సుం(అం)దరి కధ - అచ్చంగా తెలుగు

సుం(అం)దరి కధ

Share This
(జ)వరాలి కధలు - 19
సుం(అం)దరి కధ 
 గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)


అల్లరి ఆలోచనలను ఆవాహన చేస్తూ డాబా మీద పచార్లు చేస్తున్నాను. ఇంతలో గేటు తలుపు చప్పుడై క్రిందకి తొంగిచూశాను. సుమారుగా వరాలి వయసున్న ఆమె గేటు తీసుకొని లోపలికి వస్తోంది. 
"ఎవరు కావాలండీ?" అకస్మాత్తుగా శబ్దం వచ్చేసరికి త్రుళ్ళిపడి చుట్టూ చూసింది. ఎవరూ కనబడక లోనికి వస్తున్న ఆమె ఆగిపోయింది. ఆమె ఉలికిపాటుకి నవ్వు వచ్చినా సభ్యత కాదని బలవంతంగా నవ్వు ఆపుకొన్నాను. ఇక ఆమెను యిబ్బంది పెట్టకుండా పరుగులాంటి నడకతో డాబా దిగాను. 
" మీరు పైనున్నారా?" అంటూ తనకు కావలసిన వారి పేరు చెప్పింది.
"ఆ పేరు గలవారు. . . ."ఎవరూ లేరని చెప్పబోయి, వరాలి అసలు పేరు గుర్తుకొచ్చి, ఆమెను లోపలికి ఆహ్వానించాను.
"వరాలూ!" అంటూ పిలవగానే ఆమె ఆశ్చర్యపోయింది.
"వరాలా? నేను సరైనచోటికే వచ్చానా?" అప్రయత్నంగా అడిగింది.
"సరైన చోటికే వచ్చావు లేవే! ఆయన పిలిచిన వరాల్ని నేనే!" అంటూ లోనుంచి వరాలు వచ్చింది. ఆమెను చూడగానే వచ్చినామె చేటంత ముఖం చేసుకొని, చేతిలో సూటుకేసు క్రిందపెట్టి వరాల్ని చుట్టేసింది. ఇద్దరూ ఆలింగనాలతో వారి ఆనందాన్ని పంచుకొన్నాక, ఆమె క్రింద పెట్టిన సూటుకేసు తీసుకొని వరాలు లోనికెళ్ళింది.
"అవునే! పెళ్ళయితే ఆడపిల్ల యింటిపేరు మారుతుంది. ఇక్కడ నీకేంటి? మీవారు ఏకంగా పేరే మార్చేశారు?" తిరిగి డాబామీదకి వెళ్ళబోతున్న నేను ఆమె ప్రశ్నతో ఆగిపోయాను. 
ఆడుగు పెట్టిందో, లేదో అప్పుడే మామధ్య తగవు పెట్టాలని చూస్తోంది. దీనికి వరాలి ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వీధిగదిలో కుర్చీలో చతికిలబడ్డాను. ముఖానికి ఆరోజు వార్తాపత్రిక ఆడ్డు పెట్టుకొని వారి మాటలు వినసాగాను. 
"ఆయన మాత్రమేనా? మా బాబాయి పద్మావతి పిన్నిని "పద్దూ" అని పిలుస్తాడు. మా అమ్మని నాన్న "ఏమే, ఒసే, యిదిగో" అనే గానీ, ఏనాడూ పేరుతో పిలవటం నాకు తెలీదు. అంతా ఎందుకు? మీ నాన్న మాత్రం మీ అమ్మని " అన్నపూర్ణా" అని పిలుస్తాడా? 'అన్నూ' అనేగా పిలిచేది? ఏ పేరుతో పిలిస్తేనేమే? నన్ను ప్రేమగా చూసుకొంటున్నారు. అది చాలదా?" వరాలి వాదనను ఆమె ఒప్పుకొనేలా లేదు.
" నీ పిచ్చి గానీ! పూర్వకాలంవాళ్ళు మనపేరులో సగం కత్తిరిస్తారేమో గానీ! ఈరోజుల్లో మగాళ్ళు అలాకాదే బాబూ! అసలు వాళ్ళని నమ్మకూడదే! కాలేజీరోజుల్లో ఎవరో స్నేహితురాలితో పరాచికాలాడతారు, చివరికి ప్రేమలో కూడా పడుతుంటారు. ఇంట్లో పెద్దలు ఆ పెళ్ళికి ఒప్పుకోక మనలాంటి బకరాలెవరికో కట్టపెడతారు. ఆ అమ్మాయిని మరిచిపోలేక వాళ్ళ పేర్లు మనకు తగిలించి "ముద్దుపేరు" అని మనని మురిపిస్తారు. మీవారికి కాలేజీలో వరలక్ష్మో, స్వరలక్ష్మో, త్వరలక్ష్మో, మరలక్ష్మో ఉండే ఉంటుంది. ఆమెతో పెద్దవాళ్ళు పెళ్ళి చేయలేదు. దానికి మీవారు ఆమెను మరిచిపోలేక ఆ లక్ష్మిగారి పేరులో సగం కత్తిరించి యీ గృహలక్ష్మికి తగిలించారు. చిన్నప్పటి స్నేహితురాలివి. ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తావు గనుక. . . ."
"భార్యాభర్తల మధ్య నమ్మకం ప్రధానమే! వారు చేసే ప్రతీ పనిని వక్రదృష్టితో చూస్తే మన జీవితాలే నరకమవుతాయి" అంటూ, వరాలు సుందరి యింకేం చెబుతుందోనని నన్ను పిలిచింది.
అకస్మాత్తుగా వరాలు నన్ను ఎందుకు పిలిచిందో అర్ధం కాలేదు. "వరాలు" అని తనకు పేరు పెట్టినందుకు పంచాయితీ చేయబోతోందా! చేతిలోని పేపర్ని గూట్లో పడేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను.
" దీని పేరు సుందరి అండీ! చిన్నప్పటినుంచి స్నేహితురాళ్ళం. అది నన్ను అక్కా అని పిలుస్తుంది. ఇక సుందరీ! ఈయన మా వారు. కేంద్రప్రభుత్వ ఆఫీసులో పని చేస్తున్నారు" మా యిద్దర్నీ ఒకరికొకరికి పరిచయం చేసింది.
"అవునే! పెళ్ళయ్యాక మనం కలిసిందిదే కదా! మీ వార్ని కూడా తీసుకురాకపోయావా?" వరాలు సుందరిని అడిగింది.
"నేను యూనివర్శిటీ పనిమీద వచ్చానే! రేపటినుంచి ఇంటర్ పేపర్లు దిద్దాలి. రెండువారాల పని. అన్నాళ్ళు ఆయనకు సెలవు దొరకదు. కంపెనీ ఉద్యోగి కద!" అంది.
"సరె! ప్రయాణ బడలిక మీద ఉన్నట్లున్నావు. స్నానం చేసి విశ్రాంతి తీసుకో! నేను వంటపని చూస్తాను. సాయంత్రం ఊరు చూపిస్తాను " అని వరాలు వంటింట్లోకి తప్పుకొంది. చేసేది లేక
ఆమె సూటుకేసు తీసుకొని, నేను చూపించిన గదివైపు వెళ్ళిపోయింది. నామీద స్నేహితురాలు చేస్తున్న వ్యాఖ్యలు పేపరు చాటునుంచి వింటున్నానని వరాలికి తెలుసు. అందుకే ఆమె వ్యాఖ్యానాన్ని మధ్యలోనే త్రుంచేసింది. వరాలు అమాయకురాలా? అలా అనుకొన్న సుందరే మహా అమాయకురాలు. 
ఆ సాయంత్రం ఆమెకి యూనివర్శిటీని చూపించి, అక్కడినుంచి బాలాజీ మందిరానికి వెళ్ళాలని బయల్దేరాం.

వరాలు ఆటోని పిలుస్తోంటే " వద్దే! బస్సులో పోదాం" అంది.
"అదికాదే! డబ్బులెక్కువైనా సమయం కలిసివస్తుంది కదే!" వరాలు చెప్పింది.
"నిజమే! కానీ ఆటోలో ముగ్గురూ యిరుక్కొని కూర్చోవాలిగా!" అందామె.
"ఫరవాలేదండీ! మీకంతగా యిబ్బంది అనిపిస్తే నేను డ్రైవరు ప్రక్కన కూర్చుంటాను" అన్నాను.
"అలా కూర్చోవాలన్నా మీకిబ్బందిగా! అయినా వద్దులెండి. బస్సులోనే వెడదాం" 
ఆటోలో నేను కూడా వస్తానని ఆమె మొహమాటపడుతోందని వరాలు బస్సు స్టాప్ వైపు దారి తీసింది. మా అదృష్టం బాగుండి, ఎక్కువసేపు ఎదురు చూడకుండానే బస్సు వచ్చింది. నేను వెనకగేటునుంచి, వాళ్ళు ముందుగేటునుంచి బస్సెక్కాం. సాయంత్రం కావటాన బస్సులో జనం భారీగానే ఉన్నారు. సుందరి ముందరున్న జనాల్ని తోసుకొంటూ బాగా లోపలికి వచ్చింది. ఆమెను అనుసరించిన వరాలు లోపలికొచ్చి, యిద్దరూ ఒక మూల నిలబడ్డారు. 
"ఏమిటే యిది బస్సేనా?" అని వరాల్ని అడిగింది.
"బస్సే! నీకా అనుమానం ఎందుకొచ్చింది?" వరాలి ప్రశ్న.
" మరేం లేదు. బస్సులో ద్వారబంధాలు పెడితేను. . దీనికి కూడా వాస్తు ఏమన్నా చూస్తున్నారేమో అని. . ."
"అదేం లేదే! నీవన్న ద్వారబంధానికి అవతల మగాళ్ళు కూర్చుంటారు. ఇవతల ప్రక్క ఆడవాళ్ళు. ఒక రెండు వరసలు మాత్రం ముసలివాళ్ళకి, అంగవికలురకూ వదిలేస్తారు. వాళ్ళు ముందునుంచి దిగినప్పుడు డ్రైవరు బస్సు లాగించేయకుండా యీ ఏర్పాటు" వరాలు చెప్పింది.
కొంతసేపయ్యాక ముందువరసలో ఎవరో ఆడమనిషి ఒకతన్ని లేపేసి, ఆమె సర్దుకొంటూ తన ప్రక్క మరొక అతన్ని కూర్చోపెట్టింది.
"ఉండు, యిప్పుడే వస్తాను" అంటూ సుందరి ఆ సీట్లముందుకెళ్ళి అక్కడ కూర్చున్న ఆమెతో ఏదో మాట్లాడింది. ఆమె సమాధానానికి సుందరి అకస్మాత్తుగా గొంతు పెంచింది. 
"అదికాదమ్మా! ఈ ప్రక్కన యింతమంది ఆడవాళ్ళు నిలబడి ఉంటే, ఆ మగాయన అలా కూర్చోవటం బాగుందా?" సుందరి అడుగుతోంది.
"ఆయన మా ఆయన. నా ప్రక్కన కూర్చుంటే తప్పేంటి?" ఆమె గొంతు పెంచింది.
"ఆహా! ఎవడో మగాడు కూర్చుంటే, దెబ్బలాడి అతన్ని లేపేసి మరీ కూర్చున్నావ్! మరి మీ ఆయన కూడా మగాడేగా! అతను ఆడవాళ్ళ సీట్లో కూర్చోవచ్చా?" 
"నువ్వెవత్తెవే నన్ను అడగటానికి? ఆయన కూర్చుంటాడు. ఏం చేస్తావ్?" 
"ఆయన ఖాళీ చేస్తే నేను కూర్చుంటాను. మీ ఆయన్ని ఆ ద్వారబంధానికి అవతల మగాళ్ళ సీట్లు ఉన్నాయిగా! అక్కడికి వెళ్ళి కూర్చోమను" వీళ్ళ గొడవకి అతను లేవబోయాడు.
"ఎక్కడికయ్యా వెళ్తావ్? కూర్చో! నా ఫామిలీని నా ప్రక్కన కూర్చోవద్దనటానికి అదెవరు?"
"ఏవమ్మోయి! నేనింతవరకూ మర్యాదగా మాట్లాడుతుంటే, నువ్వేంటి రెచ్చిపోతున్నావ్?" సుందరి తగవు పడుతూంటే వరాలు తెల్లబోయి చూస్తోంది. 
"ఏమయ్యా కండక్టరూ! ఆడాళ్ళ సీట్లో మగాళ్ళు కూర్చుంటె లేవమని చెప్పవేం?" సుందరి బాణం కండక్టర్ కేసి గురి పెట్టింది. 
"చూడమ్మా! బస్సునిండా జనం ఉన్నారు. యింతమందికి టిక్కెట్టు కొట్టకపోతే, మధ్యలో చెకింగ్ వాళ్ళొచ్చి పట్టుకొంటే, నా ఉద్యోగం ఊడిపోతుంది. అందరూ చదువుకొన్నవాళ్ళే! అక్కడ "స్త్రీలకు మాత్రమే" అని బోర్డు ఉంది. అయినా అలా దబాయించి కూర్చుంటే నేనేం చెప్పేది?" కండక్టర్ గొణిగాడు.
"ఆయనేం పరాయివాడు కాదు. మాఫామిలీ! కూర్చుంటే తప్పేంటి? ఈ బస్సేమన్నా యీమె బాబుదా?" 
"ఆ! మా బాబుదే! బస్సులు పాతబడిపోయాయని ముఖ్యమంత్రిగారు మా యింటికి కబురు చేస్తే మా బాబు నాలుగుబస్సులు దానమిచ్చాడు" సుందరి మాటలకు చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు.
"అన్నా! వాళ్ళలా లొల్లి పెడితే బస్సు నడపటం కష్టం" అని డ్రైవరు బస్సుని రోడ్డు ప్రక్కకి ఆపేశాడు. 
వెంటనే ఆడవాళ్ళు నలుగురు ఒక్కటై గొడవ పెడుతూంటే, ఆమె భర్త సీటు ఖాళీ చేసి మగవాళ్ళవైపు వెళ్ళిపోయాడు. ఆ జాగాలో సుందరి సర్దుకోవటమే గాక వరాలిని చేయి పట్టుకు లాగి మరీ సీటిచ్చింది. వాదనలో ఓడిపోయిన ఆ ఆడమనిషి ఏదో సణుగుతూంటే, చోటు దొరికిన సుందరి పట్టనట్లే కళ్ళు మూసుకు కూర్చుంది. 
ఆ రోజు తిరగాలనుకున్న ప్రాంతాలన్నీ చుట్టబెట్టి, హోటల్లో తిండి లాగించి యిల్లు చేరుకొన్నాం. 
నేను గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొంటున్నాను. సుందరి ప్రక్కగదిలో ఉన్న తన సూటుకేసులోంచి బట్టలు తీసి మార్చుకొని హాలులోకి వచ్చింది. 
"ఏం సిటీయే తల్లీ! ఆడా మగా అర్ధరాత్రి అని కూడా చూడకుండా నడిరోడ్డున, పార్కుల్లో ప్రణయకలాపాలా? ఒక కొంప, గోడూ ఉన్న విషయాన్ని కూడా మరిచిపోయి హోటళ్ళలో విందులు, విలాసాలూనా? పెళ్ళి కానివాళ్ళే అలా ఉంటే, పెళ్ళయిన వాళ్ళ సంగతి అసలు చెప్పక్కర్లేదు. లోకంలో వాళ్ళిద్దరే ఉన్నట్లు ఏమాత్రం ఎడం లేకుండా నడిబజార్లో వికారచేష్టలు. బస్సులో చూశావుగా? ఇంట్లో ఎలాగూ కలిసి ఉంటారు. కనీసం బస్సులోనైనా దూరంగా కూర్చోలేరా? ఫామిలీట! ఈవిడ ఒక్కర్తెకే ఫామిలీ ఉన్నట్లు. . . ." ఈ నగరం మీద ఆమె "గరం"గా ఒక సర్టిఫికెట్ యిచ్చేసింది. 
"సుందరీ! పెళ్ళయ్యాక చాలా మారిపోయావే! పెళ్ళి కాకముందు కలిసి వెళ్ళే జంటని చూసి, నీకూ అలాంటి జీవితమే కావాలని కలలు కనేదానివి. ఇప్పుడేమిటి యిలా కంట్లో కారం పడ్డదానిలా చిందులేస్తున్నావ్?" వరాలు ప్రశ్నించింది.
అడుక్కొనే కుర్రాడు అయిస్ క్రీం చప్పరించే వాడిపై దృష్టి కేంద్రీకరించినట్లు, మనిషిని పడగ్గదిలో ఉన్నా వారి మాటలకు చెవులు పారేశాను. 
"పెళ్ళికి ముందు ఎన్నో అనుకొంటాం గానీ. . . ఈ రోజుల్లో మగాళ్ళు ఉన్నారే! ఎవర్ని నమ్మగలం చెప్పు? కుమ్ములో పెట్టిన వంకాయ, వాసనకు కమ్మగా బానే ఉంటుంది. బయటకు తీశాకనే తెలుస్తుంది దాని పైభాగం ఎంతమేర వలిచి పారెయ్యాలో?. . .ఈ మగాళ్ళూ అంతే!" సుందరి మాటలకు త్రుళ్ళిపడ్డాను. మొగుళ్ళను కుమ్ములో పెట్టిన వంకాయలంటూంటే నాలో కోపం తారాస్థాయికి చేరింది. కొంచెం దూకుడుగా గదిలోంచి హాలులోకి వచ్చాను. 
"పదవుతోంది. పడుక్కోరా?" అని అడిగాను.
"వస్తున్నా!" అంటూ వరాలు ఆమెకు ప్రక్కగదిలో పడకకి ఏర్పాటు చేయాలని వెళ్ళింది. కొంతసేపయ్యాక నా దగ్గరకొచ్చి అదోలా చూస్తోంది.
"ఏమిటి?" అన్నాను.
"మరేంలేదు. మేమిద్దరం కలిసి చాలాకాలం అయ్యింది. చెప్పుకోవలసిన కబుర్లు చాలా ఉండిపోయాయి. అందుకే అది ఉన్నన్నాళ్ళూ నన్ను యిబ్బంది పెట్టొద్దు" అంది.
"అలాగంటే ఎలాగోయి? ఈ పక్షం రోజుల్లో అర్ధరాత్రి వేళ నాకు ఏదైనా అవసరం వస్తే ఎలా? చీకట్లో నీకోసం వచ్చి పొరపాటున . . ."చమత్కరించబోయాను..
"అలా చేస్తే అది యీ యింటియజమాని అని చూడకుండా నాలుగు పీకుతుంది. బస్సులో దాని సంగతి చూశారుగా! అందుకే మీరు రాత్రి త్రాగే నీళ్ళకోసం కూడా బయటకు రానక్కరలేకుండా, ఒక కూజా బిందెని యిక్కడే పెడతాను. తెల్లవార్లూ కావలసినన్ని నీళ్ళు తాగుతూ కూర్చోండి. హాలులోకి కూడా రావద్దు. సరేనా?" అంత ఖరాఖండిగా చెబుతుంటే ఏమనగలను?

సుందరి పొద్దునే టిఫిను లాగించి యూనివర్శిటీకి పేపర్లు దిద్దే పనిమీద పోయి సాయంత్రానికి యింటికి చేరుకుంటోంది. అయినా మా యింటి చుట్టుప్రక్కల ఏమేం జరుగుతున్నాయో అన్నీ సాయంత్రానికల్లా ఏకరువు పెట్టేస్తోంది. నాలుగేళ్ళుగా ఆ ప్రాంతంలో ఉంటున్నా నాకే తెలియవు అన్ని విషయాలు. ఏమైనా విషయసేకరణలో ఆడవాళ్ళదే పై చేయి అని ఒక్క సుందరిని చూస్తే అర్ధమైపోతుంది. 
"చూడు! ఆ పూలకుండీ యింట్లో విజయ అనే పెళ్ళికాని పిల్ల వుంది కదూ!" వరాల్ని అడిగింది సుందరి.
"ఉంది. అయితే?" 
"ఆ పిల్ల యింటికి రాఘవ అనే కుర్రాడు వచ్చిపోతుంటాడు కదూ!" 
"నిజమే! అతను ఆ అమ్మాయికి కజినవుతాడు" అమాయికంగా చెప్పే వరాల్ని చూసి భీకరంగా నవ్విందామె.
" కజినూ కాదూ, కాలిఫ్లవరూ కాదు. ఈ కాలంలో పిల్లలకి యిదో వెధవలవాటు అయిపోయింది. సంబంధం లేని వాళ్ళతో విచ్చలవిడిగా తిరుగుతారు. చుట్టుప్రక్కలవాళ్ళు తనను తప్పుగా అనుకోకూడదని "కజిను" అని ఓ యింగ్లీషుముక్క పడేస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు " బ్రదరు", ఒంటరిగా ఉంటే "అదర్". ఎవరికి తెలీదే యీ వేషాలు? నలుగురూ తనని తప్పు పట్టకూడదని అలా చెబుతోంది కానీ ఆమె విలాసంగా బ్రతుకుతోందే తల్లీ!" 
"ఛ! అలాంటి పిల్ల కాదే! పెద్దవాళ్ళు ఆర్ధిక యిబ్బందుల వల్ల పెళ్ళి చేయలేకపోయారు. తాను యీ ఊళ్ళో ఉద్యోగం చేస్తోంది. కజినో, కాదో తెలీదు గాని వాళ్ళిద్దరూ ప్రేమించుకొన్నారని, పెద్దల అనుమతి కోసం ఆగారని విన్నాను"
"ఊరుకోవోయి! ప్రేమించుకొన్నప్పుడు అక్కర్లేని పెద్దల అనుమతి పెళ్ళికి కావాలా? నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే త్వరగా తేల్చుకోవాలి గానీ. . .యిలా నానుస్తోందంటే. . .ఆలోచించాల్సిన విషయమే!" 
"పోనీలెద్దు. తన తిప్పలేవో తాను పడుతోంది"
"అని మనం ఊరుకొంటాం. కానీ ఎదురింట్లో మేడమీద ముసలినక్క ఊరుకోవటం లేదే! ఆ కుర్రాడు ఆమె యింట్లోకెళ్ళినప్పుడల్లా వీడు బాల్కనీలో బిచాణా వేసి అటే చూస్తుంటాడు. ఖర్మకాలి విజయకు ఆ కుర్రాడితో కాక మరొకడితో పెళ్ళయిందనుకో! ఈ గుంటనక్క దాని మొగుడికి యీ కుర్రాడి గురించి చెప్పాడనుకో! ఆమె జీవితం ఏమైపోతుందో!" అయిదు నిమిషాల్లో విజయ భవిష్యత్తుపై ఒక కధ అల్లేసింది. 
"సర్లేవే! ఆ గొడవ వదిలేయి! అవునూ! మీ పిన్ని గారమ్మాయి నీరజ. . .పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకొందిట కదూ!" జబ్బు తగ్గకపోతే డాక్టర్ టానిక్ మార్చినట్లు , వరాలు టాపిక్ మార్చింది.
"ఏం పెళ్ళి లెద్దూ! ఓ అచ్చటా? ముచ్చటా? అసలు పెద్దలు చేసిన పెళ్ళిళ్ళే అంతంతమాత్రంగా అఘోరిస్తూంటే , ప్రేమపెళ్ళిళ్ళు స్థిరంగా నిలబడతాయా?" తేలిగ్గా తీసి పారేసింది. 
"ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుందే? భావన ప్రేమించి పెళ్ళాడింది. హాయిగా ఉంది కదా! మాది పెద్దలు చేసిన పెళ్ళి. హాయిగా లేమా?" వరాలు క్విజ్ మాస్టార్లా ప్రశ్నించింది. 
"మీ దారి వేరే! చెక్కకు బిగించిన స్క్రూలా కదలకుండా పడి ఉండే వాళ్ళు మీకు దొరికారు. అందరు భర్తలూ అలా ఉండొద్దూ?" 
చాటుగా వారి మాటలు వింటున్న నేను త్రుళ్ళిపడ్డాను. కట్టుకొన్న దాన్ని కన్నీళ్ళు పెట్టుకోకుండా చూసే వాళ్ళంతా చెక్కకు బిగించిన స్క్రూలా?
"ఎవరి గొడవలో మనకెందుకు? నీ సంగతే చెప్పు. నీ భర్త నిన్ను సరిగా చూడడా?" వరాలినుంచి వచ్చిన అనూహ్యమైన ప్రశ్నకు సుందరి కంగారుపడింది.
"మావారికేమే! దేవుడు.. .నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు" అని చెబుతూ లేచి బాత్రూంలోకి వెళ్ళింది. అకస్మాత్తుగా సుందరిలో వచ్చిన ఆ మార్పుకు విస్తుపోవటం వరాలి వంతంయింది.

సుందరి మా యింటికి వచ్చి వెళ్ళిన రెండు నెలలకి, మేము తిరుపతి వెళ్ళివస్తూ సుందరి యింటికెళ్ళాం.
మేము తలుపు కొట్టబోయే సమయానికి లోపలినుంచి ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు వినిపించింది. మగగొంతు చాలా హెచ్చుస్థాయిలో వినిపిస్తోంది. తిరిగి వెనక్కి వెళ్ళిపోదామనుకున్నా, సుందరిని కలవాలన్న కోరికతో ఉన్న వరాలికి సాధ్యం కాలేదు. చివరికి సంశయిస్తూనే కాలింగ్ బెల్ కొట్టాను. ఉన్నపాటున శబ్దం ఆగిపోయింది. కొద్ది క్షణాల తరువాత సుందరి వచ్చి తలుపు తీసింది. గుమ్మంలో మమ్మల్ని చూస్తూనే కంగారుపడినట్లు కనిపించింది. లేనినవ్వు తెచ్చిపెట్టుకొని మమ్మల్ని లోనికి ఆహ్వానించింది. వచ్చిన స్నేహితురాలిని వదల్లేక సుందరి కబుర్లు చెబుతుండగా లోనుంచి చిరాకు పడుతున్నట్లుగా మాటలు వినిపించాయి.
" పిచ్చాపాటీ తరువాత. . .ముందు నాక్కావలసినవి సర్ది వెళ్ళు" 
"ఇప్పుడే వస్తానే!" అంటూ మమ్మల్ని లోపల కూర్చోపెట్టి తను భర్త ఉన్న గది లోనికెళ్ళింది. 
"వచ్చిందెవరు?" దురుసుగా అడుగుతున్నాడు.
"మెల్లిగా మాట్లాడొచ్చుగా! అది నా చిన్నప్పటి స్నేహితురాలు" ఆమె గొంతు తగ్గించి చెబుతోంది. 
"ఏం? ఊళ్ళో హోటళ్ళు ఖాళీ లేవని మనింటికొచ్చారా?" అతని మాటలకు చిర్రెత్తి నేను లేవబోయాను. వరాలు నా భుజాన్ని కుదిపి చేతులు జోడించింది. ఈ గొడవలో ఆమె ఏమి బదులిచ్చిందో మాకు వినిపించలేదు.
కొద్ది క్షణాల తరువాత ఆయన సూట్ కేసుతో మా ముందునుంచి వెళ్ళిపోతుంటే " ఏమండీ! ఈమె. . ."అని మమ్మల్ని పరిచయం చేయబోయింది.
"సాయంత్రం మనింట్లోనే ఉంటారుగా! అప్పుడు మాట్లాడుతానులే!" అని మా వైపు చూడకుండానే వేగంగా బయటకెళ్ళిపోయాడు. 
"ఆఫీసులో అర్జెంట్ మీటింగు ఉందిట. అందుకే తొందరలో ఉన్నారు. ఏమనుకోకండి" నాకు సంజాయిషీ చెప్పిందామె.
"ఫరవాలేదులెండి" అన్నాను.
సుందరి కాపురాన్ని చూడాలని ముచ్చటపడిన వరాలు హతాశురాలైంది. 
సుందరి కాలేజీకి రానని ఫోనులో చెప్పి, వరాలితో ఏదో మాట్లాడుతూనే ఉంది.

మధ్యాహ్నం భోజనాలయ్యాక స్నేహితురాళ్ళిద్దరినీ వదిలేసి నేను ఊరు చూడ్డానికి పోయి, సాయంత్రానికి యిల్లు చేరాను. ఈ మధ్యలో వాళ్ళిద్దరూ తమ కష్టసుఖాలు మాట్లాడుకొనే ఉంటారు. రాత్రి ఎంత ఎదురుచూసినా అతను రాలేదు. సుందరి చెప్పిందని భోజనాలు ముగించి, ఆమె ఏర్పాటు చేసిన గదిలో పడుకొన్నాం. అతనికోసం ఎదురుచూసే ఆమె మాతో భోజనం చేయలేదు. అర్ధరాత్రి వేళ అదేపనిగా తలుపు చప్పుడవుతుంటే వరాలు నిద్ర లేపింది. 
"అది పాపం అలిసిపోయి పడుకొన్నట్లుంది. అతను వచ్చినట్లున్నాడు. వెళ్ళి తలుపు తీస్తారా?" వరాలు అడగటంతో నేను వెళ్ళబోయాను. వెంటనే ప్రక్కగదిలోంచి కళ్ళు నులుముకొంటూ సుందరి రావటంతో, నేను ఆగిపోయాను. వచ్చిన వ్యక్తి కాలింగ్బెల్ ను అదేపనిగా మోగించటం చూస్తూంటే , అతనెంత కోపంలో ఉన్నాడో అర్ధమవుతోంది. 
"ఏం? పిలిచిన వెంటనే తలుపు తీయలేవా?" గట్టిగా అరుస్తున్నాడతను. మాట కూడా మందు మీద ఉన్నట్లు ధ్వనిస్తోంది.
"బాగా నిద్ర పట్టేసింది" 
వెంటనే చెంప ఛెళ్ళుమంది. ఆ శబ్దానికి ముందు వరాలు ఉలిక్కిపడింది. తరువాత కోపంతో దెబ్బలాటకి వెళ్ళబోయింది. నేను ఆమె భుజంపై చేతితో నొక్కటంతో నిగ్రహించుకొంది. 
"నేను దాని యింటికెళ్ళను. మీ వాళ్ళొచ్చారన్నావు గనుక యింటికి వస్తానని చెప్పానా? లేదా? ఏం? నేను వచ్చేవరకూ నిద్రపోకుండా ఆగలేవా?"
"గట్టిగా అరవకండి. వాళ్ళు లోపల పడుకొన్నారు. లేస్తే బాగుండదు" భయంతో చెబుతున్నట్లుంది. 
"ఎందుకొచ్చారట?" సంజాయిషీ అడుగుతున్నాడు. 
"తిరుపతికి వెళ్ళి తిరిగి వాళ్ళ ఊరెళ్ళిపోతూ, నన్ను చూడాలని వచ్చారు"
"అంత కావలసినవాళ్ళా?" 
" నేను పేపర్లు దిద్దటానికి వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోనే ఉన్నాను. అయినా మీరు నన్నేమన్నా అనదలచుకొంటే వాళ్ళెళ్ళిపోయాక అనండి. వాళ్ళు ఉన్నంతవరకూ, వాళ్ళని తక్కువ జేసి మాట్లాడవద్దు" 
"నోర్ముయ్! నువ్వు పాఠాలు చెప్పల్సింది కాలేజీలో! నాకు కాదు" మళ్ళీ చెంప పేలిన శబ్దమైంది. కొద్దిక్షణాలు మౌనం తరువాత ఆమె అంటోంది. 
"బట్టలు మార్చుకొని రండి. భోజనం చేద్దాం" 
"దానింట్లో తిని వచ్చాను" 
మా చీకటిగదిలోనుంచి హాలులో జరిగేదంతా కనిపిస్తోంది. సుందరి తూలుతున్న తన భర్తని పట్టుకొని ప్రక్క గదిలోకెళ్ళటం గమనించాను. పావుగంట తరువాత, బెడ్ లైట్ వెలుతురులోనే హాలులోని డైనింగ్ టేబిల్ పై అన్నం పెట్టుకొని, ఆమె తినటం గమనించాము. పెద్దలైటు వేస్తే మేము మా గదిలోంచి బయటకొస్తామని భయమో ఏమో! గుడ్డి లైటు వెలుతురులోనే భోజనం చేసింది. అన్నం తింటూనే మధ్యలో బెక్కుతోంటే మాకు జాలి అనిపించింది.

మనదేశంలో సంస్కృతీసంప్రదాయాలకు విలువనిచ్చే ఒక మధ్యతరగతి యిల్లాలామె. అందరితో పాటు ఆధునికతను కోరుకున్నా, సంప్రదాయాన్ని దాటి సంసారాలను నాశనం చేసుకోని, తొంభైశాతం భారతీయ స్త్రీలలో ఆమె కూడా ఒక్కర్తె. మన దేశంలో ప్రతి కన్నెపిల్ల తన వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలని కోరుకుంటుంది. కానీ కొందరు అభాగినులకు మాత్రం అనుకొన్నట్లు వారి  జీవితాలు ఉండవు. ఆ నిజాన్ని వాళ్ళు భరించలేరు. అలాగని సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఆ జీవితాలని విడచి బయటకు రారు, సంఘానికి తాము కోల్పోయిన ఆనందం గురించి చెప్పుకోలేరు. వారిలో ఒక విధమైన కీచులాట ధోరణి ప్రబలుతుంది. అందుకే అప్పుడప్పుడు చుట్టుప్రక్కలవారితో కోరి తగవుపెట్టుకొంటూంటారు. ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నట్లు కనిపించినా తిరగబడతారు. పరాయివాళ్ళ జీవితాలలోకి తొంగిచూసి వాళ్ళంతా చెడిపోతున్నట్లు బాగా బాధపడిపోతారు. ఒక రకమైన మానసికవికారంతో మిగిలినవాళ్ళకు భిన్నంగా మారిపోతారు. తమకు కష్టాలొచ్చినప్పుడు మాత్రం యిలా చీకటిగదుల్లో ఓదార్పుకి నోచుకోక కన్నీళ్ళు కారుస్తుంటారు. విదేశాలపై మోజు పడే మగవాళ్ళు ఒకటి గమనించాలి. ఇదే హింసను కొన్ని దేశాల్లో భార్యలపై ప్రయోగిస్తే వాళ్ళు వెంటనే " పోరా పుస్కీ" అని విడాకులు తీసుకొంటారు. అందుకే అక్కడి మగవాళ్ళు భారతీయవివాహ వ్యవస్థను గౌరవిస్తారు. అక్కడి విడాకుల వ్యవస్థను యిక్కడ అమలు జరిపితే, మనదేశంలో మగవాళ్ళ ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి. ఇది విదేశాలపై మోజు పడే మగాళ్ళు గ్రహిస్తే మంచిది. 
సుందరి చాలాసేపు బెక్కుతూనే భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళిపోయింది. మందు కొట్టిన పెద్దమనిషి మత్తునిద్రలో ఎప్పుడో ములిగిపోయుంటాడు. అమె అటు వెళ్ళగానే వరాలు నన్ను చుట్టేసింది.
"ఏమండీ! రేపు ఉదయం వెళ్ళిపోదామండీ!" చెబుతున్న వరాలి చెక్కిళ్ళు తడిసి ఉన్నాయి.
"ఏమిటోయి? నీ స్నేహితురాలింట్లో రెండురోజులు ఉండి వెళ్దామన్నావుగా? ఇప్పుడేంటిలా?" అడిగాను. 
"అదంటే నాకు ప్రాణమండీ! చిన్నప్పటినుంచీ ఎన్నో పిట్టకధలు చెప్పి నన్ను నవ్వించేది. అలాంటిది యిలా భర్తచేత చావుదెబ్బలు తింటూ, చీకటిగదిలో ఓదార్పుకి నోచుకోక మ్రగ్గిపోవటాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆరె! నెలకి యాభై వేలు సంపాదించి చేతిలో పోసే భార్య స్నేహితులొస్తే, పలకరించే సమయం కూడా లేని పెద్దమనిషి. కనీసం మనవైపు చూసి ఒక్క చిరునవ్వయినా విసిరాడా? దీన్ని యింత కష్టపెడుతూ మరొకర్తిని కూడా ముగ్గులోకి దింపాడంటే ఎంత దుర్మాద్గుడో తెలుస్తోంది" 
"ఇందులో సుందరి సవతి స్వార్ధం లేదంటావా? పెళ్ళయినవాణ్ణి తన గుమ్మం తొక్కకుండా ఆమె మెడబట్టి గెంటి ఉంటే ఏ మగాడు యిలాంటి ద్రోహం చేయలేడు. కానీ ఏం చేస్తాం? నేను బాగుంటే చాలు అనుకొనే ఆడవాళ్ళూ ఎక్కువ కాబట్టే, సుందరిలాంటి నిజాయితీపరుల ఆనందాలు యిలా చీకటిగదుల్లో మగ్గిపోతున్నాయి" 
      "అదిసరె! ఇదివరకు సుందరి చెప్పినట్లు మీకు కాలేజీలో వరలక్ష్మో, స్వరలక్ష్మో లేదు గదా! ఆ అమ్మాయి పేరు కత్తిరించి నాకు పెట్టి, మీరు సరదా తీర్చుకోవటం లేదుగదా!" వరాలి ప్రశ్నకు త్రుళ్ళిపడ్డాను. 
"రేపు ఉదయాన్నే వెళ్ళిపోదాం! ఇక్కడే ఉంటే అతన్ని చూసి, నామీద యింకా ఏవో లేనిపోని అనుమానాలు రావచ్చు. నా కాలేజీ ప్రేమప్రయత్నాలు నీకెప్పుడో చెప్పాను. అయినా అనుమానమా? సుందరి చెప్పినట్లు నేను కదలకుండా పడుండే, చెక్కకు బిగించిన స్క్రూని. అంత ధైర్యం చేయగలనా?" నవ్వుతూ అన్నాను.
"అదీ విన్నారూ! మీరన్ని విషయాల్లో బాగున్నారు గాని, పెళ్ళాం ఎవరితోనో మాట్లాడుతుంటే దొంగచాటుగా వినే బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నారు కాదు! నా మీద అనుమానమా?" 
"ఏం చేయను? మీ కబుర్లలో నాకేమన్నా వ్రాసుకొందుకు పిట్టకధలు దొరుకుతాయని కక్కూర్తి. అంతేగానీ నీ మీద అనుమానం కాదు తల్లోయి!" అంటూ చేతులెత్తేశాను.
మర్నాడు వెళ్ళిపోతున్న మమ్మల్ని ఉండమని చెప్పలేక,  వీధి చివరవరకూ వచ్చి వీడ్కోలు చెప్పింది సుందరి.  రాత్రి ప్రొద్దుపోయి వచ్చిన ఆ పెద్దమనిషి యింకా నిద్ర లేవలేదు. ఆటో ఎక్కుతున్న వరాల్ని చుట్టేసిన సుందరి కళ్ళలో అభిమానం కనురెప్పల దగ్గరే ఆగిపోయింది. వరాలి సంగతి సరేసరి.
"ఆ అభాగిని ఆర్తనాదం యిప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంది."
***

No comments:

Post a Comment

Pages