అగాధం - అచ్చంగా తెలుగు
 అగాధం 
బి.ఎన్.వి.పార్ధసారధి 

రమాదేవి రామారావు భార్యాభర్తలు. వీరికి పిన్నవయస్సు లోనే వివాహం అయింది.  ఇద్దరూ ఉద్యోగస్తులే కానీ పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవటంతో రమాదేవి తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. రామారావు కి తన ఉద్యోగంలో అంచలంచెలుగా పదోన్నతులు రావటంతో ఒకప్పుడు చిన్న చితకా ఇంటి పనులు చేసేవాడు కాస్తా అదికూడా క్రమేపి మానేసాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం, ఉద్యోగాల్లో చేరటం, వాళ్ళ పెళ్ళిళ్ళు అవటం అన్నీ ఇట్టే జరిగిపోయాయి. రామారావు కి ఇంకా నాలుగేళ్ళు సర్విస్ ఉంది. బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో ఉండటం వల్ల అతను భార్యతో కలిసి గడిపే సమయం రాను రాను బాగా తగ్గిపోసాగింది. ఉద్యోగరీత్యా పిల్లలు వేరే ఊళ్లలో స్థిరపడటంతో రమాదేవి ఒంటరితనానికి అలవాటు పడలేక సతమతమవసాగింది. కొన్నాళ్ళకి రమాదేవికి ఒంటరితనంవల్ల డిప్రెషన్ రావటంతో పది రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పించాడు రామారావు. కేవలం మందులవల్ల డిప్రెషన్ తగ్గదనీ, ఏదైనా ఒక వ్యాపకం వుంటే రమాదేవి మాములుగా వుండగలుగుతుందని డాక్టర్లు రామారావుకి హితబోధ చేసారు.
రమాదేవికి సాధారణ గృహిణి లాగా టీవీ సేరియల్స్ చూసే అలవాటు లేదు. అందుకని తనకి కాలక్షేపం అవుతుందని రామారావు స్మార్ట్ ఫోన్ ఒకటి తన భార్యకి  కొని ఇచ్చాడు. ఇంట్లో వైఫై కనక్షన్ పెట్టించాడు. క్రమెపీ రమాదేవి స్మార్ట్ ఫోన్ ని బాగా వాడటం ప్రారంభించింది. మొదట్లో రోజూకి గంటా రెండు గంటలు ఉండే స్మార్ట్ ఫోన్ వాడకం రానురాను క్షణం కూడా వీడి ఉండలేని పరిస్థితి ఏర్పడింది . వాట్స్అప్ లో  రమాదేవి బాల్యమిత్రురాళ్ళు , చుట్టాలు, స్నేహితులు ఇలా “ఇంతై వటుడంతై.....” అన్నట్టు వామన మూర్తి పాదం లా దేశ సరిహద్దులని దాటి ఖండాంతరాలు వ్యాపించింది. రమాదేవి వాట్స్అప్ లో చురుకుగా వుండటంతో ఆమెని చాలా గ్రూపుల్లో అడ్మిన్ గా చేసారు. గ్రూప్ అడ్మిన్ అంటే భారతరత్న బిరుదు వచ్చినంత సంతోషించింది రమాదేవి. రామారావుకి రాత్రి బెడ్రూం లో లైట్ వెలుగుతూ వుంటే నిద్ర పట్టదు. రమాదేవికి ఇప్పుడు రాత్రిళ్ళు లైట్ లేనిదే స్మార్ట్ ఫోన్ వాడలేని పరిస్థితి. దాంతో రామారావు రాత్రిళ్ళు వేరే గదిలో పడుకోవటం మొదలు పెట్టాడు. 
“ఏమండి ! నాకు ఒక లాప్ టాప్ కొనివ్వండి. స్మార్ట్ ఫోన్ లో ఫేస్ బుక్ పేజి చూడాలంటే ఇబ్బందిగా వుంది. “ అంది రమాదేవి ఒక సుముహూర్తాన భర్త రామారావు తో. ఇంక తప్పదన్నట్టు లాప్ టాప్ కొన్నాడు రామారావు. సవ్యసాచి లాగా ఒకచేత్తో వాట్స్అప్ మరో చేత్తో ఫేస్ బుక్ ఎడాపెడా వాడుతూ స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ లని కర్ణుడి కవచ కుండలాలుగా సర్వకాల సర్వావస్థలయందు శరీరాన్ని అంటుకున్న ఆభరణాలుగా ఉపయోగించసాగింది రమాదేవి. వేసవి కాలం వచ్చింది. తరచూ కరెంటు పోవటంతో ఒకరోజు ,” ఏమండి! ఇన్వర్టర్ పెట్టించుకుందాం. అస్తమాను కరెంటు పోవటంతో వైఫై రావటం లేదు. స్మార్ట్ ఫోన్, లాప్ టాప్  చార్జింగ్ కూడా కష్టంగా వుంది.” అంది రమాదేవి భర్త రామారావు తో మరో సుహూర్తం చూసి. చేసేదిలేక రామారావు ఇన్వర్టర్ కొన్నాడు. 
రామారావు పెద్దక్క  మరణించింది. “ మారుమూల పల్లెటూర్లో పదిరోజులు వుండాలంటే నాకు చాలా కష్టం అండీ. మీరు వెళ్ళిరండి.” నువ్వు వస్తావా అని ఆమెని అడగకముందే ముందరి కాళ్ళకి బంధం వేసింది రమాదేవి. ఆమె చెప్పకపోయినా వాట్స్ అప్ , ఫేస్ బుక్ ఆ మారుమూల పల్లెటూర్లో సరిగ్గా రావని ఇవే ఆమెకి ప్రతిబంధకం అని రామారావు గ్రహించాడు. 
రామారావు రిటైర్మెంట్ దగ్గర పడుతోంది. రమాదేవి కి డిప్రెషన్ వచ్చిన కొత్తల్లో తాను ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలని అనుకున్నాడు రామారావు. రమాదేవి ట్రీట్మెంట్ తీసుకోవటం ఆతరువాత జీవన యాత్ర లో అనుకోని మలుపులు తిరగటం వల్ల ఆమె మామూలుగా మారినప్పటికీ తమ ఇద్దరిమధ్య ఒక పెద్ద అగాధం మాత్రం ఏర్పడింది. తమ మధ్య ఈ గాప్  ఇప్పట్లో తగ్గేదిగా రామారావుకి అనిపించలేదు. రిటైర్ అయ్యి తాను ఇంట్లో కూర్చుంటే ఈ వాతావరణానికి బహుశా తనకి కూడా తన భార్య లాగా డిప్రెషన్ వస్తుందేమో అని అనిపించింది అతనికి. తాను సమ్మతిస్తే తనకి మరో రెండేళ్లు పదవీ కాలం పోడిగిస్తామన్నారు ఆఫీసు వాళ్ళు. వెంటనే దానికి అంగీకరించాడు రామారావు..... రమాదేవి తనలోకంలో ఎప్పటిలానే తలమునకలై వుంది. రామారావు యధావిధిగా ఆఫీసు కి వెడుతున్నాడు. ఆ దంపతులమధ్య అగాధం రోజు రోజుకి ఇంకా పెరగసాగింది. ఇంతలో ఒకరోజు రమాదేవి బాత్ రూం లో జారి పడటంతో ఆమె కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. వంట మాట దేముడెరుగు ఆమె తన దైనందిన కార్యక్రమాలు కూడా స్వయంగా  చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు నెలాన్నర రోజులు రామారావు ఆఫీసు కి శలవు పెట్టాడు. రమాదేవి దగ్గర వుండి పర్యవేక్షిస్తూ నేర్పించడంతో ఒక మోస్తరు వంట చెయ్యటం నేర్చుకున్నాడు రామారావు. ఇంట్లో ప్రతీ పనీ రామారావు చెయ్యటం, వెనక అజమాయిషీ, పర్యవేక్షణ రమాదేవి చేస్తూవుండటం తో ఆ దంపతులిద్దరూ ఈ నెలాన్నర లో బాగా దగ్గరయ్యారు. రమాదేవి చేతికి కట్లు విప్పారు. చెయ్యి దాదాపు మాములుగా అయ్యింది. “ఏమండీ ! మీరు ఆఫీసు కి వెడితే నేను ఒంటరిదాన్ని అవుతాను “ అంది రమాదేవి తన స్వరంలో బెంగ ధ్వనించగా. “నీకు కాలక్షేపానికి స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ వున్నయికదా! దిగులెందుకు ? “ అన్నాడు రామారావు. “నాకు స్మార్ట్ ఫోన్ , లాప్ టాప్ వద్దండీ. మీరేకావాలి” అంది రమాదేవి భావోద్వేకంగా. ఆ మర్నాడే రామారావు తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.  
***

1 comment:

  1. avunu-- konni --saarlu-- debbala-- valla --manassulu --daggara avtayemo-- kaani-- naaku -telisi na-- anubhavamulo --maatramu ee nijaaniki --nenu "40%" maatrame yes antaa--

    ReplyDelete

Pages