అరి సర్వత్రా - అచ్చంగా తెలుగు

అరి సర్వత్రా

Share This
"అతి సర్వత్రా"
“మినీకథా చక్రవర్తి ” “ కథానిధి " -- కె.బి.కృష్ణ, 

సన్న జాజి, విరజాజీ, కనకాంబరాలూ, లిల్లీపూల తో ఆ గది లో పందిరిపట్టి మంచం కనపడకుండా అలంకరించారు. గదంతా పెర్ ఫ్యూమ్ మత్తెక్కిస్తూంది. నేను పాలగ్లాసు తో గది లోకి మా ఇంటి అమ్మలక్కలచేత గెంటబడ్డాను.
“ మంగా -- ” అంటూ లో గొంతుక తో మంచం దగ్గర కుర్చీ లోంచి లేచి నా దగ్గరకు వచ్చారాయన. సిగ్గుతో చితికిపోతున్న నా ముఖాన్ని, నా బుల్లి గెడ్డం పట్టుకుని మృదువు గా పైకి ఎత్తారు. నా కైపెక్కిన కళ్ళు, ఆయన మత్తు కళ్ళతో, పెళ్ళిచూపులు, పెళ్ళిపీటల తరువాత మళ్ళీ మా ఇద్దరి చూపులు కలుసుకుని మా ఇద్దరి హృదయాల్లో గుచ్చుకుని అల్లరి చేశాయి. 
ఇద్దరం మంచం మీద కూర్చోబోతుంటే, “ ఉష్ " అని ఆయన్ను వారిస్తుంటే " అదేమిటి ? ” అన్నారాయన. “కొంచం వొంగి మంచం కింద చూడండి ” అన్నాను. ఆయన చూసి " అమ్మో మీ పల్లెటూరి వాళ్ళు, చాలా అల్లరి వాళ్ళు. నవారు కి బుల్లి బుల్లి గంటలూ, గజ్జెలూ బలే కట్టేశారే ” అంటూ ఒహటే నవ్వసాగేరు. దుప్పటి తీసి ఇద్దరం కింద కూర్చున్నాం. ఆయన నా చేతిలో పాలగ్లాసు తీసుకుని “మంగా ముందు నువ్వు పాలు తాగి నాకు ఇచ్చావనుకో ఇంక ఆ పాలల్లో పంచదార అక్కర్లేదు, ఎంత తియ్యగా ఉంటాయో చెప్పలేను -- ” అంటూ బాచీపీఠం వేసుకుని కూర్చున్న నా కాళ్ల మీద గిల్లినంత పని చేశారు. వళ్ళు పులకరించింది. పాలు తాగేక, “ నాది ఒకే ఒక కోరిక, నాకు ఎక్కువ కోరికలు లేవు అందరి మొగుళ్ళ లా నిన్ను కోరికలతో ఇబ్బంది పెట్టను అన్నారాయన మెల్లిగా --ఇదేం కోరిక బాబూ, ఎక్కడో చదివినట్లుగాని, ఎవరో చెప్పినట్లు గాని గుర్తు, నన్ను పూర్తి గా వివస్త్రను చేసి, నా శరీరం లో అణువణువూ చూస్తానంటాడా ఏమిటి ఖర్మ ? అప్పుడు నేనేం చేయాలి ? ఏదిఏమైనా ఈ మగాళ్ళు శోభనం గది లో నియంతల్లా ప్రవర్తిస్తారు బాబూ అని నేను ఆందోళన పడుతూండగా- ఇంతలో -- పూలతో కిటికీ కనపడకుండా కట్టించేసిన అమ్మలక్కలు “ ఎంతసేపే పిల్లా కబుర్లు ? మొదలెట్టండొసే --” అంటూ కిలకిలా నవ్వుసాగేరు. నేను వెళ్ళి పూలు పక్కకి తొలగించి కిటికీ కి గెడ పెట్టేసేను.
“మంగా, నేను రెండే రెండు విషయాలు చెప్తాను గబగబా, ఆ రెండు విషయాలు మనిద్దరికీ ఎంతో ముఖ్యం. మొదటిది నాకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు బాపు గారి అమ్మాయిల బొమ్మలంటే ఎంతో ఇష్టం, పొడవాటి ముక్కు చెవుల దాకా కళ్లు, బుగ్గలూ, పండంటి పెదవులూ, జడగంటలతో పొడవాటి వాలుజడా, ఎత్తు పల్లాలు అంతగా లేని సున్నితమైన శరీరం అబ్బ నేను నిన్ను పెళ్ళిచూపుల్లో మొదటిచూపు లోనే వరించేశాను అందుకే--” అన్నారు చిరునవ్వుతో—“ఇక రెండవ విషయం, నేను అందరి మగాళ్ళలా కాకుండా భోజనం కతికేయడం కాకుండా ఇష్టం గా తింటాను, ముఖ్యం గా నాకు వంకాయకూర అంటే ఎంతిష్టమో చెప్పలేను. నీ అంత ఇష్టం అనుకో. నువ్వు ఎప్పుడూ వంకాయకూర చేసి పెట్టినా తినేస్తాను అబగా మా అమ్మ వంకాయ తో పాతిక రకాల కూరలు, పచ్చళ్ళు, పులుసులు చేస్తుంది, నువ్వూ అలాగే చేయాలి ఓ.కే..' అని ఆయన అనగానే “ అయితే వంకాయ నా రెండో మొగుడన్నమాట ” అని నేను అనగానే నా బూరె బుగ్గల మీద చిటికేసి " యూ నాటీ-- ” అని ఆయన అనగానే నా ఒడలంతా పులకాంకితమై రెప రెప లాడింది శరీరమంతా. " ఈళ్ళిప్పట్లో నిద్రపోరే మాయదారి మేళం, పెళ్ళికొడుకు వంకాయ అంటున్నాడేమిటే-- వంకాయ మొగుడు -- ” అంటూ అమ్మలక్కలు మళ్ళీ మా గది తలుపులు బాదుతూ నవ్వుతున్నారు గోలగోలగా. నాకైతే మండిపోతోంది ఇంతలో లైట్లు ఆరిపోయాయి మా గదిలో. ఎవరో పెద్దవాళ్లు వచ్చి వాళ్లందరినీ తరిమేస్తున్నట్లు గా శబ్దాలు వినిపించసాగేయి.
మేము ఆ రోజునే హైదరాబాదు లో అపార్ట్ మెంట్ లో దిగాము. రాజమండ్రి నుండి పొడుగాటి, పొట్టి వంకాయలు తలా ఒక కేజీ పట్టుకోచ్చేశారీయన. పుర్రెకో బుద్దీ, జిహ్వకో రుచీ అన్నారు పెద్దలు, ఈ వంకాయకూర పిచ్చి ఫర్వాలేదులే, ఇదే మందో, మాకో, పేకాటో, గుఱ్ఱప్పందాలో అనుకో నా కొంప కొల్లేరయ్యేది. అందుకని భరించాల్సిందే అని గట్టిగా నిర్ణయం చేసేసుకున్నాను.
వంటింట్లో వంటకు మాత్రం ఏర్పాటు చేసుకున్నాను -- " మంగా ఇటురా -- " అన్నారాయన.
“ ఇదిగో విను శ్రద్దగా విను -- గ్లాసు కారం, గ్లాసు మెత్తని ఉప్పు, కర్వేపాకు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర మిక్సీ లో కంగా మంగా పట్టేస్తే ఘుమ ఘుమ లాడే వేపుడు కారం తయారైపోతుంది. ఈ వేపుడు కారం తో రెండు వంకాయ వంటకాలు చెప్తాను, ఇవ్వాళ చెయ్యి. పొడవాటి వంకాయలు,వీటిని నీటి వంకాయలు అంటారు రెండు ముక్కలు చేసి, మధ్యలో పూర్తి గా తెగిపోకుండా నాటు పెట్టి మూకుట్లో ముక్కలు మునిగేంత నూని వేసి వాటిని మెత్తబడే వరకూ వేయించి, వేగేక తీసి మధ్యలో విడదీసి ఆందులో ఈ వేపుడు కారం వేస్తే, అబ్బ నోరు ఊరిపోతోందనుకో ఈ వేపుడు వంకాయలు నెయ్యిఅన్నం లో కలుపుకుంటే -- అబ్బ ! అని ఆయన అంటోంటే నోట్లోంచి లాలాజలం వస్తుంటే భుజం మీద తువ్వాలు తో తుడుచుకున్నారాయన.
రెండోది వంకాయ గిన్నెకూర, పొట్టిగా, బొద్దుగా గుండ్రం గా వుండే వంకాయలు తీసుకుని మధ్యలో జాగ్రత్తగా కట్ చేసి, వేపుడు కారం లో ఒక చెమ్చా శనగపిండి కలిపి వాటిల్లో కూరి, కూరిన వంకాయల్ని ఒక గిన్నె లో సరిపడా నూనె వేసి మూతపెట్టి సన్నని సెగ మీద ఉడికించావనుకో-- వాటి రుచి ఏమని చెప్పను? వొట్టినే తినెయ్యచ్చునే బాబూ-- ఇవ్వాల్టికి ఈ రెండు కూరలు చాలు, రేపు మళ్ళీ చెప్తాను ” అంటూ మళ్ళీ తన నోట్లోంచి వస్తున్న నీటిని తుడుచుకున్నారు.
" అది కాదండీ మీరు ఈ వంకాయకూరలు ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు ? వారానికి ఒక రోజైనా వేరే ఏదైనా కూర తింటారా ? లేక ముప్పొద్దులా, వారం లో ఏడు రోజులూ, నెలంతానూ ఈ వంకాయే నా --” అని నేను అంటే “ ఇప్పుడు నా వయసు ఇరవై ఎనిమిది అనుకో, నేను అన్నం తినడం మొదలు పెట్టినప్పటినుంచీ, మా అమ్మ ఈ వంకాయ కూర తోనే పెంచింది. నాకు అప్పుడప్పుడు రాత్రుళ్ళు మెలకువ వచ్చి వంకాయ కావాలి అని అంటే, గభాల్న సౌవ్ మీద ఒక వంకాయ కాల్చి తొక్కతీసి వేపుడు కారం కొద్ది గా రాసి ఇస్తే కమ్మగా తినేసి పడుకుండిపోయేవాడిని తెలిసిందా ? ” అని ఆయన అంటోంటే, అమ్మో ఇది మామూలు పిచ్చి కాదురా బాబూ, ఆయన తో ఎలా వేగాలో ఏమో అనుకోసాగేను.
మా సంసారం లో వంకాయ కూర, గుత్తి వంకాయ కూర, వంకాయ వేపుడు, వంకాయ గిన్నెకూర, వంకాయ బజ్జీ, బజ్జోంకాయ, వంకాయ రైస్, వంకాయ పులుసు, వంకాయ పచ్చడీ, వంకాయ ఉల్లిపాయ కూర, వంకాయ పచ్చి పులుసు, రాత్రుళ్ళు ఎప్పుడైనా ఆయనకు వంకాయ తినాలని కోరిక పుడితే, నిద్రలేపి నన్ను వంకాయ అంటే ఒక వేళ నేను లేవలేదనుకోండి స్టాప్ మీద ఒక వంకాయ కాల్చుకుని తినేస్తారు. మా ఈ మాయదారి వంకాయ సంసారం ఇలా మూడు పొడవాటి వంకాయలూ, ఆరు గుత్తి వంకాయలూ లాగా సాగిపోతోంది. ఆయన నేను ఎప్పుడైనా వంకాయ లని విసుక్కుంటే, వంకాయలు ప్రాణ లింగంబులయ్యె --గంజి వంకాయ నువ్వింకా తిననే లేదు అది కూడా తెప్పిస్తాను దానితో పులుసు వుంటుందీ --నీకు ఇంకో విషయం తెలుసునా -- కర్పూర వంకాయ చెట్టు ను లవ్ యాపిల్ చెట్టు అంటారే డియర్ మంగా అంటూ నన్ను తనివి తీరా హత్తుకునేవారు. మగడి కి ఎటువంటి చెడు అలవాట్లు లేక పోతే, భార్య జీవితం స్వర్గధామం అని పెద్దలు చెప్పారు. మరి ఈ వంకాయ సంసారానికి ఇలా అడ్డుతగులుకుందే అని అమ్మతో అంటే “ అమ్మాయ్ వంకాయ సంసారానికి అడ్డు రాదే తల్లీ, ఎప్పుడో ఈ వంకాయకి చరమగీతం పాడాల్సి వస్తుందే ” అప్పటి దాకా కంగారు పడకు” అంది మా అమ్మ.
ఆ వేళ హాలు లోంచి మాటలు వినిపిస్తుంటే అటు గా వెళ్ళాను --
“ వంకాయవంటి కూరయు, పంకజముఖి సీత వంటి భార్యామణియు, శంకరుని వంటి దైవము, లంకాధిపు వంటి రాజును గలడే ” అన్నారు బావగారూ, దీనర్ధం ఏమిటంటే, వంకాయవంటి కూర, పద్మముఖి సీత వంటి భార్య శంకరుని వంటి దైవము, శ్రీరాముని వంటి మహారాజు, లోకం మొత్తం వెదికినా దొరకడు అని కవి వాపోయేడు. నేను గన్నా ఈ పద్యం రాసిన వాడిని చూసి ఉంటే బంగారు పతకం తో సత్కరించేవాడిని. అది సరేగాని బావా, మరి పొడవాటి వంకాయలు, పొట్టి వంకాయలు, బజ్జోంకాయలు, ఇంకా రెండు మూడు రకాలు తెమ్మన్నాను కదా తెచ్చావా ? ” అంటున్నారాయన అప్పుడే వచ్చిన మా అన్నయ్యతో. " అన్నయ్యా ఇదేనా రావడం, అప్పుడే వంకాయ పురాణం మొదలెట్టేశారా బావగారు ” అంటూ చిరుకోపం తో అంటుంటే “ చెల్లాయ్ బజ్జోంకాయ్ లాంటి బాబును ఎప్పుడిస్తావ్ ? ” ఆన్నాడు.
“ గుత్తివంకాయ కూరోయ్ బావా -- కోరి వండినానోయ్ బావా --" అంటూ రాగం తీసి, పాతకాలం లో బందా కనకలింగేశ్వరరావుగారని ప్రఖ్యాత నటుడు నాటకాలలో ఈ పద్యం పాడేవాడు బావా, మా నాన్నగారు నాకు ఎన్నిసార్లు వినిపించారో నా చిన్నతనం లో --" అని ఆయన అంటుంటే అన్నయ్య లేచి నాతో పాటు లోపలకు వస్తూ " ఎలా వేగుతున్నావే ఈ వంకాయగాడితో, ఆ వంకాయను వదలడేమే బాబో -- " అంటే, " అన్నయ్యోయ్ -- వంకాయ వదలమంటే నన్నే వదిలేస్తారేమో మీ బావగారు, తస్మాత్ జాగ్రత్త -- ” అని నేను నవ్వసాగేను..
ఆ వేళ మా అన్నయ్యకు భోజనం లో మా శ్రీవారు చెప్పిన వంకాయ మెనూ, గుత్తి వంకాయ కూర, వంకాయ పచ్చిపులుసు, వంకాయ గిన్నెకూర, వగైరాలు వడ్డించాను-- భోజనాల దగ్గర మా అన్నయ్య వంకాయ తో రక రకాలు తింటూ “ బావగారూ ఏమీ అనుకోకండి ఒక విషయం చెప్తాను. వంకాయ అనేది కూరలలో రారాజు నిజమే! కాని ఈ వంకాయ ఉంది చూశారూ వాత పిత్తం కలగచేస్తుందని వైద్యశాస్త్రం ఘోషిస్తోంది. అతిగా తింటే దద్దుర్లు, దురదలు, ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. కొండొక చో ప్రాణప్రమాదం కూడా పొంచి ఉంది. అయినా అతి సర్వత్రా వర్జయేత్ ” అన్నారు కదా పెద్దలు, మరీ అంత అతి పనికిరాదండీ -- " అని మా అన్నయ్య అంటోంటే, ఆయన చిరాకు గా ముఖం పెట్టి వింటున్నారు. ఈ వంకాయ గోల తట్టుకోలేక పని వుందని పారిపోయాడు ఆవేళే.
అన్నయ్య వెళ్ళడం ఆలస్యం ఏమిటే మంగా మీ అన్నయ్యకు నేను వంకాయకూరలు తినడం నచ్చడం లేదు, అలా వాతం పిత్తం అలెర్జీ అని నానా మాటలు అన్నాడేమిటే ! వెనకటికి శుభం పలకరా అని పెళ్ళిపందిట్లో ఒక పెద్దాయన్ని అంటే పెళ్లికూతురు ముండేదీ అన్నాడటలే ముద్దుకొద్దీ, ఆ మరుక్షణం లో పీటల మీద పెళ్ళికొడుకు గుండెల మీద చెయ్యేసుకుని హరీ మన్నాడుట గుండాగిపోయి, అలా మాట్లాడేడులే బావగారు ” అంటూ చిర్రుబుర్రు లాడేరాయన. పెళ్ళయ్యాక చాలా రోజులకు కోపంతో యడముఖం, పెడ ముఖం గా పడుకున్నాం ఇద్దరమూ.
మంచి నిద్రలో ఉన్నాను-- ఒక రాత్రి వేళ పెద్దగా మూలుగులు, అమ్మో, బాబో, అంటూ వినిపించసాగేయి. అర్ధరాత్రి భయం గా లేచాను, ఆయన వళ్లంతా దద్దుర్లు తో నిండిపోయింది, గోకితే చాలు ఆయన శరీరం ఉబ్బి పోతోంది. ఈ వళ్ళంతా మంటా దురదగా ఉందే మంగా అంటూ ఆయన దురద వచ్చిన చోటల్లా గోక్కుంటూ మా అన్నయ్య ను ఒహటే తిడుతున్నారు. ఆయన బాధ చూడలేక వెన్నపూస కోసం ఫ్రిజ్ లో పెట్టిన మీగడ తీసి అప్పటి కప్పుడు చల్లకవ్వం తో చిలికి, వెన్న తీసి ఆయన వళ్లంతా రాయసాగేను. " అబ్బ హాయి గా వుందే మంగా ! నన్ను బ్రతికించావే ” అంటూ మరో పక్కన గొక్కుంటూనే ఉన్నారు. తెల్లవారే సరికి ఆయన ముఖమూ, కాళ్ళూ, చేతులూ ఉబ్బిపోయి, పొట్టకూడా అక్కడక్కడ దద్దుర్ల తో ఆయన ముఖం అచ్చంగా ఆంజనీపుత్రుని ముఖం లా తయారైపోయి వికృతం గా తయారయ్యారు. తెల్లవారడం ఆలస్యం కారు పిలిపించి, చర్మరోగాల ఆసుపత్రికి తీసుకువెళ్ళాను.
ఈయన అరుపులకు, కేకలకూ, మూల్గులకూ హాస్పటల్ అంతా గోలగోలగా అయిపోయింది. " ఏమయిందమ్మా ఏదైనా పురుగు పాకిందా ? ” అక్కడున్నవారంతా మా చుట్టూ చేరి ప్రశ్నల వర్షం కురిపించసాగేరు.
డాక్టరు గారు వచ్చి ఆయన్ను చూసి బాగా పరీక్ష చేసి, రక్తపరీక్షలు చేయించి, నిన్న ఏం తిన్నారు ? అసలు ఎప్పుడూ ఇష్టం గా ఏం తింటారు ? ఏదైనా పదార్ధం తింటే పడకపోవడం వుందా ? ఇలాంటి ప్రశ్నలు అనేకం వేసేక పెద్దసీసాతో జావ లాంటి క్రీమ్, మరో సీసా తో నూనె, నాలుగు రకాల మాత్రలూ ఇచ్చి రెండు రోజుల దాకా ఆయనకు బట్టలు వేయకండి, అండర్ వేర్ తో ఉంచండి, గంట గంటకీ క్రీమ్, ఆ తరువాత నూనె మార్చి మార్చి వళ్లంతా రాయమన్నారు. అంతా అయ్యాక చివర్లో డాక్టరు గారు “ ఒక ముఖ్యవిషయం, మీ శ్రీవారు కొన్ని సంవత్సరాల వరకూ వంకాయ తినడం మానేయాలి. అసలు వాటిని పూర్తిగా తినడం మానేస్తే బెటర్. పోనీ--ఒక పని చెయ్యకూడదూ ఎలర్జీ తగ్గేక కుటుంబమంతా కాశీ వెళ్ళి గంగ లో వంకాయ వదిలేయమనండి శనొదిలిపోతుంది -- " అని చిరునవ్వు తో చెబుతున్నారు, ముఖం అదో లా పెట్టి. “ఇంతలో పరుగులతో మా అమ్మా, అన్నయ్యా వచ్చేశారు. " అదేమిటే చోద్యం -- ఆంజనేయస్వామి కి వడల దండ వేస్తానని మొక్కుకోవే తల్లి, స్వామి మీ ఆయన వంటిమీదకి వచ్చేశాడే బాబూ-- అయినా ఆ మాయదారి వంకాయ కూరలూ, పచ్చళ్ళూ, పిచ్చి పిచ్చి గా తినకూడదు ఏదైనా అతి చేస్తే గతి చెడుతుంది అన్నారు గదే పెద్దలు -- " అంటోంది అమ్మ వస్తూనే.
" అమ్మానే చెబుతూనే ఉన్నా .వంకాయ వాతం పిత్తం ఎలర్జీ అని మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను అని అన్నయ్య అంటూంటే, మా అన్నయ్య నోరు నొక్కేసి " నువ్వు ఉన్నపళంగా బస్సెక్కి వెళ్ళిపో, కొన్ని సంవత్సరాల వరకూ మా ఇంటి ఛాయలకు కూడా రావద్దు. మీ బావ గారికి నువ్వంటే ఎంత కోపం గా ఉందో చెప్పలేను, కనిపించావంటే చేతికి ఏది దొరికితే దానితో నిన్ను పొడిచేస్తారాయన, అంత బాధలో కూడా “ మీ అన్నయ్య శాపం పెట్టాడే నాకు ” అని ఒహటే గోల -- ” అంటూ అన్నయ్యని మా ఇంటి వేపు రాకుండా తరిమేశాను.  ఇంటికొచ్చాక, నేను ఒక పక్కన క్రీము, నూనె, మరో పక్కన వెన్నపూస రాస్తున్నా కూడా ఆయన దురదలు మంటలు తట్టుకోలేక మోకాళ్ళ మీద ముడుచుకుని బాధ తో విలవిల లాడి పోతుంటే, ముత్యాలముగ్గు సినిమా లో అంజనీపుత్రుడు వంటి మీద కు రావడం తో అల్లురామలింగయ్య కోతి లా ఒక మూలగా గొంతుక్కూర్చోవడం గుర్తుకు వచ్చింది సుమా ! మా పెళ్ళిచూపుల్లో ఐదడుగుల ఎత్తులో, ఎత్తుకు తగిన పుష్టికరమైన శరీరంతో, విశాలమైన ఛాతీ తో పచ్చని బంగారు మేని చాయలో గిరజాలు జుట్టు తో కళ కళలాడే కోలముఖం లో చక్కని ముక్కూ గులాబీ రంగు పెదాలూ, కనుపించీకనుపించని బుగ్గలూ విశాలమైన నేత్రాల నుండి చిలిపి చూపులూ ఆయన రూపం గుర్తుకు వచ్చి వంకాయను శత విధాలా తిట్టుకున్నాను. కాశీ చూడాలని వుంది అని వంక పెట్టి అక్కడ ఈయన చేత వంకాయలు వదిలిపెట్టించాలి లేకపోతే ఈయన్ను కంట్రోల్ చెయ్యలేను నేను -- అనుకుంటూ ఆలోచనల్లో వుండగా
" ఇన్ని సంవత్సరాల నుండి తింటుంటే నాకు ఏమీ కాలేదు. కాని మీ అన్నయ్య తెచ్చిన వంకాయలు తింటే నే ఈ రోగం వచ్చింది. కొంపములిగింది. అయినా మీ అన్నయ్య కనుదిష్టి బాగా తగిలింది. మా అమ్మ అంటూనే వుండేది ఎవరూ చూస్తుండగా అబగా ఏమీ తినకు రా అబ్బీ అని అది నిజం అయిందిప్పుడు -- అంటూ ఆయన వాచిపోయన నోటి తో వచ్చీ రాని మాటలతో అంటున్నారు. పోనీ శ్రీఆంజనేయస్వామి దయ వలన తొందరగా తగ్గి పోతే ఆయనకు పెద్ద వడమాల వేస్తాను-- అనుకుంటూ ఆంజనేయస్వామి ని ప్రార్ధించసాగేను.
ఇప్పుడు నాకు గుర్తుకు వస్తోంది అమ్మ అన్న మాటలు " వంకాయ సంసారానికి అడ్డుకాదే తల్లీ ఓపిక పట్టు ఈ వంకాయ కి చరమగీతం పాడాల్సి వస్తుందే ఎప్పుడో ఒకప్పుడు --” అని. ఇది అమ్మ దీవెన గా నేను భావిస్తున్నా

No comments:

Post a Comment

Pages