తిరువీధుల మెరసీ దేవదేవుడు - అచ్చంగా తెలుగు

తిరువీధుల మెరసీ దేవదేవుడు

Share This
బ్రహ్మోత్సవాలు- అన్నమయ్య  కీర్తనలు-01
-డా.తాడేపల్లి పతంజలి

తిరువీధుల మెరసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడను ॥పల్లవి॥
01.తిరు దండెల పై నేగీ దేవుడిదే తొలునాడు
సిరుల రెండవ నాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వు గోవిలలోను ॥తిరు॥
02.గక్కన నయిదవనాడు గరుడుని మీదను
యెక్కెను ఆరవనాడు యేనుగమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభ లోనను
యిక్కువ దేరును గుఱ్ఱమెనిమిదోనాడు ॥తిరు॥
03.కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశుడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీదను ॥తిరు॥ (సంపుటము: 7-192)
********    
భావం:
శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను అన్నమయ్య ఇందులో వర్ణిస్తున్నాడు
దేవతలకు దేవత అయిన (= దేవదేవుడు)శ్రీవేంకటేశ్వరుడు గొప్పతనాలను(=గరిమల)మించిన అలంకారాలతో శ్రీ ప్రదమైన తిరుమల వీథులలో(=తిరు వీథుల) ఈ బ్రహ్మోత్సవాలలో మెరిసిపోతున్నాడు.
1.బ్రహ్మోత్సవాలలో శ్రీవేంకటేశ్వరుడు మొదటిరోజు పెద్ద ఆది శేషుని వాహనం మీద (=తిరుదండెలపై) ఊరేగుతున్నాడు.శోభలతో(=సిరుల) రెండవరోజు చిన్న ఆది శేషుని వాహనం మీద ఊరేగుతున్నాడు.కులుకులతో(=మురిపేన) మూడోరోజు ముత్యాల పందిరి క్రింద కూర్చొని ఊరేగుతున్నాడు.క్రమంగా (=పొరి) నాలుగోరోజుకల్పవృక్ష వాహనం పై(=పువ్వుగోవిల) ఊరేగుతున్నాడు.
2.వెంటనే(=గక్కన)అయిదవరోజు గరుత్మంతుని మీద ఊరేగుతున్నాడు.ఆరవరోజు ఏనుగుమీద ఎక్కాడు.పరవశంతో (=చొక్కమై )యేడవరోజు సూర్య ప్రభ వాహనం మీద ఊరేగుతున్నాడు.కళలు అతిశయించేటట్లుగా(=యిక్కువ) ఎనిమిదో రోజు ఉదయం రథం మీద (= తేరును) రాత్రికి అశ్వ వాహనం మీద ఊరేగుతున్నాడు.
3.తొమ్మిదోరోజు బంగారపు పల్లకీ(=కనకపుటందలము) చేరి(=కదిసి) ఊరేగుతున్నాడు.పదోరోజు అమ్మవారితో కలిపి (=పెనచి )పెండ్లి పీటలపైన కొలువై ఉన్నాడు.శ్రీవేంకటేశ్వరుడు అన్నిరకాలుగా తనతో సాటివచ్చే(=ఎనసి) మా అలమేల్మంగమ్మతోను,ఇతర స్త్రీలమధ్య కొలువై ఈ బ్రహ్మోత్సవాలలో వాహనాల మీదఊరేగుతున్నాడు.
విశేషాలు
స్వామివారు పరబ్రహ్మ .ఆయనకి చేసే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు, బ్రహ్మ స్వయంగా ఈ ఉత్సవాలుస్వామివారికి చేయటం ప్రారంభించాడు కనుక బ్రహ్మోత్సవాలుఅనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు.అన్నమయ్య కాలంనాటీ బ్రహ్మోత్సవాలకి,ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకి కొన్ని తే డాలు ఉన్నట్లు ఈ గీతం చదివిన తర్వాత అనిపిస్తుంది.
అధిక మాసం వచ్చినప్పుడు రెండుసార్లు స్వామివారికి బ్రహ్మోత్సవాలుచేస్తారు. మొదటిదానిని వార్షికబ్రహ్మోత్సవాలు, రెండవదానిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం,(గరుడపటం ఉన్న జెండా పైకి ఎగరవేయటం)ధ్వజావరోహణం (జెండా కిందికి దింపటం)ఉండవు.ఈ తిరువీథుల కీర్తన నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించినదేమో! ఎందుకంటే ఇందులో ధ్వజారోహణం,ధ్వజావరోహణవర్ణనలు లేవు..
మొదటిరోజు సాయంత్రం స్వామివారిని పెద్ద శేష (=ఆదిశేషుడు)వాహనం మీద ఊరేగిస్తారు.అన్నమయ్యమొదటిరోజు స్వామివారిని 'తిరుదండెల' పై ఊరేగించాడు.'దండె'అంటే దండాకారము-అంటే గుండ్రటి ఆకారం కలిగిన వాయిద్యం.పాముకు ఉండే రకరకాల పేర్లలో 'కుండలి'(=గుండ్రటి ఆకారం కలిగిన శరీరం కలిగినది)అని ఒక పేరుంది. ఇలా -ఆలోచిస్తే అన్నమయ్య 'తిరుదండెల'అనే పేరులో శుభాన్నిచ్చే ఆదిశేషుడివాహనాన్ని సూచించాడేమో అనిపిస్తుంది.లేదా-శుభకరములైన కర్రలు కలిగిన పల్లకీ వాహనం అని కూడ చెప్పుకోవచ్చు.
స్వామివారిని బ్రహ్మోత్సవాలలో రెండవరోజు ఉదయం చిన్న శేష వాహనం మీద ఊరేగిస్తారు.అన్నమయ్యకీర్తనలో కూడ ఇదే ఉంది.దేవుని స్వభావం గొప్పవాటికన్నా గొప్పదిగా, చిన్న వాటికన్నా చిన్నదిగా ఉంటుంది.(అణో..)ఇది మనకు చెప్పటానికే పెద్ద, చిన్న శేష వాహనాలు.
ఈనాడు కూడ అన్నమయ్య వర్ణించినట్లుగానే మూడోరోజు ముత్యాలపందిరి వాహన సేవ యథాతథంగాజరుగుతోంది.నా లుగోరోజు ఉదయం కల్పవృక్ష వాహనం మీద స్వామిని ఇప్పుడు ఊరేగిస్తున్నారు.దీనిని అన్నమయ్య పువ్వుగోవిల అన్నాడు. అది పువ్వు గోవెల అనుకోవచ్చన్నారు సముద్రాలలక్ష్మణయ్యగారు.కోవెల అంటేపొడుగైన దేవాలయం.కోవెలలో భక్తితో కోరిన కోరికలు ఫలిస్తియి.కల్పవృక్షం కూడ కోరిన కోరికలు ఫలింపచేస్తుంది.అందువల్ల కల్పవృక్ష వాహనాన్ని అన్నమయ్య పువ్వు గోవెల అన్నాడేమో!
అయిదవరోజు రాత్రి జరిగే గరుడవాహన సేవ చాలా ప్రత్యేకత కలిగినది.గరుత్ అంటే రెక్క. రెక్కల చేతఎగురుతాడు  కాబట్టి గరుడుడు అనిపేరు వచ్చింది.స్వయంగా వేద పురుషుడు గరుడుడు. తల్లి దాస్యంతీర్చటానికిఅమృతం తెచ్చేటప్పుడు దానిని తాను కూడ ఆస్వాదిద్దామనే చింతలేని, నిస్స్వార్థ పరుడు.అందుకే ప్రేమతోస్వామి గరుడుని తన వాహనంగా చేసుకొన్నాడు.
ఆరవరోజు రాత్రి గజవాహన సేవ. ఏనుగులు అమ్మవారికి తోడబుట్టినవి .ఆమెను నిత్యం అమృత కలశాలతో అభిషేకిస్తూ ఉంటాయి. శ్రీవేంకటేశునికి పద్మావతితో(లక్ష్మి) పెండ్లి కావటానికి కారణమయినది కూడగజమే.అందుకే, అమ్మకు, అయ్యకు ఇష్టమైన గజం-బ్రహ్మోత్సవాలలో వాహనంగా మారింది.ఏడవరోజు ఉదయం సూర్య ప్రభ వాహనం మీద పరవశంగా స్వామి తిరుగుతున్నాడన్నాడు అన్నమయ్య.మన పనులలో మనలిని ప్రేరేపిస్తి కాబట్టి ఆయన్ని సూర్యుడన్నారు.లోకానికి ఆరోగ్య ప్రదాతగా,మిత్రునిగాసేవలందించే సూర్యుడు తన వాహనంగా మారితే -స్వామికి ఆనందమే కదా!
ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం. రాత్రికి అశ్వ వాహనం.ఈ రెండింటిని కలిపి అన్నమయ్య పేర్కొన్నాడు.రథం మీద ఉన్న కేశవున్ని చూస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు.ఈ రథాన్ని భక్తజనులు కూడలాగే అవకాశం కల్పిస్తారు.హయగ్రీవాతారంలో స్వామి గుర్రం ముఖాన్ని ధరించి జ్ఞానాన్ని ప్రసాదించారు. అశ్వం అంటే నడుస్తూవ్యాపించేది.చాలా లోతయిన అర్థం. ఈ అశ్వవాహన సేవతో ఈనాటి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు పూర్తవుతాయి.తొమ్మిదవరోజు ఉదయం చక్రస్నానం, ఆ సాయంత్రం జెండా దింపే కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలుముగుస్తాయి

అన్నమయ్య కీర్తనలో తొమ్మిదో రోజు స్వామివారికి బంగారు పల్లకీ వాహన సేవ చేయించాడు.(ఇదిఇప్పుడుఅయిదవరోజు ఉదయం జరుగుతోంది).పదవరోజు అమ్మని, అయ్యని పెండ్లి పీటల మీద కూర్చోబెట్టి కల్యాణం చేయించాడు.ఇలా కొన్ని తేడాలు ఉన్నప్పటికీ- అన్నమయ్య కాలం నాటి బ్రహ్మోత్సవాలలో అత్యధికభాగం వాహనసేవలు ఇప్పటికి జరుగుతుండటం గమనార్హం.
స్వామికి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను చూసిన ఆనందంలో అన్నమయ్య మనందరికి ఈ కీర్తనలో అక్షరబ్రహ్మోత్సవం చూసే అవకాశం కల్గించాడు.గొంతెత్తి మధురగాయకుడు ఆలపిస్తున్న ఈ గీతాన్ని కళ్లు మూసుకొని ఆస్వాదిస్తే అన్ని వాహనసేవలు చూసే అదృష్టం ఒకేసారి కలుగుతుంది. స్వస్తి.
****

No comments:

Post a Comment

Pages