బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ చెన్నూరి సుదర్శన్ - అచ్చంగా తెలుగు

బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ చెన్నూరి సుదర్శన్

Share This
బహుముఖ ప్రజ్ఞాశాలి -ఆర్టిస్ట్ చెన్నూరి సుదర్శన్


భావరాజు పద్మిని


తన అసమాన ప్రతిభతో పలువురు విద్యార్ధుల్ని తీర్చిదిద్దిన గురువు ఆయన. మరో ప్రక్కన సాహిత్యం, చిత్రలేఖనం, హస్త కళలువంటి అనేక విద్యల్లో నిష్ణాతులు. అన్నింటినీ మించి గొప్ప మనసున్న కళాభిమాని, భాషాభిమాని, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ చెన్నూరి సుదర్శన్ గారితో ముఖాముఖి ఈ నెల తెలుగుబొమ్మలో ప్రత్యేకించి మీకోసం...    

ప్ర: నమస్కారమండి. మీ బాల్యం, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. 

జ: మా నాన్న గారి పేరు చెన్నూరి లక్ష్మయ్య.. తల్లి గారి పేరు చెన్నూరి లక్ష్మి(గౌరమ్మ). కరీంనగర్ జిల్లా హుజురాబాదు గ్రామం అయిన మా అమ్మమ్మ ఇంజపురి కన్కమ్మ గారింట్లో నేను 18 ఆగస్టు 1952, జన్మించాను.  మాదీ చేనేత కుటుంబం. నిరక్షరాస్యుడైనాప్పటికీ.. అదృష్ట వశాత్తు మా నాన్న గారిని పోలీసు ఉద్యోగం వరించింది. దాంతో మా దశ తిరిగింది.  
హన్మకొండ పోలీసు లైన్లో ఉండే వాళ్ళం. 
నా ఆరవ యేట మా తాతగారు ఇంజపురి రాజయ్య   హుజురాబాడులో అక్షరభ్యాసం చేయించారు.

ప్ర: మీ ఇంట్లో ఆర్టిస్టు లెవరైనా ఉన్నారా?
జ: లేరండి.. తర తరాలుగా నిరక్షరాస్యులే.. మగవారు మొగ్గం నేయడం..
ఆడవారు వారికి సహకరించడం తప్ప మరో ఆలోచనే లేదు వారిలో. మొట్టమొదటిసారిగా  చదువుకున్న వాడిని నేనే..

ప్ర: చిన్నప్పటినుంచీ బొమ్మలు వేసేవారా?
జ: అవునండి.. బాల్యం నుండి గీసేవాణ్ణి.

ప్ర: మీ గురువులు..అభిమానించే చిత్రకారులు ఎవరు?
జ: ములుగులో శ్రీ సురేందర్ డ్రాయింగ్ మాస్టారు నా బొమ్మలు చూసి మరిన్ని మెళకువలు నేర్పాడు. తను కలర్ కాంబినేషన్స్.. వాటర్ కలర్స్..
ఇంకా ఆయిల్ కలర్స్.. వాడుతూ.. పెయింటింగ్ చేస్తుండగా చూసి నేర్చుకున్నాను. నాకు ఆరాధ్య దైవం అతనే.. ఇక అభిమానించే చిత్రకారుడు బాపు’. వారు గీచిన బొమ్మలను తిరిగి గేచే వాణ్ణి. ఆ రేఖలు గీస్తుంటే తన్మయత్వం చెందే వాణ్ణి. బాపు గారి రేఖలు అలాంటివి. అందుకే వారి చిత్రాలు చాలా వరకు తిరిగి గీచాను.
                ప్ర: మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది?
జ: ఉద్యోగరీత్యా  మానాన్న గారికి  వరంగల్ జిల్లాలోని బచ్చన్న పేటకు బదిలీ అయ్యింది నేను బచ్చన్నపేటలో మూడవ తరగతి వరకు చదివాను. గుఱ్ఱం బాలరాజు నా క్లాస్మేంట్ తఱచుగా మా ఇంటికి వచ్చే వాడు. మా ఇంట్లో  గోడలకు అలంకరించిన దేవుళ్ళ క్యాలెండర్లలోని బొమ్మలను బాలరాజు పలకపైన బలపంతో గీచే వాడు. అవి చూసిన  నాలో కుతూహలం పెరిగింది. ప్ర ప్రథమంగా నేను శ్రీ ఆంజనేయస్వామివారి  బొమ్మ గీచాను. ఇప్పటికీ ఆ బొమ్మ నా మస్తిష్కంలో ఇంకా ఉంది. రెండవ బొమ్మ శ్రీ కృష్ణుడు.. నిలబడి పిల్లన గ్రోవి ఊదడం. మూడవది వినాయకుడు.  అలా క్రమంగా నేను ఇంట్లోకి వచ్చిన ప్రతీ సంవత్సరం క్యాలెండర్ పై ఉన్న బొమ్మలు పలకపై  గీచే వాణ్ణి.
                మా నాన్న గారి ఉద్యోగ బదిలీల పరంపరలలో మేము వరంగల్ వెళ్ళాల్సి వచ్చింది.  వరంగల్లో  నాల్గవ  తరగతి కౌసల్య టీచర్ నల్ల బోర్డుపై తామర పుష్పం సగం వరకు గీచింది. మిగతా సగాన్నీ  ఎవరు పూర్తిచేస్తారు
అని అడిగితే నేను ధైర్యంగా లేచి వెళ్ళి బోర్డుపై టీచరు గీచిన చిత్రాన్ని పూర్తి చేసాను. నా కంటే బాగా గీచావని మెచ్చుకుంది. అది నా జీవితంలో మొదటి మెప్పుకోలు. నాలో ఉత్సాహం మరింత పెరిగింది. పరీక్షల సమయంలోనె చదువు.. మిగతా సమయంలో.. బొమ్మలు గీయడం. మా నాన్న గారికి నచ్చేది కాదు. ఎక్కువ ప్రోత్సాహం మా అమ్మగారు అందించారు. దిండు గలేబాలపై.. దుప్పట్లపై నేను గీచిన బొమ్మలను రంగుదారాలతో కుట్టేది. ఆ కుట్టడం నాకూ అలవాటయ్యింది.
                ఆ తరువాత అదే జిల్లాలోని ములుగు వెళ్లాం. అక్కడే వీవర్స్ కాలనీలో ఒక స్వంత ఇల్లు సంపాదించుకొని స్థిరపడ్డాం. కాలనీ లోని 52 ఇండ్లన్నీ పద్మశాలీలకే అలాట్ అయ్యేటట్లు ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాసి
విజయం సాధించడంలో నేను ఎక్కువగా కృషి చేసాను.
ములుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించే  ప్రతీ వార్షికోత్సవంలో నాకే ప్రథమ బహుమతి వచ్చేది.  మా డ్రాయింగ్ మాస్టర్ శంకర్రావు గారు నా పుస్తకంలో వెరీ గుడ్ అని రాసే వాడు. అది అందరికి చూపిస్తూ మురిసిపోయే వాణ్ణి.
అన్ని రకాల పెయిటింగ్స్  చేసే వాణ్ణి. ముఖ్యంగా గ్లాస్ పెయిటింగ్. అది గ్లాసుపైన వ్యతిరేక దిశలో ముందు పైన కనబడే రంగులు పులుముతూ... చివరికి బ్యాక్ గ్రౌండ్ కలరు నింపాలి. దాంట్లో కూడా నేను కాన్వాసుపై గీచినట్లే షెడింగ్స్ తెప్పించే వాణ్ణి. అది కొంచెం కష్టం కూడానూ.
                అమెరికాలో నివసిస్తున్న నా కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా అక్రిలిక్ కలర్స్ వాడి దాదాపు అరవై చిత్రాలు గీచాను.
                మన ఫోటోలను కాన్వాసుపై గీయాలంటే గ్రాఫ్ పద్ధతి వాడే వాణ్ణి.  కాన్వాసు కొనాలంటే దండిగా డబ్బు కావాలి. నేను కాన్వాసును దాని ఫ్రేమును స్వయంగా తయారు చేసుకునే వాణ్ణి. అదీ సురేందర్ గారే నేర్పారు.
ప్ర: ఈ రంగాన్ని ఎన్నుకున్నాక మీరు ఎటువంటి ఒడిదొడుకులను ఎదురుకున్నారు.
; నేను ఈ రంగాన్ని నా జీవనోపాధి కోసం ఎన్నుకోలేదండి. హాబీగా తీసుకున్నాను. నా ఆత్మసంతృప్తి కోసం.
నేను గీచిన చిత్రాలేవీ మా ఇంట్లో ఉండేవిగావు. మా ఇంటికి వచ్చిన వారు
నా బొమ్మలను అడిగి తీసుకొని వెళ్ళే వారే గాని దాని ఖర్చు సైతం అడిగే వారు కారు. మనవాళ్ళు బొమ్మలు కొనరని నాలో ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పడింది. జీవితంలో స్థిరపడాలంటే ఒక ఉద్యోగంలో చేరాలనుకున్నాను.
అందరూ నన్ను ఫైన్ ఆర్ట్స్ చేయుమని సలహాలిచ్చారు గాని నాకు గణితశాస్త్రమంటే మక్కువ. ఇంకా టీచరు ఉద్యోగం కావాలనే కాంక్ష. సెలవులు ఎక్కువ ఉంటాయి గనుక బొమ్మలు గీసుకోవచ్చనే అభిలాష. 
ప్ర: మీ ఉద్యోగ వివారాలు చెబుతారా..
జ: నేను ఎం. ఎస్సి. గణితం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ముందు  నాకు మెరిట్ ఆధారంగా పోస్ట్స్ అండ్ టెలీగ్రాఫ్స్ డిపార్టు మెంటులో టెలీఫోన్ ఆపరేటర్గాల ఉద్యోగమొచ్చింది. కావాలనే నిర్మల్ ఎన్నుకొని జాయినయ్యాను.. బొమ్మలకు ప్రసిద్ది కనుక. విరామ సమయంలో పరిశ్రమకు వెళ్లి బొమ్మలు చెయ్యడం నేర్చుకున్నాను. రాత్రుళ్ళు చదువుతూ పి.జి. పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణుడయ్యాను. లెక్చరర్ కావాలన్నదే.. నా జీవితాశయం.
ఉద్యోగ బదిలీల క్రమంలో నాస్వంత ఊరు ములుగుకు వచ్చాను. బొమ్మలు గీయడం.. పిల్లలకు గణితంలో ట్యూషన్ చెప్పేవాన్ని. నా సతీమణి శోభారాణికి  గూడా.. ఆవిడ చదువు మీద శ్రద్ధ పెట్టింది. అప్పటికే మాకిద్దరు
పిల్లలు. అయినా ఆమె చదువు మానలేదు. ఎస్. ఎస్. సి. ఇంటరు మా ఊళ్లోనే పూర్తి చేసింది.
 అప్పుడు నెలకు పదిహేను రూపాయలు ఫీజు. పడవ తరగతికి పది రూపాయలు. బీద విద్యార్థుల వద్ద ఫీజు తీసుకునే వాణ్ణి కాదు.
లెక్చరర్ ఉద్యోగమొచ్చింది. ములుగు వదిలి శ్రీకాకుళం డిగ్రీ కాలేజీలో జాయినయ్యాను. ఆ తరువాత పరస్పర ఒప్పంద బదిలీ మీద రంగారెడ్డి జిల్లాకు వచ్చాను. కొంతకాలం మెదక్ జిల్లాలో పనిచేసాను. మన టీ.వి.లో దాదాపు రెండు సంవత్సరాలు పాఠాలు చెప్పాను.
నా సహచరి డిగ్రీ డా. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పూర్తి చేసింది. టీచరు ట్రైనింగ్ చేసి టీచరు ఉద్యోగం సంపాదించుకుంది. ఇంకా సర్వీసులో ఉంది.
నేను ప్రిన్సిపాల్ ప్రమోషన్ మీద సిద్ధిపేట జిల్లా నంగునూరు వెళ్లి 2010 ఆగస్టులో పదవీ విరమణ పొందాను.
అనంతరం బొమ్మలు వేయాలంటే కాస్త ఓపిక తగ్గి తెలుగు మీద మమకారంతో రచయితగా మారాను.

ప్ర: మీ సాహితీ కృషి గురించి చెప్పండి.
జ: నేను విద్యార్థి దశలోనే ములుగు గ్రంథాలయం లోని పుస్తకాలన్నీ
చదివాను. వాటి ప్రభావం వల్ల  నిండుమనసులుఅనేఒక నవలను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు వ్రాసాను. కొన్ని కథలు రాసాను. కాని పత్రికలకు పంపాలంటే.. ఖర్చుతో కూడుకున్న పని.
1970 జనవరి ఒకటిన ఆకాశవాణి హైదరాబాదు కార్మికుల కార్యక్రమంలో నా ఒక పేజీ స్కెచ్ నా అనుభవం’  చదివారు.
మాయింట్లో కూడా ఒక గ్రంథాలయం ఉండాలనే కుతూహలం కలిగింది.  మా కాలనీలో ఉండే గృహిణుల సౌకర్యార్థం   టెలీఫోన్ ఆపరేటర్ ఉద్యోగంలో ఉన్నప్పుడు నా స్వంత ఖర్చుతో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాను.  అందులో వంటల పుస్తకాల నుండి అన్ని రకాల పుస్తకాలు ఉండేవి. పిల్లలకోసం బాల్య సాహిత్యం కొన్నాను.
మా మిత్రబృందం అంతా కలిసి భారత్ యూత్ అసోసియేషన్అనే ఒక సంస్థను ఏర్పాటు చేసాం. ప్రతీ రోజు  సాయంత్రం పిల్లలను ఆడించే వాళ్ళం. నా సతీమణి  టెన్నికాయిట్  రాష్ట్ర స్థాయిలో ఆడిన అనుభవం ఉంది. నేను వాలీ బాల్.. బాల్ బ్యాట్ మింటన్..  జిల్లా స్థాయిలో పాఠశాలకు బహుమతులు తెచ్చిన అనుభవం ఉంది. ఇండోర్ గేమ్స్ లో .. కేరమ్స్, చెస్  బాగా ఆడే వాణ్ణి.  
యువతరం రచనలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అరుణతారఅనే వ్రాత పత్రిక ప్రారంభించాము.  ఆ పత్రికలో నేను ముఖ చిత్రంతో బాటు కథలకు.. కవితలకు  బొమ్మలు వేసే వాణ్ణి.. రచనలూ చేసే వాణ్ణి.
ఇప్పుడూ  నా కథలకు బొమ్మలు నేనే వేసుకుంటాను. ఇంత వరకు నా రచనలు :
1.            ‘ఎంసెట్విద్యార్థుల కోసం ప్రశ్నావళి సాధనలుఆంగ్ల తెలుగు మాధ్యమం.
2.            ‘ఝాన్సీ హెచ్.ఎం.కథల సంపుటి.
3.            ‘మహాప్రస్థానంకథానికల సంపుటి.
4.            ‘జీవన చిత్రం-రంగుల వలయంఆత్మకథ.
5.            ‘ప్రకృతిమాతపిల్లల కథలు.
మరో కథల సంపుటి జీవనగతులుప్రచురణలో ఉంది. మన పత్రికలో ధారావాహికంగా వస్తున్న జర్నీ ఆఫ్ ఏ టీచర్నవల పూర్తీ కాగానే ప్రచురిస్తాను. 
ప్ర: మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.
జ: నేను పత్రికల్లో వచ్చిన వార్తలకు ఆధారంగా బొమ్మలు గీచి పత్రికలకు పంపే వాణ్ణి. అందులో సారాయిని నిషేధించాలని ఆడవారు చేసిన ధర్నాలకు సపోర్టింగ్ బొమ్మలు గీచాను. అవి పత్రికల్లో వచ్చాయి. ప్రజల నుండి ఆదరణ లభించింది. మరొక బొమ్మ అజంతా శిల్పంలా గీచిన రచయిత్రి మొల్లఅందులో జీవం ఉట్టి పడుతున్నదని ప్రశంసలు అందుకున్నాను. అది ఒక క్యాలెందరులో వచ్చిన బొమ్మకు అనుకరణ.
ప్ర: మీరు పొందిన అవార్డులు.. మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
జ: ములుగులో ఉపాద్యాయులంతా కలిసి శారదా సాహితీ సంస్థను ప్రారంభించారు. ప్రతీ వారంతం  కవిసమ్మేళనం జరిగేది. అందులో నాకు మాత్రమే అనుమతి ఉండేది.
భక్త పోతన సంస్మరణ రోజు పాఠశాల ఆవరణలో గొప్ప సభ ఏర్పాటు జేశారు. అందులో నేను పోతనపై ఒక కవిత చదివాను. నాకు యువకవిఅని బిరుడునిచ్చి సన్మానించారు.
సంగారెడ్డి జూనియర్ కళాశాలలో వృష నామ సంవత్సర సందర్భంగా ఏర్పాటుచేసిన  నవరసాలుఅనే  కవి సమ్మేళనంలో నేను హాస్య రసాన్ని
పోషించాను. హాస్యకవి’  అని ధృవపత్రమిచ్చి  స్వర్గీయ కరణం రామచంద్రం మంత్రిగారి సమక్షంలో కలెక్టర్ గారు సన్మానించారు.

జాగృతి మాస పత్రిక యాజమాన్యం  నిర్వహించిన కథల పోటీలో శ్రీ వాకాటి పాండురంగారావుస్మారక అవార్డు వచ్చింది.
తెలుగు అకాడెమీ వారు పద్మభూషణ్ డాక్టర్  గుర్రం జాషువా 118, జయంతి సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో నా కథ కవలల కలవరంఎన్నిక చేసి.. హైదరాబాదు పబ్లిక్ గార్డెన్ ఆవరణలో గల జూబ్లీ హాల్లో  సన్మానించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు డివిజన్ నుండి  బెస్ట్ టెలీఫోన్ ఆపరేటర్అవార్డు వచ్చింది.
రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయుడుఅవార్డు మెదక్ జిల్లా నుండి లభించింది.
మన అచ్చంగా తెలుగు అంతర్జాల మాసపత్రిక వారు పర్యావరణం అంశం పై  నిర్వహించిన కథల పోటీలో ప్రకృతిమాతకథకు  ద్వితీయ బహుమతి వచ్చింది.
తెలుగు వెలుగుమాస పత్రిక నిర్వహించిన ప్రేమలేఖల పోటీలో మనుమరాలికి ప్రేమలేఖకు బహుమతి వచ్చింది.
 ‘కథాకేళివారు నిర్వహించిన దీపావళి కథల పోటీలో మహాప్రస్థానంకథకు ద్వేతీయ బహుమతి వచ్చింది.
పల్లకి, మయూరి,ఆంధ్రభూమి, నవ్య పత్రికల్లో నా కార్టూన్లకు బహుమతులు వచ్చాయి.
చిత్రలేఖనంలో పాఠశాలలో బహుమతులే తప్ప మరే ఇతర పోటీల్లో పాల్గొనలేదు.
ప్ర: మీ అభిమానులకు మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంటుంది?
జ: మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. నా పనులకు అడ్డు తగలరు. నాకు ఒక పగలు సరిపోదు.. ఇరువదినాలుగు గంటలు పగలు పది గంటలు రాత్రి ఉంటే చాలని అనుకుంటూ ఉంటాను. ఒక్క క్షణం ఖాళీగాకూర్చోను.
నాకు తెలియని  విద్య ఎదుటి వారిలో కనబడితే చాలు.. వెంటనే వారితో స్నేహం చేసి వారి విద్యను నేను నేర్చుకుంటాను. అలా ఉపాద్యాయుల నుండి.. మిత్రులనుండి నేర్చుకున్న హస్తకళలు నాలో ఉన్నాయి. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. నేను నేర్చుకున్న కళలు.. కారకులు:
1.            సుద్దముక్కలను శిల్పాలుగా చెక్కడం:  శ్రీ.సీతారామయ్య ఉపాధ్యాయుడు, జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల, ములుగు.  ఆ తరువాత నేను సబ్బు బిల్లలను శిల్పాలుగా చెక్కాను. నా స్నేహితుని పెళ్ళికి బెల్లం ముక్కను ఒక సౌందర్యరాశిగా చెక్కి కింద పెళ్ళాం.. బెల్లంఅని టైటిల్ రాసి స్నేహితుల చిరునవ్వుల మధ్య బహుమతిగా ఇచ్చాను.  
2.            రంగు కాగితాలను దేవతామూర్తులు.. పల్లె జీవనం మొదలగు రూపాలలో కేవలం కత్తెరతో కత్తిరించడం: .శ్రీ కృష్ణ, ఫోటో గ్రాఫర్, పోలీసు డిపార్ట్ మెంటు, హన్మకొండ
3.            మ్యాజిక్ షోలు నిర్వహించడం:  శ్రీ శంకర్ రావు, డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం.
4.            నాటకాలు:  శ్రీ రంగారావు, హిందీ పండిత్ , జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల, ములుగు
5.            సూక్ష్మకళ: బియ్యం గింజలపై అక్షరాలు రాయడం ఎగ్జిబిషన్ లో ఆర్టిస్ట్ రాస్తుండగా చూసి నేర్చుకున్నాను. ఒక గింజపై పదహారు అక్షరాల వరకూ రాస్తాను.
6.       నఖచిత్రాలు గీయడం:  ములుగులో ఒక కిళ్ళీ కొట్టు అబ్బాయి.
         ప్ర: మీ హస్త కళలపై ఎలా మక్కువ ఏర్పడింది?
                ; బాల్యంలో తిరుణాల్లకు వెళ్ళినప్పుడు వివిధ రకాల బొమ్మలు నన్ను ఆకర్షించేవి. అన్నీ కొనుక్కోవాలనే ఆశ. కాని డబ్బు కొరత. నాకు నచ్చిన ఆటవస్తువును పరిశీలనగా చూసేవాణ్ణి. ఇంటికి వచ్చాక అదే ఆటవస్తువును అట్టముక్కలతో తయారు చేసి ఆడుకునే  వాణ్ణి. అప్పుడు పొందే ఆనందం అనుభవించడమె గాని చెప్పనలవి గాదు. అలా ఏ ఆటవస్తువు చూసినా తయారుచేసేసుకునే వాణ్ణి.
 ఇప్పుడు యుట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. నా మనుమరాలు ఫిడ్గేట్ స్పిన్నర్ అడిగితే యుట్యూబ్లోు చూసాను. అట్ట ముక్కలతో బేరింగ్స్.. బేరింగ్స్.. లేకుండా  తయారు చేసి అమెరికాలో ఉంటున్న  నా మనుమరాండ్లకు.. మనుమనికి పంపించాను.      
                ప్ర: భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
                జ: ప్రముఖ తత్వవేత్త సోక్రటీసు గారన్నట్లు ఒకరు ఒక రంగంలోనే కృషి చేస్తే అందులో నిష్ణాతులవుతారు. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. రాదన్న పని రాజా పనిఅన్నట్లు గాకుండా..  నేను అన్ని రంగాలలో ప్రవేశించి నేర్చుకున్నానే తప్ప ఎందులోనూ ప్రావీణ్యత సంపాదించలేక పోయాననే నిరాశ పడ్తూంటాను.
భావి చిత్రకారులు నాలా నిరాశ పడే అవకాశం రాకుండా.. ఒక చిత్రరంగంలోనే విశేషమైన కృషిసలిపితే బాగుంటుందని నా అభిప్రాయం. చిత్రకళలోనూ వివిధరకాలు ఉన్నాయి. చూడగానే పామరులకు సైతం అర్థమయ్యేలా మోడర్న్ ఆర్ట్ గీస్తే బాగుంటుందని నా సలహా.
ఇక సెలవు.. నమస్తే. 
***   

No comments:

Post a Comment

Pages