మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదేమో! - అచ్చంగా తెలుగు

మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదేమో!

Share This
మనిషి విలువ ఉన్నప్పుడు తెలియదేమో!
ఆండ్ర లలిత


గోపికి బామ్మంటే చాలా ఇష్టం. గోపి వాళ్ళ బాబయ్యలందరూ అమెరికా వెళ్ళిపోవడంతో బామ్మ గోపీకి జ్ఞానం వచ్చినప్పటినుంచి వాళ్ళదగ్గరే వుంది. గోపీని కూడా బామ్మ చాలా గారాబం చేసేది. బామ్మతో గోపీ చెప్పని విషయాలు కూడా ఏమీవుండేవి కాదు. ఒకోసారి ఈ సందర్భంలో గోపీ అమ్మ నాన్నలకి కూడా చాలా కోపం వచ్చేది. కాని బామ్మ చాల తెలివిగా కొడుకు కోడలిని ఏనాడు మనసు కష్టపెట్టకుండా మసలుకునేదు. అందుకే బామ్మంటే అందరకీ ఇష్టం. అందరూ బామ్మ పార్టీయే.  చిన్నప్పటినుంచి బామ్మకి ఒక్కరోజు వంట్లో బాగులేక పడుకున్నా అందరూ గిలగిలాడి పోయేవారు. బామ్మ కూడా అందరూ తహతహలాడుతూంటే కొండంత బలంతో తన ఈతి బాధలన్నీ ప్రక్కకి పెడుతూ అందరికీ పెద్ద దిక్కుగా వుండి ఆ కుటుంబాన్ని కనుపాపలా చూసుకునేది.
****
“సీతా రామస్వామీ, నే చేసిన నేరము లేమి” అని పాట ఏకధాటిగా పాడే బామ్మ కమలాంబ కంఠం రోజు రోజుకి క్షీణిస్తోంది.   “బామ్మ కంఠం ఇంక నేను పాడ లేనని చెప్పుతోందా!” అనిపించింది, భోజనాల బల్ల దగ్గర టిఫి
ను తింటుంన్న గోపీకి. ఎప్పుడూ వినే బామ్మ పాడే పాటలో  రానురాను ఆర్ద్రత పెరుగుతోందనుకున్నాడు గోపి తనలో తాను. నవ్వుతూ అజమాయిషీ చేసే బామ్మ మంచానికి పరిమితమై పోతోంది. అసలు ఎన్ని రోజులు మన  మధ్యలో ఉంటుందో అని బెంగ వచ్చింది గోపికి. ఎన్ని రోజులో! అనిపించినప్పుడల్లా, చిన్నప్పటి జ్ఞాపకాలు ఏవేవో బామ్మతో  మాట్లాడి బామ్మ ముఖముపై చిరునవ్వు తేవాలనిపిస్తుంది  గోపీకి. బామ్మ కమలాంబ  కళ్లలో ఎవేవో ప్రశ్నలతో ఆవేదన, ఏదో తపన అసంతృప్తి కనబడుతున్నాయి. అలా కనబడినప్పుడల్లా గోపీకి బామ్మ తన జీవితంలో ఎంత అమూల్యమో చెప్పాలనిపించేది.  ఎక్కడా ఖాళీ దొరకడం లేదు! ఎప్పుడు చూసినా ఏదో ఒక అవసరమైన పని పీకలమీద ఉంటోంది. బామ్మ తనదేగా తరువాత మాటలాడచ్చులే అని నిర్లక్షం చేస్తున్నానేమోననే ఆలోచన తనని వేధించింది. అసమర్థతతో తనమీద తనకే కోపంవచ్చింది. ఏదో మోక్కుబడికి బామ్మ ఒంట్లో ఎలా ఉందో క్లుప్తంగా అడగటం ఒక్కటే చేస్తున్నానని  మనసు బాధ పడింది. ఏదో కంగారులో ఆలోచనలు పరుగెట్ట సాగాయి. బామ్మ మొన్న రాత్రి తననెందుకో  పిలిచిన విషయం గుర్తుకొచ్చి,అయ్యో అనుకుంటూ, గోపి బామ్మ గదిలోకి గబగబగా వెళ్ళి, “క్షమించు బామ్మా మొన్న రాత్రి ఎందుకో నన్ను పిలిచావు. ఏదో పనిలో పడి మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు! ఎలా ఉన్నావు?  ఏమన్నా తిన్నావా? నీరసంగా ఉన్నావు!   ఏదీ నాడి చూడనీ” అన్నాడు గోపి బామ్మ కమలాంబ మంచం మీద పక్కన కూర్చుని. 
బామ్మ కమలాంబ తన నాడి చూస్తున్న గోపి మొహంలో ఆవేదన గమనించి “ పెద్ద దాన్నయిపోయానని చెప్తోందా, నా నాడి!”అంది  చిరునవ్వుతో గోపితో. 
“లేదు! నిన్ను నా మాట వినమని చెప్తోంది” అన్నాడు గోపి మరొక చిరునవ్వుతో బామ్మ కమలాంబ కేసి తిరిగి నేనున్నానని ధీమా యిస్తూ. 
మళ్ళీ అందుకుంటూ “చాలా నీరసంగా కొట్టుకుంటోంది నీ గుండె. మందులు వేసుకున్నావా? అన్నాడు బామ్మ మందులు ఉండే  గూటిలో  మందులను పరిశీలిస్తూ. అది చూస్తూ, మనవడి ముఖ చర్యలను గమనిస్తున్న బామ్మ కమలాంబ “బానే ఉన్నాను నాన్నా, కంగారుపడకురా.  ఏ అవయవాన్ని చూసుకుంటావు. ఇక  నా శరీరమంతా మొరాయిస్తోందిరా. అంతా అయిపోయింది. శరీరం గుల్లై పోయింది. మందులు రోగం తగ్గించే బదులు మరోకటేదో  ప్రవేశపెట్తున్నాయి. మొన్న గుండె దడకి నువ్వు మందిస్తే,  దానితో విరోచనము కావటం లేదు. ఆకలి లేదు. వళ్ళంతా నొప్పులే. ఏమని చెప్పను... రోజూ, నా రామునితో మొర పెట్టుకుంటున్నాను. నా రామునికే ఎఱుక కావటంలేదేమోరా.  అయినా నీకు ఆలస్యమౌతోంది. సాయంత్రం తాపీగ మాట్లాడుకుందాము.  నీతో ఎదో చెప్పాలి నాన్నా”అంది బామ్మ గోపితో. మళ్ళీ అదే తపన కనబడింది గోపికి బామ్మ కళ్ళల్లో.
“ఇప్పుడు మాట్లాడు బామ్మా ఫరవాలేదు! ఏమి చెప్పాలో చెప్పు”అన్నాడు గోపీ.
******
తన మాటలు మొదలుపెట్టేలోపల గోపి తన చేతి గడియారం కేసి చూస్తున్నాడని గమనించి:
“ఎంతోమంది రోగులు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు నువ్వు నా పక్కనుంటే ఎంతో ఊరట కలుగుతుంది. కానీ అందరికీ నువ్వు కావాలి కదా. నా దగ్గరే నువ్వు ఉండిపోతే ఎలా! ప్రతీ మనిషి ప్రాణం అమూల్యం నాన్నా.   నా మీదే సమయం వృధా చేసుకోకు. మందు ఇస్తున్నావు కదా” అంది బామ్మ కమలాంబ గోపి చేయి పట్టుకుని. 
“నీకున్న సమస్యలు నాతో చెప్పాలి. ఎందుకు చెప్పవూ? చెప్పాలి సరేనా” అన్నాడు గోపి , బామ్మని బతిమాలుతూ.
“చెప్తానులేరా నాన్నా. అవును కానీ, అదేమిటి ఇలా రా, అలా చిక్కి పోతున్నావేంటిరా. ఏది నాకేసి చూడు. కళ్ళు లోతుకు పోయాయి.  పోవు మరీ, ఇంటి పట్టును ఉండేదే అరుదు. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నువ్వు. నువ్వలా ఉంటే తట్టుకోలేనురా!  అయినా ఈ వైద్యులూ, ఆసుపత్రులూ, రక్తపరీక్షలూ, ఇన్ని బుట్టడు మందులూ తట్టుకునే శక్తి నాలో లేదు నాన్నా. అన్నట్టు నువ్వు టిఫిను తిన్నావా! వెళ్ళి తిను” అంది బామ్మ కమలాంబ తన మనుమడిని ముద్దు చేస్తూ. 
“తిన్నానులే బామ్మా! నువ్వు మాత్రం సరిగా తినాలి మరి! నువ్వు టిఫిను తిన్నావా? ” అన్నాడు గోపి బామ్మతో సమాధానంగా.
“తినలేదు.తినాలని లేదు” అంది బామ్మ కమలాంబ.
“ఎందుకు తినలేదు? నాకెందుకు చెప్పలేదు బామ్మా! చెప్పాలి” అంటూ గోపి ఒక్క నిమిషం ఆలోచించి 
“బామ్మా!  ఆగు! నీ మందు మారుస్తాను. ఈ వేరే మందు వేసుకో. నీకు బావుంటుంది.  తరువాత ఇవాళ ఆసుపత్రికి కూడా వెళ్ళాలి. కార్డియాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది కదా”అన్నాడు గోపి.
“ఎందుకురా!” అంది బామ్మ కమలాంబ నిరసన వ్యక్తపరుస్తూ.
“నీరసం తగ్గటం లేదు కదా. రాత్రంతా నిద్ర పోవటం లేదు కూడా నువ్వు. అవునూ! అమ్మ చెప్పింది, నువ్వు అసలు ఏమీ తినటం లేదని”అన్నాడు గోపి.
“అవును తినటము లేదు నాన్నా. అన్నహితవు లేదురా. కడుపులో తిప్పుతోంది” అంది బామ్మ కమలాంబ.
“చూద్దాం! బామ్మా ఏమన్నా అవశిష్టాలుంటే తీర్చుకుని తయారౌవ్వు ముందు. ఇంకొక అరగంటలో ఆసుపత్రికి వెళ్దాము” అన్నాడు గోపి   వణుకుతున్న బామ్మ  పక్కన మంచం మీద కూర్చుని, బామ్మ చేయి తన చేతిలో తీసుకుని ధైర్యానిస్తూ.  ఆ తరువాత బామ్మ బట్టల గూడు దగ్గరకు వెళ్ళి,  బట్టల గూటిలో నుంచి చలి కోటు తీసి చక్కగా బామ్మకి తొడిగి బోత్తాలు పెట్తుంటే, గోపీకేసి  బామ్మ కమలాంబ చూస్తూ “ఎందుకు రా ఇవన్నీ. నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటావు” అంది బామ్మ కమలాంబ మురిసిపోతూ మనుమడు గోపి చేష్టలకి.
“ఆవును మరి. నువ్వు నన్ను చిన్నప్పుడు చూసుకోలేదూ?” అన్నాడు గోపి  నవ్వుతూ బామ్మతో.
“మీ నాన్న తీసుకెళతాడు లేరా!  నాతో పెట్టుకుంటే, నీకు ఆలస్యం అవుతుంది. అరకు పుచ్చుకుంటున్నానుగా. తగ్గిపోతుంది. రేపు వెళ్దాము.  నా గురించి బెంగ పెట్టుకోకు.  పండుటాకుని నేను. ఎప్పుడో రాలిపోవాల్సిన దానినే. ఎవరినీ కష్టపెట్టకుండా వెళ్ళిపోతే చాలు తండ్రి. నువ్వు మాత్రం నేను ఉన్నా లేకపోయినా ఒక్కటి గుర్తు పెట్టుకో! బాగా పని చేసి గొప్ప వైద్యుడవ్వాలి. వైద్య సేవ ఎంతో ఉత్తమమైన సేవ. నువ్వే నా నారాయణుడి వి. ఇంకొక వైద్యుడెందుకు రా నాకు.  సరే నా. నీ చేతులలో నేను వెళ్ళిపోవాలి” అంటూ వణుకుతున్న చేతితో గోపీ తల నిమిరింది బామ్మ కమలాంబ.
“ఆ, చాలు చాలు. నేను నిన్ను వెళ్ళనిస్తే కదా” అన్నాడు గోపి బామ్మ కమలాంబ కళ్ళలోకి అప్యాయంగా చూస్తూ.
“లేదు బామ్మా  . రావాలి నువ్వు ఆసుపత్రికి. ఇంకా నేను  నేర్చుకుంటున్నాను. మనము నిపుణుల దగ్గరకు వెళ్తే, వాళ్ళు రోగ గుణాలు ఇట్టే పసికట్టి ఉపశమనానికి మందులు ఇస్తారు. బొత్తిగా నాలుగడుగులు వెయ్యలేక పోతున్నావు” అన్నాడు గోపి  బామ్మ కళ్ళలోకి ప్రేమతో చూస్తూ.
ఎక్కడ మనుమడు గోపి మనసు నొచ్చుకుంటుందో అని మళ్ళీ అందుకుంటూ
“మళ్ళీ ఏవో పరీక్షలంటారు. ఓపిక లేదురా.  చెప్పాను కదా! ఇంకా ఎన్నాళ్ళో ఈ జీవితం. మీ తాతగారు అదృష్టవంతులు. ముందు వెళ్ళిపోయారు” అంటూ కంటతడి పెట్టుకుంది. 
“ డాక్టర్లు, మందులు, చికిత్సలు తట్టుకునే ఓపిక లేదురా” అంది బామ్మ కమలాంబ గోపితో
“ సరే..ఏమి చేస్తాము. నీ యిష్టం బామ్మా. ఆసుపత్రికి శెలవు పెట్టాను. అయినా నీ పని నువ్వు చేసుకోవాలంటే నా మాట వింటే చేసుకోగలవు.  లేకపోతే అదుగో, నీ స్నేహితురాలు రామలక్ష్మిలా మంచానికి పరిమితమై పోతావు” అంటూ గదిలో నుంచి వెళ్ళిపోతున్న గోపితో “వస్తున్నానురా ఆగని నాలుగడుగులు  మనమడి దగ్గరకు వేసి, అయ్యో అంటూ మళ్ళీ గదిలోకి వెళ్ళి, ఏదో పేకెట్టు చీరకొంగులో దాచుకుని తెచ్చుకుని, “ఇప్పుడు పద నాన్నా” అంటూ బామ్మ కమలాంబ  మనవడితో కారులో బయలుదేరింది. కారులో చాలా మౌనంగా ఉన్న బామ్మని గమనించి గోపి “బామ్మా ఏమన్నా మాట్లాడు” అన్నాడు ధీర్గాలోచనలో ఉన్న బామ్మతో.
“ఏమున్నాయి నాన్నా మాటలు” అంది బామ్మ.
“ఏదో ఒకటి మాట్లాడు బామ్మ. ఏమిటీ ఆలోచనా? జీవిత సారాంశము ఏమిటీ అని అడిగానా మొన్నన. నువ్వు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా.ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది.  ఏదోకటి మాటలాడు బామ్మా! చెప్పు, బామ్మా జీవిత సారాంశము ఏమిటి?” అన్నాడు గోపి కారు డ్రైవ్ చేస్తూ బామ్మ కమలాంబతో.
“ఏమి చెప్పను నాన్నా. నేను ఏమి  పెద్ద చదువులు చదువుకోలేదు. ఏదో మొగుడికి ఉత్తరం రాయటం వరకే నా చదువు.  జీవితం ఒక  మహా సముద్రం. దానిలో నాకు తెలిసింది కూసంత. మరి అదే నీకు చెప్తాను.  మన మనసు ఒక విశాలమైన స్థలమనకో. దానిలో మన భావాలతో మనము ఏర్పరుచుకుంటామొక  పొదరిల్లు. దానిని నిర్మించుకునేటందుకు మనము నైతిక విలువలు ఇంకా మన ధర్మాలనూ పునాదులుగా వుంచుతాము.  మరి  ఆ పునాదుల మీద ఇటికలనే భావాలు జోడించి కట్తాము. ఒక దానికొకటి అతుక్కోవాలంటే  నమ్మకమనే సిమెంటు వాడతాము. మన పొదరిల్లు పదిలంగా పది కాలాలుండాలంటే  మన భావాలు బాగా దృఢంగా ఉండాలి. మన చదువులు, ఉద్యోగాలూ, సంప్రదాయాలూ, సంస్కృతులు ఒకెత్తైతే; మనసు లో పడే ఘర్షనలు  మమతలు, బంధాలు అనుబంధాలు, బరువు బాధ్యతలు, సంస్కారాలు   ఒకెత్తు.  వీటంన్నింటిలో సమతుల్యత తేవడానినోకి మన మనసులో, ఎన్నో తుఫానులు అలజడిలు భూకంపాలు  చెలరేగుతుంటాయి. వీటన్నిటి ధాటికి మన మానసిక పొదరిల్లు తట్టుకోవాలి. పునాదులు కదలకూడదు. అవన్నీ తట్టుకుని అన్నిటితో సమతుల్యత తెచ్చినప్పుడు ఓర్పూ సహనము ఏర్పడుతాయి. అవి మన పొదరిల్లు ని కాపాడుతాయి. అదే రా water proof weather proof లాగనమాట”అంది బామ్మ  చిరునవ్వుతో. 
“Hat’s off బామ్మా”అన్నాడు గోపి బామ్మకేసి తిరిగి.
మళ్ళీ అందుకుంటూ “కాని  ఇప్పుడు ఏమౌతుందో చెప్పలేను! ఆఖరి దశ ఎలా  ఉంటుందో. జీవితం ఎటు మలుపు తిప్పుతుందో చెప్పలేక పోతున్నాను. ఇంతవరకు జరిగిన ఆటుపోటులు వేరు. తట్టుకుని బయటికి వచ్చాను కనక అంత కష్టం అనిపించలేదు. కానీ ఇప్పుడు జరగబోయేదీ! నాకన్నీ పద్మవ్యూహాల్లా అనిపిస్తున్నాయి. పద్మవ్యూహాలనుంచి బయట పడలేననిపిస్తోంది రా. ఆసుపత్రి వచ్చేసిందా”అంది బామ్మ కమలాంబ ప్రశ్నార్థకంగా మనమడు గోపితో.  
“నేను తిరిగి నీతో ఇంటికి రాగలనా” అంది కమలాంబ కారు తలుపు తీస్తున్న గోపి కళ్ళలో జవాబు వెతుకుతూ.
“ఎందుకు రాలేవు?రాగలవు. బామ్మా ఆ పేకెట్టు  తీసుకో.  నీ సీటు పక్కన పోకెట్లో ఉంది” అన్నాడు గోపి కారు దిగుతున్నబామ్మతో.
బామ్మ ఆ పాకెట్టు కేసిచూస్తూ, ఈ పేకెట్టు నీకే నాన్నా. వచ్చేటప్పుడు చూద్దువుగానీ. మొన్నరాత్రందుకే పిలిచాను. ఇది ఇద్దామనీ అంది బామ్మ  గోపి కళ్ళలోకిచూస్తూ .
“నేనున్నాను కదా బామ్మా పద్మవ్యూహంలో నుంచి బయటికి నిన్ను లాగడానికి” అంటూ కారు పార్కు చేసి వీల్చేయరు తెచ్చి బామ్మని కూర్చో పెట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు.  తనని గదిలో పడుకోబెట్టి తోటి డాక్టర్లుతో ఏవో పరీక్షలు చేయించాడు.ఇంతలో పెద్ద వైద్యుడు వచ్చి తను కూడా పరీక్షలు చేసారు. అందరి ముఖాలు గంభీరంగా మారాయి. ఇంతలో బామ్మ కమలాంబకి తన ఆఖరు గడియలనిపించాయి. మనమడు గోపి బామ్మకి oxygen ఇవ్వమని  నర్సుకి పురమాయిస్తు గదిలోనుంచి వెళ్ళిపోతుంటే గోపి చేయి పట్టుకుని అమ్మా నాన్నలని చూసుకో అని కన్ను మూసింది. గోపి నిర్ఘాంతపోయాడు. బామ్మ చేతులలోనుంచి తన చేయి తీస్తుంటే కళ్ళెవెంబడ బడబడ నీళ్ళు రాసాగాయి. జీవితం చాలా చిన్నదనిపించింది. వైద్య పరంగా మనము ఎన్నో చేస్తూవుండచ్చు. కాని ప్రాణ దాత మటుకు ఆ భగవంతుడే అనిపించింది. ఒక్కసారి నివ్వెరపోయి తనలో తాననుకున్నాడు, బామ్మని బతికించలేపోయానని . 
“చిన్నప్పుడు నన్ను మరిపించి , ఏదో తాయిలం నా చేతిలో పెట్టి, నాకు తెలియకుండా ఊరు వెళ్ళిపోయేదానివి.  ఇప్పుడు నాకు  తాయిలం కారులో పెట్టి, నాకు  తెలియకుండా వెళ్ళిపోయావా బామ్మ” అనుకున్నాడు ప్రశాంతంగా పడుకున్న బామ్మని ఒక్కసారి  చూస్తూ.
జీవితము ఎవరి కోసం ఆగదు. ఏవో చెప్పాలనుకున్నాను నీకు బామ్మా. కాని  చెప్పలేక పోయాను, just missed.  నువ్వు ఉన్నపుడు నువ్వు నాదానివనుకున్నాను. నువ్వు నాతోనే ఉంటావనుకున్నాను. ఈ బరువులు బాధ్యతలు ముగించుకుని మాట్లాడచ్చు అననుకున్నాను. నువ్వు  పాపం నాతో ఏవేవో చెప్పుదామనుకున్నావు. కాని తరువాత చెప్పమని నేను వాయిదా వేసేవాడిని. నేను నాకు ప్రశాంత ప్రత్యేక సమయం కుదిరినప్పుడు మాట్లాడచ్చనుకున్నాను. కాని అనుకూల సమయమంటూ ఎప్పటికి రాలేదు. అది మనము కుదుర్చుకోవాలేమో. బామ్మా! తెలియలేదు బామ్మా.  నువ్వెప్పుడు నాకోసం ఎదురుచూసేదానివి.  నేను చదువుకుంటుంటే నా తలనిమిరి వెళ్ళిపోయేదానివి. ఒక్కసారన్నా నన్ను గదమాయించి నేను నీతో మాటాడాలని ఎందుకు చెప్పలేదు. అలా చెప్పుంటే మాట్లాడేవాడినేమో. నా మనసెరిగి నువ్వు మసులుకునేదానివి. మరి నీ మనసెరిగి నేను  మసులుకున్నానా! లేదే! క్షమించు నన్ను బామ్మా! నువ్వు  లేవన్న నిజం జీర్ణించుకోలేక పోతున్నాను.  మనసు నీకోసం పాకులాడుతోంది. ఇప్పుడు కూడా నా మనసులోనే ఉన్నావు కదా! కాని ఎందుకు నా  మనసొప్పటలేదు నీ లోటు. ఇదేనేమో విలువకి అర్థం.   అనుభవించాక తెలుస్తోంది. బామ్మా నీ విలువ, నువ్వు ఇక నాకు లేవన్నాక తెలిసింది. ఒరేయ్ గోపి ! ఏదన్న మనకు దక్కనపుడు దాని విలువ అనంతంరా, అనేదానివి నువ్వు. అంతేలే నువ్వనే పదాలకు అర్థం అప్పుడు తెలియక పోయినా ఇప్పుడు తెలిసింది అంటు చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు. తనని తను తమాయించుకుని బామ్మని కడసారి చూస్తూ
“Any way have a safe ride బామ్మా.  వైతరిణీ నది దాటినప్పుడు నీ అనుభవం కలలో వచ్చి చెప్తావు కదూ.మా మంచి బామ్మ. అందుకేనేమో మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా ప్రేమచూపించు లేనప్పుడు తపించి లాభంలేదంటారు” అంటూ ఏదో పనుండి పార్కింగ్ స్లాట్లో కారు దగ్గరకెళ్లి కారు తలుపు తీసినప్పడు, బామ్మ తీసుకొచ్చిన పేకెట్టు కనబడింది. ఆతృతతో తెరిచిచూసాడు. అందులో ఒక మఫ్లరు, ఇంకా ఒక ఉత్తరం ఉన్నాయి. ఉత్తరం తీసి చదవాడు, దుఖం పొరులుతున్న కళ్ళు తుడుచుకుంటూ.
“మొన్నన నా పెట్టి సద్దుకుంటుంటే  రెండు ఊలుండలు దొరికాయి. అదీ నీకిష్టమైన రంగు నీలం.   నువ్వు  చలికి తట్టుకోలేవు. రొంప పడుతుంది.  ఈ బామ్మ నీ కోసం  అల్లిన మఫ్లరు  మెడకి చుట్టుకో. నీకు నచ్చిందా? ఎప్పుడు నీకు surprises ఇవ్వమనేవాడివి. ఇదిగో నీ surprise. బావుందా?”  అని ఉత్తరం చదువుకొని పదిలంగా తన చొక్కా జేబులో దాచుకొని ఆకాశం కేసి చూస్తూ  చిన్నపిల్లాడిలా  ఏడుస్తూ “I love you bamma! It is a real real fantastic surprise. Bye bamma….”అంటూ ముందుకి సాగిపోయాడు.
***

2 comments:

  1. జీవితానుభవం కన్నా పెద్ద పెద్ద చదువులు ఏమీ ఉండవు . బామ్మ చెప్పిన పొదరిల్లు సత్యం చాలా నచ్చింది లలిత గారూ .. పిల్లలు పెద్దల మనసుని తెలుసుకోరు. తెలుసుకునే సమయం వచ్చేసరికి పెద్దలుండరు. ఇది ఏ తరంలోనైనా జరిగేదే ! ఈ కాలపు పిల్లలు మరీనూ ..పెద్దవాళ్ళని చాదస్తులని తీసిపారేస్తారు. ఈ కథలో బామ్మా మనుమడి అనుబంధం బాగుంది. మీకు అభినందనలు .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజగారు

      Delete

Pages