శ్రీ దేవి దశమహావిద్యలు - 10 - అచ్చంగా తెలుగు

శ్రీ దేవి దశమహావిద్యలు - 10

Share This
శ్రీ దేవి దశమహావిద్యలు - 10
శ్రీరామభట్ల ఆదిత్య 

9. మాతంగి.
శ్రీ దేవి దశమహావిద్యలలో తొమ్మిదవ అవతారం మాతంగి. మాతంగ ముని కుమార్తె కాబట్టి మాతంగి. శివ సహస్రనామ స్తోత్రములో శివుడికి మతంగుడనే పేరుంది. మతంగుడి శక్తి కాబట్టి మాతంగి. అమ్మ త్రినేత్రిగా రత్నమయ సింహాసనము పైన కూర్చుని శ్యామవర్ణంలో చంద్రుని తలపై ధరించి మనకు దర్శనమిస్తుంది. అమ్మ తన నాలుగు చేతులలో ఖడ్గము, పాశము, బల్లెము మరియు అంకుశము ధరించి మనకు దర్శనమిస్తుంది. పురుషార్థప్రదములైన సిద్ధులకు, గృహస్తాశ్రమములో జీవితం సుఖమయం కావటం కోసం అమ్మ ఆరాధన అత్యంత శ్రేయస్కరం.
నారద పాంచరాత్రంలోని పన్నెండవ అధ్యాయంలో శివుడిని శ్మశాన చండాలుడిగా చెబితే అయన శక్తియైన అమ్మవారిని ఉచ్ఛిష్ట చాండాలిగా చెప్పబడి ఉంది. ఆ రూపానికే మాతంగి అని పేరుంది. పూర్వం కదంబ వనంలో ఉండే మతంగ ముని తపమును మెచ్చి లలితాదేవి తన మూడోకంటి నుండి శ్యామవర్ణంలో ఒక దివ్య తేజోమూర్తిని సృష్టించింది. ఆమెయే మాతంగి. అమ్మకే రాజమాతంగి, సుముఖి, కర్ణమాతంగి మరియు వశ్యమాతంగి అనే పేర్లు కూడా ఉన్నాయి. దక్షిణామ్నాయ మరియు పశ్చిమామ్నాయ మఠాలకు అమ్మ అధిష్ఠాన దేవత.
శ్లో|| అక్ష్యవక్ష్యే మహాదేవీం మాతంగీం సర్వసిద్ధిదాం |
      అస్యాః సేవన మాత్రేణ వాక్సిద్ధిం లభతే ధృవం ||

వకశుద్ధి ఇంకా వాక్సిద్ధి కోసం పై శ్లోకాన్ని పఠిస్తే ఉత్తమం. అమ్మ పూర్ణరూపం వాగ్దేవియే. అమ్మ మూడు నేత్రాలు సోమసూర్యాగ్నులకు ప్రతీకలు. అమ్మవారి నాలుగు భుజాలు నాలుగు వేదాలకు, పాశము 
అవిద్యకు, అంకుశము విద్యకు ప్రతీకలు. పాశము కర్మరాశికి, శబ్దస్పర్శరసరూపగంధాలు పంచభూతాత్మక సృష్టికి, కదంబ వనము బ్రహ్మాండానికి ప్రతీకలు.

దుర్గాసప్తశతిలోని ఏడవ అధ్యాయములో అమ్మవారు వీణాధారి అయి చిలుకయొక్క మధురమైన మాటలు వింటూ అరుణ వర్ణపు చీరలో అందరికీ  దర్శనమిస్తుంది. ఇక్కడ చిలుక మాటలు 'హ్రీం' కారానికి ప్రతీక. అరుణ వర్ణం జ్ఞానానికి ప్రతీక.

No comments:

Post a Comment

Pages