శ్రీధరమాధురి - 49 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి - 49

Share This
శ్రీధరమాధురి - 49
(నకిలీ పోకడల గురించి పూజ్య గురుదేవుల అమృతవాక్కులు)

ఈ లోకంలో కొంతమంది యదార్ధమైన వారు,
ఈ లోకంలో కొంతమంది మంచివారు,
ఈ లోకంలో కొంతమంది మోసపుచ్చే వారు,
ఈ లోకంలో కొంతమంది మోసపుచ్చడంలో మంచి నేర్పరులు.
ఇది కేవలం అందమైన చెట్లు, పొదలు, మొక్కలు ఉన్న తోటే కాదు. విషమయమైన కలుపు మొక్కలకు కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. దైవం యొక్క నిర్మాణం ఇలా ఉంది, అసలు ఎవరో నకిలీ ఎవరో గుర్తించేందుకు ఆయన మనకు అపరిమితమైన అవకాశాలను ఇస్తారు.

మీరు ఎవరినైనా మోసగాళ్ళని ముద్ర వేసే ముందు, మీరూ అందులో ఒకరు కాదని నిర్ధారించుకోండి.


మనం మన కల్పనలకు అనుగుణంగా ఇతరులపై అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. కల్పనలు అభిప్రాయాలకు ప్రాతిపదికలు కాలేవు. కొన్నిసార్లు, మనం ఇతరుల మాటలు నిజమని నమ్మి, ఒక అభిప్రాయానికో లేక నిర్ణయానికో వస్తాము. ఊహాజనిత పరిధులలో ఉండే అనుమానాలు, భ్రమల వలన ఒకరి గురించిన మన స్వీయ అనుభవాలే లోపభూయిష్టంగా ఉంటాయి. కనుక, చాలాసార్లు మన అభిప్రాయాలే తప్పుడువి. ఇటువంటి తప్పుడు అభిప్రాయాలతో మనం వారి గురించి తీర్మానాలు చేసుకుని, అదే సమాచారాన్ని టముకు వెయ్యడం మొదలుపెడతాము.
దోషరహితంగా ఉండాలంటే మనం ఒక అభిప్రాయానికి రాకపోవడమే మంచిది. నిజానికి, ఇతరులను విమర్శించే పని మనకు లేదు. కనీసం, మీ తప్పుడు తీర్మానాలతో ఇరతుల గురించి పుకార్లు వ్యాపింపచెయ్యడం మానండి. వాళ్ళు కూడా మనుషులే, వారెలా ఉన్నా, ఆ స్థితిలోనే తగిన మర్యాదను, గౌరవాన్ని పొందే హక్కు వారికుంది.

నిజానికి అంటిపెట్టుకుని ఉండడం కష్టం, అబద్ధానికి అంటి పెట్టుకుని ఉండడమే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

అతడు – ‘ఇప్పుడు నేను మంచి విజయం సాధించాను గురూజీ.’
నేను నవ్వి, ఇలా అన్నాను – ‘ఇప్పుడు నువ్వు నకిలీ స్నేహితులు, నిజమైన శత్రువుల గురించి జాగ్రత్త వహించాలి.’


అసలైనవి సహజంగా ఉంటాయి, నెమ్మదిగా పెరుగుతాయి, నకిలీలు సంకరజాతి రకాల వంటివి, వేగంగా, పెద్ద పరిమాణంతో పెరుగుతాయి.

అహం అనేది ఆ వ్యక్తి యొక్క స్వీయ విక్షేపం. ఇది వాస్తవాన్ని అనుభూతి చెందనివ్వదు. వాస్తవంలో మునగాలంటే, ఒకరు అహరహితులై ఉండాలి.


మీరు కర్త్రుత్వాన్ని పట్టుకు వేళ్ళాడుతూ ఉన్నంతవరకు, సంపూర్ణ శరణాగతి అనేది అసాధ్యం. కర్తృత్వం మిధ్యా భేషజాలకు ఆజ్యం పోస్తుంది. కర్తృత్వం వహిస్తూ కూడా మీరు మోక్షం కోసం తపిస్తున్నారా? ఇది చాలా దురాశ మిత్రమా.


అహంకారంతో జీవించేవారు అబద్ధం యొక్క బూటకాన్నే అనుభూతి చెందగలుగుతారు. అహం అనేది అబద్ధమైనది, లోపాలున్నది. అహరహితంగా ఉండటమనేదే వాస్తవమైన జీవనం. అహంకారం లేకుండా జీవించాలంటే, ఒకరు అప్రమత్తంగా ఉండాలి. అహంకారమనేది అజ్ఞానం నుంచి పుడుతుంది. ఇదొక విక్షేపం, ఎన్నటికీ నిజం కాదు. మీరు ‘అహం’ అనే భూతం యొక్క పరిధిలో లేకుండా ఉండేందుకు గాను అప్రమత్తంగా ఉండండి.
 

మనలో చాలా మంది నటిస్తారు. నటనలు అనేవి వాస్తవాన్ని తెలియజెయ్యలేవు. నటన అనేది కేవలం మిధ్యా గర్వం, దాన్నుంచి జనించే ఆశించడం ద్వారా, చివరికది నిరాశకు, నిస్పృహకు దారి తీస్తుంది. అందుకే నటించకండి. 


ఈ ప్రపంచంలో నకిలీవి అసలు వాటి కంటే మరింత స్వచ్చంగా, మెరుగ్గా కనిపిస్తాయి. నిజం అనేది ప్రదర్శనలు పెట్టదు. అబద్ధం ఆకర్షించేందుకు మెరుస్తూ ఉంటుంది.

అమెరికన్ డైమండ్లు, లేక క్యూబిక్ జిర్కోన్లు అసలు వజ్రాల కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అలాగే,
మతంలో కూడా యదార్ధమైన వారి కంటే బూటకపు వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. వారు అత్యంత ఆకర్షణీయంగా ఉండి, ఉన్న స్థాయిలో ఉంటారు.
జ్ఞాని వారిని చూసి నవ్వుతారు.

ఈ ప్రపంచం మొత్తం నకిలీ గురువులు, నకిలీ జోతిష్కులతో నిండిపోయి ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీ హృదయాన్ని అడగండి, తగిన వ్యక్తిని అదే మీకు చూపిస్తుంది. బుద్ధి టక్కరి ఆటలాడుతుంది. మీరు దాన్ని నమ్మి, తప్పుడు వ్యక్తిని సంప్రదిస్తే, మీరది తెలుసుకునే లోపే, నిండా మునిగిపోయి, బయటకు రాలేక అవస్థలు పడతారు. మీరు తిరస్కారానికి, నిరాశకు గురైన అనుభూతి చెంది, ప్రతి ఒక్కరూ ఇంతేనన్న అనుభూతికి లోనౌతారు.


చిన్నప్పటి నుంచి, మనం మన పెద్దలు నమ్మిన కొన్ని విషయాలను నమ్మేలా మనకు శిక్షణనిచ్చారు. వారవన్నీ మనలోకి చొప్పించేసారు, మనం వాటినే నిజాలని అంగీకరించాము.
కాబట్టి, మనం చాలావరకు ఈ నమ్మకాలచేతనే నడిపించబడతాము. ఈ నమ్మకాలు మనపై రాజ్యం చేస్తాయి, దేనిపైనైనా మనం చూపే ఆకస్మిక ప్రతిచర్యకు లేక ఏ ఇతర ప్రతిచర్యకు, మూలాలు మనలోలోపల ఉన్న ఈ నమ్మకాల క్రింద దాక్కుని ఉంటాయి.
కాబట్టి మనపై రాజ్యం చేసే ఈ నమ్మకాలు నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మీరు తక్షణం చర్య తీసుకున్నా, లేక కాస్త ఆలోచించి ప్రవర్తించినా కూడా మీరు ఎల్లప్పుడూ సత్యం వైపునే ఉన్నారన్న నమ్మకం ఏమీ లేదు. అది అసత్యం కూడా కావచ్చు.
 ***


No comments:

Post a Comment

Pages