స్నేహితుడా - స్నే-హితుడా - అచ్చంగా తెలుగు

స్నేహితుడా - స్నే-హితుడా

Share This
స్నేహితుడా - స్నే-హితుడా 
   - సునీల్ ధవళ


'అమ్మకి ఫోన్ చేసేవా ఇవాళ?', అఫీస్ నుంచి వస్తూ రాగానే కార్తిక్ ఆడిగేడు.
'అత్తయ్యగారు శ్రావణశుక్రవారం పేరంటం కెళ్ళేరుట, మామయ్య గారితో మాట్లాడేను, ఏముంది ఆ అబ్బాయి మాధవికి నచ్చలేదుట', అని కాఫీ అందిస్తూ చెప్పింది ప్రవల్లిక.
కార్తీక్ భృకుటి ముడిపడింది. 'ఇంతమంచి పెళ్లి సంబంధం జన్మలోరాదు. అసలు మాధవికి ఏమైంది ఈ మధ్యన? మొన్నటివరకు వదినా 
ఈ చీర బావుందా, ఈ గొలుసు నాకు బావుంటుందా అని షాప్ నుంచి ఫోటో పెట్టి
మీ ఛాయిస్ బావుంటుంది, మీరు ఏది చెబితే అదే తీసుకొంటాను అనేది కదా!'అన్నాడు చిరుకోపంతో.
'బావుందండి, చీర, నగ నట్రా వేరు, జీవితభాగస్వామి వేరు. మీరు ఎక్కువ ఆలోచించకండి, ఇంత కన్నా మంచి సంబంధం వస్తుందిలెండి',అని ఊరట కలిగించింది ప్రవల్లిక.

ఒక ఆర్నెళ్లు గడిచేయి, కానీ ఇదే తంతు. చెల్లికి మంచి భర్తని తేవాలని, కార్తీక్ ప్రవల్లికలు టైం దొరికినప్పుడల్లా కెనడా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు నుంచి
తెలుగూస్ వనభోజనాలు వరకు
అన్ని కార్యకమలకి తు.చ. తప్పకుండా హాజరవుతున్నారు.
కెనెడా, అమెరికా, ఆస్ట్రేలియాలలో ఉన్న తెలుగు పెళ్ళికొడుకులందరి వివరాలు, ఫోటోలుతో సహా అమ్మ నాన్నకి పంపడం, వాళ్ళు ఏదోక వంక పెట్టడం ఇలా గత ఆర్నెల్లు గా జరుగుతున్న తంతు.

కార్తిక్ సహనం కోల్పోడం, బేలమొహం వేయడం, ప్రవల్లిక ఏదొకలాగ సర్దిచెప్పడం ఒక రొటీన్ అయిపోయింది.
కార్తిక్ ఐదో క్లాసు చదువుతునపుడు పుట్టింది మాధవి. అమ్మ నాన్నల గారాలపట్టి, తనకు ఆరో ప్రాణం. చిన్నప్పటినుంచి చెల్లెలు కొండమీద కోతి తెమ్మన్నా తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి మాధవికి తక్కువ మార్కులు వచ్చాయని
లెక్కల మాస్టారు స్కేలుతో మండమీద కొడితే, ఏడ్చుకుంటూ వచ్చి అన్నయ్యకి చెప్పింది. అంతే హుటాహుటిన స్నేహితుడు కృష్ణని తీసుకుని మాస్టారు ఇంటికెళ్లి నానా హైరానా చేసేడు కార్తిక్.

కృష్ణ తన ప్రాణస్నేహితుడు. చిన్నపుడు ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కలసి చదివారు. కృష్ణ వాళ్ళ నాన్నగారు రైల్వేలో జీపు డ్రైవరుగా పనిచేసేవారు. ఆయనకి ఐదుమంది సంతానం, కృష్ణ ఆఖరివాడు. చీటీలు అవీ వేసి ఆర్ధికంగా బాగా చితికిపోయేరు, వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడు లాగా, కృష్ణ వాళ్ళ అమ్మగారు రైల్వే క్వార్టర్ పక్కనే కూరల దుకాణం పెట్టుకున్నారు. కార్తిక్, కృష్ణలకి కులం, ఆస్తి, అంతస్తు తారతమ్యం లేకుండా అన్నీ పంచుకొనేవారు. భోజనం సమయంలో ఎవరింట్లో వాళ్లిద్దరూ ఉంటే అక్కడే ఎంగిలిపడేవారు. కార్తిక్ నాన్నగారు రైల్వే స్టేషన్ మాస్టర్. ఆయన అంటే ఊరంతటకి గౌరవం. ఆయన తెల్ల షర్టూ పాంటు, నల్లని కోటు వేసుకొని ఠీవిగా నడుస్తూంటే సినీ యాక్టర్ శ్రీధర్ లాగుండేవారు. మంచి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవారు. కృష్ణ వాళ్ళ నాన్నగారు ఖాకీ యూనిఫారము, గుబురు మీసాలుతో చూడ్డానికి కర్కశంగా కనబడినా కళ్ళు ఎప్పుడూ చింతనిప్పుల్లా ఉన్నా, మాట సౌమ్యంగా ఉండేది, మంచి మనసు.
కార్తిక్ డిగ్రీ అయిపోయాక ఎం.ఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు, కృష్ణకి స్థోమలేక డిగ్రీతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, తనున్న ఊర్లోనే ట్యుటోరియల్ పెట్టుకొని, మరొకపక్క బాంక్ ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు తయారువుతున్నాడు.
కార్తీక్ చదువయ్యాక అమెరికాలోనే తనుండే వెస్ట్ కోస్ట్ లొనే ఉద్యోగం రావడం, అక్కడే పనిచేస్తున్న కోనసీమ అమ్మాయిని ప్రేమించడం, ఇరువైపు పెద్దల అంగీకారంతో ఒకింటివాడు ఆవ్వడము అంతా రెండు సంవత్సరాలలో జరిగిపోయాయి.

అమెరికా వెళ్ళాక, కార్తిక్ కృష్ణల మధ్య మాటలు తగ్గాయి, కార్తిక్ కొంచెం మారిపోయాడు. అమ్మ నాన్నలు కృష్ణ గురుంచి చెప్పినపుడల్లా అయిష్టంగా వినేవాడు లేదా మరో టాపిక్ మాట్లాడేవాడు. తన పెళ్లి రిసెప్షన్ విశాఖపట్నం డాల్ఫిన్ హోటల్లో ఇచ్చినా, కృష్ణని పిలవడానికి తాహతు, అంతస్థు అడ్డొచ్చింది. కృష్ణ చూడ్డానికి పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్నా, తను కట్టుకొనే నాసిరకం బట్టలు, స్టయిలు ఇంకా పల్లెటూరి పద్దతులు కార్తీకి రుచించలేదు. ఏదో బ్యాంకులో ఆఫీసరుగా ఉద్యోగం వచ్చిందట.
తన భార్యవైపు బంధువులుకి తన ప్రాణమిత్రుడుని పరిచయం చేయడానికి నామోషీగా అనిపించింది. తర్వాత ఎపుడైనా కృష్ణని ఇంటికి పిలిచి పార్టీ ఇవ్వొచ్చులే అనుకున్నాడు. అమెరికాలో ఈ ఆరేడు సంవత్సరాల్లో పాట్రిషియా, మైక్, సింధీ, ఇంకా తెలుగువాళ్ళు కొత్తగా స్నేహితులయ్యారు.
చెల్లికి మంచి సంబంధం చూసి చేసేస్తే తనకు ఎవరస్ట్ శిఖరం ఎక్కినట్టుంటుంది, అన్నగా తన బాధ్యత తీరుతుంది. తనకంటే మంచి చదువుకున్న, పెద్ద ఉద్యోగంలో ఉన్న
వాళ్లనే చూస్తున్నాడు కార్తీక్. చెల్లితో అన్ని విషయాలు మాట్లాడుతాడు కానీ పెళ్లి విషయాల్లో మాత్రం సూటిగా అడగలేకపోతున్నాడు. అక్కడ అమ్మని, ఇక్కడ భార్యని ఆడిగితెల్సుకొంటున్నాడు. అమ్మ నాన్నల ప్రవర్తన, మాటలో కూడా ఈమధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. కానీ ఎంత అడిగినా వాళ్ళు మాత్రం 'అబ్బె అదేమీలేదు, అంతా మునుపటిలాగేనే ఉన్నాము కదరా నానా' అని దాటించేస్తున్నారు.చెల్లి అయితే ఫోన్ చేసినపుడల్లా ఇంట్లో ఉండడమేలేదు.

ఒకరోజు కార్తీక్ వాళ్ల బాస్ పిలిచి, బెంగళూరులో మన క్లయింటుకి క్రొత్త ప్రాజెక్ట్ ప్రపోసల్ కోసం వెళ్ళాలి. అందరిలో నువ్వే ఆ క్లయింట్‌ ని కన్విన్స్ చేయగలవు, 'యూ మస్ట్ ట్రావెల్ టు ఇండియా ఫర్ ఎ వీక్' అని చెప్పేడు. తనతో పాటు ప్రవల్లికని, పాపని తీసుకెళ్లడానికి అనుమతి తీసుకున్నాడు. అమెరికా వచ్చేక చదువు, ఉద్యోగం, పెళ్లి హడావుడిలో పడిపోయి ఇండియా ఒక సారే అదీను పెళ్ళికని వెళ్లివచ్చేరు. పాప పుట్టడం, క్రిందటేడాది కెనడాకు బదిలీ అవడం వలన గత ఐదు ఏళ్లుగా ఇండియాకెళ్లడం కుదరలేదు.
ముందు బెంగళూర్ వెళ్లి ఆఫీస్ పని చూసుకొని, రెండ్రోజుల తరువాత అమ్మ, నాన్న, ముద్దుల చెల్లెలికి సర్ప్రైజ్ ఇద్దామనుకొని వైజాగ్ ఫ్లైట్ ఎక్కేరు.
టాక్సీ తమ గుమ్మం ముందు ఆగేసరికి, పేపర్ చదువుకొంటున్న మూర్తిగారు తలతిప్పి చూసి పోల్చుకోలేకపోయారు. మేడమీద గుమ్మడి వడియాలు ఎండబెడుతున్న రామయమ్మగారు మాత్రం ఒక్కసారి నిశ్చేష్టులయిపోయారు కొడుకు కోడలిని చూసి.
యోగక్షేమాలు కనుక్కుని, భోజనాలు అయ్యాక కొడుకుని పక్కన కూర్చొబెట్టుకొని, భార్యాభర్తలు కళ్లనీళ్ల పర్యంత అయి అసలు విషయం చెప్పేరు.
చెల్లి కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎవడో వెంటపడి ఇబ్బందిపెట్టేవాడుట. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోమని.
ఒకరోజు చెల్లి రోడ్డుమీద వాడ్ని మందలించిందట. అయినా మాట వినకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది.
ఒక మూడనెళ్ల తరువాత అకస్మాత్తుగా ఒకరోజు వాడు నువ్వు నాకు చెందాలి లేదంటే ఎవరికీ చెందవు అని ఆసిడ్ సీసా చెల్లి మీద పోసేసాడు.
అప్పుడు నీ స్నేహితడు మన కృష్ణకి కబురుతెలిసి హాస్పిటల్లో చేర్పించి, పదిరోజులు హాస్పిటల్లో పడుకొని ఇరవైనాలగ్గంటలు నీ చెల్లిని
కనిపెట్టుకొని ఉన్నాడు. వెంటనే వైద్యం అందడం వలన కంటిచూపుకి ప్రమాదం కలగలేదు. కాకపోతే మెడ భాగం నుంచి కడుపు వరకు బాగా కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసినా ప్రయోజనమేమీలేదన్నారు.

నువ్వు గ్రీన్ కార్డుకి అప్లై చేసేవని, కోడలు కడుపులో బిడ్డ ఉందని, నువ్వు వచ్చి చూస్తే తట్టుకోలేవని అందుకే ఈ విషయం గోప్యంగా ఉంచమని కృష్ణ నాకు అమ్మకి చెప్పి వేడుకున్నాడు. మన మాధవిని చినప్పుడునుంచి చూస్తున్నా, ఎపుడూ ఆ దృస్థితో చూడలేదనీ, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్య ప్రేమ చిగురించిందని, మనకి ముఖ్యముగా నీకు అభ్యంతరం లేకపోతే మాధవిని పెళ్లిచేసుకొంటానని చెప్పేడు. 
సానుభూతి కోసమో, జాలి వలనో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలేదని బాగా ఆలోచించే తన మనసులో మాట చెప్పేడుట.

ఇదంతా వింటున్న కార్తిక్ కి ఒక్కసారి కాళ్ళక్రింద భూమి కంపించినట్లయింది. కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి, మనసు రోదించింది, తల సిగ్గుతో క్రిందకి వాలిపోయింది. వెంటనే బైక్ తీసుకుని బయలుదేరాడు, మాధవి ఆఫీసుకి, అక్కడ్నుంచి తన ప్రాణమిత్రుడి ఇంటికి. కానీ మనసు ప్రశ్చాత్తాపంతో మధనపడింది
అహం దహించవేయబడింది. మస్తిష్కం 
సిగ్గుతో మొద్దుబారిపోయింది.
స్నేహం సృష్టిలో మాత, పిత, గురువు, తరువాత అంతటి మధురమైనది, నిస్వార్ధమైనది. స్వచ్ఛమైనది ఒక్క స్నేహం మాత్రమే అన్న సత్యం అతనికి బోధపడింది.

***

No comments:

Post a Comment

Pages