శ్రీమద్భగవద్గీత - 13 - అచ్చంగా తెలుగు
 శ్రీ మద్భగవద్గీత - 13
ఆరవ అధ్యాయము
రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు
09482013801


ఆత్మసంయమయోగము
ధ్యాన యోగము

ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్
ఆత్మైవహ్యాత్మనోబన్ధు
రాత్మైవరిపురాత్మనః - 5వ శ్లోకం
ప్రతిజీవుడున్ను తన్ను తానే యుద్ధరించుకోవలసినదిగా భగవానుడుద్భోధించుచున్నాడు.గురువులు,శాస్త్రములు,దైవము దారి చూపుదురే కాని నడవవలసినది తానే.తన కాళ్ళతో తానే నడవవలెను.తన కండ్లతో తానే చూడవలెను.తన ఆకలిని తానే పోగొట్టుకోవలెను.సోమరులై,ఇంద్రియ నిగ్రహము,వైరాగ్యము లేక,భోగ పరాయణులై దేవుడే మాకు మోక్షమిచ్చుననుకొనుట గురువే తమను కైవల్యధామమునకు గొనిపోవుననుకొనుట వెర్రితనము.సామాన్యముగా ఒక చిన్న వస్తువు బజారులో కొనవలెనన్న కొంత వెల చెల్లించవలెను.అట్టితరి మోక్షము దుఃఖ రాహిత్యము,జనన మరణ రూపబంధ నిఛ్ఛేదము,పరమానంద ప్రాప్తి నభిలషించువారు దానికెంత విలువను చెల్లించవలసియుండును? సోమరులకది సాధ్యపడునా? ఎంతయో త్యాగము ఎంతయో సాధన ఎంతయో ఇంద్రియనిగ్రహము దానికి అవసరము. అట్టి ఆధ్యాత్మ సాధనా రూపమూల్యమును జీవుడు చచెల్లించనిదే పరమేశ్వరుడు కూడా జీవునకేమియు నొసంగజాలడు.కఠోరశ్రమపడవలెను.పూజ్యులు,పెద్దలు,బోధించిన మార్గమును అనుసరింప వలెను. గురువు శిష్యునకుపదేశించుట సంప్రదాయమును పాటించుటకొరకే చేయవలసిన దంతయు శిష్యుని చేతిలోనే యున్నదని వశిష్టమునీంద్రులు శ్రీరామచంద్రమూర్తికి యోగ వాసిష్టమునందు చెప్పియున్నారు. భవరోగపీడితుడగు జీవుడు తానే స్వయముగా సాధనచేసి తరించవలెను.
మనసు పదునైన కత్తిలాంటిది.భయంకరమైన వ్రణమును శస్త్ర చికిత్సతో తొలగించి ప్రాణాన్ని కాపాడవచ్చు.అదే కత్తితో కుత్తుక కత్తిరించి ప్రాణాలను హరించవచ్చు.అభ్యాసవైరాగ్యములు ద్వారా మనసును స్వాధీనపరచుకొన్నచో మనలనుద్ధరించును.
జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా
కూటస్తో విజితేంద్రియః
యుక్త ఇత్యుచ్చతేయోగీ
సమలోష్టాశ్మకాంచనః - 8వశ్లోకం
శాస్త్ర జ్ఞానము,అనుభవ జ్ఞానములచే తృప్తినొందిన మనస్సు గలవాడును, నిర్వికారుడు, ఇంద్రియములను లెస్సగ జయించిన వాడును,మట్టి,రాయి,బంగారము అను మూడింటిని సమానముగా జూచువాడు యోగారూఢుడని చెప్పబడును.యోగమనగా కలయిక జీవీత్మ పరమాత్మతో కలియుటయే యోగము.యోగులనేకులున్ననూ అందు అరూఢస్థితి నొందిన వారు చాలా అరుదు.అట్టి ఉత్తమ యోగుల లక్షణములు ఈ శ్లోకమున వివరించబడినవి.
1.జ్ఞానవిజ్ఞానములచే తృప్తినొందుట 2.కూటస్థుడై నిశ్చలముగానుండుట 3.ఇంద్రియములను లెస్సగ జయించుట 4.మట్టి,రాయి బంగారములను సమానముగా చూచుట
జ్ఞానమనగా బాహ్య విషయముల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకొనుట. విజ్ఞానమనగా తొలుసుకొన్న జ్ఞానాన్ని (గురువుల ద్వారా,సాధన ద్వారా)అనుభూతమొనర్చుకొనుట. కూటస్థుడై నిశ్చలస్థితినొంది ప్రత్యగాత్మను పరమాత్మతో సంధానించి ఆనందస్థితి ననుభవించుట. విజితేంద్రియత్వమనగా ఇంద్రియములను పరిపూర్ణంగా నిగ్రహించవలెను. వాసనలు ఏమాత్రము శేషంచియున్న సాధకుని పడద్రోయగలవు. చిన్న నిప్పురవ్వ కొండంత ప్రత్తిని కాల్చివేయగలదు.ఆత్మసాక్షాత్కార ప్రాప్తికి మట్టి,రాయి,బంగారము ఏవియును ఉపయోగపడవు. అందువల్ల యోగ శ్రేష్ఠునికి అన్నిటియందును సమభావనగాయుండును.
శుచౌదేశే ప్రతిష్టాప్య
స్థిరమాసనమాత్మనః

నాత్యచ్ఛ్రితం నాతినీచం
చేలాజినకుశోత్తరమ్ -11 వశ్లోకం
తత్రైకాగ్రంమనః కృత్వా
యతచిత్తేన్ద్రియక్రియః
ఉపవిశ్యాసనేయుఞ్యా
ద్యోగమాత్మవిశుద్ధయే - 12వ శ్లోకం
ఈ ఆరవ అధ్యాయానికి ధ్యానయోగము అన్నపేరు సార్ధకము కావటానికి ఇట్టి శ్లోకములే మూలము.ధ్యానాభ్యాసికి కావలసిన ముఖ్య విషయములన్నియు ప్రస్తావించబడినవి.ఆధ్యాత్మిక సాధనాక్రమములో ధ్యానానికున్న ప్రాముఖ్యత వివరించబడినది.
పరిశుద్ధమైన చోటుయందు మిక్కిలి ఎత్తుకాకుండా మిక్కిలి పొట్టికాకుండాయున్నట్టి ఆసనము.దానిపై దర్భచాపయు,దానిపై ఉన్నివస్త్రము, ఉన్నివస్త్రము పైన మెత్తని బట్టపరచి దానిపై కూర్చుని మనసును ఏకాగ్రపరచి,ఇంద్రియమనో వ్యాపారములనరికట్టి, అంతఃకరణ శుద్ధికొరకు ధ్యానమును అభ్యసింపవలయును.మలిన ప్రదేశము యొక్క ప్రభావము సాధకుని మనస్సుపై పడుచుండును. కావున బాహ్య శుద్ధి కూడా ముఖ్యమైనదే.మహనీయులగువారు తమ మనసునెంతపవిత్రముగనుంచుకొందురో అంతే పవిత్రముగా తమ దేహమును,వాక్కును,తాముండు ప్రదేశమునుగూడపవిత్రముగనుంచుకొందురు.వారి శుద్ధత్వము అన్నిటియందుప్రతిబింబించుచుండును.మొత్తము ఆసనమంతయు ఏమాత్రము కదలక,స్థిరముగానుండవలెను.ఏప్రకారము కూర్చుండవలెననిన ఎవరికి ఏ ఆశనము స్థిరముగా,సౌకర్యవంతముగానుండునో ఆ ఆశనమేవారికి అనుసరణీయము.కొందరు పద్మాసనము,కొందరు అర్థపద్మాసనము,కొందరు సిద్దాసనము,కొందరు వజ్రాసనము అనుసరింతురు.ఏదివారికి స్థిరముగా చాలాసేపు కూర్చుండునకు సౌకర్యవంతముగా నుండునో దానికే అవలంబించవచ్చును.పతంజలి మహర్షియు ఈ విషయములో 'స్థిర సుఖమాసనమ్' అని చెప్పెను.మనస్సు యొక్క శక్తిని ప్రాపంచిక పదార్థములనుండి మరలించి పరమాత్మపై ఏకాగ్రమొనరించినచో అఖండశక్తి ప్రాదుర్భవించి అజ్ఞానరాశిని భస్మీభూత మొనర్చివేయును.నిర్మల హృదయమందే ఆత్మోదయముకాగలదు.
సమంకాయ శిరోగ్రీవం
ధారయన్నచలంస్థిరః
సంప్రేక్ష్యనాశికాగ్రం
స్వందిశశ్బానవలోకయన్ - 13వ శ్లోకం
ప్రశాంతాత్మా విగతభీ
ర్బ్రహ్మచారి ప్రతేస్థితః
మనస్సంయమ్యమచ్చిత్తో
యుక్త అసీతమత్పరః - 14వ శ్లోకం
ధ్యానము చేయువారి శరీరము,శిరస్సు,కంఠము తిన్నగా,నిలిపి,కదలక స్థిరముగానున్నవాడై దిక్కులను చూడక,భ్రూమధ్యమును వీక్షించుచూ ప్రశాంత హృదయుడై బ్రహ్మచర్య వ్రతనిష్ఠగలిగి,పరమాత్మనేనమ్మి ధ్యానయుక్తుడై వుండవలెను. వెన్నుపాము,మెడ, శిరస్సు,ఈ మూడును నిటారుగా యుండవలెను.ఏలయనిన ధ్యానస్థితిలో మూలాధార చక్రములో నిలిచిన చైతన్యశక్తి ఊర్థ్వముఖమై ప్రయాణించవలెనన్న స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము,విశుద్ధ చక్రము మరియు ఆజ్ఞా చక్రము ఒకే క్రమంలో ఉండవలెను.చైతన్యము ప్రయాణించుటకు అవరోధము లేకున్న ధ్యానము త్వరత్వరగా ఫలవంతముకాగలదు.
ధ్యానము ఫలవంతమైనదా? లేదా? అనుటకుమనపై కరుణతో పరమాత్మకొన్ని ఆహ్లాదకరమైన అనుభూతుల్ని మనకు అందిస్తుంటాడు.అవి ఏమంటే సుషుమ్న ఊర్థ్వముఖమైనప్పుడు వెన్నుపాము ద్వారా దివ్యమైన పులకింత కలుగును.ముఖ్యంగా 9,10 పూసలలో మైమరపును కలిగించే మత్తు కలుగును.ఒక చల్లని స్పర్శ క్రిందినుంచి పైకి ప్రయాణిస్తున్నట్లు అనుభూతి కలుగును.ఇవన్నియు యోగి ధ్యానాభ్యాసంలో అభివృద్ధికి సంకేతములు.
 ***

No comments:

Post a Comment

Pages