లోవరాజు కధలు - రమణమ్మ గారబ్బాయి శేషు - అచ్చంగా తెలుగు

లోవరాజు కధలు - రమణమ్మ గారబ్బాయి శేషు

Share This
లోవరాజు కధలు - 21
రమణమ్మ గారబ్బాయి శేషు
కంభంపాటి రవీంద్ర 

'పాకం గార్లెప్పుడూ వేడి వేడిగా తినాలి .. ఇంకో రెండు వడ్డించు మావోడికి ' వాళ్ళావిడ తో అన్నాడు లోవరాజు.
ఆ ఆదివారం మధ్యాన్నం వాళ్ళింటికి బోయనానికి పిలిచేడు నన్ను , కడుపు నిండా తెగ తినేసి , వాళ్ళ అరుగు మీద చెరో పడక్కుర్చీ లో కూచుని కబుర్లు చెప్పుకుంటూండిపోయేము . టైమెలా గడిచిపోయిందో తెలీలేదు .. అప్పుడే సాయంత్రమైపోవడం , లోవరాజు వాళ్ళావిడ పాకం గార్లేసేయడం కూడా అయిపోయింది !
'టేస్టు అదిరిపోయింది ' అన్నాను.
'ఇవేం తిన్నావులే గానీ మన రమణమ్మ గారి శేషు చేసిన గార్లు తిన్నావంటే .. జన్మ పరిపూర్ణమైందనేసుకుంటావు ' అన్నాడు లోవరాజు.
'శేషంటే ఎవరూ ? కూరపాటోళ్ల అబ్బాయి శేషేనా ?' అన్నాను.
'అవును .. ఆడే ' అన్నాడు.
'మరి శేషు అని చెప్పక , రమణమ్మ గారి శేషంటావేంటీ ? గౌతమీ పుత్ర శాతకర్ణి లాగా ?' అడిగేను.
'సరే .. ఆడి కధ చెబుతాను .. నువ్వే చెప్పు మరి ఆడినేం పిలవాలో ' అంటూ మొదలెట్టేడు లోవరాజు.
కూరపాటి రమణమ్మ గారికి ఎనమండుగురు పిల్లలు .. ఆళ్లందరూ ఎదిగీ ఎదగని వయసులోనే పైలోకాలకి ప్రయాణం కట్టేసేడు వాళ్ళాయన కామేశ్వర్రావు .  ఇంట్లో కాఫీపొడి ఆడే మిషనొకటెట్టుకుని , ఊళ్లోని కిరాణా కొట్లకి కాఫీ పొడి సప్లై చేసేవాడాయన , అదే పని రమణమ్మ గారు పిల్లల్ని పోషించడానికి తలకెత్తుకుంది . ఇంతకాలం ఇంటిపట్టునే ఉన్నావిడేమో, లోకం పోకడ తెలియక పెద్ద కొడుకు శేషు గాడికి ఊళ్లోని కొట్లకి సప్లై చేసే పని అప్పజెప్పిందావిడ .
పదహారేళ్ళ శేషు గాడికి ఈ కాఫీ పొడి యాపారం తో తమ్ముళ్ళనీ , చెల్లెళ్ళనీ పోషించలేమని అర్ధం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. తను కాఫీ పొడి సప్లై చేసే కిరాణా కొట్లల్లో జనాలు ప్రియా పచ్చళ్ళు ఎగబడిపోయి మరీ కొనేసుకోవడం చూసి, అవే పచ్చళ్ళు తనూ , తన తల్లీ పెట్టి అమ్మితేనో అనే ఆలోచనొచ్చింది, అసలే తన తల్లి రమణమ్మ గారి వంట మీద విపరీతమైన నమ్మకం ఆడికి !
తల్లీ కొడుకులిద్దరూ కలిసి ఇంటి పెరట్లో ఉన్న ఉసిరి, చింత  చెట్ల నుంచి ఉసిరావకాయ , చింతకాయ పచ్చడి తో మొదలెట్టి మెల్లగా సీజన్ బట్టి ఆవకాయ, మాగాయ , దబ్బకాయ , టమాటా పచ్చళ్ళు కూడా పెట్టేవారు . రుచి బావుండటం తో ఆళ్ళు సప్లై చేసిన పచ్చళ్ళు ఏ రోజుకా రోజుకే ఎగబడి మరీ కొనేసుకునేవారు జనాలు .
ఇన్ని వ్యాపకాల మధ్య చదువుని పక్కనెట్టేసేడు శేషు గాడు. 'అదేమిట్రా తమ్ముళ్లూ , చెళ్ళెళ్ళూ చదూకుంటూంటే , నువ్వు చదువు పక్కనెట్టేస్తున్నావూ ' అని రమణమ్మ గారు బాధపడితే , 'బతకడానికి అవసరమైన చదువు నీ దగ్గిర నేర్చుకున్నాలేవే ' అని ఊరుకోబెట్టేడు !
వీడూ , వీళ్ళమ్మా కష్టపడి బాగానే సంపాదిస్తూండడంతో , తమ్ముళ్ళకీ , చెల్లెళ్ళకీ చదువులు బాగానే అబ్బేయి . రమణమ్మ గారికి ఉబ్బసం , డయాబెటీస్ కట్టగట్టుకునొచ్చేసరికి , శేషుగాడే పచ్చళ్ళ వ్యాపారం , కాఫీ పొడి వ్యాపారం చూసుకునేవాడు . వాళ్ళ వీధిలోని బ్రేమ్మలావిడ ఆదుర్తి కామాక్షి గారిని పిల్లలు పట్టించుకోకపోతే , ఆవిణ్ణి పన్లోకి తీసుకుని, బతకడానికో దారి చూపించేడు .
ఒకరోజా బ్రేమ్మలావిడ పన్లోకొస్తూ గుమ్మడికాయ పులుసు చేసుకునొచ్చేరు , ఆ రుచి చూసిన శేషు గాడు , 'ఇదేంటండీ  బాబూ .. ఇంత రుచిగా ఉంది ' అని ఆవిణ్ణి బతిమిలాడేసి ఆవిడకొచ్చిన వంటలన్నీ నేర్చేసుకున్నాడు .
'కొంపదీసి పెళ్లిళ్లకీ , శుభకార్యాలకీ క్యాటరింగ్ మొదలెట్టేడా ఏంటి ?' అడిగేను 
'బాగానే ఊహించేవు .. జనాలు ఇంట్లో తయారు చేసే కాఫీ పౌడర్లు మానేసి , బ్రూలు , నెస్కేఫ్ లు మొదలెట్టేరు కదా ..కాబట్టి ..వీడు కాఫీ పొడి యాపారం పక్కనెట్టేసి , క్యాటరింగ్ లోకి దిగిపోయేడు ' అంటూ చెప్పుకుపోతున్నాడు లోవరాజు !
శేషుగాడు ఆడికోసం ఏ సంబంధమొచ్చినా తిరగొట్టేసి , 'ఇంట్లో పెళ్లి కావాల్సిన తమ్ముళ్లూ , చెళ్ళెళ్ళూ ఉండగా , బుద్దున్నోడెవడైనా పెళ్లి చేసుకుంటాడా అండీ ?' అంటూ ఎదురు ప్రశ్న వేసేసేవోడు . తమ్ముళ్లూ , చెళ్ళెళ్ళూ బాగానే చదువుకుని వృద్ధిలోకొచ్చేసి , పెళ్లిళ్లు చేసుకునెళ్ళిపోయేరు , అప్పుడప్పుడూ తల్లినీ , అన్నయ్యనీ చూసుకోడానికి రావడం తప్పించి , ఎవరి జీవితాల్లో ఆళ్ళు బిజీగా ఉన్నారు . 
వాడి వంటలు ఎంత ఫేమస్సయిపోయినా , తల్లినొదిలి వేరే ఊరెళ్ళే బేరాలొచ్చేయంటే ఒప్పుకునేవాడు కాదు, 'మా అమ్మకి నేనొండిన వంటంటేనే ఇష్టమండి .. అసలా మాటకొస్తే నేను పన్జేసేదే ఆవిడి కోసమండి .. అలాంటిది ఆ మనిషినొదిలేసి వేరే ఊరెళ్లే పనులొప్పుకోలేనండి ' అంటూ ఓ నమస్కారం పెట్టేసి పంపించేసేవాడా శేషుగాడు . 
తనకి రోజులు దగ్గిరపడుతున్నాయి , తను లేకపోతే వీడెలా బతుకుతాడో అని కంగారడిపోయిన రమణమ్మ తన మీద ఒట్టెట్టించుకుని, బలవంతపెట్టి మరీ శేషుగాడికి తాళ్లూరి భాస్కర్రావు గారమ్మాయి ప్రభ తో పెళ్లి చేసింది. 
  
ఏదో పెళ్లంటే తల్లి బలవంతాన చేసుకున్నాడు గానీ , రోజూ ఆవిడ పడుకున్నాక గానీ పడగ్గదిలోకి వెళ్ళేవాడు కాదా శేషు గాడు . దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రభ , ;ఇంతందం ముందుంటే రోజూ ఆ ముసిలావిడని పట్టుకుని వేలాడతావేంటని ' ఎకసెక్కాలాడినా , నవ్వేసూరుకునేవాడు తప్ప , గొడవెట్టుకుంటే తల్లి బాధపడుతుందేమోనని ఒక్క మాటా అనేవోడు కాదు . 
రమణమ్మ గారికి ఉబ్బసం ఎక్కువయ్యి , గుండె జబ్బు కూడా తగులుకునేసరికి , ఆవిడకి రాత్రుళ్ళు ఒకటే దగ్గు .. కంగారడిపోయిన శేషు గాడు యాపారం పక్కనెట్టేసి , రాత్రీ , పగలూ తల్లితోనే ఉంటున్నాడు . సంపాదన తగ్గిపోయింది , తినడానికి లోటు లేకపోయినా వీడు రోజంతా ఇంటిపట్టునే ఉండడంతో , ప్రభకి ఒళ్ళు మండిపోయేది . చూసి చూసి ఓ రోజు తనవేపు పెద్దాళ్ళని పిలిపించుకుని గోడవెట్టేసుకుంది .. 'వీడసలు మొగాడే కాదు .. పెళ్ళైన తర్వాత ఎప్పుడూ తల్లి గొడవే తప్ప .. ఎప్పుడూ నాదగ్గిరకొచ్చిన పాపాన పోలేదు ' అనేసరికి , ఆ పిల్ల వేపు జనం కూడా , 'అసలు వంటలొండడమే ఆడంగి పని .. అనవసరంగా ఇలాంటి సంబంధం చేసేం .. ' అనుకుంటా ఆ ప్రభని తీసుకునెళ్లిపోయేరు !
ఆ తర్వాత శేషు గాడిని వాళ్ళమ్మ  'ఏరా .. నీకు మగతనం లేదు  అని ఆళ్లందరూ అంటూంటే కోపం రాలేదా ' అని అడిగితే , 'చాల్లేవే అమ్మా .. నిన్ను పట్టించుకోకుండా నా పెళ్ళాం పక్కలో పడుక్కోవడాన్నే మగతనమంటే అలాంటి మగతనం నాకెందుకే ' అన్నాడు !
'ఇప్పుడెలా ఉన్నాడా శేషుగాడు ?' అడిగేను 
'ఆ ప్రభ ఇల్లొదిలి వెళ్లిన రోజు రాత్రే నిద్దట్లో పోయేరా రమణమ్మ గారు .. రాజమండ్రి కెళ్లే దార్లో ఉండే రాజానగరం లోని వృద్ధాశ్రమం లోని ముసలాళ్ళకి వంటలు చేసుకుంటా బతికేస్తున్నాడు , రమణమ్మ గారి శేషు ' అంటూ లేచేడు లోవరాజు !

No comments:

Post a Comment

Pages