ఒక చెదరని స్వప్నం
పోడూరి శ్రీనివాసరావు 
“కల  చెదిరింది 
కథ మారింది 
కన్నీరే మిగిలింది”
ఇది ఒక సినీకవి ఆవేదన!
చెదరని కలతో 
కథ మారదు 
కన్నీరు కారదు ......
కానీ కథ వింతపుంతలు త్రొక్కుతుంది...
కన్నీరు కురవదు - పన్నీరు చిలుకుతుంది...
చెదిరిన కల నీటిమీద రాతైతే –
చెదరని కల ... శిలాశాసనమే!
చెరిగిపోయే రాతలకన్నా...
చెరగని రాతలు 
హృదయాల్లో నిక్షిప్తమౌతాయి!
గుండెల్లో గూడు కట్టుకుంటాయి!!
మధురానుభూతులను 
జీవితకాలమంతా 
వెల్లి విరియచేస్తాయి...!!
చెదిరిన కల,
కలతనిద్దురతోనే కనుమరుగవుతుంది...
ఆనవాలైనా మిగుల్చకుండా 
అదృశ్యమౌతుంది.
కానీ... చెదరని కల అలాకాదు 
ఉషాకాంతులతో మమేకమయి 
నీ నిత్యకృత్యాలతో ..తోడుంటుంది...
నీడలా నిన్ను వెంటాడుతుంది...
అనుభూతిని నీ జీవితంలో ఆవహిస్తుంది...
కష్టమైనా – సుఖమైనా...
ఆనందమైనా – ఆక్రోశమైనా ...
కన్నీరైనా -పన్నీరైనా...
నీ జీవనయానంలో భాగమౌతుంది 
నీతోనే ... నడయాడుతుంది.
కానీ...
ఆదేం వింతో ... విచిత్రమో!
భగవంతుని సృష్టి విలాసం!!
చెదరనికల నీ బతుకు చిత్రం 
కేన్వాస్ పై గీసిన ఆయిల్ పెయింటింగ్ లాంటిది.
అవే నీకు గుర్తుంటాయి కానీ 
చెదిరిన కలలు, వాటి నైజం 
నీ జీవితంలో ఇంప్రెషన్స్ 
నింపాల్సి ఉన్నా...._
గుర్తుకురావు _
చుట్టపుచూపుగా వచ్చి 
పలకరించి పోయే 
చెదిరిన కలలే _
నీతో ఆటలాడుకుంటాయి.
చెదరని కలలు నీపై 
ప్రభావం చూపగలిగేవైనా _
నీ వ్యక్తిత్వంపై గురి చూసి కొట్టగలిగేవైనా_
నీ జీవనయానంలో చుక్కాని పాత్రపోషించేవైనా _ 
ఆ మబ్బులను 
నీ జీవనరాగ గానంతో 
ఆకర్షించి, దరిచేర్చి...
వానలను కురిపించిన నాడే _
ఆ చిరుజల్లుల చల్లదనాన్ని 
ఆస్వాదించగలుగుతావు..
మట్టివాసనను ఆఘ్రాణించ కలుగుతావు!
నీ కొచ్చే కలలను 
చెదిరిపోయేలా చేయాలన్నా...
చెదరకుండా ఉండేలా చేయాలన్నా...
చెల్లా చెదరైన కలల మబ్బులను 
మేఘావృతం చేసి ... చిరుజల్లులను 
కురిపించేలా చేసుకోవాలన్నా...
నీ చేతుల్లోనే ఉంది!
నీ చేతలను, తలపులను...
ఒకటిగా చేయి 
మమేకత్వంతో మైమరిచేలా చేస్తే 
నీ జీవితమే నందనవనం_
దానికో పరమార్థం_
చెదరని కలలను లక్ష్యం చేసుకో!
లక్ష్యం చేదించడానికి కృషిచేయి 
శిలాశాసనం _ చెదరని కల ఒకటే 
సాధించు...లక్ష్యాన్ని చేదించు 
అంతిమ విజయం నీదే!!
***
 

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment