థింక్ బిగ్ - అచ్చంగా తెలుగు
థింక్ బిగ్
-బి.వి.సత్య నగేష్, మైండ్ ఫౌండేషన్ అధినేత, 
ప్రముఖ మానసిక నిపుణులు 

నేను ఈ మధ్య చిలుకూరు బాలాజీ గుడి దగ్గర్లో వున్న భూమి విలువ గురించి బాగా స్టడీ చేశాను. ఆ రేట్ల గురించి విని ఆశ్చర్య పోయాను. అక్కడ రేట్లు ఎలా వున్నాయో నీకేమైనా తెలుసా ? అని ప్రశ్నించాడు కుమార్
“అవును.... నేనూ విన్నాను. గజం ఇరవై వేల దాకా వుందట. 200 గజాల స్థలం కొనాలంటే నలభై లక్షల పెట్టుబడి పెట్టాలి”.
“ఇదే మనతో సమస్య, కొంచెం నీ ఆలోచనా పరిధిని పెంచుకో. పెద్దగా ఆలోచించు, నేను ఎకరాల గురించి నీకు చెబుదామనుకుంటుంటే నువ్వు గజాలు, అంగుళాల గురించి మాట్లాడుతున్నావు. ఛ.... ఎప్పుడు మారతావో ఏమో” అంటూ అసహనాన్ని వ్యక్తపరిచాడు కుమార్,
నిజమే ! ఆలోచనా పరిధిని పెంచుకోవడానికి పరిమితి లేదుగా! కాని అధికశాతం మంది పరిధిని పెంచి ఆలోచించడానికి కూడా భయపడతారు. “ఆ ... ఎందుకులే.. అదంతా ఆయ్యేదా ఏంటి ? చివరికి ఆయాసం, నిరాశా, నిస్పృహ తప్ప, ఉన్నదాంట్లో తృప్తిగా వుండడం నేర్చుకోవాలి” అనే మనస్తత్వంతోనే గడిపేస్తారు.
అందుకే... పెద్దగా ఆలోచించు, గొప్పగా ఆలోచించు, బ్రాడ్గా ఆలోచించు, థింక్ బిగ్ అని విజేతలంటారు.
క్రికెట్ ఆడడానికి రూల్స్ వున్నాయి. రోడ్డుమీద వాహనాలు నడపడానికి రూల్స్ వున్నాయి. అలాగే చాలా వరకు ప్రతిదానికి రూల్స్ వుంటాయి.
ఆలోచించడానికి మాత్రం రూల్స్ లేవా ? అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. “ఎలా బ్రతకాలి !”, “ఎలా ఆలోచించాలి ?” అనే వాటి గురించి అనుభవజ్ఞులు చెప్పిన మాటలు, వ్యాసాలు, పుస్తకాలనే రూల్స్ గా తీసుకోవాలి. దీనికంటూ ఒక ప్రయోగదీపిక (ప్రాక్టికల్ మాన్యువల్) అంటూ ఏమీలేదు. ప్రతి విషయాన్ని స్వానుభవంతో తెలుసుకోవాలనుకుంటే ఒక జీవిత కాలం సరిపోదనేది సందేహం లేని విషయం .
సాధారణంగా మనిషిలో అపారమైన శక్తి సామర్థ్యాలు నిక్షిప్తమై వుంటాయి. వాటినుపయోగించి లక్ష్యాలు ఏర్పర్చుకుని స్వయం కృషిని జోడి స్తే ఉన్నత స్థాయి విజయాలు సాధ్యపడతాయి. కానీ చిన్నచిన్న లక్ష్యాలతో రాజీపడటమే 'సగటు మనిషిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి ప్రత్యామ్నాయమే “థింక్బిగ్” అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. పెద్దగా, గొప్పగా ఆలోచించడం ద్వారానే ఉన్నతమైన స్థానానికి చేరుతారా ? అనే అనుమానం  రాకమానదు. మనం ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా ముందుగా ఆలోచన, తర్వాత ఆచరణ అనే క్రమంలోనే వస్తాయి కనుక ఆలోచనా ప్రక్రియకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన జీవితమనేది మన ఆలోచనా ప్రక్రియకు ప్రతిబింబం.
ఈ ప్రపంచంలో గొప్పగా చెప్పుకునేవన్నీ 'ఆలోచనా ప్రక్రియ' ద్వారానే సృష్టింపబడ్డాయనేది వాస్తవం. ఆలోచన ప్రక్రియకు అంత గొప్పశక్తివుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో చరిత్ర సృష్టించిన వారు గొప్పగా, పెద్దగా ఆలోచించడం వల్లనే ప్రపంచ స్థాయిలో ప్రముఖులయ్యారు. ఆల్బెర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్, అబ్రహం లింకన్, చార్లీ చాప్లిన్, సి.వి. రామన్, రామానుజం, వాల్ డిస్ని, జె. ఆర్. డి. టాటా, బిర్లా, ఎల్లాప్రగడ సుబ్బారావు, నాయుడమ్మ, జిడ్డు కృష్ణమూర్తి, చలం, మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెల్సన్ మండేలా, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఆతర్వాత తరంలో అబ్దుల్ కాలం, శ్రీశ్రీ, స్టీఫెన్ హాకింగ్స్, ధీరూభాయి అంబానీ, అజీం ప్రేమ్జీ, నారాయణ మూర్తి, స్వామి రాందేవ్ బాబా, ఎలాన్ మస్క్ జుకర్ బెర్గ్, స్టీవ్ జాబ్స్, వారన్ బఫెట్, బిల్గెట్స్, జాక్ మా... ఇంకా మరి కొందరు గొప్పగా ఆలోచించడం వల్లనే వారి వారి రంగాల్లో చరిత్రను సృష్టించారు. రాజకీయాలు, సినిమా రంగాల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. పైన పేర్కొన్న ప్రముఖులందరూ వారి ఆలోచనా విధానమే వారి విజయానికి కారణం అని ఉద్ఘాటించారు.
విద్యారంగంలో సగటు విద్యార్థులు సంచలనం సృష్టించారు, అదే విధంగా అనేక రంగాల్లో కేవలం ఆలోచనా తీరులోని మార్పు ద్వారా ఎంతో మంది అద్భుతాలు సృష్టించారు.
ఎలా కావాలంటే అలా ఆలోచించగలమా ? ఆలోచించినంత మాత్రాన అలా అయిపోతుందా? అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతూనే వుంటాయి. అవేంటో చూద్దాం.
ఎలా కావాలంటే అలాగే ఆలోచించడం గురించి సాధన చెయ్యాలి. ఆలోచనలు ఎక్కడ నుంచో వస్తాయనే అపోహ నుంచి బయటపడాలి. ఆలోచించినంత మాత్రానా అయిపోతామా ? అంటే అవుతామనే చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే మీ మనసు ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంది కనుక మీరు గమ్యాన్ని చేరుతారు. మీరు ఆలోచనా తీరును మారిస్తే మీ ప్రయాణం మీరనుకున్న గమ్యస్థానానికి చేరదు.
పాజిటివ్ అఫర్మేషన్స్ ను విజువలైజేషన్ ద్వారా సాధన చేస్తూ వుండాలి. వెలిగించిన దీపం ఆరిపోకుండా వుండాలంటే నూనెను నింపుతూ, ఒత్తిని సరిచేసిన విధంగా నిరంతరం సాధన చేస్తూనే వుండాలి.
ఊబిలో ఇరుక్కున్న వాడు ప్రాణాలతో బయట పడటానికి ఆరాటపడే విధంగా పోరాటాన్ని సాగించాలి.
మన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలనుకుంటే కొత్త అవసరాలను సృష్టించుకోవాలి. నిత్యస్పూర్తితో పోరాడాలి. అవకాశాలను సృష్టించుకోవాలి. అవి వస్తాయని, ఒక్కసారి మాత్రమే తలుపు తట్టుతాయనే పాత కథలను మర్చిపోయి పనిచెయ్యాలి. అవకాశాలను సృష్టించుకోవడం మన శక్తి సామర్ధ్యాలకు పరీక్ష అనే భావనలో వుండాలి. అవకాశాలు సూర్యకిరణాల్లా ప్రతిరోజు అందుబాటులోనే వుంటాయి. పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) ఎటు సూర్యరశ్మి వుంటే అటువైపునకు తిరుగుతుంది. ఉన్నచోట నుంచి కదలలేని ఒక చెట్టుకున్న పువ్వులు సూర్యరశ్మి కోసం తిరుగుతున్నప్పుడు ... ఎంతో మేధాశక్తివున్న మనిషి ఎన్నెన్నో అవకాశాలను చేజిక్కుంచుకోగలడనే భావంతో మనిషి ప్రయత్నం చెయ్యాలి. విశ్వం అనంతమైనది. అలాగే ఆలోచన కూడా అనంత వై నది. పరిమితిలేదు, గొప్పగా ఆలోచించాలి.
చివరిగా... “నా శక్తి ఇంతే” అనేది ఒక పెద్ద అపోహ... మీరింత కాలం చెయ్యలేకపోయారనుకున్న పనుల లిస్టును ఒక దానిని తయారుచెయ్యండి. మిమ్మల్ని మీరు సవాలు చేసుకొని అందులోని ఒక పనిని చేపట్టండి. ఆ పనిని పూర్తి చెయ్యడానికి మీకు అందుబాటులో వున్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకునే విధంగా ఆలోచించండి. పనిని చేపట్టండి. పూర్తయ్యే వరకు అదే పట్టుదలతో వుండేలా మీకు మీరే స్పూర్తి పొందేలా ఆలోచిస్తూ పనిచెయ్యండి. పని పూర్తయితీరుతుంది. ఈ అనుభవం మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. మీ ఆలోచనలే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పెద్దగా, గొప్పగా, ఉన్నతంగా ఆలోచించండి.

No comments:

Post a Comment

Pages