శ్రీ మద్భగవద్గీత -28 - అచ్చంగా తెలుగు
శ్రీమ్భగవద్గీత - 28
12 వ అధ్యాయము

రెడ్లం రాజగోపాలరావు 

భక్తి యోగము

శ్రేయోహిభ్యానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే
ధ్యానాత్కర్మ ఫలత్యాగ స్త్యాగాచ్ఛాంతి రనన్తరమ్
-      12వ శ్లోకం

అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్ఠమైనది , జ్ఞానము కంటెను ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము శ్రేష్ఠమైయున్నది. అట్టి కర్మఫల త్యాగము వలననే పరమశాంతి లభించుచున్నది. త్యాగమే నిజమైన యోగము కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పినారు. అధిక జనులకు నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగానున్నది.

దుఃఖ భూయిష్టమగు ఈ సంసారమున ప్రతి మనిషి శాంతిని అభిలషించుచున్నాడు. కాని ఆ శాంతి ఎటుల లభింపగలదో తెలియలేకున్నాడు. త్యాగము వలననే శాంతి చేకూరగలదని గీతాచార్యుడిచట స్పష్టముగా తెలియజేసెను. ప్రతివ్యక్తి కూడను ఈ సంసారమనే మహావృక్షము నన్ను బంధంచి ఊపిరాడకుండా చేయుచున్నది. అందువలన నేను దైవ ధ్యానము చేయలేకున్నానని భ్రమించుచున్నాడు. నిజానికి సంసార మహావృక్షమును మనమే దృఢముగా బంధించుకొనియున్నాము.

దుర్లభమైన మానవ జన్మయొక్క పరమావధి ఏమి ?  భగవంతుని చేరుకొనుటయే. చర్విత చర్వణమైన జన్మ పరంపర నుండి విడివడి మరలా జన్మలేకుండా చేసుకొనుటయే.

మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. ఈ సమాజము ద్వారా జన్మను పొందాము. సమాజము ద్వారానే భౌతిక సుఖములను పొందుతున్నాము. అందుకు కృతజ్ఞతగా సమాజానికేమిచ్చాము ? చాలామంది తరతరాలకు సరిపడ్డ సంపద కూడబెట్టి వారసులకు మాచెడ్డ కీడు చేయుచున్నారు. సంపద వలన గర్వం , అహంకారం , సోమరితనం మొదలైన చెడు సంస్కారములు సంభవించును. నీరు నిలువయున్నచో చెడిపోవును. పారే నీరు శ్రేష్ఠమైనది. ఫలితమాసించని సేవ వలన అనంతమైన శాంతి లభించుచున్నది. మనకున్న సంపదనంతా సమాజసేవకుపయోగించమని అర్థముకాదు. మనము ఎల్లప్పుడు నిష్కామకర్మాచరణను ధ్యేయమునందుంచుకొని, మన వలన సమాజానికి ఎలా మంచి జరుగుతుందని చింతన చేస్తూ ఉండాలి. అట్టి నిష్కామకర్మాచరణయోగం ద్వారా భగవంతుడుకి చేరువయ్యే ప్రయత్నం మానవుడు ఆచరించాలి. అదియే దైవాన్ని చేరుటకు దగ్గరిత్రోవ.

అద్వేష్టా సర్వ భూతానాం మైత్రః కరుణ ఏవచ
నిర్మమోనిరహంకారః సమ దుఃఖ సుఖః క్షమీ
-      13 వ శ్లోకం


సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః
మయ్యర్పిత మనోబుద్ధి ర్యోమద్భక్తస్సమే ప్రియః
-      14 వ శ్లోకం

సమస్త ప్రాణుల యెడల ద్వేషము లేనివాడును , స్నేహము కరుణ కలవాడును , అహంకార మమకారము కలవాడును , సుఖదుఃఖములందు సమభావము కలవాడును నేర్పుగలవాడు ఎల్లప్పుడు సంతృప్తితో యుండువాడు, మనస్సును స్వాధీనపరుచుకొనువాడును, మనస్సు బుద్ధి నాయందు సమర్పించువాడును, నాయందు భక్తిగలవాడు నాకు ప్రియమైనవాడు.

వాస్తవముగ భగవంతునికి ఏ ప్రాణిపైనను ప్రీతిగాని , ద్వేషముగాని లేదు. ఎవరు భక్తితోసేవింతురో వారిపై నాతడనుగ్రహమును వర్షించును. భగవదనుగ్రహమువలన ఆత్మ జ్ఞానము, తద్వారా ముక్తిని అతడుపొందును. అనేకులకు భగవంతునిపై ప్రీతియుండును కానీ అది చాలదు. భగవంతునికి తనపై ప్రీతి జనించినదాయని పరీక్షించుకొనవలెను. ఐతే భగవంతుడు తాను చెప్పిన సుగుణములు కలవాడే ప్రియుడని “యోమద్భక్తస్సమే ప్రియః” అను వాక్యము ద్వారా తెలియజేసెను.

దైవ విషయమునగాని, ప్రపంచవిషయమునగాని స్థిరమైన నిర్ణయములు గలిగి సాధనయందు దృఢ నిశ్చయముతో గూడియుండవలెను. ఇది అవునో కాదో అను ఊగులాట పనికిరాదు. దేవుడున్నాడు అతనిని నేను పొందితీరెదను అను దృఢ నిశ్చయము కలిగియుండవలెను. లేనిచో మాయ చంచల మనస్కుని బ్రష్టుని చేయును. మనస్సుతో బాటు బుద్ధిని కూడా తనయందు నిలుపవలెనని గీతయందు పరమాత్మ హెచ్చరికలు చేయుచున్నాడు. ఏలనన మనస్సు వికలాత్మకమైనది గనుక, నిశ్చయాత్మకబుద్ధితో దానిని చేరనిచో మనస్సు చంచలముగనేయుండి లక్ష్యమును పొందజాలకుండును.

అనపేక్షశ్శుచిర్దక్ష ఉదాసినో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ యోమద్భక్తస్సమే ప్రియః
-      16వ శ్లోకం


కోరికలు లేనివాడును బాహ్యాన్తరశుద్ధిగలవాడును, కార్యసమర్ధుడును, దుఃఖములేనివాడు, సమస్త కార్యములందు కర్తృత్వమును వదలిన వాడు, నాయందు పూర్ణభక్తి కలవాడును ఎవరుకలరో, అతడు నాకు ఇష్టుడు. గీతాచార్యుడు శుచిత్వమునిచట చెప్పుచున్నాడు. బాహ్య, అంతరశుచి కలిగి నిర్మలముగా నుండవలెను. మురికియందున్నవానికి మురికి భావములే కలుగును. సమర్థతతో సమయస్పూర్తితో ఆధ్యాత్మిక సాధన నిర్వర్తించుకొనుచు పోవలెను. అజాగ్రత్తగా నున్నచో మాయపడగొట్టి వేయగలదు.

భక్తుడగువాడు అన్నిటికీ మూలాధారమైన దైవాన్ని ఆశ్రయించినాడు కాబట్టి దిగులునొందవలసిన విషయము ఈ ప్రపంచమున ఏమియును లేదు. కావున దిగులు దుఃఖము దరకి జేర్చరాదు.

“సర్వారంభ పరిత్యాగి” కార్యములన్నింటినీ సంపూర్ణముగా పరిత్యజించువాడనగా దైవేతరములగు సమస్త కార్యములను విడిచిపెట్టువాడు, అనగా సమస్త కార్యములందు కర్తృత్వ బుద్ధిని విడనాడు వాడని యర్థము.

భగవంతుడు భక్తుని యొక్క దివ్యలక్షణములను ఈ శ్లోకమందు విపులీకరించినాడు.

ఇట్లు
సర్వజన శ్రేయోభిలాషి
రెడ్లం రాజగోపాలరావు 
పలమనేరు.

No comments:

Post a Comment

Pages