అపూర్వ పురస్కారం - అచ్చంగా తెలుగు

అపూర్వ పురస్కారం

Share This
అపూర్వ పురస్కారం
 - కె.బి.కృష్ణ

ఆ సభావేదిక పై ప్రత్యేకం గా ముదురునీలం రంగు చీరలపై లేత నీలం రంగు కోట్లు ధరించిన అమ్మాయిలు, లేత నీలం రంగు జీన్స్ ప్యాంట్లపై లేత నీలం రంగు కోట్లు ధరించిన యువకులు కొంత మంది తిరుగాడుతున్నారు. వేదిక పై ఆ నగరం లోని ప్రముఖులు, ఆ జిల్లా కలక్టరు, మరియు స్థానికశాసన సభ్యులు తదితరులు కూర్చుని వున్నారు.
ఇంతలో చేతిలో ప్యాడ్ లో  కాగితాలతో వేదిక పైనే వున్న కోటు ధరించిన యువతి మైక్ ముందుకు వచ్చి “ఈ అపూర్వమైన మా మొదటి సభ కు వచ్చిన మహనీయులందరికీ మా పురస్కార ట్రస్ట్ సహృదయం గా స్వాగతం చెబుతోంది.
సమాజం లో ప్రతీ మనిషి పుట్టిన రోజును గుర్తు పెట్టుకోవాలి. ఆ పుట్టిన రోజు ముందురోజు వరకూ తన జీవితం లో సాధించిన ప్రగతి చర్చించుకుని తరువాత భవిష్యత్తు లో నిర్వర్తించవలసిన కార్యక్రమాలు కూడా నిర్దేశించుకోవాలి. అయితే ఈ పుట్టిన రోజులు, జన్మదినోత్సవాలు, హేపీబర్త్ డేలు ఒక పెద్ద పండుగలా తమ తమ అంతస్థులకు తగినట్లు గా తమ హెూదాలను, అందరికీ తెలియబరుచుకునేందుకు పావులుగా చాలా మంది వాడుకుంటున్నారు.
ఒక పెద్ద ఫైవ్ స్టార్ హెూటల్ లో గాని, లేదా ఒక కల్యాణమండపం లో గాని, జన్మదినోత్సవ సంబరాలు ఏర్పాటు చేసుకుని బంధుమిత్రులందరినీ పిలిచి ఆ పుట్టిన రోజుకు కేకు తెప్పించి ఎన్నో పుట్టినరోజో అన్ని కొవ్వొత్తులు వెలిగించి, దివ్యమైన కాంతితో వెలుగొందే ఆ దీపాలను నోటితో ఊది ఆర్పివేసిహేపీబర్త్ డే అని పాట పాడుతూ పండుగ చేసుకుంటున్నారు. ఈ వేడుకకు వారి వారిహెూదాలను బట్టి వందలు, వేలు లక్షల వరకూ ఖర్చు పుంటుంది. సమాజాన్ని నిర్దేశించవలసిన పెద్దలూ, మార్గదర్శనం చేయవలసిన వృద్ధులు కూడా ఈ ఫంక్షన్స్ కి హాజరుకావడం శోచనీయం. దేదీప్యమానంగా వెలిగే జ్యోతులను ఆర్పడం శుభకరం కాదని అందరికీ తెలుసు, అయినా నాటి నుండి నేటి వరకూ ఇదే చేస్తున్నారు. అసలు మనకు ఈ ఆర్భాటాలు అవసరమా ? విదేశీ సంస్కృతి ని వంటబట్టించుకుని జన్మదినం, అమ్మదినం, నాన్నదినంఅని జరుపుకోవడం బాగాలేదు.
జన్మదినం రోజున పిల్లలు గాని నిద్రలేవంగానే తమకు జన్మనిచ్చిన ప్రత్యక్షదైవాలైన తమ తల్లితండ్రుల పాదాలకు నమస్కరించాలి. తరువాత ఇష్టదైవానికినమస్కరించుకోవాలి. దేవాలయాలను దర్శించి తమ ఇష్టదైవాలను ప్రార్ధించాలి. స్నేహితులతో సరదాగా గడుపుతూ తీపి తినాలి. వీలైనంతవరకూ బీదలకు సహాయం చెయ్యాలి. దినపత్రికలలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టి జన్మదిన శుభాకాంక్షల ప్రకటనలు వేయిస్తారు చాలామంది, ఇవి ఎంత మంది చూస్తారు ?
ఈ ఖర్చు అంతా వృధా అని మేము భావించాము. మేము ఇంటింటికీ తిరిగి అనేక పట్టణాలో గ్రామాలలో తిరిగి, సమాజంలో జన్మదినోత్సవం జరుపుకునే ప్రతీ వారినీ వారు పుట్టినరోజుకు ఖర్చు పెట్టే సొమ్ములో కొంత భాగం లేదా మొత్తం డబ్బు, మేము ప్రవేశ పెట్టిన ఈ పురస్కార ట్రస్ట్ కి దానంగా ఇవ్వమని సవినయం గా వేడుకున్నాం. చాలా మంది సహృదయం తో స్పందించారు.
దేశంలో రాష్ట్రాలలో ప్రతిభాపాటవాలు వుండి అద్భుతమైన తెలివితేటలు వుండి, క్రియేటివిటీ పుష్కలంగా వున్న విద్యార్థులు చదువులలో రాణించినా, వారి వారి ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా వారు కోరుకున్న చదువులు చదువుకోలేక వారు వున్న చోటునే నిస్సహాయం గా మగ్గిపోతున్నారు.
మేము ఒక సెర్చి కమిటీని వేశాము. ప్రతీ ఆరునెలలకూ, అటువంటి విద్యార్థులను వెతికి పట్టుకుని కులమత బేధాలు, బీదా, గొప్పా, తారతమ్యం లేకుండా వారిని ఎన్నిక చేసి వారికి తాము చదువుకోవాలనుకునే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అయ్యేవరకూ మేము వారిని చదివిస్తాము. ఇదే మా పురస్కారం. మా ఈ సభ ముఖ్యఉద్దేశ్యం కూడా. ఈ మొదటి సభలో ఈ " విద్యాపురస్కారం " అనే మా దృష్టిలో మహత్తరమైనదాన్ని ప్రదానం చేస్తున్నాం. ప్రతీ సంవత్సరం ప్రకటిస్తాం. మా ట్రస్ట్ సభ్యులలో రాజకీయనాయకులకు స్థానం కల్పించలేదు, మన్నించాలి. నాయకులు లేకుండా ఆర్థిక పరిపుష్టి రాదు. మా ట్రస్ట్ లో ప్రస్తుతం కోటీశ్వరుల సంతానం కూడా వున్నారు. ఈ పురస్కారానికి విద్యార్ధులను ఎన్నిక చేయడానికి గతంలో సుప్రీం కోర్టు, హై కోర్టులలో జస్టిస్లుగా పదవీవిరమణ చేసిన అనుభవజ్ఞులైన మేధావులను మాకు సహాయం చెయ్యమని అర్ధిస్తే, ఎటువంటి పారితోషికం ఆశించకుండా వారు మాకు తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం తొమ్మిది మంది ని విద్యాపురస్కారానికి ఎంపిక చేశాము. ముగ్గురు డాక్టరు విద్య, నలుగురు ఇంజనీరింగ్ విద్య, ఇద్దరు చార్జర్ట్ అకౌంటెంట్స్ గానూ చదువుకోవాలని కాంక్షిస్తున్నారు. వీరందరూ అఖండమైన తెలివితేటలు గలవారే కాని నిరు పేద కుటుంబాలకు చెందినవారు. ఈ లోటును మేము పూడుస్తున్నాం.
ఎంతో సంతోషంగా వుంది మాకు. చూశారా పుట్టిన రోజు వేడుక కు అయ్యే ఖర్చు ఎంత గొప్ప మానవీయ ఆలోచన కు శ్రీకారం చుట్టిందో---( సభలో చప్పట్లు నిరంతరాయంగా మోగుతున్నాయి.)
మొదటగా ఈ జిల్లా కలక్టరు గారు మాట్లాడతారు,అనగానే ఆయన లేచి వచ్చారు " సభికులారా నమస్కారం. జన్మదినపురస్కారం ట్రస్ట్ వారికి చేతులెత్తి సవినయంగా నమస్కరిస్తూ, వారందరికీ ఆశీస్సులు అందచేస్తున్నాను. సమాజం లో అతి బీద వారు తప్పితే మిగతా వర్గాల వారందరూ తమ తమ గృహాలలో జన్మదినాలు జరుపుకోవడం ఒక సాధారణ విషయమైపోయింది. దీనికి ఎవరి అంతస్థును బట్టి అంత ఖర్చు అవుతుంది, నిజమే ! అసలు ఈ వాస్తవాన్ని ఎవరు ఆలోచించారు ? సమాజానికి భవిష్యత్ సృష్టికర్తలైన ఈ యువతరంగంమనోఫలకాలపై ఈ అద్భుతమైన ఆలోచన వచ్చినందుకు నా మనసు పులకాంకితమైపోయింది ఈ పురస్కారాల కొరకు జిల్లాకలక్టరు వద్ద వుండే వివిధ రకాల సంక్షేమ నిధుల నుండి నేను ప్రతీ సంవత్సరం నాకు సాధ్యమైనంత డబ్బు అందచేస్తానని మనవి చేస్తున్నాను. అంతే కాకుండా మా ఇంట్లో నేనూ, నా శ్రీమతి, చిరంజీవుల ఇద్దరి బర్త్డేలకు అయ్యే ఖర్చు సుమారు మూడు లక్షలు ట్రస్ట్ కి అందచేస్తానని తెలియచేస్తున్నాను. ఈ ట్రస్ట్ సభ్యులందరికీ భగవంతుడు సంపూర్ణఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటూ వారందరినీ ఆశీర్వదిస్తూ, శెలవు తీసుకుంటున్నాను--" సభ లో కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.
తరువాత నియోజకవర్గ శాసన సభ్యులు లేచారు " సభికులకు నమస్కారాలు. ప్రజా సేవ అందరూ చేస్తారు. మేమూ చేస్తున్నాం. కాని జీవితం లో వికసిస్తున్న పుష్పాల వంటి ఈ చిరంజీవులు చేస్తున్న మహత్కార్యానికి నేను జేజేలు అందిస్తున్నాను. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టండి ( అలాగే సభ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు దిక్కులు పిక్కటిల్లేటట్లు ) నాకు ఇంకేమీ మాట్లాడడానికి నోరుపెగలడం లేదు. ఆనందం తో మాట్లాడడం కంటే కార్యరూపం దాల్చడం ప్రతి కార్యక్రమానికీ చాలా ముఖ్యం. నేను నా నియోజకవర్గ నిధుల నుండి తొమ్మిది లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా ఇస్తున్నానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. శెలవ్-- " సభ అంతా చప్పట్ల తో మారు మోగింది.
ఉన్నపళంగా ఒక ఎనిమిదేళ్ళ పాప వేదిక పైకి వచ్చి “ నేను మాట్లాడతాను " అంటే వెంటనే ఆ పాప కు మౌత్ పీస్ ఇచ్చారు. " అందరికీ నమస్కారాలు. నాకు ఏం మాట్లాడాలో తెలియదు. అయినా కూడా మా కాన్వెంట్ లో చాలా బీద పిల్లలను కొంత మంది చదివిస్తున్నారని మాత్రం నాకు తెలుసు. పాపం వాళ్ళ యూనిఫామ్ నాలుగు రోజులకోసారి మార్చుకుంటారు. అటువంటి వారి లో ఒక అమ్మాయి మా ఫోర్త్ క్లాస్ సెక్షన్లు మొత్తానికి ఫస్ట్ ర్యాంకు లో వుంది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వున్నారు. అందరికీ డబ్బు కావాలి. ప్రతీ సంవత్సరం నా పుట్టినరోజుకు మా డాడీ ఏభైవేల రూపాయలు ఖర్చు పెడతారు. రాబోయే నా బర్త్డే ఖర్చును ఇదిగో చెక్కు రూపంలో ట్రస్ట్ వారికి ఇస్తున్నాను. అందరూ గట్టిగా చెప్పండి. పురస్కారం ట్రస్ట్ జిందాబాద్ -- " అని గట్టిగా అరవగానే సభలో అందరూ ఆమెను అనుసరించారు. ఆడిటోరియం చప్పట్ల వర్షం లో తడిసి ముద్దయింది.
సభానిర్వాహకురాలు మళ్ళీ వేదిక పైకి వచ్చి " ఇప్పుడు ఈ తొమ్మిది మందికి జన్మదిన పురస్కారాలు ప్రదానం చేయ బడతాయి. డాక్టరు చదువుకోవాలనుకునే వారికి మొదటి వాయిదా గా 5 లక్షలు, ఇంజనీరింగ్ చదువుకునే వారికి 3 లక్షలు, సి.ఏ చదువుకునేవారికి లక్ష రూపాయలు ఇస్తున్నాం. వీరిని మా టచ్ లో వుంచుకుని వారు చదువుకునే విద్య పూర్తి అయ్యేవరకూ, వారికి ఉద్యోగాలు కూడా కల్పించి, వారికి అవసర మైనప్పుడల్లా ఆర్ధికసాయం అందచేయబడుతుంది.
ఈ రోజున మా ట్రస్ట్ నిధి సుమారు ఏభైలక్షలరూపాయలు దాటింది. త్వరలో ఇది కోట్లాది రూపాయలు గా పెరగాలనీ కాంక్షిస్తున్నాం. మా నిధి డబ్బుని డిపాజిట్ చేసి బ్యాంకుల వారు ఉదారం గా మాకు అత్యధిక శాతం వడ్డీ ని ఇస్తూ మాకు ఇతోధికం గా తోడ్పడుతున్నారు వారికి కృతజ్ఞతాంజలి, అందువలన డబ్బు ఎక్కువ గా జమ అవుతోంది. తొమ్మిది మంది విద్యార్థులకు పురస్కారం నెంబరు మాత్రమే ప్రకటిస్తున్నాం, వారి వివరాలు తెలియచేయడం లేదు. మీరే చూస్తారు గా వారిని-- " అంటూ ఆమె వేదిక దిగింది.
జిల్లాకలక్టరు, శాసనసభ్యుల చేతుల మీదుగా తొమ్మిది మంది కీ వారి పెద్దల సమక్షంలో పురస్కారాలు ప్రదానం చేయ బడ్డాయి-- తరువాత పురస్కారాలు తీసుకున్న వారిలో ఇద్దరిని మాత్రమే మాట్లాడడానికి ఎన్నిక చేశామనీ మిగతా వారు తరువాతి సభలో మాట్లాడతారని ప్రకటించారు.
మొదటిగా ఒక అమ్మాయి వేదిక మీదకు వచ్చి--- “ అందరికీ నమస్కారాలు-- మాది చాలా పేద కుటుంబం. మా నాన్న, అమ్మ, నా తమ్ముడు, నేను. మా నాన్న కూలిపని కి వెళ్తాడు. మా అమ్మ ఇళ్ళల్లో పని చేస్తుంది. అయినా మమ్మల్ని ఒక చిన్న కాన్వెంట్ లో చదివించారు. నాకు చదువంటే చాలా ఇష్టం. ఇంటర్ క్లాసు లో నేను రాష్ట్రం లో మొదటి ఏభైమంది లో వచ్చాను. యమ్.సెట్ లో చాలా మంచి ర్యాంకు వచ్చింది కాని డాక్టరు చదవాలనే నా కోరిక ఎలా తీరుతుంది ? కొన్ని సేవా సంస్థలు నన్ను చదివించడానికి ముందుకు వచ్చినా ఆ డబ్బు సరిపోదు. సరిగ్గా దిక్కుతోచని ఆ సమయం లో ఈ పురస్కార కమిటీ వారు మా ఇంటికి వచ్చి నన్ను ఎన్నిక చేసుకున్నారు. నాకు ఈ సహాయం చేసినందుకు నేను బాగా చదువుకుంటాను. నాకుస్త్రీలకు వైద్యం చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాతృదేవత అయ్యే మహత్తర అవకాశం ఒక్క ఆడవారికి మాత్రమే వుంది. అందుకని నేను ఆ వైద్యం చదివి, బాగా డబ్బు సంపాదించి, నా సంపాదన లో ఎక్కువ భాగం ఈ పురస్కార ట్రస్ట్ కే ఇస్తానని ఈ సభాముఖం గా మాట ఇస్తున్నాను. పురస్కార కమిటీ వారికి కోటి నమస్కారాలు--' అంటూ ఆ అమ్మాయి వేదిక పైన వున్న పెద్దలందరికీ పాదాభివందనం చేసింది. సభలో కరతాళధ్వనులు మిన్ను ముట్టాయి.
తరువాత ఒక అబ్బాయి లేచి నిలబడి--- " పెద్దలందరికీ వందనాలు--నేను ఒక బీద కుటుంబం లో పుట్టాను. మా నాన్న యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేనూ తమ్ముడూ చిన్న పిల్లలం. అప్పటి వరకూ ఇళ్ళల్లో పాచి పనులు చేసే మా అమ్మ ధైర్యం గా తను పని చేసే బ్యాంకు మేనేజరు గారి కాళ్ళావేళ్ళా పడి ఒక ఆటో కొనుక్కుని, డ్రైవింగ్ నేర్చుకునమమ్మల్నిద్దర్నీ చదివించింది. నా తమ్ముడు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. నేను ఇంటర్ లో మొదటి ఇరవైమంది లో ఒకడిగా ప్యాసయ్యాను. యమ్.సెట్ లో మొదటి యాభైమంది లో వచ్చాను. నాకు ఫ్రీ సీటు వచ్చినా కూడా మా అమ్మ చదివించలేని స్థితి లో వుంది. నేను మా అమ్మను పట్టుకుని చదువుకుంటానమ్మాఅని ఏడుస్తున్నాను ఆ రోజున. దేవుడు ప్రత్యక్షమైనట్లు గా సరిగ్గా అదే సమయం లో పురస్కారం కమిటీ వారు మా ఇంటికి వచ్చారు. మేం అందరం వారి కాళ్ళను మా కన్నీటితో కడిగాం.
నేను మంచి ఇంజనీర్ని అయి, యమ్.టెక్ కూడా చదివి, నేను సంపాదించిన డబ్బులో మాకు అవసరాలకు డబ్బు వుంచుకునిమిగతాదంతాట్రస్ట్కే డొనేషన్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. నా ముఖ్యమైన ఆశయం ఏమిటంటే పగలూ రాత్రీ ఆటో తొక్కి కష్టపడి మమ్మల్ని చదివించిన మా అమ్మను, కాదు కాదు మా ఇంటి దేవత ను నేను సుఖ పెట్టాలి. మా మాతృదేవత హాయిగా ఇంట్లో కూర్చుని సుఖపడాలి--అందరి పాదాలకు నమస్కారం--” అంటూ ఆ అబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ వేదిక పక్కకు జరిగాడు—
“ఈ సభ దిగ్విజయం గా నడవడానికి తోడ్పడిన పెద్దలందరికీ మా కృతజ్ఞతాంజలి ! -- అంటూ నిర్వాహకులు వందన సమర్పణ చేస్తోంటే సభలోని వారు వెళ్ళిపోసాగేరు.
“ ఎన్నో పురస్కారాలు చూశాం, కాని ఇలాంటి అపూర్వపురస్కారంకనలేదు, వినలేదు--"
" చూడండి చదువుకునే పిల్లల్లో ఎంతటి అద్భుతమైన ఆలోచన వచ్చిందో !"
" పుట్టినరోజు పండుగ కు పెట్టే ఖర్చు పురస్కారాలకు దానం చేయడమా ?ఎంత మహత్తరమైన ఆలోచన ? " సభ నుండి వెళ్ళిపోయే జనం తమలో తాము అనుకుంటున్నారు.
అవును ! నిజంగానే ఇది ఒక అపూర్వపురస్కారమే !!!
***

No comments:

Post a Comment

Pages