నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'అంతరంగ తరంగాలు! ' - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'అంతరంగ తరంగాలు! '

Share This
నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే) -'అంతరంగ తరంగాలు! '  
శారదా ప్రసాద్ ఇంతవరకూ నా కధలో మీకు చెప్పినవన్నీ నిజాలే!ఒకటి కూడా అసత్యం లేదు!ఇంతవరకూ రాసింది ఒక ఎత్తుఅయితే  ,రాయబోయేది మరొక ఎత్తు !ఆత్మకథల్లో పూర్తి వాస్తవాలతో వ్రాయబడిన గాంధీ గారి ఆటోబయోగ్రఫీ అయిన ,"My Experiments With Truth"చాలా గొప్పది.అది నన్ను చాలావరకు ప్రభావితం చేసింది!తెలుగులో వచ్చిన ఆత్మకథలో నాకు నచ్చింది మహాకవి శ్రీ శ్రీ గారి 'ఆనంతం'.  'అనంతం' ఎందుకు నచ్చిందంటే ఆయనలోని నెగేటివ్స్ ను కూడా ఆయన 
గ్రంధీకరించారు, వ్యభిచరించటంతో సహా!  అదొక్కటే కాకుండా అందులో చాలా రిఫరెన్స్ లు కూడా ఉంటాయి !ఇన్ని రిఫరెన్స్ లు ,నిజాలు ఉన్న ఆత్మకథ తెలుగులో మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో!ప్రతి మనిషిలోను కొన్ని బలహీనతలుంటాయి!బలహీనతలు లేని వాడు ఎవడైనా ఉంటాడా ?శ్రీ రాముడిలో  కూడా లోపాలుంటాయి. నేను ఆ మధ్య  నా స్నేహితుడి  కొడుకును ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకొని వెళ్లాను!ఆ వైద్యుడితో ఆ యువకుడి తండ్రి,"మా అబ్బాయికి ఏ దురవాటు కూడా లేదండీ!కనీసం కాఫీ కూడా తాగడు,పాలు మాత్రమే తాగుతాడు!మరి అతను ఇప్పుడు మీ వద్దకు తీసుకొనివచ్చే స్థితికి కారణం మాకు అర్ధం కావటం లేదు!"అని చెప్పాడు.అందుకు వైద్యుడు---మా దగ్గరకు వచ్చే సమస్యల్లో ఎక్కువ భాగం ఇటువంటివే!ఏ వయసులో ఎలా ఉండాలో అలా ఉండక పోవటం కూడా ఒక మానసిక వ్యాధే !అప్పుడప్పుడు సిగరెట్ కూడా తాగాలనిపించకపోవటం , ఆ వయసు ప్రభావం అతని మీద పడకపోవటమే!మీరు బుద్ధిమంతుడు అనుకునే వాడు,ఏదో ఒక టైం లో మా దగ్గరకు రావలసిందే!" అని వైద్యుడు చెప్పిన మాటల్లో చాలా వాస్తవం ఉందనిపించింది!ఎందుకంటే ,నేను  ఆ యవ్వన దశను దాటి వచ్చిన వాడినే!కఠిన నియమాలతో పెంచబడిన వారు వ్యభిచారులుగా ,తాగుబోతులుగా మారటం నాకు తెలుసు.ఇటువంటి వారు కొందరు నేడు పీఠాధిపతులు కూడా అయ్యారు!పేర్లు చెప్పటం ఎందుకులెండి!చెప్పకపోవటంలో నాకు భయం లేదు,కానీ ఆయన్ని ఆరాధించేవారు ఆయనలోని నెగేటివ్స్ ను చెప్పినందుకు అకారణంగా నా మీద విరోధం పెంచుకుంటారు!అది నాకు ఇష్టం లేదు.తప్పని పరిస్థితి వస్తే తప్పక చెబుతాను!ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ,అతని/ఆమె లోని లోపాలను కూడా అంగీకరించటం!అలా అంగీకరించకపోతే,వారి మీద మనకు ప్రేమ లేనట్లే!సమాజంలో ఎక్కువగా తిరిగితే ,బంధాలు కూడా ఎక్కువ ఏర్పడుతాయి !వారిలో ఒకరిని లేదా కొందరిని మనం ప్రేమించే అవకాశం ఉంది.జెమినీ గణేశన్ లాగా పశువులా ప్రవర్తించటం ప్రేమ కాదు!ప్రేమకు ఇవ్వటమే తెలుసు,తీసుకోవటం తెలియదు. మనం ప్రేమించే వ్యక్తి మీద కామ వాంఛలు కూడా ఏర్పడొచ్చు!అది వయసు ప్రభావం,శారీరక ధర్మం!కామం జనించకుండా ప్రేమ పుట్టదు! నిజంగా ప్రేమించే హృదయం ఉంటే ,అందరూ అందమైన అమ్మాయిలను/అబ్బాయిలను మాత్రమే ఎందుకు ప్రేమిస్తారు ?అంగ వైకల్యం కలిగిన వారిని  ఎందుకు ప్రేమించరు? ప్రేమకు కామానికి ఒక చిన్న తేడా ఉంది.ప్రేమించేది మనసుతోనైతే, కామించేది శరీర అవయవాల ద్వారా! చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనస్సు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తించడమే కామం అంటాడు వాత్స్యాయనుడు. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయకపోవడం గుర్తించాలి.  మనసులోని భావాలను పదిలంగా దాచుకోవటమే ప్రేమ!ఆ ప్రేమ కొన్నాళ్ళకు ఆరాధనగా కూడా మారుతుంది!ఇంత విపులంగా ఇన్ని విషయాలను వ్రాయటానికి కారణం --నాకు ప్రేమంటే ఏమిటో తెలుసు కనుక!అందుకే ఇప్పటికీ  నేను ప్రేమిస్తూనే ఉన్నాను.ఇప్పుడు చెబుతుంది అంతా చెప్పబోయే నా కధకు చిన్న ఉపోద్ఘాతం.నిజాలు చెబితే,కొందరి జీవితాలకు ఇబ్బంది కలగొచ్చు!అలా అని నిజాలు చెప్పకుండా ఎలా ఉండగలను?నిజం చెప్పకపోవటం అంటే అసత్యం చెప్పటమే!ఎవరి జీవితాలకైతే ఇబ్బంది కలుగుతుందని నేను భావిస్తున్నానో,వారి అనుమతి తీసుకొని ,వ్రాయాలనుకుంటున్నాను.వారు అనుమతి ఇవ్వకపోతే ,ఆ విషయాలను గురించి ప్రస్తావించను,ఎందుకంటే  నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి! వారికి ఇబ్బంది కలిగించును!ప్రశాంతంగా పడుకొని ఆలోచిస్తే ,మనం చేసిన తప్పొప్పులన్నీ మనకుగుర్తుకొస్తాయి.తప్పులకు కుమిలి పోకూడదు!అటువంటి తప్పులు ఎలా చేయకుండా ఉండాలో తర్వాతి తరానికి చెప్పాలి!అలా చెప్పకపోతే తర్వాతి తరాన్ని కూడా  మనం చెడకొట్టినట్లే!పురుషుడికి మోహ వాంఛ కలగకుండా ఉండాలంటే దానికి స్త్రీయే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ విషయాన్ని గురించే చలం గారు ఇలా అన్నారు, "స్త్రీ ఒక మాటవల్లా,చూపువల్లా పురుషునికి సందిచ్చిందా....ఇక అతని అధికారానికీ, కోరికలకీ, విన్నపాలకీ అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి......నిప్పు వలె ఉండాలి!" ఇలా లేకపోబట్టే మహానటి సావిత్రి జీవితం విషాదాంతం అయింది!నిజానికి ప్రేమించటమే తప్పైతే,Everyone of us is a criminal!  పాపాల కుబుసం విడిచిన పాములాంటి వాడే ఋషి అని ఆరుద్ర చెప్పిన మాటలు వాస్తవం!ఆది కావ్యం వ్రాసిన వాల్మీకిని మించిన మహర్షి మరెవరు ఉంటారు? ఈ అంతరంగ తరంగాలతో ప్రస్తుతంముగిస్తున్నాను. 
 ***

5 comments:

  1. Good article by Sarada Prasad garu. My sincere thanks. Nagaiah

    ReplyDelete
  2. చాలా బాగుందండీ!

    ReplyDelete
  3. ఆసక్తికరంగా మీ అనుభవాలను చెబుతున్నందుకు అభినందనలు!

    ReplyDelete

Pages