సుబ్బుమామయ్య కబుర్లు! - అచ్చంగా తెలుగు
 సుబ్బుమామయ్య కబుర్లు!

పిల్లలూ, మానవత్వం అనే పదం మీరు వినే ఉంటారు. కదూ.  మానవత్వమంటే పక్క వాళ్లను కూడా కనిపెట్టుకుని ఉండడమర్రా! 
అంటే, కొంత మందికి తినడానికి తిండి ఉండదు. కట్టుకోడానికి సరైన బట్టలూ ఉండవు. పాపం అని జాలేస్తోంది కదూ. వాళ్లకి అవసరమైన సహాయం చేయడం.
అందుకే మీరు మీ పాత బట్టలు, బొమ్మలు, పుస్తకాలు, పెన్సిల్లు, రబ్బర్లు ఇలా ఒకటనేమిటి ఏవైనా భద్రంగా ఒక చోట దాచి, అమ్మానాన్నలతో బజారుకు వెళ్లినప్పుడు రోడ్డు పక్కగా గుడిసెల్లో ఉండే వాళ్లకి ఇవ్వండి. ఎంత సంబర పడతారో, చూద్దురుగాని. ఒక్కోసారి మనం దారంట వెళ్తున్నప్పుడు వరద సహాయనిధికని, దేవాంగుల (కాళ్లూ, చేతులు, కళ్లూ లేని వాళ్లు) కోసమని కొంతమంది డబ్బులు అడుగుతూ కనిపిస్తే ఒక రూపాయో, రెండు రూపాయలో డబ్బాలో వేయండి. మీరేసే ఆ చిన్న మొత్తం మరెంతో మంది వేసిన దానితో కలిసి పెద్ద మొత్తమై కష్టాల్లో ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది. 
మీ పుట్టినరోజులు జరిగినప్పుడు కూడా కేక్, చాక్లెట్లు, పళ్లు పట్టుకెళ్లి వాళ్లకి ఇవ్వండి మీకెంత ఆనందం కలుగుతుందో. 
మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెళ్లిల్లు, గృహ ప్రవేశాలు జరిగినప్పుడు ఎంతో మందికి అన్నం పెడతారు కదా. ఈసారి బీదవాళ్లకు కూడా భోజనం పెట్టండి. దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడైనా పదార్థాలు మిగిలిపోయినా పారవేయకండి. అవి కూడా కొంతమంది ఆకలి తీరుస్తాయని మర్చిపోకండి.
లేనివాళ్లుగా పుట్టడం వాళ్ల తప్పు కాదు. అన్నీ ఉండి వాళ్లని పట్టించుకోక పోవడం మన తప్పు. 
ఈసారి నుంచి బీదవాళ్లను ఆదుకునే మంచి పిల్లలుగా ఉండి, అందరికీ సహాయం చేస్తారు కదూ.
ఉంటానర్రా, మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

No comments:

Post a Comment

Pages