ప్రేమతో నీ ఋషి -29 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి – 29
యనమండ్ర శ్రీనివాస్ 

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.  
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ  మృణాల్ శవం కనిపిస్తుంది. మృణాల్ నకిలీ పెయింటింగ్స్ తయారుచేసే వర్క్ షాప్ ను ఎక్కడ ఏర్పరిచాడో పరిశోధిస్తూ, తన మిత్రుడైన ఫోరెన్సిక్ డాక్టర్ వశిష్ట ఆచార్య ద్వారా మహేంద్ర వేలిముద్రల నకలు తయారు చేయిస్తాడ  ఋషి. ఇక చదవండి...)
“నాకా గదిలోకి వెళ్ళాలంటే భయమేస్తోంది. మృణాల్ శవం ఇంకా అక్కడే ఉంది. ఈ పాటికది కుళ్లిపోయి ఉంటుంది. “ వాళ్ళు ఆఫీస్ కు చేరిన దగ్గర్నుంచీ స్నిగ్ధ బెదిరిపోతోంది.
పోర్ట్రైట్ వెనుక ఉన్న రహస్యం తెలుసుకునేందుకు ఇది ఆఖరి అడుగు కావచ్చని చెప్పి, ఆమెను ఒప్పించాడు ఋషి. మూడోవ విశ్వామిత్ర పెయింటింగ్ ఉందేమో తెలుసుకోవాలన్నది అతని కోరిక.
మొదటి రెండిట్లో ఒకటి అప్సర వద్ద, మరొకటి గార్డెన్ హోటల్ లోనూ ఉన్నాయి. ఇదికాక, ఈ గిల్సీ పెయింటింగ్ ఒకటే రూపొందించారా, లేక భారీ ఎత్తున పెయింటింగ్స్ నకళ్ళు తయారు చేసే పెద్ద మోసాలు జరుగుతున్నాయా అన్నది కూడా స్పష్టం కావాల్సి ఉంది. 
మూసిఉన్న ఈ తలుపుల వెనుక ఏం జరుగుతోందన్న అంశంపై ఇది కొంత క్లూ ని ఇవ్వచ్చు. మొత్తం సంఘటనల్లో స్నిగ్ధ పాత్ర ఎంత ఉందన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఇవి సహకరిస్తాయి.
“బాధపడకు స్నిగ్ధ. ఆదివారం నాడు కేవలం నువ్వుకాని, మృణాల్ కాని మాత్రమే ఆఫీస్ లో ప్రవేశించగలరు. కాబట్టి ఇవాళ ఎవరూ ఒచ్చే అవకాశం లేదు. మనకు కొన్ని క్లూలు దొరుకుతాయని ఆశిస్తూ, రేపు జరుగబోయేవాటికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. “ ఆఫీస్ కు రావడం వెనుక ఉన్న అతని ఉద్దేశాన్ని స్పష్టం చేసాడు ఋషి. 
చేతిలో తాళాలతో ముందుగా స్నిగ్ధ లోనికి ప్రవేశించింది. ఋషి ఆమెను అనుసరించాడు.
అన్ని గదులూ పవిత్రంగా ఉన్నాయి. అది పూర్తి ప్రశాంతతా కావచ్చు, లేక భవిష్యత్తులో కలుగబోయే గందరగోళానికి సూచన కావచ్చు. 
ప్రతి కుర్చీ, బల్ల మృణాల్ తో స్నిగ్ధకు కలిగిన చేదు అనుభవాలను గుర్తు చెయ్య సాగాయి. ఆమె మరింత ముందు వెళ్తుండగా, తాము కొటేషన్లు ,కొనుగోళ్ళ పత్రాల వివరాలు పూర్తి చేసి అప్సరకు పంపాల్సిన పోర్ట్రైట్ లు ఆమెకు కనిపించాయి. 
“ఋషి, నాకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయింది. నా చెయ్యి పట్టుకో, ఏ సమయంలోనూ విడిచిపెట్టద్దు. ప్రతి క్షణం నాకు రక్తపోటు పెరుగుతోంది.” గట్టిగా శ్వాస తీసుకుంటూ అంది స్నిగ్ధ. తన మొదటి ఉద్యోగ అనుభవం ఇంత దారుణంగా ఉంటుందని ఆమె ఊహించలేదు. 
ఋషి జాగ్రత్తగా పరిసరాలను గమనించసాగాడు. అతను దేన్నీ వదిలిపెట్టదలచుకోలేదు. తాళాలు కేవలం మృణాల్, స్నిగ్ధ వద్దే ఉంటే, మూడోవ్యక్తి లోపలకు వచ్చి, మృణాల్ ను కాల్చడం ఎలా సాధ్యమౌతుంది?
ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా అతనికి దొరకలేదు. మృణాల్ కు ఈ వ్యాపారంలో వేరే భాగస్వామి ఎవరైనా ఉన్నారా? వారు అతనిపై పగ తీర్చుకున్నారా? ఈ వాదనను బలపరిచే సాక్ష్యాలు కూడా అతని వద్ద లేవు.
కాబట్టి ఎటువంటి జంకూ లేకుండా, ఋషి ముందుకు వెళ్ళాడు. అతను స్నిగ్దను ఇలా అడిగాడు, “ మీరు మామూలుగా పెయింటింగ్స్ ఎక్కడ దాస్తారు? మనం అక్కడికి వెళ్లి ఈ పెయింటింగ్ మూడో ప్రతి ఉందేమో చూద్దామా?”
“క్రింద బేస్మెంట్ లో దాస్తాము, అక్కడే శవం కూడా ఉంది. నా చెయ్యి గట్టిగా పట్టుకో,” స్నిగ్ధ నెమ్మదిగా గుసగుసలాడింది. 
వాళ్ళు మెట్ల వైపు వెళ్ళగానే, ఋషి అడుగులు వెయ్యడంలో జాగ్రత్త పడసాగాడు. నెమ్మదిగా అతను పెయింటింగ్స్ ను భద్రపరిచే హాల్ లోకి చేరుకున్నాడు. 
వాళ్ళు మలుపు తీసుకుని, హాల్ లోకి ప్రవేశించబోతూ ఉండగా, స్నిగ్ధ ఒక్క నిముషం ఆగింది. మలుపు తిరగగానే మృణాల్ శవం ఉంటుందని ఆమె భావించింది. అందుకే అక్కడికి వెళ్తుండగా, ఋషి చేతిని గట్టిగా పట్టుకుంది.
వాళ్ళు అక్కడికి చేరుకున్న క్షణమే... ఆశ్చర్యంగా... అక్కడ శవం ఏమీ ఆమెకు కనిపించలేదు. ఆ ప్రదేశం చాలా శుభ్రంగా ఉంది. 
హాల్ కు వెళ్ళే దారిలో అప్సరకు గాని, హైదరాబాద్ మ్యుజియం కు గాని పంపాల్సిన పెయింటింగ్స్ అమర్చి ఉన్నాయి. ఆ శవం ఎలా మాయమైందో స్నిగ్ధకు ఇంకా అర్ధం కావట్లేదు. ఆ రోజున మృణాల్ శవాన్ని ఆమె కళ్ళారా చూసింది. తుపాకీ గుండు తగిలి, పారుతున్న రక్తాన్ని కూడా ఆమె చూసింది. ఇప్పుడు వాళ్ళ జీవితాలను ఏదో ప్రమాదం చుట్టుముట్టనుందని ఆమెకు అనిపిస్తోంది.
ఋషి అక్కడికి వచ్చి, “ ఇక్కడ శవమేమీ లేదే. అంటే, ఎవరైనా ముందే తీసేసి ఉండాలి, లేక నువ్వు భ్రమ పడి ఉండాలి. 
“భ్రమ ఏమీ లేదు. నేను నా కళ్ళతో చూసాను. మృణాల్ ని కాల్చేశారు, అతని శవం ఇక్కడే పడుంది,” అంటూ ఆమె రక్తపు మరకల కోసం, శవం కోసం హాల్ అంతా వెతకసాగింది. కాని, ఆమెకు ఏమీ కనిపించలేదు.
“స్నిగ్ధ, మనం ఇక టైం వేస్ట్ చెయ్యద్దు. మనం త్వరగా మూసి ఉంచిన మహేంద్ర గదిలోకి ప్రవేశించి, మూడవ విశ్వామిత్ర పెయింటింగ్ ఉందేమో చూద్దాము. కనీసం అప్పుడైనా మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. “ఇప్పుడతను ప్రత్యేకంగా డిజైన్ చేసిన గ్లోవ్స్ వేసుకున్నాడు, వాటిపై మహేంద్ర వేలిముద్ర వేసుంది.
దీనికోసమే వశిష్ట్ ఋషికి సాయం చేసింది. స్నిగ్ధ ఇచ్చిన వేలి ముద్రలను, ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ద్వారా బొమ్మగా మార్చారు. ఇందులో వాడిన స్కానర్ లు హై రిసల్యూషన్ వి. అతి సూక్ష్మమైన ముద్రల్ని సైతం స్కాన్ చెయ్య గలిగినవి. 
వీటి నుంచి వేలిముద్రల తాలూకు ‘క్లోజ్ అప్ డిజిటల్ ప్రింట్’ ను లేసర్ ప్రింటర్ సాయంతో తీసారు. దాన్ని పూర్తిగా ఆరనిచ్చారు. 
తర్వాత ఆ వేలి ముద్రను పల్చటి చెక్క గ్లూ(జిగురు) పొరతో కప్పి, ఫేక్ ప్రింట్ ను తయారు చేసారు. ఆ గ్లూ పూర్తిగా ఆరాకా, నెమ్మదిగా దాన్ని స్లయిడ్ లో నుంచి తీసారు. 
తర్వాత ఆ గ్లూ ను వేళ్ళకు తొడుక్కునేందుకు గాను, గ్లోవ్స్ పై అతికించేందుకు అనువుగా కట్ చేసారు. అలా సృష్టించిన గ్లోవ్స్ నే ఋషి ఇప్పుడు వేసుకున్నాడు. అతను వేసుకున్న గ్లోవ్స్ మీద మహేంద్ర వేలి ముద్రలు ఉన్నాయి.
ఋషి బయో మెట్రిక్ పరికరంపై వెళ్ళు ఉంచగానే, ఇద్దరూ ఊపిరి బిగబట్టారు. స్నిగ్ధకు మాటలు రాలేదు.
బీప్... వేలిముద్రలు అధీకృతం అయ్యాయి. ఆ పరికరంపై గ్రీన్ లైట్ వెలుగుతూ ఉండగా, గది తలుపు తెరుచుకుంది. 
ఇద్దరూ నెమ్మదిగా లోపలకు వెళ్లి, తలుపులు మూసేశారు. అది బయట నుంచి కూడా ఆటోమాటిక్ గా లాక్ అయిపొయింది.
(సశేషం...)

No comments:

Post a Comment

Pages