డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ సాహితీ సదస్సు - అచ్చంగా తెలుగు

డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ సాహితీ సదస్సు

Share This

డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ సాహితీ సదస్సు 
 డా.గౌతమ్ కశ్యప్ తెలుగునాట తెలుగు భాషా సాహిత్యాలను ప్రభుత్వాలే మర్చిపోతున్న తరుణంలో, చెన్నై హిందూ కళాశాలలో ప్రసార మాధ్యమాలలోని తెలుగు భాషా సాహిత్యాలపై, తొలి అంతర్జాతీయ తెలుగు సదస్సు - (సెమినార్)  జరిగింది.


మొట్టమొదటి సారిగా ఒక డిగ్రీ కాలేజీలో తెలుగు భాషా సాహిత్యాలపై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సు (సెమినార్) ఇదేనని ప్రొఫెసర్ ఎల్ బి శంకర్రావు గారు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అప్సర్ గారూ పేర్కొన్నారు. దానిలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. 

మాస్ మీడియం మీద జరిగిన ఈ అంతర్జాతీయ సెమినార్ లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీయుతులు మండలి బుద్దప్రసాద్ గారు, ప్రముఖ సాహితీ ప్రియులు రచయితా మేడిశెట్టి తిరుమల కుమార్ గారూ, ప్రముఖ రచయితా, నటులూ, కవులూ అయినా గొల్లపూడి మారుతీ రావు గారు, ప్రముఖ కవి ప్రొఫెసర్ అఫ్సర్ గారూ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం అమెరికా నుంచి విచ్చేశారు.
ప్రముఖ జర్నలిస్టూ రచయిత, నెల నెలా వెన్నెలతో తన సాహితీ ప్రియ తత్త్వాన్ని ఎందరికో పంచిన డా. శ్రీ రెంటాల జయదేవ్ గారూ, ప్రముఖ రచయిత్రి, అనువాదకులూ వరల్డ్ తెలుగు రేడియోలో టివి, పత్రికా రంగంలో ప్రముఖులు అయిన శ్రీమతి మృణాళిని గారూ, తెలుగు సినీ రచయిత్రి, శ్రీమతి ఉమర్జీ అనూరాధ గారూ, నేనూ ( డా.గౌతమ్ కశ్యప్, శ్రీధర్) , BBC., తెలుగు జర్నలిస్టు, కుప్పం యూనివర్శిటీ డిల్లీ నుంచి విచ్చేసిన ప్రొఫెసర్ సత్యవాణి గారూ ఇలా అనేక దూరప్రాంతాలనుంచి ఇతర విశ్వవిద్యాలయాల నుంచి కూడా
ఎందరో ప్రముఖులు మీడియా రంగంలో వున్న పెద్దలూ విచ్చేసి ఎంతో చక్కని పత్రాలు సమర్పించారు. వాటిని వారు ఒక ప్రత్యేక పుస్తకంగా శ్రీ
మండలి బుద్దప్రసాద్ గారూ, శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ గారూ, డా. శ్రీమతి నిర్మలా పళనివేలు గారూ, ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ముద్రించారు. ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఉత్సాహంతో ఆ కాలేజీ లోని తెలుగు విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించారు. 


వారు సమర్పించిన పత్రాలు వారి ఉపన్యాసాలూ సభను విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నాయి. 
ఆడపిల్లలంతా తెలుగుతనం ఉట్టి పడేటట్టు చక్కని చీరలు కట్టుకొచ్చారు. మగ పిల్లలు పంచలు కట్టుకొచ్చారు. 
(నిజానికి చెప్పాలంటే మేమే పాంట్లూ షర్టులూ వేసుకున్నాం. తెలుగుతనం
మా మగవాళ్ళల్లోనే లోపించిందని ఒప్పుకోవాలి.) మాకు ముందుగా ఆ సంగతి చెప్పి వుంటే మేం కూడా కనీసం కొందరమైనా పంచలు కట్టుకుని వచ్చే సాహసం చేసేవాళ్ళమేమో అనిపించింది. ఏమైనా ఆ స్టూడెంట్స్ కి హృదయ పూర్వక అభినందనలు - నిర్వహించిన కల్పన గారికీ బాధ్యతలు సలహాలతో పర్యవేక్షించిన తెలుగు శాఖాధ్యక్షులు, శ్రీమతి పత్తి సీతమ్మ గారికీ, కాలేజీ ప్రిన్స్ పల్ గారికీ, శ్రీ కలవల కన్నయ్య చెట్టి గారికీ జేజేలు. 

No comments:

Post a Comment

Pages