ఏమీ? నిన్నుపేక్షింతునా ? - అచ్చంగా తెలుగు

ఏమీ? నిన్నుపేక్షింతునా ?

Share This
ఏమీ? నిన్నుపేక్షింతునా ?
మా బాపట్ల కధలు -23
భావరాజు పద్మిని
బాపట్ల రైల్వే స్టేషన్...
మొదటి ప్లాట్ఫారం మీద విజయవాడ వెళ్ళే రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అప్పుడే స్టేషన్ చేరుకున్న బాపట్ల హనుమంతరావు పంతులు గారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. టికెట్ కౌంటర్ వద్ద పెద్ద క్యూ ఉంది. టికెట్ కొనే లోపే ట్రైన్ విజయవాడ బయలుదేరిపోతుంది. తన సర్వస్వమైన సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ పై, శ్రీ బి.వి.నరసింహ స్వామి గారి సూచన ప్రకారం రాసిన పుస్తకాల ప్రచురణకు కావలసిన పేపర్ ను, ఆయన విజయవాడ నుంచి అవసరంగా కొని, తెవాల్సి ఉంది. టికెట్ లేకుండా ప్రయాణం చెయ్యడం ఆయనకు ఇష్టం లేదు. ఈ ట్రైన్ గాని వెళ్ళిపోతే, ఇక బస్సుల్లో పడి విజయవాడ వెళ్లేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ కంగారులో వగరుస్తూనే, తన నుదుట పట్టిన చెమటను కండువాతో తుడుచుకుని  ‘ఏమిటి చెయ్యడం?’ అన్న ఆలోచనలో స్థాణువులా నిలబడిపోయి ఉన్న ఆయనకు, తను నడిపే పత్రిక “ఏమీ? నిన్నుపేక్షింతునా ?” “ కవర్ పేజీ మీద తాను ప్రచురించిన శ్లోకం గుర్తుకు వచ్చింది. మనసులోనే సాయి స్మరణ చేసుకున్నారు.
ఇచట నేనుండ నిఁక భయమేల? విడుము
నీ బరువుల నాపై నేన నిర్వహింతు;
నన్నుగను. వేయికన్నుల నిన్నుఁగందు;
శ్రితుని నిన్నెప్పుడే నుపేక్షింతునేమి?
అలా శ్లోకం పూర్తయ్యిందో లేదో, ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి "బాబు! నేను విజయవాడ వెళ్ళాలని టికెట్ కొన్నాను. కానీ ప్రయాణం మానుకొన్నాను. మీకు ఇది అవసరమైతే తీసుకోండి" అని చెప్పి పంతులుగారికి టికెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా సమయానికి టికెట్ బాబాయే అందించారని సంతోషంగా రైలెక్కిన పంతులు గారు,  మానుకుందామనుకున్న విజయవాడ ప్రయాణం కొనసాగేలా చేసి, తన పుస్తక ముద్రణకు అవసరమైన పేపరును తెప్పించుకోబోతున్న సాయి లీల తల్చుకుని, భక్తితో కైమోడ్చి, కృతఙ్ఞతలు తెలుపుకున్నారు. అయినా, జీవితం మీద రోసి, ఒకసారి ఇదే రైలు పట్టాల మీద తాను ఆత్మహత్య చేసుకునేందుకు వస్తే, “నేనుండగా నీకా అవసరం లేదు, తిరిగి వెళ్ళు,” అని ఆజ్ఞాపించి,  తన ప్రాణాలే కాపాడిన సాయికి ఇదొక లెక్కా? అప్పటినుంచి సాయి కాపాడిన ఈ జీవితం సాయికే అంకితమిచ్చారు కదూ ! నెమ్మదిగా కనులు మూసుకుని, సాయిని గురించిన గత జ్ఞాపకాలలో మునిగిపోయారు ఆయన.
***
'నా భక్తులు ఎక్కడున్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లూ నా దగ్గరకు రప్పించుకుంటాను' అని చెప్పిన సాయినాథుడి మాటలకు రుజువు తన జీవితం. ఏ కళ అయినా, భగవంతుడు ప్రసాదించినదే, దాన్ని దైవదత్తం చేసినప్పుడే కదా, ఆ కళకు నిజమైన సార్ధకత.
తన స్వస్థలం బాపట్ల మండలంలోని చెరువు జమ్ములపాలెం. విద్యాభ్యాసమంతా బాపట్లలోనే సాగింది.  తన తొలి గురువు తల్లి చిన్నపున్నమ్మ  సంస్కృతాంధ్ర భాషా పండితురాలు. ఆమె శిక్షణలో ఈ ఇరుభాషల్లో, ఆపై ఆంగ్ల, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం జరిగింది. తను పిన్న వయసులోనే "ఉభయ భాషా ప్రవీణ" పట్టా తీసుకుని, గొప్ప గొప్ప సంస్కృత గ్రంథాలన్నీ తెనిగించడం మొదలుపెట్టాడు. వేదవ్యాస విరచితమైన భగవద్గీతను తెలుగు పద్యాల్లోకి అనువదించి, తిరుపతి వేంకట కవుల వంటి సాహితీ దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆపై శ్రీ ఆదిశంకరాచార్య విరచిత ప్రారబ్ధ సుధాకరం, భజగోవిందం వంటి శ్లోకాలను, శ్రీ నిగమాంత దేశికుల శ్రీనివాస దయా శతకం, పాదుకా సహస్రం వంటి వాటిని, లీలాశుక విరచిత శ్రీ కృష్ణ కర్ణామృతాన్ని, నారదముని విరచిత నారద భక్తి సూత్రాల వంటి  తెనిగించాడు. సరస్వతీ పుత్రులకు లక్ష్మీ కటాక్షం కరువన్నది జగమెరిగిన సత్యం. పొట్టకూటి కోసం చినగంజాంలో జిల్లా పరిషత్ స్కూల్ లో తెలుగు పండిట్ గా స్థిరపడడం, ఆపై వ్యాపారం మొదలుపెట్టి, పూర్తి నష్టాల్లో కూరుకుని, బ్రతుకు మీద రోసి, ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. అప్పుడు జరిగిందో అద్భుతం... తన స్వప్నంలో సద్గురు సాక్షాత్కారం...
అప్పట్లో తను బాపట్లలోనే నివసించేవాడు, తనకు 42 ఏళ్ళ వయసు. అది  1944 సంవత్సరం, డిసెంబర్ 27 వ తారీకు. వేకువ జామున 5 గంటల సమయం. కలలో, బంగారు మేని ఛాయతో, గడ్డముతో, తెలుపు  రంగు కఫ్నీ  థరించి, అటువంటి రంగుగల వస్త్రమునే తలకు ముడి వేసుకున్న ఒక ఫకీర్ తనకు సాక్షాత్కరించారు. అప్పటికింకా తనకు బాబా గురించి తెలియదు. కాని, చిన్నతనం నుంచి పెద్దల పట్ల అలవడిన భక్తి ప్రపత్తుల వలన, ఆ తేజోమూర్తి దివ్య వర్చస్సు వలన, ఆయనకు వెనువెంటనే సాష్టాంగ నమస్కారము చేసి, నిల్చున్నాడు . అప్పుడా ఫకీరు, “రారా, ఇటురా,” అని పిలిచి, “నీవు ఏమేమి వ్రాసితివిరా?” అని అడిగారు. ఆముద్రితములైన తన గ్రంథముల గురించి తను మనవి చేసుకున్నాడు.  అప్పుడా ఫకీరు, “ వాటిని అలా ఉండనీ”, అని కొన్ని గ్రంథములను చూపిస్తూ "వీనిని వ్రాయుము" అని  చెప్పారు.  “చిత్తము, అలాగే రచిస్తాను,” అని చెప్పగానే, ఫకీరు తన అభయ హస్తమును తన శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి, అదృశ్యమయ్యారు. తాను స్వప్నం నుంచి మేలుకుని, స్నానాదులు ముగించుకునే సమయానికి, ఇంకా గంటైనా కాకుండానే, చిన్ననాటి స్నేహితుడు, ఆధ్యాత్మిక మార్గోపదేశకుడు అయిన శ్రీ బందా ఆదినారాయణ గారొచ్చి, అఖిల భారత సాయి సంఘ అధ్యక్షులు శ్రీ బి.వి.నరసింహ స్వామి గారు చీరాల వచ్చి, సాయి బాబా పై ప్రసంగాలు ఇస్తున్నారని, ఏవో పుస్తకాలు రాసేందుకు, రైలు చార్జీలిచ్చి, తనను వెంటబెట్టుకు రమ్మన్నారని, చెప్పాడు. శ్రీ నరసింహస్వామి గారు శ్రీ సాయి బాబా జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని ఆంగ్ల పుస్తకాలను , ఆయన ఫోటోను ఇచ్చి, “బాబా బోధలను తెనిగీకరించి, ఆంధ్ర దేశంలో ప్రచారం చేసేందుకు బాబా తనను ఎన్నుకున్నారని,” చెప్పారు. ఆ ఫోటో చూడగానే నా కనుల వెంట ఆనంద బాష్పాలు ... ఎందుకంటే, తనకు కలలో కనిపించిన ఫకీరే, ఈ సాయి బాబా. ఎంతటి పాండిత్యం, పుస్తక జ్ఞానం ఉన్నా, సరైన మార్గం చూపే సద్గురువు లేని జీవితం చుక్కాని లేని నావ వంటిదే కదా! తన జీవితాన్ని ఉద్ధరించేందుకు స్వప్న దర్శన మిచ్చిన పరమదైవం ఈయనే. ఇక తన జీవితానికి ఏ చింతా లేదు అన్న ధైర్యం కలిగింది.
శ్రీ బి.వి.నరసింహస్వామి గారు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, షిర్డీ సాయి సజీవంగా ఉన్నప్పుడు ఆయన సాంగత్య భాగ్యం పొందిన ఒక్కొక్క భక్తుడినీ ప్రత్యక్షంగా కలిసి, వివరాలు సేకరించి, పుస్తకాలు రాసారు. అవన్నీ తెనిగీకరిస్తూ ఉండగా తనకు సాయి పట్ల విశ్వాసం మరింతగా ఇనుమడించింది.  అవసర సమయాల్లో “సాయి” అని పిలచిన వెంటనే, ఒక్క క్షణమైనా ఉపేక్షించక, “ఓయీ” అని పలికే దయామయుడు షిర్డీ సాయి.
ఒకసారి తనింటికి అతిధులొచ్చారు. ఇంట్లో బియ్యం నిండుకుంది. అప్పటికీ అప్పు మీద చాలా సరుకులిచ్చిన కోమటి, అడిగితే, లేదు పొమ్మని కసిరి పంపేసాడు, సాయి ఆ కోమటి రూపంలో అరబస్తా బియ్యం తెచ్చి, ‘ఇప్పుడే మంచి బియ్యం వచ్చాయి, తర్వాత చూసుకుందాము, తీసుకోండి,” అంటూ తనింట్లో వదిలేసి వెళ్ళారు.  ఎన్ని లీలలని, ఎన్ని మహిమలనీ? సద్గురువు పట్ల మహా విశ్వాసమే (సబూరి) ఆలంబనగా జీవిస్తున్న తనకు అనుక్షణం అద్భుతాలు చూపారు సాయి.
అది మొదలు సాయి బాబాపై  పద్య, వచన  పుస్తకాలు 28 దాకా రాసారు. సాయి సుధ వంటి అనేక పత్రికలలో సాయి బాబాకు సంబంధించిన వ్యాసాలు రాసారు.  1957 లో రాత్రి తనకు మళ్ళీ కలలో బాబా గారు దర్శనమిచ్చి, తన త్రివర్ణ చిత్రమును, "క్యా, తుఝే ఉపేక్షా కర్తాహూ" అనే హిందీ అక్షరములతో వ్రాయబడినదానిని తనకు బహూకరించారు. ఆ తర్వాత తాను  “ఏమీ? నిన్నుపేక్షింతునా ?” అనే పేరుతో కొన్నాళ్ళు ఒక పత్రికను కూడా నడపడం జరిగింది.
దైవం అనుగ్రహించ దలచిన రోజున ఉత్తమాధమ తారతమ్యాలు చూడరనేందుకు తనే ఋజువు. షిర్డీ సంస్థానం తన రచనా సేవలకు గాను “ఆస్థాన కవిగా” బిరుదును ఇచ్చి సత్కరించింది. ఏమీ కాని తనవంటి అల్పజీవి, ఇంతటి మహాసత్కారాన్ని పొందింది అంటే, సాయి కరుణే కాక మరేమిటి? .     
“సాయి, పూర్వ జన్మలో నేను నీ షిర్డీ పురంలో ఏదో ఒక ప్రాణిగా పుట్టి ఉంటాను, అప్పుడు మీరో, మీ భక్తులో అటుగా వెళ్తూ ఉండగా, వారి పాదాల ధూళి నాకు సోకిందేమో, ఇప్పుడు ఇలా ఉత్తమ జన్మనిచ్చి, నీ కింకరుడిగా నియమించుకున్నావు? ఏ నోము నోచానో కాని, సాయి సన్నిధి అనే వెలలేని పెన్నిధిని పొందాను. ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోను తండ్రీ ?” ... అప్రయత్నంగా వారి కన్నుల వెంట కన్నీరు కారింది. ఈలోగా విజయవాడ స్టేషన్ రావడంతో జ్ఞాపకాల పుటల్లోంచి బయటకొచ్చి, రైలు దిగారు.
***
సాయి కృప వలన పుస్తక ప్రచురణకు కావలసిన పేపర్ సమకూరింది. ఇక పుస్తకం పూర్తి చేసిస్తే ప్రింట్ అయిపోతుంది. తన దృష్టినంతా రచనపై కేంద్రీకరించి రాయసాగారు ఆయన. ఇంతలో ఒక కుక్క అక్కడికి వచ్చి, ఆయన చెప్పును నోట   కరచుకుని పరుగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు పంతులుగారు కోపంతో రెంవడచెప్పును కుక్కపైకి విసిరారు. ఆ కుక్క రెండవ చెప్పును కూడా తీసుకుని పరిగెత్తిపోయింది. ఆ తర్వాత ఆయనకు, అన్ని రూపములలో ఉన్నది సాయియే కదా, అని గుర్తుకు వచ్చి, తను చేసిన పనికి  చాలా బాధపడ్డారు. "బాబా, నిన్ను గుర్తించక పాదరక్ష విసిరినందుకు శిక్షగా ఇప్పటినుండి నేను పాద రక్షలు థరించను" అని బాబాగారికి విన్నవించుకున్నారు.
అప్పటినుండి పాద రక్షలు లేకుండానే నడవడం మొదలు పెట్టారు. వేసవికాలంలో చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆయన కాళ్ళకు బొబ్బలు ఎక్కేవి. ఒక రోజున పంతులు గారు బస్సులో వెడుతూ, “బాబా యెండలో చెప్పులు లేకుండా నడవలేను, నన్ను క్షమించు” అని ఊరు రాగానే బస్సు దిగి ఎండకు కాళ్ళు మాడుతుండగా, పరిగెత్తి ఒక చెట్టు నీడకు చేరారు. యింతలో ఒక వ్యక్తి కర్రకు చెప్పుల జతను తగిలించుకుని హనుంతరావుగారి వద్దకు వచ్చి పంతులుగారూ! ఈ చెప్పుల జత మీ కాళ్ళకు సరిపోతుంది, ఇవి తీసుకుని మీ జేబులో ఉన్న రెండు రూపాయలు యివ్వండి అని అడిగి చెప్పులని హనుమంతరావుగారి కాళ్ళకు తొడిగాడు.
అనుకోని ఈ సంఘటనకు ఆశ్చర్యపోతూ, యాంత్రికంగా అతను అడిగిన రెండురూపాయలు తన జేబునుండి తీసి యివ్వగానే ఆవ్యక్తి వెళ్ళిపోయాడు. తాను బస్సులో “చెప్పులు లేకుండా నడవలేను” అని అనుకోగానే బాబా ఆయనకు చెప్పులు ఇప్పించారని అనుకొంటూ, కాసేపలా నిల్చుండిపోయారు.
అప్పుడు గాని, రావలసిన అసలు సందేహం ఆయనకు రాలేదు.
“తన వద్ద రెండు రూపాయలే ఉన్నాయని ఆ వ్యక్తికి యెలా తెలిసింది ?”
వెంటనే ఆ వ్యక్తి కోసం వెతకాసాగారు, ఎంత వెతికినా కనిపించలేదు. అయితే ఇదంతా బాబా లీలా? ఎండకు తాళలేని ఆయన బాధను చూడలేక స్వయంగా సాయే వచ్చి ఆయనకు చెప్పులు తొడిగారా? ఆ సమర్ధ సద్గురువుకు ఎంతటి ఉదారత, ఎంతటి దయ? అవును, దాసుడు “తవ దాసోహం” అంటాడు. భగవంతుడు, “దాసస్య దాసోస్మ్యహం (తన దాసులకు తానే దాసుడిని) అంటారు. ఆ విషయాన్ని తనకు చెప్పులు తొడిగి మరీ, నిరూపించారు సాయి.
“సాయి ప్రభో, ధన్యోస్మి , ధన్యోస్మి,” అనుకుంటూ నిలువెల్లా గగుర్పాటుతో, ఆనందబాష్పాలు కారుస్తూ,  సాయి వెళ్ళిన దిశగా సాష్టాంగ నమస్కారం చేసారు ఆయన.  
(శ్రీ బాపట్ల హనుమంతరావు గారు వ్రాసిన శ్రీ సాయి మననము అనే పుస్తకం తొలి పలుకుల నుంచి, సద్గురులీల పత్రిక నుంచి, ఇతర అంతర్జాల మాధ్యామాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్రాసిన కధ )

1 comment:

  1. సాయి లీలలు అనంతాలు కాకతాళీయంగా మనకు అనిపించినా , ఆ లీలల పరమార్ధాన్ని మనం ఆలోచించగలిగితే మన ఆశ్చర్యానికి అంతే ఉండదు ...నమ్మిన వారిపై ఆయన దయకు లోటే ఉండదు ....ఓం సాయి రామ్ ....

    ReplyDelete

Pages