పరివర్తన - అచ్చంగా తెలుగు
పరివర్తన 
బి.ఎన్.వి.పార్ధసారధి 

వీరయ్య హోటల్ ముందు ఒక బిచ్చగాడు రోజూ ముష్టి అడుక్కుంటూ వుంటాడు. అతనికి దాదాపు ముప్పై ఏళ్లు వుంటాయి. ఎడమ కాలి పాదానికి కి పెద్ద గాయం అయిన గుర్తుగా పాదానికి రక్తపు మరకలతో కట్టిన కట్టు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. అది హైదరాబాద్ లో ఒక మెట్రో రైలు స్టేషన్ ప్రాంతం. పగలు రాత్రి కూడా బాగా రద్దీగా వుండే ప్రదేశం. దారిన  పోయే వాళ్ళలో చాలామంది ఈ బిచ్చగాడికి చిల్లర వేస్తూ వుంటారు. వీరయ్య రాత్రి తన హోటల్ మూసి ఇంటికి వెళ్ళే సమయంలో రోజూ ఆ బిచ్చగాడికి కాస్త అన్నం, పులుసుపొట్లం కట్టి ఇస్తాడు. అప్పుడప్పుడూ ఆ అన్నం పొట్లం తో పాటు కొంత చిల్లర డబ్బులు కూడా ఇస్తాడు. రాను రాను వీరయ్యకి ఇది అతని దినచర్యలో ఒక భాగం అయింది. 
ఆ రోజు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు. రాత్రి వీరయ్య హోటల్ మూసే సరికి దాదాపు ఒంటి గంట అయింది. అలయాటు ప్రకారం అన్నం, పులుసు పొట్లం చేత్తో పట్టుకుని ఆ బిచ్చగాడు మామూలుగా కూర్చుండే స్థలానికి వెళ్ళాడు. అతను అక్కడ కనిపించలేదు. బాగా రాత్రి అవటంతో అతను వెళ్ళిపోయి వుంటాడని అనుకుని ముందుకి నడుస్తూ వుండగా మెట్రో స్టేషన్ మెట్ల కింద బిచ్చగాడు కనిపించాడు. అక్కడ గోడకి ఒక ఇనప బాక్స్ వుంది. లోపల ఏవో కొన్ని వైర్లు , కరెంటు మీటర్లు వున్నాయి. అక్కడ కొంత ఖాళీ స్థలం వుంది. ఆ స్థలం లో బిచ్చగాడి సరంజామా భద్రం గా దాచాడు. వాటిల్లో వాడి దుస్తులు, దుప్పటి తో పాటు ఒక ఎర్ర రంగు ద్రవం వున్న బాటిల్, దూది కూడా వున్నాయి. బిచ్చగాడు వాడి ఎడం కాలికి వున్న కట్టుని ఇప్పదీసి , బాటిల్ లోని ఎర్ర రంగు ద్రవం దూది లో పోసి కాలికి కొత్త కట్టు కడుతున్నాడు. పక్కనే ఒక క్వార్టర్ బాటిల్ బ్రాంది కూడా వుంది. వీరయ్య బిచ్చగాడి కేసి చూసి క్షణం సేపు నిర్ఘాంత పోయాడు. మరుక్షణమే తమాయించుకుని వడి వడిగా నడుచుకుంటూ వెళ్లి సమీపంలో లో చెత్త బుట్ట చెంత తచ్చాడుతున్న కుక్క కి తన చేతిలో వున్న అన్నం,పులుసు పొట్లం ఇచ్చి వెనుదిరిగి ఇంటి ముఖం పట్టాడు. కుక్క కాస్తా ఆ పొట్లం నాలుకతో ఈడ్చుకుంటూ బిచ్చగాడి దగ్గరకి వచ్చి అతని దగ్గర పెట్టింది. ఇక్కడ హోటల్ యజమాని వీరయ్యకి తెలియని విషయం ఒకటి వుంది. ప్రతి రాత్రి వీరయ్య ఇచ్చే  పొట్లం లోని అన్నం, పులుసు , బిచ్చగాడు కుక్క ఇద్దరూ కలిసే తింటారు. అందుకే వీరయ్య కుక్కకి పొట్లం ఇస్తే అదికాస్తా ఆ పొట్లాన్ని బిచ్చగాడి దగ్గరకు తీసుకువచ్చింది. ఇందాక వీరయ్య తనకేసి క్షణం సేపు తీక్షణం గా చుసిన ఆ చూపు ఆ బిచ్చగాడి గుండెల్లో సూటిగా నాటుకుంది. అతనికి ఎందుకో ఏమీ తినాలనిపించ లేదు. క్వార్టర్ బాటిల్ బ్రాంది సీసాని చెత్త బుట్టలో విసిరేసాడు. వీరయ్య ఇచ్చిన పొట్లం ఇప్పి అందులోని అన్నం, పులుసు కుక్కకి పెట్టాడు. కుక్క కాస్త తిన్నాక మొరాయించింది. కుక్క తననికూడా  తినమంటుందని అతను గ్రహించాడు. అతను బలవంతంమీద నాలుగు మెతుకులు తిన్నాడు. మర్నాడు ఉదయం బిచ్చగాడు అడుక్కోవడానికి రాలేదు. రాత్రి హోటల్ కట్టేసాక వీరయ్య అన్నం పొట్లం కుక్కకి పెట్టాడు. వీరయ్య వెళ్ళిన మరుక్షణం కుక్క ఆ పొట్లాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి మెట్రో స్టేషన్ మెట్లకింద గోడ దగ్గర ముసుగు తన్ని పడుకున్న బిచ్చగాడిని లేపి అతని దగ్గర ఆ పొట్లం పెట్టింది. ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఐదో రోజు రాత్రి వీరయ్య హోటల్ తలుపులు మూస్తూ వుండగా అతనికి హోటల్ ముందు బిచ్చగాడు కనిపించాడు. అతని ఎడమ కాలు బాగానే వుంది. “ క్షమించడయ్యా ! తప్పు  చేసాను.” అన్నాడు బిచ్చగాడు వీరయ్యకేసి రెండు చేతులు జోడించి. వీరయ్య మాట్లాడకుండా మౌనంగానే వున్నాడు. “ నా కాలికి దెబ్బ తగిలిందని అందరినీ నమ్మించి రోజూ డబ్బులు అడుక్కునేవాడిని. మూడు పూటలు ప్రభుత్వం వారి అయిదు రూపాయల భోజన పథకం లో సుష్టుగా భోంచేసి మిగిలిన డబ్బులతో రాత్రి మందు తాగి పడుకునేవాడిని. మీరు రోజూ పెట్టే ఆ అన్నం పొట్లం లో నేను కాస్త ఆ కుక్కకి పెట్టేవాడిని. మీరు నిజం గ్రహించి రోజూ నాకు ఇచ్చే అన్నం పొట్లం కుక్కకి ఇవ్వటం మొదలు పెట్టారు. కానీ ఆ కుక్క ఆ అన్నం తినకుండా ఆ అన్నం పొట్లం రోజూ నాకు తీసుకునివచ్చి నన్ను తినమని బలవంతం చేస్తోంది. నోరు లేని జంతువు మనిషి పట్ల ఎంతో విశ్వాసం, నమ్మకం చూబెట్టినప్పుడు, సాటి మనిషి గా నేను నాకు లేని అవిటితనాన్ని మీచేత నమ్మించి నా పబ్బం గడుపుకోవాలని చూసాను. నా తప్పు దిద్దుకుని నేను నా కాళ్ళ మీద  నిలబడాలని అనుకుంటున్నాను. దానికి మీ సహాయం కావాలి. “ అని దీనంగా అన్నాడు బిచ్చగాడు. 
మర్నాటి నుంచి ఆ బిచ్చగాడు వీరయ్య హోటల్ లో క్లీనర్ అవతారం ఎత్తాడు. ఇప్పుడు అతను నాలుగు కుక్కలని పెంచి పోషిస్తున్నాడు.
***

No comments:

Post a Comment

Pages