాలు పక్క ఊళ్లకు సర్దుకున్నారు.శంకరం గది ఖాళీ అయ్యింది. “ నిన్నంతా మీరు చలితోనూ,తలనొప్పితోనూ భాధ పడ్డారుటగా ఈ మాత్ర వేసుకోండి “ అంటూవేడి వేడి కాఫీతో మాత్ర అందించిన కొత్త పెళ్లి కూతురు అదే తనభార్యను చూడగానే శంకరం జరిగిందంతా చెప్పాలనుకున్నా తనఅవివేకాన్ని బయటపెట్టుకున్నట్టుగా ఉంటుందని  మీ వాళ్ళుఏర్పాట్లు జీవితంలో మరిచిపోనంతగా  బాగా చేసారోయ్ “అన్నాడుఏడవలేక నవ్వుతూ ..

“నిజమా చాలా థాంక్స్ అండీ " అంటూ అమాయకంగా నవ్వుతూ శంకరం పక్కనే గువ్వలా ఒదిగిపోయింది కొత్త పెళ్లి కూతురు .సహజంగా ఎవరి మనసును నొప్పించడం చేతకాని శంకరం ఆతర్వాత కాలంలో కూడా తన భయంకర అనుభవాలను భార్యతోకానీ ఆమెకు సంబంధించిన వాళ్ళతో ఎవరితోనూ పంచుకోలేదు। 
( ఆంధ్ర జ్యోతి వారపత్రిక 6-11-98 లో ప్రచురితం )
***

No comments:

Post a Comment

Pages