నీ దయ సామీ - అచ్చంగా తెలుగు
 నీ దయ సామీ
ఓరుగంటి శ్రీలక్మీ నరసింహ శర్మ

తిండి తిని మూడు రోజులైనా ఆకలి అనిపించడం లేదు అప్పన్నకు. ఒళ్ళంతా ఏడిగా కాలిపోతున్నా పట్టింపులేదు. అతను వదులుతున్న ఊపిరి తిరిగి అతనికే తగులుతోంది. అతనిలోని ఏడిని చల్లార్చే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని గాలి కూడా తిరగటం లేదు అక్కడ. ఇంట్లో గంజి నీళ్లు కూడా లేవని చెప్పిన లచ్చిమిని కోపానికొచ్చి కొడితే, తను చూసిన చూపుకి… సిగ్గుతో ఇంటి నుండి వచ్చేసాడు. ఎలాగైనా సరే పందిని పట్టి రెండు రూపాయలు సంపాదించే ఇంటికి పోవాలి అనుకున్నాడు ఇంటి నుంచి వచ్చేస్తూ. 

    అదేం ఇసిత్రమో మూడురోజులుగా చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది ఊళ్ళు తిరిగినా ఒక్క పంది కూడా కనబడలేదు. పంది కనబడాలి... దాన్ని పట్టాలి.... కోయాలి.... కోసింది అమ్మితేనే... ఓ రెండు రూపాయలు వచ్చేది... ఆ రోజు గడిచేది. అలాంటిది వారం పైనే అయ్యింది కనబడి. అది కూడా దొరికినట్టే దొరికి పారిపోయింది. 
    కాలువగట్టునానుకుని ఉంది, అప్పుడెప్పుడో రాయల కాలంలో కట్టిన సంతాన వేణుగోపాలస్వామి గుడి. గుడి వెనుక వైపున చింత చెట్టుకి జారగిలబడి, కళ్ళు మూసుకుని... నాకు ఏదైనా ఏట దొరికేలా సేయి, వచ్చిన దాంట్లో సగం నీకిచ్చేత్తాను నీ దయ సామీ అని మొక్కుకున్నాడు. 
                        ***
    గుడి లోపల ఉన్న పూజారి అప్పలాచార్యుల గారి మదినిండా ఆలోచనలే. పెళ్ళైయిన తర్వాత కూతురు, అల్లుడుగారు మొదటిసారి ఇంటికొస్తున్నారు. పట్నంలో అయ్యోరుగా చేస్తున్న అల్లుడిగారికి పండగ కానుకగా కనీసం కొత్త సైకిలు కొంటే బాగుంటుంది అనుకున్నారు. ఓ వంద అప్పుగా కావాలని అప్పటికి తొమ్మిదిమందిని అడిగితే.... అందరూ అష్టోత్తరం, సహస్రం చదివించుకుని పావలానో, అర్ధనో వేసిన వాళ్ళే కానీ ఒక్కరు కూడా ఇస్తామన్న పాపాన పోలేదు. భోజనం వేళవుతున్నా ఇంటికి వెళ్లకుండా.... గర్భగుడికి ఇవతల ఉన్న మంటపంలో స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకుని తండ్రీ అల్లుడుగారి దగ్గర మర్యాద పోనీయకుండా చూడు… నీ దయ స్వామీ అని వేడుకున్నారు.
                        ***
    పూజకు కూర్చున్నప్పటి నుండి పెరట్లో ఆగకుండా అరుస్తున్న కాకిని సుతారంగా విసుక్కుంటూ నువ్వు చెప్పకుండానే పదిరోజుల క్రితమే తెలిసింది కబురు. పండక్కి అమ్మాయి, అల్లుడుగారు వస్తున్నారు అని. ఐనా కబురు తెచ్చావు కదా ఇదిగో అంటూ కొన్ని బియ్యం గింజలు దానికి వేసి ఇలా వసారాలోకి సర్వలక్ష్మమ్మ గారు వచ్చారో లేదో పోష్ట్ అంటూ మరో కబురొచ్చింది. 
    కార్డుకి నాలుగు వైపులా ఉన్న పసుపు బొట్టులు చూసి ఏదో శుభకార్యమే అనుకుంటూ చేతిలోకి తీసుకుని చూసేసరికి కార్డు వచ్చింది అల్లుడుగారి ఊరు నుంచే. నీ దయ స్వామీ … చల్లని విషయం అయ్యేలా చూడు అని మనసులోనే వేణుగోపాలస్వామి వారికి దండం పెట్టుకుంటూ చదవడం మొదలు పెట్టారు. తాను ఏదైతో కోరుకుందో అదే... కూతురు నీళ్ళోసుకుంది అనే విషయంచదివేసరికి ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి. ఇదా నాన్నా నువ్వు నాకు చెప్పాలనుకున్న కబురు అంటూ పెరట్లోకి వెళ్ళి చూసేసరికి తాను వేసిన బియ్యం తినేసి... మరో కబురు మోసుకెళ్లే పనిలోకి వెళ్ళిపోయిందా కాకి. 
    ఎంత తొందరగా గుడి నుండి భర్త వస్తారా... ఎంత తొందరగా ఈ విషయం చెప్పాలా అని ఆలోచిస్తూనే... భర్తకు ఇష్టమని చక్రపొంగలి చేసి ఆయనొస్తే పెట్టి, తాను కూడా ఎంగిలి పడొచ్చు అని ఎదురు చూస్తోంది సర్వలక్ష్మమ్మ గారు. అపహరాహ్ణం అయ్యి చాలాసేపు దాటినా ఇంకా భోజనం కోసం రాని భర్త కోసం, ఉదయం కట్టుకున్న మడి చీరతో గుమ్మం పక్కన కూర్చుని అలా ఎదురుచూస్తూ ఉండగానే సంజె వేళ అవ్వొచ్చింది. 
                            ***
    మూడురోజులుగా కనబడని పెనిమిటి కోసం చుట్టుపక్కల ఊర్లన్నీ గాలించేస్తోంది లచ్చిమి. ఎక్కడా కనబడడే. ఆడు ఏదైనా తెస్తే వండి పెట్టేదాన్ని నేను. ఇంట్లో ఏం లేకుండా ఏం వండాలా అని దెప్పి పొడిచినట్టు చూసిన చూపుకే ఆడు ఇంట్లోంచి పోయాడు. 
    నా కళ్ళు పేలిపోను... మొగుడన్నాకా ఓ దెబ్బ వేయడా... ఎక్కడున్నాడో... ఏమన్నా తిన్నాడో లేదో... అని పిచ్చిపట్టినదానిలా తిరుగుతోంది. సామీ నీ దయ... నా పెనిమిటి నాకు కనబడేలా చేయి అనుకుంటూ సరిగ్గా సర్వలక్ష్మమ్మ గారి ఇంటి ముందుకు వచ్చేసరికి, ఉత్తి కడుపుతో తిరగటం ఇక నావల్ల కాదంటూ పడిపోయింది జీవం ఉన్నా ఓపిక లేని ఆ శరీరం. 
                            ***
    ఏదో అలికిడి అవ్వడంతో గబ్బుక్కున కళ్ళు తెరచి చూసిన అప్పన్నకు కళ్ళకెదురుగా కనబడింది నల్లటి చర్మంతో ఉన్న జీవి. పంది కనబడింది అన్న ఆనందం అంతా క్షణంలో పోయింది నోటినుండి ముందుకు పొడుచుకుని వచ్చి అడుగుపైనే ఉన్న దాని కోరలను చూడగానే. తాను మాములు పందులను మాత్రమే పట్టగలడు. కానీ ఎదురుకుండా కనబడుతోంది అడివి పంది. దానిని చూస్తే సింహాన్నైనా చంపేసేలా ఉంది. సరిగ్గా ఒక్క కుమ్ము కుమ్మితే చాలు తాను కైలాసం పోవడానికి. కానీ కడుపులోని ఆకలి మాత్రం దానికి ఎదురెళ్ళమనే చెబుతోంది. 
    ప్రాణం కంటె ఆకలే బలమైనది కావడంతో ఒంటిమీద గోచీలా కట్టుకున్న పంచెను తీసి, నెమ్మదిగా ఆ పంది దగ్గరకు వెళ్ళసాగాడు.
                        ***
    గబగబా బయటకు వచ్చి కింద పడిపోయిన లచ్చిమి దగ్గరకు వెళ్లబోతున్న సర్వలక్ష్మమ్మ గారితో ముట్టుకోకు సర్వలక్ష్మీ… ఎవరో ఏమిటో అసలే మడిలో ఉన్నావు… అంటున్న చుట్టుపక్కల వాళ్ళ మాటలు పట్టించుకోకుండా.... నా కూతురు వయసుంది, ఒకవేళ పడిపోయింది నా కూతురే ఐతే అలానే అనుకుంటానా అంటూ లచ్చిమిని గోడవారగా కూర్చోబెట్టి.... తాగడానికి ఇన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. 
    ఖాళీ కడుపుమీద తాగిన నీళ్ళతో లచ్చిమికి పొలమారితే… చిరంజీవ చిరంజీవ అంటూ నెమ్మదిగా నెత్తిమీద తట్టారు. లచ్చిమిఆకలితో ఉన్నాదని గ్రహించిన ఆవిడ వెంటనే ఇంటిలోకి వెళ్ళి చక్రపొంగళి తీసుకొచ్చి ఇచ్చారు తినమని. ఓ ముద్ద తీసి నోటిలో పెట్టుకోబోతూ పెనిమిటి గుర్తురాగా అమ్మా నేను ఇంటికెళ్లి తింటాను అని తినకుండా ఆకుని మడిచి తన చీరకి కట్టుకుంటుంటే ఓ క్షణం ఆగమని చెప్పి మళ్ళీ ఇంటిలోకి వెళ్ళి మిగిలిన చక్రపొంగళిని కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు... కడుపునిండా తినమని ఆశీర్వదిస్తూ. 
                        ***
    గుడి తలుపులు మూసి బయటకు వస్తున్న అప్పలాచార్యులవారికి దూరంగా కనబడ్డాడు, దిశమొలతో పందిని పట్టుకోడానికి వెళ్తున్న అప్పన్న. తనవైపుగా ఎవరో రావడం గమనించిన పంది వెంటనే అతని మీదకు దూకబోయింది. క్షణంలో అప్పన్న తన చేతిలోని పంచెను దానిమీదకు వేయడం, కనబడక పోవడంతో ఆ పంది పక్కనే ఉన్న బురదలో పడిపోవడం ఒకేసారి జరిగాయి. పంచెను దాని మొహం మీదే ఉంచి దాన్ని పట్టాలని విశ్వప్రయత్నం చేయసాగాడు అప్పన్న.
    ఆ వరాహ బలం ముందు తేలిపోయిన అప్పన్నను తన వాడివైన కోరలతో పొడిచేయాలని వరాహం ప్రయత్నిస్తున్న క్షణంలో అది చూసి అప్పలాచార్యుల వారు అప్రయత్నంగా స్వామీ అని బిగ్గరగా అరిచారు.
    ప్రాణం పోయినా సరే ఆ రోజు ఏటాడే తీరాలని నిర్ణయించుకున్న అప్పన్నకు బలంగా దొరికింది ఆ పంది కోర ఒకటి. తన బలాన్నంతా ఉపయోగించి లాగేసరికి సగం చచ్చింది అది. ఆ కోరని అలానే పుచ్చుకుని దాని గుండెల్లో గుచ్చేసరికి ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయిదానికి. ఒంట్లోని శక్తి అంతా పోవడంతో అలానే ఆ పంది మీదే వాలిపోయాడు అప్పన్న. 
    అప్పలాచార్యుల వారు గబగబా ఇంటివైపు వెళ్లిపోసాగారు.... విష్ణు సహస్రనామాల తోడుగా.
                        ***
    ఏదో తెలియని బలం తోడుగాపెనిమిటిని వెతుక్కుంటూ గుడివైపుగా వచ్చిన లచ్చిమికి కనబడ్డాడు అప్పన్న. దగ్గరగా పోయి తినడానికి ప్రసాదం తెచ్చాను అని తినిపించబోతుండగా ప్రసాదం ఇలాగటే తినేది అంటూ ఆమెను వారిస్తూ అక్కడి నుండి లేచి కాలువలో ఇద్దరూ స్నానం చేసి మెట్ల మీద కూర్చుని ఎదురుకుండా కనబడుతున్న గుడి గోపురానికి దండం పెట్టుకుని ఒకరి కొకరు తినిపించుకోసాగారు.
                        ***
    చీకట్లు ముసిరే వేళకు ఇంటికి చేరి, సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చిన భర్తకు కార్డు చేతికిస్తూ… కూతురు నీళ్ళోసుకుంది అనే శుభవార్త కూడా తనే చెప్పేశారు సంతోషం దాచుకోలేక. 
    ఓ గ్లాసు నీళ్ళల్లో రెండు తులసి ఆకులు వేసి ఇచ్చి ఇవ్వాళ్టి మన భోజనం అన్నారు సర్వలక్షమ్మ గారు. సగం తాగి మిగిలినది ఆమెకు ఇస్తూ ఎవరికి ఏది ప్రాప్తమో అదే ఆ దేవ దేవుడు ఇస్తాడు. మనమంతా నిమిత్తమాత్రులమే అని, గుడి నుండి తిరిగొస్తూ తాను చూసినది అప్పలాచార్యుల వారు చెబుతుంటే కళ్ళింత చేసుకుని వింటూ మిగిలిన నీళ్లతో తన కడుపు నింపుకున్నారు సర్వలక్షమ్మ గారు. 
    సరిగ్గా అదేసమయంలో తమ ఇంటి ముందు జరిగిన విషయం గూర్చి ఆవిడ చెబుతుంటే ఈ సారి ఆశ్చర్యపోవడం అప్పలాచార్యులవారి వంతయ్యింది. 
                        ***
    మరునాటి ఉదయం గుడి తలుపులు తెరిచేసరికి అప్పన్న లచ్చిమిలు ఇద్దరూ అక్కడున్నారు. ఇద్దరి కళ్ళలోను ఏదో తెలియని ఆనందం అప్పలాచార్యులవారికి కనబడింది. ఇద్దరిని పిలిచి వాళ్ళు తెచ్చిన పూలతో ఆ సంతాన వేణుగోపాలస్వామిని అలంకరించి అష్టోత్తరం చదవసాగారు. 
    తన నడుముకు ఉన్న ముల్లెను తెరిచాడు అప్పన్న. అందులో రూపాయి నోట్ల కట్టలు కొత్తవి రెండు ఉన్నాయి. అంత డబ్బు పందులు పట్టేవాడికి ఎక్కడిదా అని గుళ్ళో ఉన్న మిగిలిన వాళ్ళు దేవుడిని వదిలేసి ఆ ఇద్దరినే చూస్తూ ఉన్నారు. దేవుడికి దండంపెడుతూ... సామీ నిన్న నీకు మొక్కుకున్నట్లే నా సంపాదనలో సగం నీకు అంటూ ఓ కట్ట తీయగా హారతి ఇవ్వడానికి వస్తున్నఅప్పలాచార్యులవారి మనస్సులో దక్షిణ పళ్ళెంలో వేస్తే బాగుండును కదా… అల్లుడికి కొత్త సైకిలు కొనేయొచ్చు అనే ఆశ కలిగింది. 
    రూపాయి కట్టను కళ్లకద్దుకుని సామీ నిన్న ఏటాడిన ఏటను భూపతిరాజుగోరికి ఇచ్చాము. ఆళ్ల చిన్నమ్మాయి పెద్దమనిషి అయ్యిందట. ఇవ్వాళ భోజనాలు అంట. తన పరువు నిలిచేలా అలాంటి ఏటను తెచ్చానని ఆ రాజుగోరు రెండు పదులు ఇస్తే చాలనుకున్న నాకు రెండు వందలు ఇచ్చి పంపారు. ఇద్దరూ ఒకేసారి అంతా నీ దయ సామీ…. అంటూ ఆ వంద రూపాయలను హుండీలో వేసేశారు. తన దగ్గర మిగిలున్న డబ్బులలో నుంచి రెండు రూపాయలు తీసి హారతి పళ్ళెంలో వేసి కళ్లకద్దుకున్నారు ఇద్దరు. 
    ఒక్క క్షణం తనకొచ్చిన కోరికకు సిగ్గుపడి, జీవితకాల సంపాదనలో సగం ఏమాత్రం ఆలోచించకుండా అదే క్షణంలో ఇచ్చేసిన ఆ ఇద్దరినీ చూస్తూ తన్మయత్వంతో… అంతా నీ దయ స్వామీ అనుకుంటూ…
శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి.
ధీర్ఘ సుమంగళీ భవ... పుత్రపౌత్రాభివృద్ధిరస్తు... అని దీవించారు అప్పలాచార్యులవారు. 
***
    ఆనాడు గుడిలో జరిగింది భార్యతో చెప్పాలని ఇంటికి వచ్చిన అప్పలాచార్యుల వారికి వాకిట్లో కొత్తగా మెరిసిపోతున్న సైకిలు కనబడింది. ఏమై ఉంటుందా అని దాన్నే చూస్తూ ఉన్న ఆయన దగ్గరకు వచ్చి నిల్చున్నారు సర్వలక్ష్మమ్మగారు. 

    లోపల నుండి వచ్చిన అల్లుడుగారు, కూతురుతో కలిసి ఇద్దరి కాళ్లకు దండం పెట్టి కొత్త సైకిలు తాళం మామయ్యగారి చేతులకు ఇస్తూ ఎక్కడ ఆయన వద్దు అంటారో అని, ముందరి కాళ్ళకు బంధమల్లే 'సర్వం  శ్రీ వేణుగోపాలార్పణమస్తు' అనేశాడు.
***

No comments:

Post a Comment

Pages