చరమ గీతం - అచ్చంగా తెలుగు
 చరమ గీతం
మా బాపట్ల కధలు -24
భావరాజు పద్మిని


హరిద్వార్ లో గంగ ఒడ్డున ఉన్న ఒక ఆశ్రమం...
మరకతపచ్చ రంగులో గలగలా పారుతున్న గంగా నదిని చూస్తూ, ఒక చెట్టు నీడలో కూర్చున్నాను నేను. ఆ చెట్టు కొమ్మలు కొన్ని, నదివైపుకు ఒంగి, గంగమ్మను అందుకుని, అందులో జలకాలాడి, తామూ పునీతమవుదామా అని ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. దూరంగా భక్తులు ‘హరహర మహాదేవ’ అంటూ గంగా స్నానాలు చేస్తుడడం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎవరో గంగలో వదిలిన దీపాలు పగటి చుక్కల్లా అలల ఊయల ఊగుతూ, అలా వెళ్తున్నాయి.

ఈ దీపాలు వెలిగేది ఎంత సేపు? నా మనసులో ఒక ప్రశ్న. ఎంతసేపైనా, వెలిగినంత సేపూ, తిమిరంతో సమరం చేస్తూనే ఉంటాయిగా !  గంగమ్మకు నీరాజనాలు పడతాయిగా ! ఆ మాటకొస్తే ఈ గంగా ప్రవాహం కూడా పైకి చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాని, హిమగిరుల నుండి ఇక్కడికి వచ్చేదాకా, ఎన్ని రాళ్ళను, కొండల్ని ఢీకొని, లోలోపల ఎంత ఒరిపిడికి గురైందో ఎవరూ ఆలోచించరుగా !

“విష్ణుశర్మ గారు...” అన్న ఆత్మీయమైన పిలుపుతో వెనుదిరిగి చూసాను నేను. ఆశ్రమం స్వామీజీ వచ్చారు. అన్ని జీవుల పట్లా సమభావనతో ఇంతటి ప్రేమ, ఆత్మీయతను వర్షించాలంటే, ఎంతటి తపోబలం, ఆధ్యాత్మికత ఉండాలో కదా ! ప్రశాంతంగా ఉన్న ఆయన వదనం అప్పుడే వికసించిన స్వచ్చమైన తెల్లటి కమలంలా ఉంది. వినమ్రంగా నమస్కరించి, మర్యాదపూర్వకంగా లేచి నిల్చోబోయాను.

“కూర్చోండి, మీతో కాస్త మాట్లాడదామని వచ్చాను,” అంటూ తానూ వచ్చి నా చెంతనే కూర్చున్నారు.

“నేను చాతుర్మాస దీక్షకై గుజరాత్ లోని ఆశ్రమంలో ఉండగా, మీరు ఒక్కరే వచ్చి ఇక్కడ చేరారని  తెలిసింది. మీ ఆరోగ్యం కాస్త బాలేదని మీరు కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారట. నిన్న మీరు కాస్త అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని, మా వాళ్ళు చెప్పారు. ఇంతకీ మీ ఇబ్బంది ఏంటి? మీ పిల్లలు మిమ్మల్ని నిరాదరించడం వల్ల మీరిలా వచ్చారా?”

“నిరాదరించడం వల్ల కాదు స్వామీ, అతిగా ఆదరించాలన్న ఆత్రంలో వాళ్ళ బ్రతుకుల మీదకు తెచ్చుకుంటారేమో అన్న బెంగతో నేనే ఇక్కడకు వచ్చేసాను.  నామాటలు మీకు అర్ధం కావు, వివరంగా  చెప్తాను స్వామీ ! కానీ, కాస్త సమయం పడుతుంది, వింటారా ?”

అంగీకారసూచకంగా ఆయన తల ఊపడంతో, దూరంగా గంగానదిలో కదులుతున్న తెప్పను చూస్తూ, చెప్పసాగాను.

***

“మా స్వగ్రామం బాపట్ల. నాకో కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళు చేసాను, అంతా విదేశాల్లో ఉన్నారు. ఒక ప్రైవేట్ సంస్థలో అనేక ప్రాంతాల్లో పని చేసి, చివరకు రిటైర్ అయ్యాకా మా బాపట్లలోనే, పటేల్ నగర్ లో ఉన్న సొంతింట్లో స్థిరపడ్డాను. పెన్షన్ రాదని తెలుసు కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భద్రంగా దాచిన సొమ్ముతో, నేను, నా భార్య లక్ష్మి, ఆనందంగా జీవితం గడుపుతున్నాము. మూడేళ్ళ క్రితం నా లక్ష్మి, దైవసన్నిధికి చేరుకుంది. అప్పటినుంచి, పిల్లలు రమ్మన్నా నాకు విదేశాల మోజు లేదు కనుక, నేను ఓ వంట మనిషిని పెట్టుకుని, జీవనం గడుపుతున్నాను.

నాకు రెండిళ్ళ అవతల నా ప్రాణ స్నేహితుడు గోపాలం ఉండేవాడు. చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్నాము. మళ్ళీ ఈ ఇంటికి మేము వచ్చాకా, అనుకోకుండా గోపాలం కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. గోపాలం భార్య వసంత చక్కటి ఒబ్బిడైన ఇల్లాలు. వాడికి ఒక్కడే కొడుకు. కొడుకూ, కోడలూ కూడా వారివద్దే ఉంటున్నారు. వాడూ నేనూ కలిసి, ఉదయం, సాయంత్రం అలా వాకింగ్ కు వెళ్లి, ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకునే వాళ్ళం. అలాంటిది ఒకరోజు అనుకోకుండా గోపాలం కళ్ళు తిరిగి పడిపోయాడట ! ఈ వార్త వినగానే నేను హుటాహుటిన బయలుదేరి వెళ్లాను. అంతకు ముందు ఒకటి రెండుసార్లు గోపాలానికి హార్ట్ ప్రాబ్లం వచ్చి తగ్గిందని, తెలుసు. బాపట్లలో వైద్య సౌకర్యాలు తక్కువ కనుక, వెంటనే అతని ఫ్యామిలీ డాక్టర్, విజయవాడ లోని ప్రముఖ హార్ట్ స్పెషలిస్ట్ పెట్టిన ఆసుపత్రికి వెళ్ళమని చీటీ రాసిచ్చారు.

రకరకాల పరీక్షలు చేసి, తేల్చింది ఏమిటంటే, గోపాలానికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. హృదయం కూడా బలహీనంగా ఉంది కనుక కిడ్నీ మార్పిడి లాంటి సర్జరీలకు డాక్టర్ లు రిస్క్ తీసుకోలేరు. ఇక ‘డయాలిసిస్’ ఒక్కటే మార్గం. వారానికి రెండు సార్లు, ఆసుపత్రికి తెచ్చి, డయాలిసిస్ చేయించి తీసుకువెళ్ళాలి. ఇంతకంటే ముందు, చేతికున్న రెండు నరాలను కలిపి కుట్టే ఆపరేషన్ ఒకటి చెయ్యాలి. వీటన్నింటి కోసం వాడు, వాడి భార్య విజయవాడ వన్ టౌన్ లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆ కుటుంబానికి ఇక్కట్లు మొదలు. ఆ కార్పోరేట్ వారు ఆ పరీక్షనీ, ఈ పరీక్షనీ, ఆపరేషన్లని, డబ్బు లాగుతూనే ఉండేవారు. నాకు బాగా గుర్తు, ఓ సారి గోపాలం కడుపునొప్పి అంటే, పొట్టకి సి.టి.స్కాన్ చేసి, యాభై వేలు బిల్ వేసారు. ఆ పరీక్ష తర్వాత ఏమీ లేదని తేల్చారు. ఎన్ని లక్షలూ సరిపోయేవి కాదు.  

గోపాలం కొడుకు ‘మాధవ’కు తన తండ్రి పట్ల అపారమైన గౌరవం. కోడలు వల్లి, ఏ విషయంలోనూ అతనికి అడ్డు చెప్పదు, వారికి ఇద్దరు కూతుళ్ళు. తండ్రి కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే అన్నాడు మాధవ. మామూలు మధ్యతరగతి కుటుంబం వారిది.  ఈ ఇబ్బందులతో  ఏడాది తిరిగేసారికి ఆ కుటుంబం సొంతిల్లు అమ్మేసి, రైలు పేటలో ఒక అద్దింట్లోకి మారారు. అప్పటికే పాతిక లక్షలకు పైనే ఖర్చయ్యింది. నా స్నేహితుడి కోసం, నేనూ  నాకు వీలైనంత ఆర్ధిక సాయం నేనూ చేసాను. మధ్య మధ్య నేను విజయవాడ వెళ్లి, వాడిని చూసి వస్తూ ఉండేవాడిని.

పోనీ ఇటు గోపాలం పరిస్థితి చూస్తే, ఏమైనా మెరుగుపడిందా అంటే, అదీ లేదు. ఒక్కోసారి నెల రోజుల దాకా ఆసుపత్రి లోనే ఉండాల్సి వచ్చేది, రోజుకి గదికి పదివేలు అద్దె. హీమో డయాలిసిస్ నుంచి, కడుపు కోసి, అందులో అమర్చిన యంత్రం ద్వారా జరిపే ‘పెరిటోనియల్ డయాలిసిస్’ కు మారాడు. ఇది చేస్తుండగా కాలు వాస్తే, అది ‘ఆస్టియోమైలైటిస్’  అంటూ డయాలిసిస్ కు  వచ్చే ‘సైడ్ ఎఫెక్ట్’ అని చెప్పి, కాల్లో ఎముక ఆపరేషన్ చేసి తీసేశారు. అప్పటినుంచి వాడు పూర్తిగా మంచానికే పరిమితం అయ్యాడు. వసంత కూడా శారీరకంగా అంత ధృడంగా ఉండకపోవడంతో అతని కోసం ఒక సేవకుడిని పెట్టారు. అతని జీతం, పోషణ ఆ కుటుంబానికి ఇంకో భారం అయ్యింది. ఇది కాక, మరో ఆర్నెల్లు గడిచేసరికి, గోపాలం ఒంట్లో వాళ్ళు ఆపరేషన్ చెయ్యని భాగం ఏదీ మిగలలేదు. మెడ, చెయ్యి, కాలు, పొట్ట, శారీరకంగా బాధ, మానసికంగా తన కుటుంబం తనకోసం పడుతున్న బాధను చూసి వేదన. ఒక దీనమైన, అసహాయ స్థితి.

రానురాను గోపాలానికి చిన్న ఇంజక్షన్ చెయ్యాలన్నా నరాలు దొరకని స్థితి. మాట కూడా పడిపోయింది. జావలే తప్ప అన్నం తినే దశ దాటిపోయింది. ఓ రోజున ఎందుకో ఊపిరికి ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఎమర్జెన్సీ లో చేర్చుకుని, వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ అద్దె రోజుకి 15 వేలు. అలా వారం రోజులు ఉంచి, గదికి మార్చారు. మళ్ళీ, పరీక్షలు, చికిత్సలు, ఏ సమస్య వచ్చినా అందుకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ల పర్యవేక్షణలు  అవుతూ ఉన్నాయి. గోపాలం అనారోగ్యం పాలై, అప్పటికి సుమారు రెండేళ్ళు కావస్తోంది. మాధవ అక్కడి వైద్యులకి, కంపౌండర్లకి బాగా పరిచయం అయిపోయాడు. ఆ రోజున నేనూ, మాధవతో ఆసుపత్రి గదిలో ఉన్నాను. ఇంతలో డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూసి, నన్నూ, మాధవను గది బైటికి పిలిచారు.

“చూడు బాబు, మా అబ్బాయి ఈడు వాడివి, నిన్ను చూస్తే జాలేస్తుంది. నిజానికి ఈ విషయంలో నాకూ, ఇతర డాక్టర్లకు గొడవయ్యింది కూడానూ ! మీ నాన్నగారిని ఇక డిశ్చార్జ్ చెయ్యమని, నేను చెబుతున్నాను. వారు మాత్రం ఏదో ఒక సాకు చెప్పి, ఆయన్ను ఇక్కడే ఉంచుతున్నారు. నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆరోగ్యం కూడా వ్యాపారం అయిపొయింది. డాక్టర్లకు టార్గెట్లు ఇస్తున్నారు. నెలకు ఇన్ని పరీక్షలు రాయాలని, ఇన్ని ఆపరేషన్లు చెయ్యాలని, ఉంటుంది. చివరకు బీదవాళ్ళను కూడా వదలట్లేదు. అంకితభావంతో సేవ చెయ్యాలని వచ్చిన నాలాంటి వారు ఇక్కడ ఇమడలేక సతమతమవుతున్నారు. ఇంతెందుకు, ఒక్కమాట చెబుతాను. నేను నీ స్థానంలో ఉంటే, నేను డాక్టర్ ను అయినా కూడా, మా నాన్నగారిని డిశ్చార్జ్ చేయించి తీసుకుని వెళ్ళిపోయే వాడిని. అందుకని, ఇక డబ్బు వృధా చెయ్యకు, ఆయన చివరి దశలో ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళి, ప్రశాంతంగా వెళ్ళిపోనీ !ఈరోజుల్లో కూడా నీలాంటి కొడుకులు ఉండడం నిజంగా గొప్పసంగతి ” అంటూ మాధవ భుజం తట్టి, వెళ్ళిపోయారు.

నేనూ, మాధవ నిశ్చేష్టులమై నిల్చుండిపోయాము. మేము ఎంత బ్రతిమాలినా మరో పదిహేను రోజులకు కానీ గోపాలాన్ని డిశ్చార్జ్ చెయ్యలేదు. అలా విజయవాడలో ఇల్లు ఖాళీ చేసేసి, బాపట్లలోని ఇంటికి వచ్చిన రెండు నెలలకు గోపాలం కాలం చేసాడు. అప్పటికే సుమారు 40 లక్షలు ఖర్చయ్యింది. ఆ కుటుంబంలో పిల్లలకు కూడా పండక్కి బట్టలు కొని, అప్పటికి రెండేళ్ళు అయ్యింది. అప్పులపాలు అయిపోయిన మాధవ భార్యను పట్టుకుని, ‘నీకు, పిల్లలకు ఏమీ మిగాల్చలేక పోతున్నాను, నన్ను క్షమించు’ అంటూ ఏడవడం నేను ప్రత్యక్షంగా చూసాను. ఆ కుటుంబం అప్పుల నుంచి కోలుకోడానికి, కనీసం మరో పదేళ్ళు పడుతుంది.

ఇలా ఉండగా,  అనుకోకుండా నాకొక రోజు దగ్గొచ్చి, కఫంలో రక్తం పడింది. ఎవరికీ చెప్పకుండా వెళ్లి, పరీక్షలు చేయించుకుంటే – లంగ్ కాన్సర్ నాలుగొవ దశ అని తెలిసింది. నేను జీవితంలో సిగరెట్ కాల్చలేదు, ఏ దురలవాట్లు లేవు. మరి ఇది వ్యాధి రూపంలో పీడించే పూర్వజన్మ కర్మో, ప్రారబ్ధమో తెలీదు. కానీ, ఏం చేసినా నేను ఎక్కువ రోజులు బ్రతకనని తెలుసుకున్నాను. విదేశాల్లో ఉన్నంత మాత్రాన పిల్లలు డబ్బుల్లో మునిగి తేలుతూ ఉంటారని, అంతా అనుకుంటారు. కాని, ‘యెంత చెట్టుకు అంత గాలి’ అన్న తీరుగా అక్కడి పరిస్థితులు నాకు తెలుసు. ఈ దశలో పిల్లలకు చెప్పి, వారిని కంగారు పెట్టి, మాధవ జీవితంలా వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం చెయ్యకూడదని, నేను నిర్ణయించుకున్నాను. అందుకే, అలా హరిద్వార్ లో మిత్రుడి ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండి వస్తానని పిల్లలతో చెప్పి, ఇక్కడకు వచ్చేసాను. “ చెప్పడం ఆపి, స్వామీజీ వంక చూస్తూ, ఇలా అన్నాను.

“స్వామీ ! బ్రతుకు ఎంత వైభవంగా ఉంటుందో చావు కూడా అంతే గొప్పగా ఉన్నప్పుడే, ఆ జన్మకు సార్ధకత అని నేను నమ్ముతాను. మనం పుట్టగానే మన గొంతులోంచి వచ్చే తొలి గీతం – ఏడుపు, ప్రణవ నాదంలా ఉంటుందట. కాని, చరమగీతం మాత్రం హాస్పిటల్ గొట్టాలతో కట్టబడి, జీవచ్చవంలా మారి, ఇంత దయనీయంగా ఆలపించకూడదని అనుకున్నాను. ఈ బంధాలు, పాశాలు, ఇవన్నీ ఉండకూడదనే, మన పూర్వీకులు వానప్రస్థాన్ని ఏర్పాటు చేసారేమో. మా గోపాలం లాగా, మూగబోయి వేదనతో అసహాయంగా పోవడం, కంటికి రెప్పలా పెంచుకున్న బిడ్డల్ని రోడ్డుపాలు చెయ్యడం, నాకు ఇష్టం లేదు. అందుకే, పుట్టిన ఊరి మట్టిలోనే కలిసిపోవాలన్న నా బలీయమైన కోరికను చంపుకుని, తీర్ధయాత్రల పేరుతో ఇలా వచ్చాను. ప్రశాంతంగా ఈ ఆశ్రమంలో ఉంటూ, ఈ గంగమ్మను చూస్తూ, ఇలా వెళ్ళిపోవాలని, నా కోరిక. నేను చనిపోయాకా, మీ ఆఫీసులో ఇచ్చిన నా పిల్లల నెంబర్ కు ఫోన్ చెయ్యండి, వారు రావడం ఆలస్యమైతే, దహనసంస్కారాలు ముగించి, నా అస్థికలు వారికి అప్పగించండి. ఇందుకు అయ్యే ఖర్చులన్నీ ముందుగానే ఆశ్రమం ఖాతాలో జమచేసాను. నేను ఇక్కడే ఉండేందుకు మీరు దయతో అనుమతిని ఇస్తారు కదూ !” అభ్యర్ధనగా చూస్తూ అన్నాను.

నాకంటి నుండి జాలువారుతున్న రెండు కన్నీటి చుక్కల్ని చూస్తూ, ఆత్మీయంగా నన్ను హత్తుకున్నారు స్వామీజీ. ఆనందంతో ఉప్పొంగిన నా మనసు కూడా ఆ గంగమ్మతో పాటు పరవళ్ళు తొక్కుతూ ఏదో తెలియని మధురమైన పాటని పాడుతోంది.

***

2 comments:

  1. badhalu kadalinche hrudayam vunnantakalam tappavu rachana adbhutam balamaina drukpadam kavali pratimanishiki . sairam

    ReplyDelete
  2. యంత్రము లా ఒక ప్రైవేట్ ఉద్యోగస్థుడైన నేను మీ కథ వలన కొంత ఆలోచన లో పడిన మాట వాస్తవము. ఒక మాధవ లా నా కొడుకును చూడటం కంటే ఒక శర్మ గారి లాగ నిర్ణయము చాలా మంచిది...చక్కటి కథని చెప్పావు ..తల్లి... నేను కూడా బాపట్ల వాసినే

    ReplyDelete

Pages