గోవిందమ్మ గారి నగలు - అచ్చంగా తెలుగు

గోవిందమ్మ గారి నగలు

Share This
గోవిందమ్మ గారి నగలు
మా బాపట్ల కధలు – 22
భావరాజు పద్మిని

“ఏవండోయ్ పంతులు గారు, బహుకాల దర్శనం. బాన్నారా?”
“ఓ, భేషుగ్గా ఉన్నా, చెప్పవోయ్ సుబ్బారావు ఏవిటి సంగతి?”
“ఏముంది పంతులూ, మీ దీవెనల వల్ల అంతా బాగున్నాము. విశేషాలేమీ లేవు.”
“సరే అయితే, బజార్లో పనుంది, అలా వెళ్ళొస్తా...”
“ఆ, ఇంతకీ ఆ గోవిందమ్మ గారి నగలు దొరికాయా?”
“దొరక్కేమి, నేనిప్పుడు దిగేసుకు తిరుగుతున్నవి అవేగా. కనబట్టం లేదూ? చంద్రమతి మాంగల్యంలాగా పుణ్యాత్ములకే కనిపిస్తాయిలేవోయ్, సుబ్బడూ, ఏవంటావ్?”
“ఊర్కోండి పంతులు గోరూ, పరాచికాలు బాబూ తమకు.”
ఈ సంభాషణంతా విని, నవ్వుకోసాగాడు రామనాధశాస్త్రి గారితో వెళ్తున్న ఆయన మేనల్లుడు హనుమంతుడు. అంతకు ముందురోజే వేద పాఠశాలలో స్మార్తం నేర్చుకోడానికి వచ్చాడు అతను.
***
“ఏవిటో పొద్దుటే రాములవారు హనుమంతుల వారిని వెంటేసుకు బయల్దేరారు?” ఆటపట్టించాడు మహలక్ష్మమ్మ చెట్టు కదగ్గర కలిసిన గోవర్ధనాచారి.
“ఏముంది గోవర్ధనం, నీలా వేలిమీద కొండలు ఎత్తలేకపోయినా, మేమిద్దరం కలిస్తే ఉడుతలను వెంటేసుకుని, కనీసం మన సముద్రం మీద వారధి కట్టగలమేమో ప్రయత్నిద్దామని బయల్దేరాం.” సూటిగా తిరుగు బాణం వేసేసారు రామనాధం గారు.
“ప్రయత్నించడంలో తప్పు లేదు కదండీ, పోనీ అగ్రహారంలో, మీ పక్కింట్లో గోవిందమ్మ గారి నగలు దొరుకుతాయేమో వెతకప్పోయారా?” వెటకారం కొనసాగిస్తూ అన్నాడు గోవర్ధనం.
“వెన్న దొంగలకు, వన్నె దొంగలకు అయితే, పక్కిళ్ళలో దాచినవి గుట్టు చప్పుడు కాకుండా లాఘవంగా పట్టుకుపోవడం తెలుస్తుంది కాని, సొంత పెళ్లాన్నే వెతకలేక కోతుల సాయం తీసుకున్న రాముడిని, ఇక గోవిందమ్మ నగలేమి వెతుకుతాలే ఆచారి?”
కిసుక్కున నవ్వాడు హనుమంతుడు. వాళ్ళ నవ్వుతో శృతి కలిపాడు గోవర్ధనం.  
***
గడియారపు స్థంభం దగ్గరుండే కొలిమిలో, చిల్లుపడ్డ ఇత్తడి బిందెకు మాటు వేయించుకుని వెనక్కు బయల్దేరిన రామనాధం గారికి ఎదురుపడ్డారు ఆర్ట్స్ కాలేజి మాష్టారు శాంతారాం గారు.
“నమస్కారమండి, మొన్నామధ్యన ఒక జాతకం గురించి మీ సలహా అడుగుదామని మీ ఇంటికి వచ్చాను, మీరు జిల్లేళ్ళమూడి  వెళ్ళారని చెప్పారు.”
“నమస్కారం. అవునండి శాంతారాం గారు, మా ఆవిడ చెప్పింది. కాని, ఆపైన ఇడిగో, ఈ హనుమంతుడు ఊరినుంచి రావడం వలన వీడి హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాను సుమీ, ఆనక ఇంటికి రండి, చూద్దాము.”
“సరే కానండి, మనలో మనమాట, ఇంతకీ ఆ గోవిందమ్మ గారి నగల విషయం మీకేమైనా తెలుసా?”
“తెలియకపోవడం ఏమిటి, మొన్న నేను తువ్వ కాలవలో నా తువ్వాలు ఉతుక్కుంటుంటే, అందులోకి వచ్చాయి ఆ నగలు. అవి కాస్తా తీసేసుకుంటే, చేప పిల్లలకి తిండి ఉండదని జాలేసి, మళ్ళీ కాలవలోకి  వదిలేసా!”
మొహమ్మీద నవ్వితే మావయ్య తిడతాడేమోనని అనుమానం వచ్చిన హనుమంతుడు గడియారపు స్థంభం మాటుగా వెళ్లి, పగలబడి నవ్వసాగాడు. కాసేపటికి అతనికి ఓ అనుమానం వచ్చింది, “ఎవరీ గోవిందమ్మ గారు. ఏవిటా నగల గొడవ?” మావయ్య చెప్పరు కాని, ఆయన లేనప్పుడు అత్తయ్యను అడగాలి, అని తీర్మానించుకున్నాడు.
***
రాత్రి భోజనాలయ్యాకా, మండువా లోగిలి ఇంటి మధ్యలో మడత మంచం వాల్చుకుని, ఆకాశంలో పాడ్యమినాటి చంద్రుడిని  పడుకున్న అత్తయ్య శారదాంబ దగ్గరకు చల్లగా చేరి, కాళ్ళు పట్టసాగాడు హనుమంతుడు.
“ఏవిట్రోయ్, ఏం వరం కావాలేంటి, ఈ అగ్రహారంలోనే ఓ పిల్లని చూసి కట్టబెట్టేయ్యమంటావా లేక మాన్యాలు ఏవైనా రాసిమ్మంటావా ? అడిగేయ్...” అన్నారు శారదాంబ గారు కొంటెగా చూస్తూ.
“అవన్నీ కాదులే అత్తా...” అంటూ తన మనసులో మాటను బయట పెట్టాడు హనుమంతుడు.
“ఓరి, అదా సంగతి, విను చెప్తా. అది 1920 ప్రాంతం. అప్పట్లో మా మావగారి నాన్నగారైన లక్ష్మీ నరసింహారావు గారు ఇదే ఇంట్లో ఉండేవారు. మనింటి ప్రక్కనే మందపాటి గోవిందమ్మ గారి ఇల్లు. సుసంపన్నమైన కుటుంబం వారిది. ఆ మహాఇల్లాలికి ఏడు వారాల నగలు, వడ్డానం, వంకీలు, అన్నీ ఉండేవట. వాళ్ళింట్లో బంగారపు కంచాల్లో అన్నం తినేవారని అంతా చెప్పుకునేవారు. దురదృష్టవశాత్తూ, ఆమె భర్త వేదవ్యాసుడు గారు చిన్నతనంలోనే కాలం చేసారు. ఆసరికే ఆమె గర్భిణి.
అప్పట్లో బ్రిటిష్ వారు బందిపోటు దొంగల్లా ఇళ్ళ మీద దాడి చేసి, ఉన్న నగానట్రా, ఖరీదైన సామాను, అన్నీ కొల్లగొట్టి తీసుకుపోయేవారట.  వాళ్ళు మన బాపట్ల రాబోతున్నారన్న సమాచారం ఈ సత్యనారాయణపుర అగ్రహారమంతా దరిమిలా వ్యాపించింది. నెలలు నిండుతున్న ఆవిడకు ఈ వార్త వినగానే కంగారు మొదలయ్యింది. సమయానికి అత్తా, మావగార్లు కూడా ఇంట లేరు. ఏమి చెయ్యాలో పాలుపోక, తన పుట్టింటి వారికి ఓ ఉత్తరం రాసింది. నగలన్నీ ఒక ఇత్తడి బిందెలో పెట్టి, ఆ బిందెని తనింట్లోనే ఎక్కడో భూస్థాపితం చేసింది. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. తర్వాత ఆవిడ పురిటికి పుట్టింటికి వెళ్ళిపోయి, నగలు పాతిన విషయం చూచాయిగా తన తల్లితో చెప్పి, ఆ పురిటిలోనే చనిపోయింది. బ్రిటిష్ వారొచ్చి, ఇల్లంతా గాలించి, ఏమీ దొరక్క వెళ్లిపోయారట. ”
“అలాగా, అయితే మరి నగల విషయం అందరికీ ఎలా తెలిసింది?” ఆశ్చర్యంగా అడిగాడు హనుమంతుడు.
“గోవిందమ్మ గారి కొడుకైన సహదేవుడు మన పక్కింట్లోనే తాత, బామ్మల వద్ద పెరగసాగాడు. అతనికి ఎప్పుడూ కలలో అతని తల్లి కనిపించి, “నగలు తవ్వి తీసుకోరా, నగలు తవ్వి తీసుకోరా” అని చెప్పేదట. కోడలి పుట్టింటి వారిని ఈ విషయంగా ఆరా తీస్తే, గోవిందమ్మ తన తల్లితో ఇంట్లోనే ఎక్కడో నగలు పాతిన విషయం చెప్పిందని, కూతురు పోయిన బాధలో ఆమె ఆ విషయమే మర్చిపోయిందని, తెలిసింది.
ఇక అప్పుడు మొదలయ్యింది నగల కోసం వేట. అంజనాలు వేయించారు, సోదెమ్మను అడిగారు, నగల కోసం పూజలు చేయించారు, మొక్కులు మొక్కారు... ఇలా ఒకటా, రెండా అన్ని ప్రయత్నాలు చేసారు. ఆశ మనిషి చేత ఎన్ని పనులు చేయించదు చెప్పు? అందరూ తిండీ నిద్రా మాని వెతకసాగారు. అటకలు, పైకప్పులు, అన్నీ సర్ది వెతికారు. ఉన్న గదులూ, ఆవకాయ గదీ, పెరడు, వసారాలు అన్నీ తవ్వి చూసారు. నెమ్మదిగా నగల విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ పాకిపోయింది. నగల గురించి అందరిలో ఉత్సుకత మొదలయ్యింది. ఎక్కడ, ఏ రెండు కొప్పులు, తలలూ కలిసినా ఇదే విషయం మాట్లాడుకోసాగారు.
మూడు తరాల వారు తవ్విన చోట తవ్వకుండా ఇల్లంతా తవ్వేసి మరీ వెతికారు. ఎక్కడా నగలు దొరకలేదు. కాని, అప్పటికీ, ఇప్పటికీ “గోవిందమ్మ పాతేసిన నగలు దొరికాయా, అన్న పలకరింపు ఈ అగ్రహారంలో ‘భోజనం చేసారా’ అన్నంత సహజంగా మారు మ్రోగడం మొదలయ్యింది. ఇదిగో, ఇన్ని రోజులు గడిచినా ఇదే వరస.”
“అయ్యో, అయితే నగలు ఏమై ఉంటాయో, బ్రిటిష్ వారికి దొరికి ఉంటాయా? లేక ఏ తుఫానులకో భూమి లోపలకు వెళ్ళిపోయి ఉంటాయా? ”
“లేదురా, నీకో రహస్యం చెబుతాను. ఇది మీ మావయ్యకు కూడా తెలీదు. అప్పట్లో గోవిందమ్మ మునిమనవడి పెళ్ళాం ఈ విషయం ఎవరితోనూ చెప్పవద్దని, మన గుళ్ళోని గంగాపార్వతి అమ్మవారి మీద నాతో ఒట్టెయ్యించుకుంది. కనుక, నేను దీన్ని బయటకు పొక్కనివ్వలేదు. ఇప్పుడా కుటుంబం ఊరొదిలి వెళ్ళింది కాబట్టి చెబుతున్నా. అయినా, నువ్వూ మనసులోనే ఉంచుకుంటానంటే చెబుతాను.”
“సరే, ప్రమాణం చేస్తున్నా, చెప్పండి అత్తయ్యా.”
“ఇక అందరూ నగల మీద ఆశ వదిలేసారు. నాలుగో తరం నడుస్తోంది. గాడి పొయ్యలు పోయి, గాసు పొయ్యల కాలం వచ్చింది. ఇల్లంతా గచ్చులు చేయించి, ఇప్పటి తరానికి తగ్గట్టు కొత్త హంగులు అన్నీ సమకూర్చసాగారు. అప్పటిదాకా, అన్నాళ్ళూ తమకు అన్నం పెట్టిన అన్నపూర్ణ వంటి గాడిపొయ్యను ఎవరూ తాకలేదు. కాని కొత్త ఇంటికి ఆ గాడిపొయ్య అడ్డమయ్యింది. అందుకే గోవిందమ్మ గారి మునిమనవడు ఆ పొయ్యిని స్వయంగా తీసి వెయ్యాలని, పెద్దలు నిద్దరోయిన ఓ రాత్రి వేళ పలుగుతో పని ప్రారంభించాడు. రెండు దెబ్బలు వేసాడో లేదో, పలుగుకు ఏదో ఖంగున తగిలింది.
ఏవిటా అని తవ్వి చూసిన వాళ్ళు, వాళ్ళ కళ్ళను నమ్మలేకపోయారు. గోవిందమ్మ పాతేసిన నగల బిందె ! గాడి పొయ్య కింద పాతేసి, ఆ సంగతి ఎవరికీ తెలియకుండా మళ్ళీ పొయ్యి పేడతో అలికేసింది గోవిందమ్మ. ఆహా, ఏమి తెలివితేటలూ, అని నివ్వెరపోయిన వాళ్ళు, అమితానంద పడ్డారు. ఈ విషయం అగ్రహారం వాళ్లకి, ఇప్పటి ప్రభుత్వానికి, తెలిస్తే లేనిపోని గొడవలని, కుటుంబమంతా కలిసి, ఈ విషయం గోప్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక కంసాలి సాయంతో నగలు కరిగించేసి, బంగారం ముద్ద అమ్మేసి, మండువా ఇల్లు పడగొట్టి, అదే స్థలంలో వైభవంగా పెద్ద భవంతి కట్టారు. ఆ తర్వాత ఆ కుటుంబం వేరే ఊరు వెళ్ళిపోయి, స్థిరపడింది. ఇదిరా గోవిందమ్మ నగల కధ... ఎవరికా నిధి చేరాలో వారికే చేరింది. కాని, ఇప్పటికీ బాపట్ల జనం మనసులో ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.” కధ ముగిస్తూనే నిద్దర్లోకి జారుకుంది శారదాంబ.
“ఆహా, ఎంత గొప్పగా ఉంది గోవిందమ్మ నగల చరిత్ర...” అనుకుంటూ చెప్టా మీద నిద్రకు ఉపక్రమించాడు హనుమంతుడు.
***

1 comment:

Pages