స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రి :అమృత్ కౌర్ - అచ్చంగా తెలుగు

స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రి :అమృత్ కౌర్

Share This
స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రి :అమృత్ కౌర్
అంబడిపూడి శ్యామసుందర రావు    

పంజాబ్ లోని కపుర్తలా రాకుమారి అయిన రాణి అమృత్ కౌర్ స్వతంత్ర సమరంలో చురుకుగా పాల్గొని స్వాతంత్రము వచ్చినాక భారత దేశపు మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రిగా భాద్యతలు చేపట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ గవర్ నింగ్ బాడీకి ఆసియన్ అధ్యక్ష పదవిని అలంకరించిన మహిళ అమృత్  కౌర్, అంతేకాకుండా వైద్య విద్యకు భారత దేశములో పేరెన్నిక గన్న అల్  ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యవస్థాపకురాలు కూడా ఈవిడే. ఈ సందర్భముగా ప్రిన్స్ టన్ యునివేర్సిటి వారు ఆవిడను సన్మానిస్తూ ఒక రాణి హోదాలో ఉండి  పేద ప్రజల, బలహీన వర్గాల అనారోగ్య వంతుల సేవలో తరించిన మహిళగా ప్రశంసించారు ఇటువంటి ఘన చరిత్ర కలిగిన అమృత్ కౌర్ గురించి నేటి ప్రజానీకానికి చాలా తక్కువ తెలుసు. ఆవిడా గురించి ఆవిడ  సాధించిన ఘనకార్యాలను  తెలియజేసే ప్రయత్నమే ఇది. దాదాపు 30 ఏళ్ల పాటు మాహిళా హక్కుల కోసము పోరాడిన మహిళకూడా ఈవిడే 

అమృత్ కౌర్ 1889,ఫిబ్రవరి 2 న రాజా హర్నామ్ సింగ్ పుత్రిక జన్మించింది.ఈవిడ పెంపకం అంతా లక్నో లో జరిగింది ఈవిడ తండ్రి ఇక్కడే ఉండి వారి రాజకుటుంబానికి చెందిన అవధ్ ఎస్టేట్ ను చూసుకొనేవారు . ఏడుగురి సంతానంలో ఈవిడ ఒక్కత్తే ఆడపిల్ల ఈవిడ ఇంగ్లండ్ లోని ప్రతిష్టాత్మకమైన షెర్బోర్న్ గర్ల్స్ స్కూల్ లో విద్యాభ్యాసము చేసింది. చదువుల్లో రాణిస్తూ ఆటల  పట్ల శ్రద్ద చూపుతూ స్కూల్ హాకీ టీమ్ క్యాప్టెన్ గాను క్రికెట్ టీమ్ సభ్యురాలిగాను ఉండేది. స్కూల్ విద్య పూర్తిచేసుకొని కౌర్ ఆక్స్ ఫర్డ్ లో కాలేజీ చదువును పూర్తిచేసుకుంది. చదువును పూర్తిచేసుకొని 1918 లో  భారత దేశానికి తిరిగి వచ్చింది 
ఆ సమయములోనే స్వతంత్ర ఉద్యమము పోరాటం మొదలైంది ఈ ఉద్యమము ఆవిడా జీవిత గతిని మార్చి వేసింది.అణిచివేతకు ఉద్దేశించ బడిన ఆనాటి రౌలత్ చట్టము పంజాబ్ అంతటా ఆగ్రహాన్ని అసంతృప్తిని పెంచాయి ఆ సందర్భముగా అమృత్సర్ లో ప్రజలకు బ్రిటిష్ పోలీసులకు హింసాత్మక ఘటనలు చెలరేగినాయి.వీటి ఫలితమే మార్షల్ లా ను విధించటం, ఆ తరువాత జలియన్ వాలా బాగ్ (ఏప్రిల్ 1919) కాల్పుల సంఘటన.  వీటి ఫలితముగా దేశవ్యాప్తముగా నిరసనలు ఆందోళనలు దావాలనము లాగా వ్యాపించాయి. ఆ సంవత్సరము లోనే కౌర్ తన తండ్రికి సన్నిహితుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని ప్రముఖుడు అయిన గోపాల కృష్ణ గోఖలే కు పరిచయము చేయబడింది. గోఖలే ఒక సాంఘిక సంస్కర్త మరియు సెర్వెన్ట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను స్థాపించి సమాజములోని అట్టడుగు బలహీన వర్గాల  సేవచేస్తుండేవాడు గోఖలే యొక్క సేవాదృక్పధానికి దేశము పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి ఆకర్షితురాలైన కపుర్తలా రాకుమారి జాతీయోద్యములో చేరింది. క్రమముగా ఒక సామాజిక కార్యకర్తగా ఒక స్వాతంత్ర ఉద్యమ కార్యకర్తగా ఎదిగింది.ఈ సందర్భములో ఆవిడ తనలోని భారత దేశము స్వతంత్రాన్ని సంపాదించాలి అన్న బలమైన కోరికను గోఖలే పటిష్టము చేసాడు అని చెపుతుంది 
గోఖలే ద్వారా కౌర్ గాంధీజి  గురించి తెలుసుకుంది. అయన భావజాలాన్ని దేశముపట్ల అయన దృక్పధాన్ని గమనించిన కౌర్ గాంధీజీకి అయన ఆశ్రమములో చేరి ఆయనతో పాటు సేవా కార్యక్రమాలలో పాల్గొంటానని ఉత్తరము వ్రాసింది కానీ దురదృష్ట వశాత్తు ఆవిడ తల్లిదండ్రుల అనారోగ్య కారణాల వల్ల వెంటనే ఆశ్రమములో చేరలేకపోయింది కానీ కపుర్తలా లో ఇంటి వద్దనుండి స్త్రీ  సంక్షేమ కార్యక్రమలను నిర్వహించేది. 1926లో కౌర్ స్త్రీల హక్కుల గురించి పనిచేయటానికి మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫెరెన్స్ ను స్థాపించింది. ఈ సంస్థ స్త్రీలు ఎదుర్కొనే సాంఘిక రాజకీయ సమస్యలపై దృష్టి కేంద్రీకరించింది. ఉదాహరణకు బాల్య వివాహాలు స్త్రీల పరదా దేవదాసి పద్దతి వంటి సమస్యలపై పోరాటం సాగించింది ఆవిడా పోరాటం వల్లే ప్రభుత్వము స్త్రీల వివాహ వయోపరిమితిని 14 నుండి 18 ఏళ్లకు పెంచింది. 
1930లో కౌర్ తల్లిదండ్రుల మరణానంతరము కపుర్తలా భవనాన్ని వదలి స్వాతంత్ర్యోద్యమములో పూర్తిగా పాలుపంచుకుంది సహాయ నిరాకరణ ఉద్యమము,దండి మార్చ్ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది.ఈవిడ పని పట్ల చూపించే శ్రద్ద నిజాయితీ నిబద్దత వల్ల గాంధీజీ ఆకర్షితుడై అక్టోబర్ 1936లో కౌర్ కు ఒక ఉత్తరము వ్రాసాడు అందులో తానూ కోరుకున్న లక్షణాలు కలిగినవ్యక్తి కోసము చేసే అన్వేషణ ముగిసిందని కౌర్ ను తన వ్యక్తిగత కార్యదర్శిగా ఉండమని ఆ లేఖలో గాంధీజీ కౌర్ ను కోరాడు ఆ భాద్యత స్వీకరించిన కౌర్ తానూ ఆరోగ్య శాఖ మంత్రి పదవిని చేపట్టేవరకు గాంధీజీ వ్యక్తిగత కార్యదర్శి  హోదాలో కొనసాగింది.
కౌర్ స్వతంత్ర పోరాటంలో చాలా చురుకుగా పాల్గొన్నది  ధర్నాలు,సత్యాగ్రహాలలో ఏమాత్రము జంకు  భేషజాలు లేకుండా పోలీసు లాఠీ దెబ్బలు కూడా తిన్నది.కొంత కాలము జైలు జీవితమూ కూడా గడిపింది. కౌర్ స్త్రీలు రాజకీయాలలో ముఖ్యముగా స్వతంత్ర పోరాటం లో పాల్గొనాలని తీవ్రముగా కృషిచేసి ఎక్కువ మంది మహిళలు స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటట్లు చేసింది. ఈ సందర్భముగా జవహర్ లాల్ నెహ్రు తో కూడా విభేదించింది అని మరో ప్రముఖ స్వతంత్రయోధురాలు అరుణా అసఫ్ అలీ  తెలియజేశారు నెహ్రు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో ఒకా మహిళా సభ్యురాలు కూడా లేకుండా ఏర్పాటు చేసినప్పుడు కౌర్ తీవ్రముగా  నెహ్రూతో విభేదించి నెహ్రు చర్యను విమర్శించింది  స్త్రీలు చదువులలో ఆటలలో పాల్గొనాలని వాదించేది కౌర్  అల్ ఇండియా వుమన్ ఎడ్యుకేషన్ ఫండ్ అసోషియేషన్ అధ్యక్షురాలిగా పనిచేసింది 1945 లో లండన్ లో జరిగిన యునెస్కో సమావేశానికి డెలిగేట్ గా భారత దేశము తరుఫున హాజరు అయింది. 
రాజ్యాంగ చట్ట సభకు ఎన్నికైన మహిళలలో కౌర్ ఒకరు యూనిఫామ్ సివిల్ కోడ్ ను సమర్ధించిన కొద్దిమంది మహిళా  సభ్యులలో కౌర్ ఒకరు రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ సలహాదారుడైన బి ఎన్ రావు గారికి ఈ విషయంలో ఒక లేఖకూడా వ్రాశారు ఆ లేఖలో మతపరమైన స్త్రీ పురుష వ్యత్యాసాలను తొలగించాలని స్త్రీ పురుష సమానత్వము ఉండాలని వివరించారు. స్వాతంత్రము సిద్దించిన తరువాత కౌర్ మొట్టమొదటి ఆరోగ్య శాఖ మంత్రిగా (కేబినెట్ హోదాలో)భాద్యతలు చేపట్టింది క్షయ వ్యాధినివారణకోసము ట్యూబర్ క్లొసిస్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాను ,ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వెల్ ఫేర్ సంస్థను,సెంట్రల్ లెప్రసీ అండ్ రీసెర్చ్ ఇన్సి ట్యూట్ ను ,రాజకుమారి అమ్రిత్ కౌర్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ సంస్థలను ప్రారంభించింది. అన్నిటి లో  ముఖ్యమైన పని AIIMS ను ప్రారంభిచటమే . 1950లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ కి అధ్యక్షురాలిగా ఎన్నిక అయింది ఆ పదవిని అలంకరించిన మొట్టమొదటి ఆసియాకు చెందిన మహిళ  కౌర్ ఈ పదవిలో ఉండగానే కౌర్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా, స్వీడన్ వెస్ట్ జర్మనీ ,అమెరికా వంటి దేశాల నుండి AIIMS ప్రారంభించటానికి సహాయము పొందింది.
కౌర్ సిమ్లాలోని తన పూర్వీకుల మనోర్ విల్లా అనే భవనాన్ని AIIMS లో  పని చేసే సిబ్బందికి విశ్రాంతి భవనముగా  దానము చేసింది AIIMS ను దేశములోనే వైద్య విద్యకు అత్యుత్తమ మైనది గా చేయటానికి అఖిల భారత స్థాయిలో ప్రవేశ పరీక్ష పెట్టి విద్యార్థులను తీసుకొనే ఏర్పాటు చేసింది ఆవిడ  కృషి వల్ల అమెరికాలోని మసాచ్యూట్స్ జనరల్ హాస్పిటల్ వారు AIIMS ను ప్రపంచములోని గొప్పహాస్పిటళ్లలో ఒకటిగా గుర్తించారు.   . మలేరియా వ్యాధిని అరికట్టటములో విశేషముగా కృషి చేసి మలేరియా మరణాలను నియంత్రించగలిగింది. తన ఆరోగ్య శాఖ నిర్వహణతో పాటు తనకు ఇష్టమైన ఆటల గురించి శ్రద్ద తీసుకొని పాటియాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ను ప్రారంభించటంలో చొరవ తీసుకుంది.
ఫిబ్రవరి 6,1964 న 75 ఏళ్ల వయస్సులో పరమ పదించింది పూర్తిగా జీవితకాలం అంతా అవివాహితాగానే ఉండి పూర్తిగా ప్రజాసేవకే జీవితాన్ని అంకితము చేసిన మహిళామణి అమృత్ కౌర్ 
***                   

No comments:

Post a Comment

Pages