నాకు నచ్చిన నా కధ (ఇది నాకధే) - ముమ్మిడి'వరం' - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ (ఇది నాకధే) - ముమ్మిడి'వరం'

Share This
నాకు నచ్చిన నా కధ (ఇది నాకధే) -ముమ్మిడి'వరం
శారదాప్రసాద్  

నా మొదటి appointment ప్రదేశం ,తూర్పుగోదావరి జిల్లాలోని ,ముమ్మిడివరం అనే గ్రామం.14-03-1973 న ఉద్యోగంలో చేరాను.ముమ్మిడివరం ఆ రోజుల్లో ఒక చిన్న గ్రామం.హై స్కూల్,స్టేట్ బ్యాంకు,ఆంధ్రా బ్యాంకు ,ఒక సినిమా హాలు...ఉన్నాయి.అది అమలాపురానికి చాలా దగ్గర.అమలాపురం పెద్ద పట్టణమే. కోనసీమలోని బ్యాంకు ఉద్యోగులు చాలామంది అమలాపురంలో ఆదివారంనాడు కలిసే వారు.ఆ రోజుల్లో ఆ ప్రాంతపు ఉద్యోగులకు నాయకుడు శ్రీ GVSS రామారావు గారు.ఆయన మాటే ఉద్యోగులకు శిరోధార్యం!ఆ రోజుల్లో బ్యాంకుల్లో యూనియన్స్ చాలా బలంగా ఉండేవి .ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకులను యూనియన్సే నడిపించేవి అనటంలో ఆశ్చర్యం,అతిశయోక్తి లేదు.గుంటూరు నుంచే నా స్నేహితుడైన శఠగోపంను అమలాపురంలో  పోస్ట్ చేశారు.అతను వంట అద్భుతంగా చేసేవాడు.శనివారం సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి దాకా అతని రూమ్ లోనే నా మకాం!నాకు ఇష్టమైన పదార్ధాలను చక్కగా వండి ,వార్చిచక్కని ఆతిధ్యం ఇచ్చేవాడు.చాలా సౌమ్యుడు.ఇప్పటికీ అతనితో నా స్నేహబంధం కొనసాగుతూనే ఉన్నది. శని ,ఆదివారాల్లో సినిమాలను చూసే వారం.ఇక ముమ్మిడివరం విషయానికి వస్తే ,అది నా పాలిట వరమే .జీవితంలో స్థిరపడటానికి కారణమైన ఆ వరాన్ని నేనెప్పుడూ మరువలేను.బ్యాంకు మేనేజర్ గారి పేరు శ్రీ కొప్పినీడి రామన్న గారు!మనుషుల్లో దేవుడు ఆయన!ఆయన భార్య కూడా నన్ను సొంత కుమారుడి కన్నా బాగా చూచుకునేవారు.వారికి ముగ్గురు మొగ  సంతానం,ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు.పెద్ద అబ్బాయి,చిన్న వాడికి లేని దురలవాట్లు లేవు.వాళ్ళు సకల కళా వల్లభులు.మధ్య కుమారుడు సర్వేశ్వరరావు, పాలకొండ లోని ఆంధ్రాబ్యాంక్ లోనే  పనిచేసేవాడు.బ్యాంకులో చేరగానే మేనేజర్ గారు పిలిచి --ఈ ఊళ్ళో ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు, ఇబ్బంది లేదు,మా కుమారులతో తప్ప!మా పిల్లలు మిమ్మల్ని చెడగొడుతారు అని చెప్పారు.ఎవరో చెడకొడితే చెడిపోయేటంత అసమర్దుడిని కాను నేను ,నాకు స్వయం ప్రకాశం ఎక్కువ!నన్ను నేను తప్ప మరెవరూ చెడగొట్టలేరని ,మనసులోనే అనుకున్నాను.బ్యాంకు పైన మేనేజర్ క్వార్టర్స్ ఉండేవి.దానికి ఎదురుగానే నా రూమ్. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయాన్నిచెప్పటం మరచిపోయాను.ముమ్మిడివరంలో నేను కాపురం పెట్టలేదు .కారణం--నా భార్య అప్పటికే గర్భవతి.మొదటి కాన్పు కనుక పెద్దవాళ్ళ దగ్గరే ఉంచటం మంచిదని నిశ్చయించారు.అందువల్ల ముమ్మిడివరంలో నేను ఒంటరిగానే ఉన్నాను.పొద్దున్నే మేనేజర్ గారింటి నుంచి స్నానానికి వేడి నీళ్లు వచ్చేవి.ఆ తర్వాత వెంటనే వేడి వేడి ఫలహారాలు వచ్చేవి.కొద్దిగా ఇబ్బందిగా భావించే వాడిని.మేనేజర్ గారు ,ఇది గ్రహించి మందలించారు.ముమ్మిడివరం అనగానే గుర్తుకొచ్చేవి రెండు.ఒకటి బాలయోగి,రెండవది కళావంతులు (అంటే ఆ రోజుల్లో వారిని భోగం వారని అనే వారు).బ్యాంకు లో బాలయోగి ట్రస్ట్ వారి అకౌంట్ ఉండేది.బాలయోగి గది తలుపులు శివరాత్రికి తెరిచేవారు.ఈ విషయం అందరికీ పత్రికల ద్వారా తెలియచేసేవారు.ఆయన జన్మ దినం నాడో,లేక ఆయన నాన్నగారు చనిపోయిన రోజో  (నాకు సరిగ్గా గుర్తు లేదు)మరొకసారి తెరిచేవారు.అప్పుడు కొంతమందికే తెలిపేవారు.ట్రస్ట్ వారిని, బాలయోగిని నాకు దగ్గరగా చూపించమని కోరాను.వారు అంగీకరించారు.ఆయన ఉన్న గదిని అంతా పరిశీలించాను,ఆయన్ను పెద్దగా పట్టించు కోలేదేమో!వెంటనే కమిటీ వారిని ఒక ప్రశ్న వేసాను.సంవత్సరం తర్వాత ఎవరైనా ఏ గదైనా  తెరిస్తే ,పట్టిన బూజును దులపకుండా ఉంటారా?అంటే ,ముందు రోజే ఆ గదిని తెరచి ఉండాలి,కాకపోతే అప్పుడప్పుడు తెరుస్తూనే  ఉంటారని అనిపించి,ఇదే సందేహాన్ని వారినే డైరెక్ట్ గా అడిగాను.అందరు చెప్పినట్లే వారు కూడా,'అదే దైవ మహిమ' అని చెప్పి తప్పించుకున్నారు.ప్రతి దాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించే జబ్బు చిన్నప్పటి నుంచే నాకు ఉండివుంటుంది.ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.ఆ విషయం అటుంచితే,ముమ్మిడివరం బాలయోగి ఒక హరిజనుడు.నాగయ్య గారు నటించిన 'భక్తపోతన ' సినిమా చూసి ఆయన యోగిగా మారాడని అక్కడి ప్రజలు చెబుతారు.అందుకే నేను ఆ సినిమాను ఇప్పటికీ చూడలేదు! కులమత బేధాలు ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లో,అగ్రవర్ణాల వారు బాలయోగిని--ఆరాధించటం అటుంచి కనీసం గౌరవించేవారు కూడా కాదు. ఆయనలోని ప్రత్యేకత ఏమంటే--దాదాపుగా ఏక బిగిన 12 గంటలు కదలకుండా,కళ్ళు మూసుకొని ప్రజలకు దర్శనం ఇచ్చేవారు. ఆ మందిర నిర్మాణం చూసిన నాలాంటి వారికి మరికొన్ని అనుమానాలు కలిగేవి!మనిషి దేవుడిగా మారాలంటే మానవాతీత శక్తులు అవసరం లేదు !సత్యాన్నే చెబుతూ ,చెప్పింది చేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచిపోయిన గాంధీ గారి కన్నా గొప్ప దేవుడెవరుంటారు?(బహుశా:RSS వాళ్ళు ఒక్కరే ఈ విషయాన్ని ఒప్పుకోపోవచ్చు!జానే దేవ్!).ఇక బ్యాంకులో నాకు పనంతా నేర్పింది అక్కడి ప్యూన్  అయిన కఠారి కృష్ణమూర్తి.అతన్నినేను Mr. K.M.Kathari అని పిలిచేవాడిని.ఏమాటకామాటే చెప్పుకోవాలి.గోదావరి జిల్లాల వాళ్లకి వెటకారం బాగా ఎక్కువ!ఒకాయన వచ్చి, నాకు పెళ్లి సంబంధం తెచ్చాడు.మేనేజర్ గారిని కలిసాడు.దానికి మేనేజర్ గారు--ఆ అబ్బాయి భార్య ఒప్పుకుంటుందో లేదో ?అని సరదాగానే సమాధానం చెప్పారు.వెంటనే ఆ పెద్దమనిషి నా దగ్గరకొచ్చి అన్ని విషయాలను ఏర్పాటు చేసుకున్న తర్వాతే ఉద్యోగంలో చేరావన్న మాట!భేష్ !! అన్నాడు .అంతలో మా కృష్ణమూర్తి వచ్చి త్వరలో ,ఆయన తండ్రి కూడా కాబోతున్నాడని చెప్పాడు.అప్పుడు ఆ పెద్ద మనిషి,చూడబోతే వీరికి అన్నిటిలోనూ తొందరెక్కువేమో అంటూ మళ్ళీ మరొక చెణుకు విరిచి వెళ్ళాడు.గోదావరీ ప్రాంత ప్రజల ప్రేమానురాగాలు,ముమ్మిడివరంలోని నా మరికొన్ని అనుభవాలను గురించి  ఆసక్తికరంగా మరొకసారి చెప్పటానికి ప్రయత్నిస్తాను!ఇప్పటికి ఇంతే!!

--------

4 comments:

  1. Good article, written in a simple language describing the experiences.

    ReplyDelete
  2. చాలా బాగుందండీ,అభినందనలు!!

    ReplyDelete
  3. బాంక్ ఉద్యోగస్తులకు వరం వారు పనిచేసే స్థల మహిమ, వారి అనుభవాలు, వారికి మిగిల్చే జ్ఞాపకాలను , వారు పలుసార్లు నెమరువేసుకొని ఆనంద పడిన సందర్భాలే ఎక్కువ.

    ReplyDelete

Pages