పుష్పయాగంలో పుష్పాల సందడి - అచ్చంగా తెలుగు

పుష్పయాగంలో పుష్పాల సందడి

Share This
పుష్పయాగం లో పుష్పాల సందడి
   డా. లక్ష్మీ రాఘవ 

బ్రహ్మోత్సవాలలో స్వామివారు సంచరించిన మాడ వీధుల నుండి వీచిన గాలికి తిరుమలలోని ప్రతి చెట్టూ ఆనందంగా వయ్యారంగా ఊగాయి. తమ బలం కొద్దీ ఊగుతూఆ గాలిని ఆస్వాదించాయి.
ఇక రాబోయేది మా పండగేనంటూ వూసులాడుకున్నాయి. కాలిబాటన పైకి వచ్చేయాత్రీకుల చెవులలో "మళ్ళీ రావాలి మా పుష్పయాగానికి’ అని గుసగుసలాడాయి.
బ్రహ్మోత్సవాల తరువాత స్వామివారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఆ దేవుని కొరకు పుష్పించే ప్రతి చేట్టూ ఆ ఆనవాయితీని మరవలేదు. భూమిలోని సారాన్ని లాగి మరీ గ్రహించుకుంటూన్నాయి. బాగా ఆరోగ్యంగా వుంటే కదా ఆ దేవుని సన్నిధి చేరే పుష్పాలను అందించగలము' అన్నట్టున్నాయి.
గులాబీ మొక్కలు ఎదురు చూస్తునాయి తోటమాలి వచ్చి ఎరువు ఎప్పుడు వేస్తాడా అని .
చక్కని ఎరువుతో మరిన్ని శాఖలు వేసి గులాబీలు ఎక్కువ వస్తాయి కదా’ అని.

కొలనులోని తెల్లకలువ అలలతో చెబుతోంది "నేను సైతం ఆ గోవిందుని పాదాలను చేరగలను .."అని గర్వంగా, ఆమాటలకు కలువ కింద వున్న ఆకులు హాయిగా తలలు వూపుతున్నాయి
ఇక చేమంతులు చెట్టు లోని ఆకులు కనబడకుండా పసుపు రాసులై దేవుని పాదాలపైవున్న పసుపుతో పోటీ పడెందుకు సిద్దంగా వున్నాయి.
ముద్దబంతులు రక రకాల రంగులతో "మా రంగులు ప్రత్యేకం ఎప్పుడూ.."అంటున్నాయి. మల్లెలు, కాకడాలు ‘మేము స్వచ్చతకు మారుపేరు సుమా...మేము మొదట వుంటే కదా మీ రంగులు ప్రకాశం అవుతాయి!!!!" అని మసి ముసి గా అంటున్నాయి.
ఇన్ని కబుర్లు జరుగుతున్నా తులసి స్తబ్దుగా వుంది. రోజూ వసంతోత్సవంలో స్వామీ వారి మెడను సుతి మెత్తగా తాకుతూ వుండేది మేమే..అంతేకాక పుష్పయాగంలో స్వామీ పాదాలను మొదట చేరేది మేమే అని దీమాగా వున్నాయి.
సంపెంగలు అన్నీ పుష్పయాగానికి రేకులు రాలిపోకుండా బతికి వుండాలని శక్తినంతా కూడతీసుకుని ఎదురు చూస్తున్నాయి. ఇలా 18 రకాల పుష్పాలూ స్వామివారి సన్నిధి చేరడానికి ఏంతో వుత్సాహంగా ఎదురు చూస్తున్నాయి!!
పుష్పయాగం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు పుష్పాలన్నీ బుట్టలలో స్వామివారి ఎదుట కొలువుతీరాయి. పండితుల వేద మంత్రోత్సారణల మధ్య ఋత్వికులు యాగాన్ని
మొదలు పెడితే మొదటిగా తులసి స్వామివారి పాదాలను చేరింది.

తరువాతనే అన్ని పుష్పాలతో స్వామివారికి యాగం!
అక్కడికి వచ్చిన ప్రతి పుష్చం స్వామి చెంతకు చేరాలన్న ఆశతో ఎదురు చూస్తున్నాయి. కాని కొన్నింటికే స్వామివారిని తాకే అదృష్టం వుంటుంది. కానీ ప్రతి పుష్పం ఆ వేద మంత్రాలలో పులకరించాయి. దూరంగా పడిన పూలు పూజారులు చేతితో పైకి నెట్టి నప్పుడు దేవుని తాకిన పూలతో కలిసి ప్రసాదం అయ్యాయి.
క్రమంగా పూజలో స్వామివారికి సమర్పించిన రక రకాల పూలు రంగుల పట్టీలు కలిగిన వస్త్రాన్ని  తలపింపు చేశాయి.
చివరగా వేసిన సంపెంగలు స్వామివారిని తాకి కిందికి జాలువారగా, ఓ అందమైన లేత రంగు సంపెంగ స్వామి బుగ్గ మీద ఆనింది. కిందవున్న స్వామి కంటాభరణం ఆపుగా, పక్కన చెవి ఆసరాగా అలాగే నిలబడింది. స్వామివారి బుగ్గను చివరిదాకా అంటి పెట్టుకున్న ఆ చిన్ని సంపెంగ అలవోకగా పక్కకు తొంగి చూస్తే స్వామివారి కుడి చెవి వద్ద చిరునవ్వుతో అందంగా నిలిచిన మూడు మల్లెలు కనిపించే!
స్వామీ వారి స్పర్శను అనుభవిస్తూ ఆ సంపెంగ, మరోవైపు స్వామిని ఆనుకున్నమల్లెలూ పరవశించి పోయాయి!!
ఈ వార్త తిరుమల దేవస్థానం నుండీ మోసుకొచ్చిన గాలి బయటకు చేరవేస్తే సంపెంగ
చెట్లూ, మల్లెతీగలూ అత్యంత ఉత్సాహం తో వూగాసాగాయి 'ఈ రోజున పుష్పయాగం లో ప్రథమస్థానం మాదే సుమా !!’ అని!!!!!!!

********

[తిరుమల పుష్పయాగం వీక్షించిన ప్రతిసారీ ఇలా ఎన్నో పుష్పాల ఊసులు వినిపిస్తాయి!]

No comments:

Post a Comment

Pages