ఆచంట రామేశ్వర శతకము - మేకా బాపన్న
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం:
ఆచంట రామేశ్వర శతకకర్త మేకా బాపన్న గురించి గతంలో వారి మరొక శతకమైన మదనగోపాల శతకంలో వివరంగా తెలియచేసాను. మేకా బాపన్న నరసాపురం తాలూకా ఆచంట గ్రామవాస్తవ్యుడు. క్రమనాయకులను కమ్మవారి కులమునకు చెందియుండును. ఈకవి క్రీ.శ. 1850 ప్రాంతములందలివాడు. చతుర్ధకుల సంభవుడని చెప్పికొనినాడు. తల్లి చెల్లమాంబ, తండ్రి నాగయ్యల పెద్ద కుమారుడు. ఒక సోదరి రామకృష్ణమ్మ, సోదరుడు చినబాపన్న. శాస్త్రపురాణములలో నిష్ణాతునిగా తెలియచున్నది.
శతకాంతంలో ఈ కవి తనగురించి ఇలా చెప్పుకొన్నాడు
సీ. కాశ్యపీ కామినీ కమనీయ ముఖపద్మ, ముక్తాలలంతికా స్ఫురిత మయిన
యాచంట పురమున నంఘ్రి జాతాన్వ్యయ, మహిత మేకా వంశ మౌక్తికాయ,
మాన నాగయ్య ధీమణికిని చల్లమాం, బకు నగ్రవర తనూభవుడ నైన
దేవావనీ దేవ పావన పాదరా, జీవ సేవా జీవ జీవితుండ
గీ. బాపనాఖ్యుడ! తావక పదభక్తి
తోడ నర్పించితిని సీస శతక మిదియు ||భూత||
సీ. శాలివాహన శక సంవత్సరములలో, చనగిరి శైలేందు సౌమ్యవర్ష
భాద్రపదాసిత పక్షాష్టమీ సోమ వారమునను భవద్వర్ణనమున
పుట్టువు సఫలత బొందింప దలచి నే, సీస శతంబు రచించినాడ
నెందాక భస్కర హిమకర తారకా, కరి హరి గిరి కిరి కమఠ ధరలు
గీ. దరలకుండెడు నందాక తావకీయ
కరుణ నిదియొప్పుగాత సత్కవుల సభల ||భూత||
క్రీ.శ. 1850లో ఈశతకరచన జరిగింది. ఈకవి రచించిన ఈ రెండు శతకాలు తప్ప ఇతర రచనలు ఏవీ లభ్యం కాలేదు.
శతక పరిచయం:
"భూత లోకేశ! ఆచంట పురనివేశ! భావ భవనాశ! రామేశ! పార్వతీశ!" అనే మకుటంతో నూట ఎనిమిది సీస పద్యాలు గల ఈశతకం భక్తిరస ప్రధానమైనది.
మదనగోపాల శతకంలో మాదిరిగానే ఈ శతకాన్ని కవి ఇష్టదేవతా ప్రార్థన, పూర్వకవి ధ్యానం, కుకవి నిందలతో ప్రారంభించారు. ఈ కవి యొనర్చిన ఇష్టదేవతా స్తుతినుండి కొన్ని మచ్చుతునకలు చూద్దాం.
సీ. రాజకళా మౌళి రక్షిత దీనాళి, దురిత తమోహేళి తుష్టకాళి
మహనీయ తర దేహు మంజుల రుచి బాహు, వీరరసోత్సాహు వీతమోహు
సముద మూషిక సాది సాధుజనామోది, వితత విద్యాపాది వేదవేది
భూరిభూమాసాద్యు సూరి హృత్సంవాద్యు, విఘ్న రుజావైద్యు విశ్వవేద్యు
గీ. నేకదంతుని దంతుని వీక మది ను
తింతు నిర్విఘ్ను పరిసమాప్తిని దలంచి ||భూత|| (వినాయక వందనం)
సీ. క్రొమ్ముడి ముడీచిన క్రొవ్విరి సోనల, సొగయు తేటుల మ్రోత సుతిగ కల్మి
వాల్గంటి కోడలు వలిగుల్కు గుబ్బల, బండిన మణిపద్మరాగ
కంకణఝుణత్కార పాణి ధరించి, మీటఁ దంత్రీ స్వర మేళమాధు
రీసాధు రీతుల రేకజోక సరస, కవిలకు చెవులకు చవులు దవుల
గీ. దగు రసస్ఫూర్తి నా కవితకు నొసంగు
తాపసత్రాత సకల విద్యా ప్రదాత ||భూత|| (సరస్వతీ వందన)
ఈశతకంలోని ప్రతిపద్యంలో భక్తిరసం ఉట్టిపడుతుంది. అంత్యప్రాసలు విరివిగా వాడి సీసపద్యాలను ఎంతో రమ్యంగా రచించారని చెప్పాలి.
సీ శారదాంబుజగాత్ర! చతురానన స్తోత్ర!, శ్రితజన వనచైత్ర! శ్రీదమిత్ర!
భవ విమోచన సూత్ర! భక్తేప్సితక్షేత్ర!, దుష్ట దానవ జైత్ర! సృష్టిచైత్ర!
పాలిత ద్విజపుత్ర! పావన చారిత్ర!, వృజినాతపఛత్ర! వేదపత్ర!
కాముంకీకృత గోత్ర! కామిత ఫలసత్ర!, శుచ్యబ్జ రవి నేత్ర! శోకతోత్ర!
గీ. కమల సంభవ జనక సత్కంకపత్ర!
అపదావర్ణ తరణైక యానపాత్ర! ||భూత!!
ఈ క్రిందిపద్యం చదవగానే మనకు "కమలాక్షు నర్చించు" అనే పోతనామాత్య పద్యం గుర్తుకు రాక మానదు.
సీ. శ్రీకంఠ నీ గుణ చింతనామృతముచే, మరిగి చొక్కినయట్టి మనము మనము!
సర్వజ్ఞ నీపాద జలజ సమర్చన, కలితమై తనరెడి కరము కరము
క్రీడా కిరాత నీ కింకర పదరజ, శ్చిహ్నితంబైనట్టి శిరము శిరము!
వకుంఠ మిత్ర నీ వర చరిత్ర స్తోత్ర, స్థిర భక్తి బరగెడి జిహ్వ జిహ్వ!
గీ. శర్వ నీ దివ్య రూపంబు సతతంబు
నమ్మి గాచఁగ నేర్చిన నరుఁడు నరుఁడు! ||భూత||
కొన్ని మనోహరమైన పద్యాలను చూద్దాం
సీ. చెన్నగు మొగమున వెన్నెల వెదజల్లు, నవ్వుతో జాబిల్లి పువ్వుతోడ,
పెద్ద వేలుపు పుఱ్ఱె పేరున జెన్నారు, నురముతో జడలల్లు శిరముతోడ,
పసిమిరంగు జెలంగు పసమీరు పులితోలు, వలువతో సామేని చెలువతోడ,
తలగ్రాలు రతనాల తళ్కుల పాపరా, పేరుతో మెడకప్పు తీరుతోడ,
గీ. నీవు విచ్చేసి దయనేడు గావకున్న
ఎవరి వాడను నేనఔదు నెంచిచూడ ||భూత||
సీ. వాకిటి కావలి వాని జేయగానేర, కోదండమున నిన్ను గొట్టనేర
రాళ్ళచే రువ్వుచు రవ్వ సేయగనేర, కుంటెనగా బంప గోరనేర
బుడుత కూరగ్ జేసి బువ్వ బెట్టగనేర, చెలగి కన్నుల బూజ సేయ నేర,
మేను సగంబిచ్చి మెప్పించగా నేర, యెంగిలి వస్తువు లియ్యనేర
గీ. నివ్వటిలు నెవ్వచే నిన్ను నే దలంప
గూయి వినవైతి వికనేమి సేయువాడ! ||భూత||
ఈ మణిప్రవాళం గమనించండి.
సీ. మొకమల్ జిలుగు దట్టి మొలగట్టి టీకైన, మోజాల్ బిగించి హాముకొని చెరుకు
సింగాణి చెంగల్వ చికిలి నేజాబూని, గందంపు గుబ్బలి గాడ్పుటాము
టేనుంగు పై నెక్కి తెదిరి హుటాహుటి, కమ్మవిల్ పాదుషా కణక మీర,
కాయమ్ము గాయమ్ముగా నేయ నాయమ్మ, నాయమ్మ వనిజేర నన్నెరుంగు
గీ. మనుచు నిన్ గోరి వగగేరి యలరు గౌరి
దూరి సఖి జేర్చు కేళికాగార మౌర! ||భూత||
ఈ రింది అధిక్షేప పద్యం చూడండి.
సీ. కూరిమి మీరంగ కూతు నాలిగ జేసె, కొడుకును రథ చోదకునిగ జేసె
మామ నమ్ముల పొదిగా ,ఉదమున జేసె, దారను రథముగా దనర జేసె
బావనన్నను తేరి బండ్లుగ నొనరించె, తాను శిలీముఖతను వహించె
నట్టి మిత్రుని పుత్రు నభినవాకారు నీ, కంటి మంటలచేత గాల్చినట్టి
గీ. కఠిన పాకివి దయజూడ గలవె నన్ను
గలయ గతిలేక నిన్ గొల్వ వలసె గాక! ||భూత||
సీ. పుణ్య జనాత్యయ స్ఫూర్తి వీ వంటివా, పుణ్య జనాత్యస్ఫూర్తి వీవు
బ్రహ్మ హత్యాక్రియా పరుడ వీవంటివా, బ్రహ్మ హత్యాక్రియా పరుడ వీవు
పరదార సంగతి ప్రబలుడ వంటివా, పరదార సంగతి ప్రబలుడీవు
మఘ వినాశక్రియ్ నీ వంటివా, మఘవినాశక్రియా మతివి నీవు
గీ. అరయ స్వామీవసేవకో యనెడు సూక్తి
గలుగనే నన్ను దాసుని గాగ నేలు ||భూత||
ఈ క్రింది పద్యం పాల్కూరికి సోమనాధుని పద్యానికి అనుకరణగా అనిపిస్తుంది
సీ. "శివ! శివ" యని నిన్ను జింతన చేసిన, పాపసంఘంబులు పాపవేల్?
"హర! హర" యని నిన్ను నార్తి భజించిన, తాపత్రయంబుల మాపవేల?
"భవ! భవ" యని నిన్ను బ్రస్తుతి చేసిన, కలుష సంఘంబుల గాల్పవేల?
"మృడ! మృడ" యని నిన్ను మ్రొక్కి సేవించిన, దుఃఖ సంతతులను దునుమవేల?
గీ. గలిమి దయచేయుటకు నీకు కష్టమైన
నింతమాత్రము చేయ నీ కేమి కొరత? ||భూత||
ఇటువంటి రమణీయమైన పద్యాలతో నిండిన ఈశతకం అందరూ తప్పక చదవలసిన శతకం. మీరూ చదవండి. మీ మిత్రులచేత చదివించండి.
No comments:
Post a Comment